| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| నవమాంకము. (ప్రదేశము: న్యాయస్థానము.) (ప్రవేశము: న్యాయపీఠమునఁ గూర్చుండి, అభియోగపత్రము చదువుకొనుచు న్యాయాధిపతి, యెదుటఁ గుర్చీలో వెంగళప్ప, అతని వెనుక నిలుచుండి లింగరాజుగారు, బసవరాజు, రెండవవైపునఁ పురుషోత్తమరావుగారు, కమల.) | |||||||
| పురు:- | (తనలో) నిజమే, కోర్టెక్కుటకంటెఁ గొఱత యెక్కుటే మేలు.
ఇంతకును-
| ||||||
| బస:- | (తనలో) పెంపుడుతండ్రి చివరకు నన్నెంత పేలవపఱిచెను?
| ||||||
| న్యాయా:- | (కాగితములు బల్లపై నుంచి) వెంగళప్పగారూ! ఈ వ్యవహార మింతవఱకు రావలసినది కాదండీ! ఉభయులకును రాజీ చేయుట యుక్తమని నా యభిప్రాయము. | ||||||
| వెంగ:- | (లేచి) కోర్టువారల్లా సెలవిస్తే కొంప ములిగిపోతుంది! మాక్లయింటు వంటి మర్యాదస్తుడు మద్రాసులోకూడా లేడండి. ఆయన పెళ్ళికి అయిదువేల అయిదువందల కరుకులు కట్నం యిచ్చారు! | ||||||
| లింగ:- | (వెనుకనుండి మెల్లఁగా) అయ్యయ్యో! ఆసంగతి మన మొప్పుకొనఁగూడ దయ్యా బాబూ! ఆయనతండ్రికని దిద్దుకోండి! | ||||||
| వెంగ:- | అన్నట్టు పొరపాటు మనవిచేసాను. ఆయనకుగాదు కట్నం ఆయన కొడుక్కు. కాదు, కాదు తండ్రికి! ఆయన తండ్రి లక్షాధికారండి. మూడు పెళ్ళిళ్ళయినాయి. ముప్ఫయి వేలు కట్నాలు వచ్చాయి! మ్యునిసిపల్ మెంబరీకోసం మూడుసార్లు స్టాండైనారు. | ||||||
| న్యాయా:- | (నవ్వి) ఆయనచరిత్ర యిప్పు డవసరము లేదు కాని, రాజీ మాట రవంత ఆలోచింపుఁడు! | ||||||
| వెంగ:- | ఈ విషయంలో యీశ్వరుడు చెప్పినా మాక్లయింటు వినడండి. దావా మాపక్షం కావడానికి పట్టెడు రికార్డుంది. బోలెడు సాక్ష్యం వుంది. అలహాబాదు ట్వంటీత్రీలో అత్తవారు పెట్టిన నగలు హరించకూడదని అయిదు పేజీలు వ్రాశాడు! కలకట్టా ట్వంటీఫోర్లో పిల్లను కాపరానికి పంపితీరాలని వుంది! | ||||||
| న్యాయా:- | మీతీర్పులన్నియుఁ దీరిక సమయమునఁ జూచెదను! ఏమి లింగరాజుగారూ! మీ అబ్బాయిని మీ రొప్పింపలేరా? | ||||||
| లింగ:- | చిత్తము చిత్తము. కోర్టువారి చిత్తమట్లున్నప్పుడు కోటిరూపాయలు పోయినఁ బోవుగాక! మానగలు మాకిచ్చి, మా ఖర్చులు మాకిచ్చి, వారికిని మాకును సంబంధములేకుండఁ జేసికొనుటకు వా రిష్టపడిన యెడల, మా అబ్బాయిని నే నొప్పించెద. | ||||||
| న్యాయా:- | (పక్కున నవ్వి) ఏమీ, కోడ లేల పనికి రాదు! | ||||||
| లింగ:- | ఆపిల్ల మాయింట నణకువతోఁ గాఁపురము సేయదండి. | ||||||
| న్యాయా:- | ఏమి పురుషోత్తమరావుగారూ! అమ్మాయికి నచ్చఁజెప్పి అత్తవారి యిష్టానుసారముగ నడచుకొనునట్లు చేయలేరా? | ||||||
| పురు:- | అయ్యా! నే నసహాయవాదిని. అందువల్ల మీ ప్రశ్నమున కుత్తర మొసంగుటకు నా కవకాశము లేదు. | ||||||
| న్యాయా:- | న్యాయాధిపతిగాఁ గాక గృహస్థుఁడుగా నడుగుచున్నాను. | ||||||
| పురు:- | ఇది న్యాయస్థానము కాని, తమ గృహము కాదు. | ||||||
