| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| అదితి హరి యవతారములను స్తుతించుట | ||
| క. |
మే నిమిరి శిరసు మూర్కొని దానవపరిపంథి! యెంత ధన్యనొ! నియత ధ్యానపరు లయిన మునులుం గానని నినుఁ గంటి మంటి గతకల్మష నై. |
26 |
| ఉ. |
సర్గమొనర్తు బ్రహ్మయన, సత్కృపఁ బెంతు జనార్దనుండు నా, భర్గుఁడనంగఁ గ్రమ్మఱఁగఁ బారణ సేయుదు విజ్జగంబు నై సర్గికలీల నొక్కమఱి సౌఖ్యము నొందుదు, కేవలంబు దో రర్గళ భూషణీకృత రథాంగ! నినుం గొనియాడ నేర్తునే! |
27 |
| ఉ. |
వాలముతాఁకున న్గిరులు వజ్రనిపాతము సంస్మరింపఁ, బె న్వాలుగవై మహార్ణవమునం దొలుఁబల్కుల దొంగరక్కసు\న్ వాలిక వంక వాఁడిగఱి వ్రచ్చి వెస న్నిగమాలిఁ దమ్మిపూ చూలికిఁ దెచ్చి యీవె! త్రిదశుల్గొనియాడ మురాసురాంతకా! |
28 |
| చ. |
సురనికరంబు రక్కసులుఁ జుట్టములై యమృతాభిలాష మం దరగిరిఁ జిల్వరాచ తరిత్రాట బిగించి పయఃపయోధి ని ర్భరగతిఁ ద్రచ్చుచో నడుగువట్టిన తద్గిరి నెత్తవే ఢులీ పరివృఢమూర్తివై! కపట పద్మముఖీత్వ విమోహితాసురా! |
29 |
| క. |
విలయోల్బణ జలనిధి ప ల్వలమున నిల మునుఁగ నేకలమవై దంష్ట్రాం చలమునఁ దాల్పవె! నీ వా బలిసద్మము దూఱి, భుజగ పర్యంక శయా! |
30 |
| చ. |
పెకలి యజాండ కర్పరము బీఁటలు వాఱఁగ మేనుపెంచి యా మకరనికేత నోదర నిమగ్న మహీ మహిళాలలామఁగే తక ముకుళాగ్ర సంగత మదభ్రమరీ సమరీతి గాఁగఁ గొ మ్ముకొనఁ దగిల్చి యెత్తఁ గిటిమూర్తిని దాల్చితిగా జనార్దనా! |
31 |
| చ. |
సటలిట మానురోరి! హరి సర్వమయుం డటె యంచుఁ బట్టితోఁ జిటచిట లాడి యిందుఁ గనఁజేయుము నీవని దైత్యుఁ డాడినం బటపట ఱాతికంబ మిరువాయలుగా నరసింహమూర్తివై కుటిల నఖాగ్ర కుంచికల గ్రువ్వవె! వానియురః కవాటము\న్. |
32 |
| మ. |
నను నాకశ్యపకామినీ మణులలోన న్ధన్యఁగాఁ జేయ మ త్తనయ వాజ్యము దాల్చి వామనుని చందాన న్బలి న్మట్టవే! ఘనమార్గోన్నమితాంఘ్రిపద్మమునకుం గంజాప్తుఁ డంశువ్రజం బను కింజల్కపరంపర ల్మెఱయ నుద్య త్కర్ణికం బోలఁగ\న్. |
33 |
| మ. |
ఘన దోర్దండ నట త్కుఠారమున వీఁక న్రాజహంసాలిఁ దు త్తునియ ల్సేసియుఁ గ్రౌంచరంధ్రమునఁ దోడ్తో రాజహంసాలి మే దినికిం దెచ్చితి, కార్తవీర్య భుజపంక్తిం జక్కు గావించి తం బునిధిం గ్రొత్తగ నాశ్రమంబునకు నిమ్ముంగొంటివీ వమ్మున\న్. |
34 |
| మ. |
అరవిందాననఁ గోలుపోయిన యవజ్ఞావాప్తిచే వీరవా సర సైన్య ప్రకరంబు నేలి జలధి న్బంధించి లంకాపురీ శ్వర కంఠాటవి నేర్చి, రౌప్యగిరి లజ్జాపంకముం గీర్తిని ర్ఝర పూరంబులచేఁ దొలంచితిగదా! రామాభిధానంబున\న్. |
35 |
| చ. |
అలుకఁ బ్రలంబదానవుని ప్రాణము గొంటి, కళిందనందనా సలిలభర ప్రవాహ రభసంబు మరల్చితి, పట్టిఁ బ్రోవ నాఁ గలిమొన హస్తినాపురి పెకల్చితి కౌరవవీరు లెల్ల బె గ్గిల, నల రేవతీరమణికిం బతి వై యదువంశమౌక్తికా! |
36 |
| మ. |
త్రిపుర స్త్రీలఁ బతివ్రతామణుల సారెం బుంశ్చలీ వర్తనం బుపదేశిం బొనరించి బేల్పఱిచి వధ్యుల్గాని తద్భర్తల\న్ ద్విపచర్మాంబరు చూపు టింగలమున\న్ వే త్రోచి పాటింపవే! కపట శ్రీజినరూపము\న్ భువనరక్షా జాగరూకేక్షణా! |
37 |