| కావ్యములు | శివరాత్రి మాహాత్మ్యము | శ్రీనాథుఁడు |
| క. | శ్రీదోరంతర[1]దేవ ప్రాదితభాషావిశేషభాసురకీర్తి- శ్రీదార్ఢ్య వివిధపూజా మోదితగిరిదుహితృకాంత ముమ్మయశాంతా. | 1 |
| వ. | అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె. నట్లు తల్లిదండ్రుల నూరార్చి వెడలి సుకుమారుండు నిజాంతర్గతంబున. | 2 |
| గీ. | పోయె నుపదేశకాలంబు పూర్వముననె కడచె ధైర్యంబు [2]జఠరవిక్రాంతమయ్యె శీలసంపత్తి యిఁక నేమిసేయువాఁడ భామినీ[3]సక్తి మన్మథుబారిఁ బడితి. | 3 |
| శా. | [4]పంతంబోడదు ధర్మముం దగవునుం బాడిం గులంబున్ విచా- రింతున్ వేదపురాణశాస్త్రమతపారీణుండఁ గా నెట్ల- ల్పాంతద్వాదశభానుమత్కిరణదాహక్రూరకామవ్యథా- సంతాపజ్వరవేదనాభరమునం జాకుంట [5]సిద్ధించినన్. | 4 |
| సీ. | చాండాలుతోఁ బుల్కశత్వంబు గైకొను | బ్రహ్మహత్య యొనర్చి బ్రాహ్మణుండు క్రిమియై పతంగమై కీటమై జన్మించు | నాసవం బాని భూమీసురుండు క్రవ్యాదసత్త్వసర్గమున నుద్భవమందు | విప్రుఁ డాచార్యునివెలఁదిఁ గవిసి శ్యామచారుండు పిశాచమౌ బాడబుం- | డన్యుని విత్తంబు నపహరించి | |
| గీ. | యయిన [6]నేమగు వీనిలో నన్నిటికిని | సుఖము దుఃఖంబుఁ జర్చించి చూచినప్పు- డెల్లసంసారులకుఁ (బోలె) హెచ్చు(గుందు) | లేకయుండుట గందుమో లేదొ జగతి. | 5 |
| గీ. | వామదేవుండు శుకుఁడుఁ [7]గేవలము దక్క ముక్తులెవ్వరు వింటిమే ముజ్జగమున జంతువుల కెల్ల [8]సరియ సంసారయాత్ర విధినిషేధంబులకుఁ జొప్పు వెదకనేల. | 6 |
| శా. | ఆతంకంబున కేమికారణము బ్రాహ్మ్యం [9]బింతయుం జూచి యే తాతల్ గట్టిన చెర్వు లే శ్రుతులు [10]బోధప్రక్రియల్ స్వల్ప మే చేతోజాతు నుపాశ్రయించె[11]దఁ బరస్త్రీలన్ వినోదించెదన్ మాతంగీపరమేశ్వరిం గొలిచెదన్ మద్యంబు సేవించెదన్. | 7 |
| గీ. | [12]అష్టమావతారంబున నాదిపురుషుఁ [13]డచ్యుతుఁడు విశ్వకర్త యనాదినిధనుఁ డర్జునుండును దాను నేకాంతగోష్ఠి విశ్వము నెఱుంగ [14]నొగలపై వినిచెఁ గాదె. | 8 |
| మ. | బహువేదాంతమతానుసాధిత [15]మహం బ్రహ్మాస్మియం చాడుదుర్ మహి మోహాంధులు గొందఱేని [16]యది బ్రహ్మం బెట్టు [17]దారెట్టిరో యహహా బ్రహ్మము [18]దారయే నులుకశయ్యం ద్రెళ్ళి నిద్రింతురో జహదుత్సర్గముగాఁగఁ జేయుదురొ విష్ఠామూత్రనిర్మోక్షమున్. | 9 |
