| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| నందనోద్యాన సౌందర్యము | ||
| క. |
చందన హరిచందన మక రంద సరి ద్బిందుశీకర ప్రమద వనేం దిందిర పక్ష స్పందన కందళిత మరు త్కిశోరకంబులు వొలయ\న్. |
43 |
| సీ. |
రంభా మహోరోజ కుంభ పరీరంభ - కుసుమిత ప్రత్యగ్ర కురవకంబు, మంజుఘోషా వక్త్రకంజాత చకచక - స్తబకిత చంపక క్ష్మారుహంబు, హరిణీ ముఖప్రసూ నాస వార్పణ కోర - కిత లతావేల్లిత కేసరంబు, నుర్వశీ నవ యావ కోజ్జ్వ లాంఘ్రినివేశ - పుష్పిత కంకేళిభూరుహంబు, |
|
| తే. |
మేనకామోద నిశ్వాస మృదు సమీర కుట్మలిత సింధువారంబు కుధర ధరుఁడు ప్రేయసియుఁ దాను నల్లన డాయఁ జనియె దైవతాధీశ నందనోద్యానసీమ. |
44 |
| మ. |
మహిభృద్భేదివనాంతసీమమునఁ బద్మాజాని సత్యావధూ సహితుండై యనిమేష వారవనితా సందోహము ల్గొల్వఁగా విహరింపం జనుదెంచినాఁ డనుచు సేవింపంగ వర్షా శర న్మిహికా శీత వసంత ఘర్మఋతువుల్నిండెం దదుద్యానము\న్. |
45 |
| సీ. |
కనుపట్టె నొకచోట ఘనఘనా ఘనరంగ - విద్యు న్నటీ నాట్యవిలసనములు, చూపట్టె నొకచాయ వాపికా జలజాత - జాల వాచాల హంసవ్రజంబు, తలచూపె నొకవంక దరదళ త్సేవంతి - కా గంధి నీహారకణ భరములు, పొడచూపె నొకచక్కిఁ బుష్పిత ఫలినీ ల - వంగ వాసిత శైత్యవైభవములు, |
|
| తే. |
నెఱసె నొకయెడఁ దామ్రపర్ణీ జలార్ద్ర చందనాచల పవమాన కందళములు, మొనసె నొకకడ సామి సంఫుల్ల మల్లి పాటలీ చంపకోత్పల ప్రౌఢిమములు. |
46 |
| క. |
మలయానిల సంగతిఁ జూ తలతిక లంకూరజాల దౌహృదవతు లై యలయిక సడలించిన సొ మ్ముల కైవడిఁ బాండుపత్రములు వెస జాఱె\న్. |
47 |
| క. |
గురివెందఁ జైత్రుఁ డొందఁగఁ గర మలుక న్మావి యవుడు కఱచినఁ నును వా తెరమీఁదఁ గాననగు పలు వరుస యన న్ననలు పల్లవముపై మొనసె\న్. |
48 |
| క. |
తలిరాకు గుత్తిఁ దమిఁ గో యిల చంచునఁ జించి క్రోల్చె నీరీతి వియో గుల గుండియ లవియింపుదు బలువిడి నని మరుని యెదుటఁ బచరించె నన\న్. |
49 |
| చ. |
మలయ సమీరణ చ్యుత సమంచిత పాండు పలాశ లైనపా దుల నునుసోగ తీఁగలు యదుప్రభునిం దలపించె బాలచా పల హృత తీరవస్త్ర లయి పంకరుహాకర మధ్యసీమల\న్ నిలిచిన ముగ్ధ గోపరమణీ రమణీయ విలాసరేఖల\న్. |
50 |