| కావ్యములు | పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన | తృతీయాశ్వాసము |
| ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణునకు మ్రొక్కి యాహ్వానించుట | ||
| చ. |
అమరవిభుండు దూరమున నంబుజనాభుని గాంచి సంభ్రమో ద్గమమునఁ జేతియంకుశముఖంబునఁ గుంభము లూఁది కుంచితా గ్రిమ చరణంబున న్మదకరి\న్ డిగి, యంసవిలంబి కల్పచే లము నడుమ న్బిగించుచు, నిలా నిహితాత్మ శిరఃకిరీటుఁ డై. |
4 |
| చ. |
జడిగొని సమ్మదాశ్రుకణజాలము లొల్కఁగ, రోమహర్షముల్ బడిబడి మేనఁ బాదుకొన, భక్తి నివేశ తరంగితాత్ముఁడై యడుగులమీఁద వ్రాలె దివిజాగ్రణి తత్కుశలంబు నెమ్మితో నడిగెడురీతి మౌళి కుసుమాగత షట్పదపంక్తి మ్రోయఁగ\న్. |
5 |
| ఉ. |
ఆ దనుజాపహర్తయు భుజార్గళము ల్వెసఁ జాఁచి యంచితా మోద వికాసవ న్నయన ముగ్ధ సరోరుహపంక్తిఁ బూజ ల త్యాదరలీలఁ జేయు నమరాధిపుఁ గౌఁగిటజేర్చె నూతనాం భోదము సానుమ చ్ఛిఖరము న్రభసంబునఁ గప్పుకైవడి\న్. |
6 |
| మ. |
అనలుం డంజలిసేసె, నంతకుఁడు సాష్టాంగంబు గావించె, మ్రొ క్కె నిశాచారి, ప్రచేతసుండు దెలచెం, గేల్మోడ్చె సారంగవా హనుఁ డర్థేశుఁడు వందనం బిడియె, నీహారాంశు కోటీరుఁడు\న్ వినతుం డయ్యె, యదుప్రవీరునకు నుద్వేల ప్రమోదంబున\న్. |
7 |
| శా. |
వారిం జూచి రథాంగపాణి సరస వ్యాహార లీలన్ దర స్మేరాపాంగ విలోకన క్రియల సంప్రీతాత్ములం జేసి గో త్రారీ! రమ్ము గజమ్ము నెక్కుమని నాగారాతిపై నెక్కెఁ దా రా రంభాకర చామరానిలము మార్గశ్రాంతిఁ దూలింపఁగ\న్. |
8 |
| క. |
తక్కిన దిశానాథులు నెక్కిరి నిజవాహనముల, నెసఁగె హుడుక్కా ఢక్కా పటహ ధ్వానము లక్కజముగఁ బొంగి నింగి యఱచిన భంగి\న్. |
9 |
| ఉ. |
ఆయెడ సిద్ధ కింపురుష యక్ష వసు ప్రముఖామరావళిం బాయఁ దొలంగుమంచు శతమన్యుఁడు సందడివో బరాబరుల్ సేయఁగ నల్లనల్ల నతసీ కుసుమాసిత దేహుఁ డేఁగె వై హాయసవీథి నారదముఖామర సంయమి కీర్తనీయుఁడై. |
10 |