| సీ. | కల్పద్రుమంబుతోఁ గామధేనువుతోడ | నమృతాబ్ధి నవతారమయ్యె నెద్ది బృందారవనమధ్యమందారతరుల[19]లో | హలపాణి కెద్ది ప్రత్యక్షమయ్యెఁ ద్రిపురాంతకుని యర్ధదేహంబునకు నెద్ది | [20]మదసముల్లాససంపత్తి యయ్యె నవసుధారూపమై పవనభుగ్భువనాధి- | పతి కెద్ది ప్రాణంబు ప్రాణమయ్యె- | |
| గీ. | నట్టి భవభేషజము నాసవామృతంబుఁ | గన్నుఁ గానక శపియించెఁ గాక యొకఁడు తత్సమానములగు పదార్థములు గలవె | భూతభావిభవత్కాలముల ధరిత్రి. | 10 |
| వ. | *అని. | 11 |
| సీ. | కర్పూరరజము[21]లోఁ గలిపి కేతకీధూళి | నఖిలాంగకముల నభ్యంగమాడి జలజనాళీతంతుసందానితములైన | యజ్ఞోపవీతంబు లఱుతఁ దాల్చి వారాంగనాస్తన[22]హారవిభూషల | నక్షమాల్యముగఁ జే నలవకించి కస్తూరికామిశ్రగంధసారంబున | నలికంబునఁ ద్రిపుండ్ర మనువుపఱిచి | |
| గీ. | చంద్రికావేళఁ బరిపాండుసౌధవీథి | శక్తిఁ బూజించి దేవీప్రసాదమధువు పుచ్చుకొను విప్రుఁ డాకంఠపూరితముగ | వెలఁదులును దాను నప్పుడు వినిమయముల. | 12 |
| క. | వనితల [23]కంగప్రేంఖో- ళన మక్షివిఘూర్ణనంబు లజ్జావిగమం- [24]బనవస్థితి మధుపానం- బునను సురతమునను సదృశములు వక్త్రంబుల్. | 13 |
| గీ. | త్రిసరకాస్వాదభవ మదోద్రేకలహరి ధరణిదేవుఁ డా యోజ మత్తావహించి యారణాలు పఠింపంగ నాలకించి శంబరారాతి రతిచేయి చఱచి నవ్వు. | 14 |
| సీ. | ఇంట నున్నాడొ వాఁ డెచ్చోట నున్నాఁడొ | యొంటియో యెందఱే నున్నవారొ మిన్నకున్నాఁడొ [25]యేమేఁ బల్కుచున్నాఁడొ | నిద్రించినాఁడొ కన్దెఱచినాఁడొ [26]యడలుచున్నాఁడొ (ప్రహర్షింపుచున్నాఁడొ) | చించిలినాఁడొ గర్వించినాఁడొ (శోకించినాఁడొ) యుత్సేకించినాఁడొ యు- | ల్లాసించినాఁడొ కలంగినాఁడొ | |
| గీ. | యుత్సవమొ వైభవమొ లేమియో కలిమియొ | పగలొ రాత్రియొ యెఱుఁగఁ డా బ్రాహ్మణుండు నవమధూకప్రసూనసంభవపు మధువు | దలము దప్పంగఁ ద్రావి మత్తావహించి. | 15 |
| క. | సుకుమారుఁ డిట్లు నానా- [27]ప్రకరంబుల వీటిలోనఁ [28]బడుచై తిరుగన్ సకలజనులు మొఱవెట్టిరి యొకనాఁ డత్యాగ్రహమున నుర్వీశు సభన్. | 16 |
| క. | దేవర ప్రతినిధిఁగా సం- సేవింతుము యజ్ఞదత్తు [29]సిద్ధ మతనిఁగా భావింతుము తత్తనయుని యౌవనసంప్రాప్తి లేని యటమున్నెల్లన్. | 17 |