| న్యాయా:- | అట్లయిన నీ వ్యవహారమిఁక నిరుపక్షములకు అనుకూలముగా నిర్వర్తించుట కవకాశము లేదన్న మాటయే! | ||||||
| వెంగ:- | ఆ సంగతి నే నాదిలోనే మనవి చేశాను. | ||||||
| కమ:- | (తనలో)
| ||||||
| న్యాయా:- | అందుచేతనె మీరు వకీలును బెట్టుకొనలే దన్నమాట. | ||||||
| కమ:- | (కొంచెము ముందునకు వచ్చి) అయ్యా! తామధిష్ఠించినది ధర్మపీఠము, తాము ధర్మదేవతకుఁ ప్రతినిధులరు. తమ కాఁడుబిడ్డ యున్నయెడల నా బిడ్డయె యీబిడ్డ యనుకొని తమ సన్నిధానమున ధర్మము విన్నవించుకొనుటకు నా కనుజ్ఞ దయచేయుఁడు! | ||||||
| వెంగ:- | (చివాలున లేచి) నో! నో! నో! ఆ చిన్నది మాట్లాడడము అశాస్త్రీయం. అందుకు లా యెంతమాత్రం వప్పదు. ఏదీ సివిల్ ప్రోసీజరుకో డ్డెక్కడుంది. (అని బల్లమీద వెదకును.) | ||||||
| న్యాయా:- | ఏమీ? ఏల మాటాడఁగూడదు? | ||||||
| వెంగ:- | ఆపిల్లకు మైనార్టీ వెళ్ళలేదండి. మైనార్టీ వెళ్ళనివాళ్ళు మాట్లాడగూడదని బోలెడు బొంబాయితీర్పు లున్నాయి. | ||||||
| కమ:- | అయ్యా! చట్టము వేఱు, సందర్భము వేఱు, సందర్భములను బట్టి చట్టములు మాఱునుగాని, చట్టములనుబట్టి సందర్భములు మాఱవు. నాతండ్రిగా రసహాయవాదులు. నాకు వకీలును బెట్టుకొనుట కవకాశము లేదు. చట్టమునందుఁ జెప్పఁబడిన యీడు రాకపోయినను స్వవిషయమును సమర్థించుకొనుటకుఁ జాలిన జ్ఞానమును సర్వేశ్వరుఁడు నాకుఁ బ్రసాదించినాఁడు. ఇట్టి స్థితిలో, నామాట వినకుండుట నా కన్యాయము చేయుటకాదా? | ||||||
| న్యాయా:- | చెప్పమ్మా, చెప్పు. నీవు చెప్పిన మాటలు రికార్డు చేయఁగూడ దనవచ్చును గాని, నన్ను వినఁగూడ దనుటకు వీ రెవరు? | ||||||
| కమ:- | చిత్తము, చిత్తము. దావా సారాంశములు రెండు. మొదటిది నా తలిదండ్రులు నా నగలు హరింపఁ దలఁచినారని. రెండవది అందులకై వారు నన్నుఁ గాపురమునకుఁ బంపలేదని. (నగలు మూట తీసి) ఇవిగో వారిడిన వస్తువులు. వీనిని వారు వివాహ కాలమున నాకు బహూకరించినారు. బహూకరించిన వస్తువులు దిరుగఁ బరిగ్రహించుటకు దాతకు హక్కులేదు. | ||||||
| వెంగ:- | కావలసినంత హక్కుంది. కలకత్తా తీర్పులు లక్ష చూపిస్తాను. ఏదీ నంబరు యైట్ వాల్యూము. (అని వెదుకును.) | ||||||
| న్యాయా:- | ఆఁగవయ్యా నీ యల్లలాట కాల! అమ్మాయి, రెండవ సారాంశమును గూర్చి యేమి చెప్పెదవు? | ||||||
| కమ:- | ఇదియే తా మించుక శ్రద్ధతో వినవలసిన విషయము. నాభర్త నాయింటికి వచ్చి, నా ఆజ్ఞానుసారము నడచుకొనవలసి యున్నదిగాని, ఆయన యింటికి నన్ను రప్పించుకొనుట కాయన కావంతయు నధికారము లేదు. | ||||||
| వెంగ:- | కావలసినంత అధికారం వుంది. కలకత్తా ట్వంటీ సిక్సులో కాళ్లూ, చేతులూ కట్టి తీసుకుపోవచ్చునని కూడా వుంది. | ||||||
| న్యాయా:- | అబ్బబ్బా! నీవాఁగవయ్యా! ఎందుల కధికారము లేదమ్మా? | ||||||
| కమ:- | ఆయనను, మేము వేలములో అయిదువేల యైదువందల రూపాయలకుఁ గొన్నాము. | ||||||
