| నాటకములు | వరవిక్రయము (1923) | కాళ్లకూరి నారాయణరావు |
| చతుర్థాంకము - రెండవ రంగము. (ప్రదేశము: పురుషోత్తమరావుగారి లోపలి చావడి.) (ప్రవేశము: భ్రమరాంబ, కాళింది.) | |||
| భ్రమ:- | అమ్మాయీ! యీ పూఁట నీ వన్నమునకు రాలే దేమి? | ||
| కాళిం:- | ఆఁకలి లేకమ్మా! | ||
| భ్రమ:- | అ దేమే ! యేపూఁట కాఁపూఁట యాకలి లేదని మొదలు పెట్టినావు. పెండ్లి తలపెట్టఁగానే పెండ్లికూఁతుల కెక్కడలేని కళయు వచ్చును. నీవే మిట్లు నీళ్ళు కారుచున్నావు? | ||
| కాళిం:- | అమ్మా! అడిగితివి కనుకఁ జెప్పుచున్నాను. ఈ పెండ్లి నాకిష్టము లేదే! | ||
| భ్రమ:- | అ దేమీ? ఆ పెండ్లికొడుకు నచ్చలేదా యేమిటి? | ||
| కాళిం:- | పెండ్లికొడుకు కాదు, పెండ్లియే నచ్చలేదు.
| ||
| భ్రమ:- | ఇంతియే కద, యీ దురవస్థ యిపుడు మనకే పట్టినదా?
| ||
| కాళిం:- | అగుఁ కాక. మనముకూడ వారినే యనుసరింపవలెనా?
| ||
| భ్రమ:- | కాక చేయవలసిన దేమి?
| ||
| కాళిం:- | అమ్మా! అ దేమన్నమాట?
| ||
| భ్రమ:- | తెలివిమాలినదానా! నీవిప్పటి దేశకాలపాత్రముల సంగతి తెలియక మాటాడుచున్నావు!
| ||
| కాళిం:- | పోనిమ్ము. లోకమంత గొడ్డుపోవునప్పు డీలొచ్చు పనికంటె వివాహమే విసర్జింపఁ గూడదా?
| ||
| భ్రమ:- | అవివాహితయగు నాఁడుబిడ్డ యింటనుగల తల్లి యవస్థ అమ్మా! నీకిపుడేమి తెలియును?
| ||
| కాళిం:- | అమ్మా! యిన్ని బాధలు పడి పెంచిన బిడ్డను ఇట్టి లంచగొండులకుఁ గట్టబెట్టుటకంటె నవమాన మిం కేమున్నదే? | ||
| భ్రమ:- | అయ్యవమాన మాలంచ మాసించు వారికిఁగాని మనకేమి? | ||
| కాళిం:- | అదేమన్నమాట?
| ||
| భ్రమ:- | (వినుట నభినయించుచు) ఆఁగు మాఁగుము. అదిగో! మీ నాన్నగారు కావలయును దలుపు తట్టుచున్నారు. ఆఁ! వచ్చె వచ్చె. (అని నడచి తలుపు తెఱచుట యభినయించును.) | ||
| పురు, పేర:- | (ప్రవేశింతురు.) | ||
| భ్రమ:- | వెళ్ళిన పని యైనదా? | ||
| పేర:- | అవడంలో అఖండ దిగ్విజయంగా అయింది. ఆ రిజిష్టారుముండాకొడుకు చేతులో అయిదురూపాయల నోటూ పెట్టగానే, అదివరకు వచ్చినవార్నందర్నీ వెనకబెట్టి అరగంటలో తేల్చేశాడు. | ||
| పురు:- | పెండ్లికొడుకు ముడుపు పేరయ్యగారిచేతఁ బంపివేయ మనెదవా? అదేమి నీ వట్లున్నావు? | ||
| భ్రమ:- | కాళింది నా కీ పెండ్లి వల దని కావలసినంత గందరగోళము చేయుచున్నది! ఏమి చెప్పినను దానితల కెక్కుట లేదు! | ||
| పురు:- | అదేమీ? | ||
| భ్రమ:- | కట్న మిచ్చి వరునిఁ దెచ్చుకొనుట గౌరవహీన మని. ఆనవాయత లట్టెపోవునా? మీ పోలికలు పుణికి పుచ్చుకొన్నందులకు మీ తిక్కయే దానికిని బట్టుకొన్నది! | ||
| పురు:- | నాతిక్క నాబిడ్డలకుఁ గూడ నంటుకొనుట నా కానందమే కాని, భగవంతుఁడు ప్రతికూలుఁ డయినందున మాతిక్కతీఱు మార్గము మాత్రమే లేకపోయినది! ఏదీ యెక్కడనున్న దొక్కసారి యిటు పిలువు. | ||
| కాళిం:- | (తలవంచుకుని ప్రవేశించి) ఇదిగో యిక్కడనే యున్నానండి. | ||
| పురు:- | (దగ్గఱకుఁ దీసికొని, తల నిమురుచు) అమ్మా! మీయమ్మతో నేమో యన్నావఁ టేమిటి! | ||
| కాళిం:- | అమ్మతో నన్నమాట మీతోఁగూడ ననుటకే వచ్చినాను. నాన్నగారు! నాయెడ మీకు నిజముగాఁ బ్రేమ యున్నదా? | ||
| పురు:- | అమ్మా! నీ కట్టి సందేహ మేల కలిగినది? | ||
| కాళిం:- | ఉన్న యెడల -
| ||
| పురు:- | (గడ్డము పుడుకుచు) వెఱ్ఱితల్లీ! బిడ్డను బెరవారి కిచ్చుట ప్రేమలేక కాదు. మఱే మందువా!