| వ. | అవధరింపుము సుకుమార నామధేయుండైన మంత్రినందనుండు సౌందర్యవంతుండును గామశాస్త్రకళా[30]విధిజ్ఞుండునునై జారచోరవిటధూర్తవర్గంబులం గూడి వేడుకకాఁడై పుణ్యస్త్రీల [31]యీలువులు చెఱచుచున్న వాఁ డతని వారింపను నారీజనంబుల శిక్షింపను సమర్థులము గాకయున్నార మద్దురాత్మకుని నన్యాయసదృశంబైన దండంబు *(వలన) దండించునది యని విన్నవించిన (నా) మహీపాలుం డతని రప్పించి వాగ్దండనంబున దండించి పురంబును దేశంబును వెడల నడిపించిన రాజావమానితుండై యప్పాపి కీ[క]టదేశంబునకుం బోయి యందుఁ గొన్నిదివసంబు లుండి హూణమండలంబునకు నేతెంచువాఁడు కాంతారమధ్యంబున నతిక్షుత్పిపాసాపరవశుండై తనలో*(న) నిట్లు వితర్కించుచుండె. | 18 |
| చ. | అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం [32]బొడతేర గిన్నెలోఁ బెరుఁగును వంటకంబు వడపిందియ[33]లుం గుడువంగఁబెట్టు ని- ర్భరకరుణాధురీణయగు ప్రాణముప్రాణము తల్లియున్న దే హరహర యెవ్వరింకఁ గడుపారని పెట్టెద రీప్సితాన్నముల్. | 19 |
| వ. | అని తనలోనం దలపోయుచుం జనిచని ముందట. | 20 |
| సీ. | స్ఫటికరత్నగృహంబు సర్వంసహాకాంత | కభిధాంతరంబు దుగ్ధాంబునిధికి మణిదర్పణము నభోమణిమార్గలక్ష్మికిఁ | జంద్రాతపమునకు జన్మభూమి యర్ధేందుమకుటాట్టహాసంబునకు జోడు | పౌలస్త్యగిరికి సబ్రహ్మచారి ప్రతిబింబ మభ్రముప్రభువారణమునకు | ననుఁగుఁజుట్టము శారదాభ్రములకు | |
| గీ. | గమఠతిమినక్రవిక్రమక్రమవిహార | చటులతరవీచికాఘటా[34]సమధిరూఢ హంసకులసన్నినాదసంవ్యాప్తదిగ్వి- | భాగ మీక్షించె నతఁడు తడాగ మెదుర. | 21 |
| మ. | వసుధానిర్జరుఁ [35]డమ్మహాసరసిలో వార్వీచులం దేలెఁ ద్రా- వె సుధాసన్నిభమైన వారిఁ దటపృథ్వీజావళిచ్ఛాయ[36]లన్ వసియించెన్ లహరీసమీరముల నధ్వశ్రాంతి పోకారిచెన్ బిసకాండంబులు [37]మేసెఁ గూర్చెఁ జలువల్ నిర్మోకసంకాశముల్. | 22 |
| క. | కరశీకరార్ద్రపుష్కర- కరుఁడై యాతండు గంధకరిరాజు క్రియం [38]బరిషేకానంతరమునఁ సరసిరుహాకరము వెడలి చాలఁగ నొప్పెన్. | 23 |
| సీ. | వైదూర్యమణిశిలాస్వచ్ఛోదకము గానఁ | గౌతుకం బొనరించెఁ గన్నుఁగవకు [39](శిశిరసంస్పర్శవీచీమారుతము గాన | నంగకంబులకు నిం పావహించెఁ మలకేసరరేణుగంధోల్బణము గాన | ఘ్రాణేంద్రియమునకుఁ బ్రమద మొసఁగె గలహంసకులకలకలకలకులాయము గాన | శ్రుతిసంపుటములకు సుఖమునిచ్చె) | |
| గీ. | (మధుర)సలిలంబు [40]గాన సమ్మదముఁ జేసె | నాలుకకు నప్పు డవనిబృందారకునకు సైకతారూఢజలమానుషీకదంబ- | కాంక్షితార్కమయూఖంబు కనుల నరసి. | 24 |
| క. | కొలనిదరి వటమునీడన్ శిలతల్పమునందుఁ గొంతసేపు శయించెం జెలువమగు వలిపెదుప్పటి తలగడఁగాఁ జేసి సచివతనయుం [41]డంతన్. | 25 |