| న్యాయా:- | (ఆశ్చర్యముతో) అ దెట్లు? | ||||||
| కమ:- | నాకుఁ గాళింది యను నక్కగా రుండెడిది. ఆమెకై మాతండ్రిగారీ సంబంధము కొఱకు యత్నించుతఱి మున్నంగివారు పోటీకి వచ్చినారు. అప్పుడు పెండ్లికొమరుని వేలము జరిగి, ఆ వేలములో అయిదువేల అయిదువందలకు మా సొత్తయినారు. | ||||||
| లింగ:- | అయ్యా! వట్టిది వట్టిది! అట్టిదేమియు జరుగలేదు! (వెంగళప్పను చఱచి) నీబొడ్డు పొక్క! నిజముకాదని చెప్పవేమయ్యా! | ||||||
| వెంగ:- | (ఉలిక్కిపడి లేచి) అయ్యా! అయ్యా! అంతా అబద్ధమండి. కావలిస్తే మాక్లయింటు గంగలోదిగి ప్రమాణం చేస్తాడు. | ||||||
| కమ:- | (రెండు కాగితములు తీసి) అయ్యా! ఇదిగో యిది మొదటి అగ్రిమెంటు. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు. (అని యిచ్చును.) | ||||||
| న్యాయా:- | (చదివి) ఏమయ్యా! ఈ రశీదులు మీ రిచ్చినవేనా? | ||||||
| లింగ:- | (గొల్లున) కావు! మహాప్రభో! కావు! కల్పించినారు. | ||||||
| వెంగ:- | నిశ్చయముగా ఫోర్జరీ అండి! నిలువునా ఫోర్జరీ! ఇండియ\న్ పీనల్ కోడ్డు నాలుగువందల అరవయ్యేడో శెక్షను ప్రకారం ఆపిల్లమీద ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించక తప్పదు. | ||||||
| న్యాయా:- | అయితే, అమ్మాయి! అగ్రిమెంటు ప్రకారము ఆసంబంధము మీయక్క కేల జరుగలేదు? | ||||||
| కమ:- | కొని తెచ్చిన వరుని బెండ్లియాడుట గౌరవహీనమని మాయక్క బావిలోఁ బడి మరణించినది. ఇదిగో యీ పత్రికఁ జిత్తగించినచో దమ కీ యంశము విశదము కాగలదు. (అని పత్రిక యిచ్చును.) | ||||||
| న్యాయా:- | (చదివి) హరహరా! యెంతపని జరిగినది. ఆ కారణముచే ఆ చిన్నవానికి నిన్నుఁ జేసినా రన్నమాట. | ||||||
| కమ:- | చేయక తప్పినది కాదు. చేఁజిక్కిన సొమ్ము మరల చేపుటకు వారు నిరాకరించినందున ఆక్రయము నాక్రింద మార్చవలసి వచ్చింది. | ||||||
| లింగ:- | అయ్యా! వాదము నిమిత్తము, వారు సొమ్మిచ్చినట్లే నిశ్చయింపుఁడు. అయిన నది కట్నమగును గాని, క్రయధన మెట్లగును? | ||||||
| కమ:- | కట్నమునకును, గ్రయధనమునకును గాసింతయు బేధము లేదు. ఉన్న దన్నను కట్నములు వివాహకాలమున నిచ్చుట కలదు గాని, వేలము, బజానా, అగ్రిమెంటు, ముందు చెల్లించుట ఇట్టి యాచార మెచ్చటను లేదు. అందువల్ల నిది క్రయధన మగుట కాక్షేప యేమియు లేదు. అది యటుండనిండు. శుభలేఖలలో సర్వత్ర "వారి కుమారునకు వీరి కొమార్తెనిచ్చి" అని కదా యుండును? వీనినిం జిత్తగింపుఁడు. (అని రెండు శుభలేఖ లిచ్చును.) | ||||||
| న్యాయా:- | (ఒక శుభలేఖ నెత్తి) "నాకొమార్తె చి॥ సౌ॥ కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజుగారి కుమారుడు బసవరాజు నిచ్చి" (అని పఠించి, పక్కున నవ్వి) ఇది పురుషోత్తమరావుగారి శుభలేఖ. లింగరాజుగారి శుభలేఖలో నెట్లున్నదో (అని రెండవ దాని నెత్తి) "నా కుమారుడు చి॥ బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తె చి॥ సౌ॥కమలకు ఇచ్చి" సరే యిక నేమి స్పష్టముగానే యున్నదే! ఏమి లింగరాజుగారూ! మీకుమారు నామె కిచ్చివేసినట్లు మీరొప్పుకొనియే యున్నారే? | ||||||