| ||
| కాళిం:- | నాన్నగారు! నా కీ పెండ్లి యెంతమాత్రము నచ్చ లేదు! ఎందుచేత నందురా?
| ||
| పురు:- | (చటాలున గౌఁగలించుకొని) నాతల్లి! నాతల్లి! నా కడుపునఁ బుట్టి, నాకు బుద్ధి చెప్పగలదాని వైనందులకు, నా యాయువు గూఁడ బోసికొని బ్రతుకుము!
| ||
| భ్రమ:- | సరి సరి! చక్కఁగానే యున్నది! దాని పాటకు మీరు తాళముగూడ మొదలు పెట్టినారా? | ||
| పురు:- | తాళమును లేదు, తప్పెటయును లేదు గాని, దాని నేమియు ననక, తగుమాటలతో నచ్చజెప్పుము. | ||
| కాళిం:- | నాన్నగారూ! నాకీ యేహ్యకృత్య మేమాటల చేతను నచ్చదు. నాయెడ నిజముగ దయ కలదేని నాపలుకులను బాటించి, ఈ యవమానపు వివాహప్రయత్న మింతటితో విరమింపుఁడు, లేదా ... (అని, పైమాట రాక, యేడ్చుచుఁ గాళ్ళపై బడును.) | ||
| పురు:- | (లేవనెత్తి) అయ్యో తల్లీ! నే నేమి చేయుదును? ఆఁడుపడుచు అవివాహితయై యింటఁబడి యున్న, అపనిందల పాలు గాదా?
| ||
| కాళిం:- | అయ్యయ్యో, మీరుఁ గూఁడ న ట్లనెద రేమి? నా కింగ్లీషు చెప్పిన దొరసానికి నలుబదియాఱేం డ్లున్నవి. ఇప్పటికిఁ బెండ్లి లేదు. ఆమె యేమి యపనిందలపా లైనది? | ||
| భ్రమ:- | సరే యిఁక నేమీ, చక్కని యుపమానమే దొరకినది. ఆమెకును మనకును గల యంతర మేమో తెలియునా? మన దేశములో, నాఁడుది యాఁడుదే, మగవాఁడు మగవాఁడే. అక్కడనో, ఆఁడుది మగవాఁడు, మగవాఁ డాఁడుది. తెలిసినదా? ఈమంకుతన మిఁకఁ జాలును గాని, ఈపాటికి లోపలికి బోవుదము రమ్ము. (అని బలవంతముగాఁ గాళిందిని దీసికొని పోవును.) | ||
| పురు:- | పేరయ్యగారూ, విన్నారా సంగతి? | ||
| పేర:- | విన్నాను బాబూ, విన్నాను. ఏమిటో యెఱిగి ఎఱగని పిల్లలకేం తెలుస్తాయి కష్టసుఖాలు. | ||
| పురు:- | ఇప్పు డే మని మీ సలహా? | ||
| పేర:- | తమకు నేను సలహా చెప్పాలా. అయినా దీని కంత సలహాతో ప నేముంది? కట్నంసొమ్ము పంపివేసినట్లు తెలిస్తే, కార్యం లేదని ఆ చిన్నదే వూరుకుంటుంది. ఆ కాస్తముడి పడిందా పెనిమిటి బెల్లమే అవుతాడు. | ||
| పురు:- | అట్లయిన నిఁక నాలస్య మెందులకు? ఇదిగో సొమ్ము. ఇచ్చి చక్కరండు. (అని నోట్లు లెక్కపెట్టి) బజానాక్రింద నిచ్చిన పదిరూపాయలు మినహాయింతమా? | ||
| పేర:- | ఆ బ్రాహ్మడు నోట్లకు మారకం అడక్కుండా విడిచిపెడతాడా? ఆ పదిరూపాయలూ అందుక్రింద సరిపుచ్చుతాను. | ||
| పురు:- | అట్లే కానిండు. (అని నో ట్లిచ్చి) మీ రొకసారి చూడుడు. | ||
| పేర:- | (లెక్కచూచి) అయిదువేల అయిదువందలూ సరిగావున్నాయి. ఈదారినే వెళ్ళి యిచ్చివేసి, ముట్టినట్టు ముక్కకూడా వ్రాయించుకు వస్తాను. శలవు. (అని కొంచ మీవలకు వచ్చి) బ్రతుకు జీవుడా, బ్రాహ్మడు పప్పులో అడుగువేస్తాడేమో అని ప్రాణాలు కొట్టుకొన్నాయి. లేచిన వేళ మంచిది. అయినా, ఆడపిల్ల నింత హద్దుమీరనివ్వ గూడదు. అందుకనే ఆడపిల్లలకు చదు వంటే, నాకరికాలుమంట నెత్తి కెక్కుతుంది. వెనక నోసారి వెంకిముండ, ప్రక్కయింటి పిల్లతో బళ్ళోకి వెళ్ళడానికి సిద్ధపడితే నేనేం చేశాను, స్తంభానికికట్టి చావగొట్టాను, అక్కడితో ఆరోగం వదలి అయిదుగురు బిడ్డల త ల్లయ్యింది. (అనుకొనుచు నిష్క్రమించును.) | ||
| పురు:- | (రవంత నడయాడి) ఔరా! దురదృష్టము.
| ||
| (తెరపడును.) ఇది చతుర్థాంకము. | |||