| గీ. | బహులపక్షక్షపాకదంబములలోనఁ బ్రభవ మొందిన యంధకారంబువోని కొలనిదరి కాననంబులోఁ గొంత[42]ప్రొద్దు నలపు వాయంగ నిద్రించె యాజ్ఞదత్తి. | 26 |
| గీ. | [43]డప్పి దీఱంగ మధురకాండంబు గ్రోలి కడుపునిండంగఁ [44]దూఁడుఁదీఁగలు భుజించి యెండ వాలారునందాఁక నిండుకొలని తీరమున మఱ్ఱినీడ నిద్రించె నతఁడు. | 27 |
| చ. | అపుడు విలంబమానమయి యంబరకోణతటాంతరంబునం దపనునిమండలంబు బెడిదంబగు వేఁడిమి వే నొయ్య వీడ్కొనెం గపిలములై మయూఖములు కార్తికమాస[45]కళాపచేళిమ త్రపుసలతాశలాటుసముదాయముచాయఁ దిరస్కరింపఁగన్. | 28 |
| గీ. | అంత[46]లో నిద్ర మేల్కాంచి యవనిసురుఁడు జిగమిషాబుద్ధి [47]నీక్షించెఁ జిత్రభాను నభినవోన్మేషకుటిలజిహ్మప్రకార- లోలతారకాకేకరాలోకనమున. | 29 |
| శా. | కాంతారాంతరభూమిచెంత శబరగ్రామంబు పద్మాకర- ప్రాంతక్షోణితలంబునం గలుగ [48]సంభావించె విప్రుం [49]డెదన్ దంతిస్కంధకపోలకుంభపలలాదక్రూరకౌలేయకీ- [50]సంతానాస్ఫుటకంఠఘర్ఘరతరద్రాఘిష్ఠనాదంబులన్. | 30 |
| వ. | (ఆ సమయంబున). | 31 |
| సీ. | ఆదికాలమున మాయావిలాసినియైన | మురదైత్యదమనుని మూర్తి వోలె ధరణితలంబునఁ జరియింప నేర్చిన | పురుహూతమణిశిలాపుత్రి వోలెఁ గామినీరూపంబుఁ గైకొన్న శంబరా- | రాతి కాలాయసాస్త్రంబు వోలె వేడ్కకె మానుషీవిగ్రహంబు ధరించి | విహరించు తొలుకారువేళ వోలె | |
| గీ. | నంధతామిస్రమును నవిద్యయును బోలె | భువనమోహనరూపవైభవము [51]లొలయ లీల నేతెంచె నొక్క చండాలకన్య | కొలనఁ జిఱుబంతిపసపాడఁ జెలియుఁ దాను. | 32 |
| శా. | ఆ చండాలకులప్రసూతయగు కన్యం గన్యకారత్నముం జూచెన్ దవ్వుల యాజ్ఞదత్తి విపినక్షోణీవిభాగంబునన్ వాచాగోచరసౌకుమార్యనవలావణ్యాన్వితం బుష్పనా- రాచుం డిక్షుశరాసనంబు ఘన[52]దోర్దర్పంబునం గూర్పఁగన్. | 33 |
| ఉ. | యోగసమాధితత్పరత నున్న విధంబున [53]వ్రాసినట్లు మూ- ర్ఛాగమ[54]మీలితాత్ముఁడగు చాకృతినిశ్చలదేహయష్టియై సోగకనుంగొనల్ నుదురు చొక్కుల కిక్కలుగాఁగ నత్తఱిన్ రాగరసాతిరేకమున బ్రాహ్మణుఁ డాదటఁ జూచె మాలెతన్. | 34 |
| సీ. | అప్సరస్త్రీ వోలె [55]నకులీనయైన యీ | పైదలి కన్నులపండువయ్యెఁ [56]జామ యౌవనరూపసంపన్నయై [57]మోక- | వనరేఖయునుబోలెఁ బెనఁచె వేడ్కఁ బొలఁతి [58]ప్రావృడ్వేళ వోలె నళివినీల- | ఘనవేణియై యిది [59]కరము మెఱసె నిభరాజనిభయాన యిది [60]శరత్తునుఁ బోలెఁ | బుండరీకాక్షియై పొలుపు మిగిలె | |