| లింగ:- | అయ్యా! అన్యాయ మన్యాయము. మీ శుభలేఖలతో పాటు మాకుఁ గూడాఁ గొన్ని యచ్చువేయించి పెట్టుఁడని బుద్ధి గడ్డితిని పురుషోత్తమరావుగారిని కోరగా యీ ద్రోహ మాయన చేసినారు. | ||||||
| వెంగ:- | ఇదో ఫోర్జరీ. ఇందుకోసం యీయనమీద కూడా ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించాలి. ఇక వూరుకోవడానికి వీల్లేదు. | ||||||
| కమ:- | అయ్యా! ఆయన నేమియు యెఱుఁగరు. నాకుఁగల హక్కును బట్టియుఁ న్యాయమును బట్టియు నేనే యావిధముగా మార్చినాను. అందులకు వా రప్పుడేమియు నభ్యంతరము చెప్పి యుండలేదు. తామీ సందర్భములన్నియుఁ జక్కఁగా నాలోచించి, నాపై నాభర్తకే యధికారము కలదో, నాభర్తపై నాకే యధికారము కలదో, నిర్ణయింపుడు. | ||||||
| బస:- | (తనలో) నా యవజ్ఞచేతనే యీవ్యవహార మింతవఱకు వచ్చినది. ఇంకను నేనిట్లు మొరడునై యుండఁ దగునా?
| ||||||
| న్యాయా:- | ఏమి వెంగళప్పగారూ! మీరేమి చెప్పెదరు? | ||||||
| బస:- | (అంతలో ముందునకు వచ్చి) అయ్యా! యిప్పుడు మాటాడవలసినవాఁడను నేను గాని, ఆయన గాదు. ఈ దావాకు సంబంధించిన కాగితములపై నేను సంతకములు చేసినది, నా తండ్రి బలవంతమున గాని, నా స్వబుద్ధిచేఁ గాదు. అందువల్ల నా దావాను నేను రద్దు చేసికొనుచున్నాను. ఆచిన్నది చెప్పిన మాటలలో నణువంతయు నసత్యము లేదు; నా తండ్రి మాటలలో నలుసంతయు నిజములేదు. ఈ వ్యవహారములో నాతండ్రి చేసిన దుస్తంత్రము లన్నియు నిచ్చట వెల్లడించుట నా కిష్టము లేదు. పెక్కు మాటలేల?
| ||||||
| న్యాయా:- | సెబాసు, నాయనా సెబాసు! చెప్పవలసిన రీతిగఁ జెప్పితివి! కాని, చెప్పినది చెప్పినట్లు చేయుటగూడ జరిగెనేని, లోకమున కొక శ్రేష్ఠమైన పాఠము నేర్పినవాఁడ వగుదువు. | ||||||
| బస:- | అయ్యా! తమకా సందేహమేల? (అని కమలవంకకు నడచును.) | ||||||
| లింగ:- | (ఆవేదనతో) ఆఁ; ఆఁ; ఆఁ; ఓరి నిర్భాగ్యుఁడా! నిర్భాగ్యుఁడా, నీకేమి వినాశకాలమురా యిది. అయ్యో! అయ్యో! ఇం కే మున్న దిం కే మున్నది? (అని గుండె బాదుకొనును.) | ||||||
| బస:- | (తిరిగి చూడకయె కమలను సమీపించి) ఓ సుగుణవతీ!
| ||||||
| కమ:- | (మందహాసముతో) ఇదిగో, యీ నగలమూటయు, నీ కాగితముల కట్టయుఁ బట్టికొని నావెంట రండు. ఇరువురమును గలిసి యీ వరవిక్రయ దురాచారమును రూపుమాపుటకై పాటుపడుదము. (అని మూటయుఁ గట్టయు నిచ్చును.) | ||||||
| బస:- | (తీసికొని, తలపై నిడుకొనును.) | ||||||
| లింగ:- | ఓరి నీచుఁడా! చివర కెంత నైచ్యమునకు సిద్ధపడితివిరా! ఇదిగో, నాయాస్తినుండి నీకు నలుసంత ముట్టనిచ్చితినా, నామెడలోనిది యజ్ఞోపవీతము కాదు. | ||||||
| (అని చనుచుండఁ దెరపడును.) ఇది నవమాంకము. | |||||||