| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| శ్రీకృష్ణుని సత్యభామ నారదునకు దాన మొసఁగుట | ||
| చ. |
అనవుడు సత్యభామ హృదయంబున లజ్జయు సమ్మదంబునుం బెనఁగొనఁ బ్రాణవల్లభునిఁ బ్రేమరసాలస వీక్షణంబునం గనుఁగొని మోము వాంచి మధుకైటభమర్దన చిత్తగించితే! మునిపతిమాట నావుడును మోవిపయిం జిఱున వ్విగుర్పఁగ\న్. |
77 |
| మ. |
నవచంద్రాలిక! నీకు నేల యనుమానం బాగమోక్తంబు గా న విచారింపక ధారవోయు మనిన న్లజ్జాభరా క్రాంతలై సవతు ల్వాంచిరి వక్త్రపంకరుహము, ల్సంబంధి భూపాలక ప్రవరు ల్నవ్విరి నర్మగర్భిత వచః ప్రాగల్భ్యమేపారఁగ\న్. |
78 |
| చ. |
మునిపతి యానతిం జకిత ముగ్ధ మృగీ తరలాక్షి ప్రాణనా థుని గనకాంబరాంచలముతోఁ గుసుమాయుధ వాగురా నిబం ధనమునుబోని క్రొవ్విరులదండఁ దగుల్కొనఁ జుట్టె వేడ్కఁ గ ల్పనగముఁ గూడఁ గంకణ ఝుణంఝుణ మంజుల దోర్యుగంబున\న్. |
79 |
| తే. |
పరమముని మానసాలాన బంధనమునఁ గుదురుపడకుండు యాదవకుంజరంబు వికచ రాజీవనేత్రచే వేల్పుమ్రానఁ గమ్మఁ బూవులదండచేఁ గట్టువడియె. |
80 |
| చ. |
బలి దనుజేంద్రుఁ గట్టితని పల్కఁగ విందుము గాని, నేఁడు మా చెలి యిదె పుష్పదామకముచే నినుఁ గట్టఁగఁ గంటి, మింక నె మ్మెలు పచరింప రాదనుచు మేలము లాడెడు సత్యబోట్ల స న్నల నెసకొల్పుచుం గెలన నవ్విరి ధర్మజ భీమ ఫల్గునుల్. |
81 |
| మ. |
సమయజ్ఞుం డయి గర్గసంయమి మహాసంకల్పముం జెప్పఁ గ ల్ప మహీజంబు సదక్షిణాకము నిజప్రాణేశుఁగూడ న్సుప ర్వమునిశ్రేష్ఠున కిచ్చె దానముగ ధారాపూర్వ మవ్వేళఁ 'దు భ్యమహం సంప్రదదే నమో నమ' యటం చద్దేవి మోదంబున\న్. |
82 |
| ఆ. |
ధారవోసి మఱియుఁ దద్వ్రతాంగంబుగా దాన మిచ్చె నపుడు తలిరుఁబోఁడి మణి సువర్ణ ధాన్యమయ పర్వతంబులు గోసహస్ర వాజి కుంజరములు. |
83 |
| క. |
ఇవ్విధమున దానము గొని చివ్వల యోగిరపుఁ దపసి చెట్టును గూడం బువ్వులసరులం జుట్టిన యవ్విభుని చెఱంగు విడిచి యల్లన నగుచు\న్. |
84 |
| క. |
సత్యముగ నిన్ను నిప్పుడు సత్యాసతి మాకు నిచ్చె సకలామ్నాయ స్తుత్య! యిఁక సలుపు మభీప్సిత కృత్యంబులు సలుపు మనుచుఁ గేళిపరుండై. |
85 |