| గీ. | ముట్టరానిదియైనట్టి మూర్తి వోలె | జిత్తరువు వోలె దృష్టి కచ్చెరు వొనర్చె మెలఁత మధుమాసకుసుమసమృద్ధి వోలె | జాతివిరహిత[61]యయ్యు సంప్రీతి నొసఁగె. | 35 |
| గీ. | దీనిఁ గల్పించె నజుఁ డభిద్యానమునను నాతి మును ముట్టరాకుండ నంత్యజాతి ముట్టుటయ కల్గెనేని యిమ్ముదితమేను గందకుండునె పుష్పంబుకంటె మృదువు. | 36 |
| వ. | అని [62]విస్మృతనిమేషంబు గిలించి ముకుళితపక్ష్మాంచలంబును జిహ్మ [63]తరతరళశాతోదరంబునునగు వీక్షణంబున నవ్వెలివాడ వ్రీడావతి నీక్షించుచు నవ్విప్రుండు మదనశరశలాకాశంకు[64]సంకలితహృదయుండై స్తంభితుని [65]భంగి విలిఖితుని చందంబున నుత్కీర్ణుని పగిది [66]నియతుని లాగున మూర్ఛితుని ప్రకారంబునఁ (నున్మత్తుని తెఱంగున) దన్నుఁ దానెఱుంగక నివ్వెఱపడి నిశ్చలాంగుండై యుండె నమ్మచ్చెకంటియు నలవోక వోలె నతిస్వచ్ఛసౌభాగ్యచ్ఛాయావినిర్భర్త్సిత మత్స్యకేతనుండగు నా బ్రాహ్మణుం గనుంగొని [67]నిజాంతరంగంబున. | 37 |
| గీ. | విప్రవేషంబుఁ దాల్చిన విష్ణుఁడొక్కొ బ్రాహ్మణుండైన శంబరారాతి యొక్కొ బాడబాన్వయరూప[68]సంప్రభవుఁడైన చందురుండొక్కొ యితఁ డతిస్వచ్ఛమూర్తి. | 38 |
| వ. | అని యంతంతం జేరవచ్చి యయ్యంత్యజాతిసీమంతిని యశేషజనపూజనీయులు బ్రాహ్మణులని తమ కులంబు [69]పెద్దలవలన వినుటం జేసియుఁ దా[70]నెందే నొక్కపూర్వజన్మకృతపుణ్యసంస్కారవిశేషంబుననో బాల్యంబు [71]నాఁటనుండియు రూపంబు వినయంబు దాక్షిణ్యంబు మధురాలాపకౌశలంబు నిస్సంగతప్రశాంతమహానుభావంబు శుచిత్వంబు గౌరవంబు సద్భావంబు గుణంబులు నైసర్గకంబులయి యుండుటనో భర్గఫాలనయనకృశానుజ్వాలాజాలహేలాచుళుకితావయవుండు గాని కుసుమకోదండుండునుం బోలెఁ గన్నులపండువై తప్తకాంచనవర్ణంబును గోరాచనాగౌరంబును జాంపేయకుసుమకేసరరేణుత్రసరేణువిసర[72]పిశంగంబునునగు దేహ[73]ప్రభాప్రవాహంబున గహనషండం బశేషంబును వెలిగించువాని నుద్భిన్ననవశ్మశ్రు [74]నభినవయౌవనోద్భాసితు షోడశవర్షదేశీయు నాదిగర్భేశ్వరు నమాత్యనందను సుకుమారుం గుమారసన్నిభుఁ దప్పక చూచి భయసంభ్రమడోలాయమాన దంతతాటంకవలయం బగునట్లుగా నిబ్బరంపు గుబ్బచన్నుల బిబ్బోకంబు బాహుమూలకూలంకషంబై యీషద్విలోకనీయం[75]బుగఁ గేలుదోయి సేవాంజలిపుటంబు లలాటంబునఁ గీలించి యయ్యగారికి నమస్కారంబని యధరకిసలయంబునకు దశనరత్నాంకురజ్యోత్స్న కుసుమస్తబకంబుగా సహకారపల్లవాస్వాదకషాయకంఠకలకంఠకామినీ కోమలకుహూకారకోలాహలకరంబిత పంచమరాగ ప్రపంచంబునకు మించుఁజూపు కంఠస్వరంబునం బలికిన. | 39 |
