| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | పంచమాశ్వాసము |
| భీకర సంగరము | ||
| క. |
భిన్నాసురాస్రముల చవి గన్న మురాహిత శిలీముఖము లపు డనిలో మున్నెఱుఁగని సురవీరుల క్రొన్నెత్తురు చవియు నెఱిఁగి క్రోలఁ దొడంగె\న్. |
6 |
| చ. |
అమరహితంబు గోరి యసురాంగకము ల్విదళించునట్టి మా కమరులఁ ద్రుంపఁగా వలసె నక్కట నేఁడని సిగ్గుఁజెందు చం దమునఁ గఠోర శార్ఙ్గ ప్రదరంబులు వైరిమర్మ భే దము లొనరించి యుద్ధవసుధాస్థలిఁ దూఱఁగఁబాఱు నయ్యెడ\న్. |
7 |
| సీ. |
హరిబాణ లూనంబులై వచ్చు నమరాస్త్ర - ఖడ్గము ల్దూల్చుఁ బక్షముల జడిసి, యమృత గంధాసక్త మగు చంచుపుటమున - వడి సింధురంబులఁ బొడిచి యెత్తు, నధిపుఁ డేసినఁ బాఱు నాశుగంబులకంటె - మునుమున్న చని లక్ష్యముల దళించు, భటులపై హరులపై బహురథాగ్రములపై - నొక్కఁ డయ్యును దోఁచు బెక్కుగతుల, |
|
| తే. |
నఖముఖంబుల నిఱికి గండ్రలుగఁ జేయు దివిజ బిరుద ధ్వజంబు లుద్రేకవృత్తి నిఖిలలోకాద్భు తావహ నిర్నిరోధ విక్రమ స్ఫూర్తి ఖగరాజ చక్రవర్తి. |
8 |
| తే. |
సర్వతోముఖ మయి పేర్చు శార్ఙ్గి బాణ వర్ష సమ్మర్ద దుర్దినవ్యాప్తి వలన నప్పుడెదిరించి పన్నిద్ద ఱహిమకరులుఁ గానఁ బడలేక తేజోవిహీను లైరి. |
9 |
| ఉ. |
చుక్కలరాణివాసముల సోయగపుం జనుదోయి త్రెక్కునం జిక్కన యైన యక్కు యదుసింహుఁడు బాణపరంప రాహతి\న్ వ్రక్కలుసేయఁ గాఱు రుధిరంబున దోఁగుచు రేవెలుంగు గెం పెక్కిన చాయ నభ్యుదయ మేదియుఁ దాల్చె రణాంగణంబున\న్. |
10 |
| తే. |
చోద్య మప్పుడు భవరోగ వైద్యుఁ డైన యంబుజోదరు డాసిన యంతమాత్ర నపగతాసాధ్య గదుఁ డయ్యె యక్షభర్త, సొరిది రుద్రులు నిర్ముక్త శూలు లైరి. |
11 |
| సీ. |
నిర్భగ్న శృంగుఁడై నిజవాహనముఁ దాను - వైవస్వతుఁడు లాఘవంబు నొందె, దళిత శాతకృపాణ దంష్ట్రమై నైరృత - భుజ భుజంగస్వామి పొల్లువోయె, నిర్ధూతహేతియై నిలువు నీఱుగ నగ్ని - దేవుండు నిర్వాణ తేజుఁ డయ్యె, భయ పలాయనవేళఁ బవమానునకు నాత్మ - జవసత్త్వముల కల్మి సఫల మయ్యె, |
|
| తే. |
వరుణునకు డాఁగికొనఁ జోటు వలఁతి యగుట నుదధి నాయక భావంబు నుపకరించె, జలరుహోదర సవ్యాపసవ్య ముక్త నిష్ఠురాస్త్రంబు లొండొండ నిగుడునపుడు. |
12 |