| గీ. | వెలఁది మాలెత గాన దీవింపకయును నొప్పెడిది గాన నూరకయుండకయును ధరణి దేవుండు గైకొనె దాని మ్రొక్కు గేలుఁదామర తిర్యగాందోళనమున. | 40 |
| ఉ. | శంబరవైరిసన్నిభునిఁ జారుతరోజ్జ్వలమూర్తి విప్రర- త్నంబు మహాప్రధాను ప్రియనందనునిన్ సుకుమారుఁ జూచి ప్రే- మంబు వహించియుం గొమరుమాలెత గన్నుల నవ్వు దేరఁగా [76]సంబళిసంబళీ యళుకు సందడికిం దలమంచుఁ బల్కుచున్. | 41 |
| గీ. | బ్రాహ్మణుఁడు గాన లజ్జింపఁ బ్రాప్తి లేక బాల ప్రౌఢయవోలెఁ దప్పకయ చూచి చాటువడి యుండుమయ్య యీ సరసిలోన నుదకమాడెదఁ[77]గాక పిన్నదియు నేను. | 42 |
| క. | *అని పలుకుచుఁ గొలనికి డిగఁ జని మాలప్రమద దాను సఖియు నొనర్చెన్ వనకేళితరంగ లురు- స్తనభారాస్ఫాలనమున జర్జరములుగాన్. | 43 |
| చ. | పడఁతి పసిండిడాలు [78]గనుపట్ట [79]హరిద్ర ప్రతిప్రతీకమున్ దొడసి సరోవరాంబువునఁ దోఁగి పయోనిధితీరభూమికిన్ వెడలి ధరాసుపర్వునకు నేత్రమహోత్సవమయ్యె నప్పుడ- ప్పుడ కలశాబ్ధిమధ్యమునఁ బుట్టిన యాదిమలక్ష్మియో యనన్. | 44 |
| గీ. | కొలను వెలువడి తడినూలు వలువ విడిచి మణుఁగు పుట్టంబుగట్టి యమ్మగువ యొప్పె [80]జలద మెడవడి వర్షావసానవేళఁ గాశకుసుమాట్టహాససంగతియుఁ బోలె. | 45 |
| ఉ. | ఆ కలకంఠి యొయ్యఁ దడియార్చు నెడన్ జఘనాంతికంబులై [81]కేకికలాపలీల నణకించి మధువ్రతమాలికాకృతిం గైకొని యింద్రనీలమణిఖండవిలాసమలిమ్లుచంబులై చీకటికొల్పె బ్రాహ్మణుని చిత్తము పెన్నెఱిసోగవెండ్రుకల్. | 46 |
| గీ. | చికురసంతతి నీరార్చి చెలువ తుఱిమె సేసకొ ప్పొక(యింత దక్షిణము మలఁగ) చన్నుఁగవ[82]సొంపు కక్ష[83]దేశముల మెఱుఁగు బ్రాహ్మణుని యాత్మఁ బల్లవింపంగఁజేయ. | 47 |
| గీ. | దంతతాటంకచక్రమధ్యంబునందు బాల కీలంచెఁ గంకేళిపల్లవంబు బాడబుని నేయఁదలఁచు శంబరరిపునకుఁ బ్రథమ మదియ నమస్కారబాణమయ్యె. | 48 |
| గీ. | పూనెఁ గుచముల వెలివాడపువ్వుఁబోణి విప్పుగలయట్టి బండిగుర్వెందసరముఁ బ్రథమరాగరసోద[84]యరక్తమైన సచివనందను హృదయజసంగరమున. | 49 |
| వ. | అప్పుడు సుకుమారుండు నిజాంతర్గతంబున. | 50 |
| సీ. | ఏల చేయండు శేషేంద్రియంబులు నాల్గు | నలినగర్భుఁడు లోచనములుగాఁగ నెట్టు గల్గె విధాత కీ రూపనిర్మాణ- | పరమాణువులు కోటిపరిమితంబు లజుఁడు దీని సృజించి యాత్మ నువ్విళ్లూర- | కెట్లుండుఁ గూతు మోహించినాఁడు కల్పింపఁబోలు శృంగార[85]సర్గంబున | దీని వాక్పతి [86]యున్నతి ఫలియించె | |
| గీ. | దీని [87]నిఖిలావయవములు తీర్చితీర్చి | చేయునపుడు ప్రయాసంబుఁ జెందుటయును నొయ్యనొయ్యన బ్రహ్మ నిట్టూర్పువుచ్చె | నదిసుమీ పుష్పసమయమందానిలంబు. | 51 |
| వ. | అని విచారిం[88]చుచు విప్రుండు చండాలకులకన్యకా*(మణి) దుర్లభంబగు సౌభాగ్యంబునకు నద్భుతంబందుచు దానితో సంభాషింపఁ గోరి చేరువ [89]నిలిచె జనంగమకన్యకారత్నమును నతని కిట్లనియె. | 52 |
| క. | ఎందుండి [90]యేఁగు దెంచితి- రెం దరిగెద రిచట నునికి కేమి కతంబో కందర్పరూపరేఖా- సౌందర్యవిలాసవిభవ[91]సర్వజ్ఞనిధీ. | 53 |
| వ. | నిన్నుం జూచి సుఖామృత(హ్రద)ంబున మునింగిన చందంబున [92]రతిసముద్రంబును దేలిన విధంబున [93]సర్వానందంబుల కుపరిభాగంబున వర్తించు కరణి సకలమనోరథంబులకు సంకేతంబైన లాగున నా హృదయంబు నిర్వృతిం బొందియున్నయది. | 54 |
| ఉ. | క్రొన్ననవింటిజోదు నలకూబరు నైషధునిం జయంతునిం బున్నమనాఁటిచందురునిఁ బోలినవాఁడవు రూపసంపదన్ నిన్నొకవిప్రుఁగాఁ బరిగణింపఁగవచ్చునె కల్లగాదు మా యన్నల[94]తోడు చూడు పులకాంకురముల్ మొలచెం గుచంబులన్. | 55 |
| గీ. | అవనిసుర చింతకాయల కాజ్ఞ గాక యరసిచూడంగ గ్రుక్కిళ్ళ కాజ్ఞ గలదె యంటరాకున్న నేమి యంతంత నిలిచి చిత్తమలరంగ నిన్ను వీక్షింపరాదె. | 56 |
| సీ. | కమలినీపత్ర[95]పాత్రములఁ గాసారోద- | కముఁ దెచ్చి పాదపద్మములు గడుగఁ జిలుక ముట్టని ఫలంబులు గోసికొని వచ్చి | పరికించి యారగింపంగఁ బెట్టఁ గాంతార[96]కర్పూర కదళికాదళముల | సరసరీతులను వీజన మొనర్ప నధ్వఖేదము వోవ హస్తద్వయంబున | నూరుకాండము లొత్తి యుపచరింప | |
| గీ. | వేడ్క[97]యయ్యెడు వినయంబు విస్త[98]రిల్ల | [99]భక్తి గొనఁసాగఁ బ్రమదంబు పారమేద నీకు విప్రోత్తమునకు నీ నెలవులందుఁ | జెట్టదుర్జాతి యది నన్నుఁ జెఱిచెఁ గాని. | 57 |
| క. | ఇది హూణమండలం [100]బ- వ్వది నున్నది చెంచుపల్లె వనమధ్యమునన్ మదననిభ యీ పుళిందా- స్పదంబు వెలివాడ (జన్మసదనము నాకున్). | 58 |
| తాళ రగడ. | కనుఁగొనవలయును దౌదవ్వుల నెడ[101]గలిగి నిలిచియైనను మా యిండ్లన్ వనమధ్యంబున విప్రోత్తమ వెలివాడవనితలకు నేత్రోత్సవమై యనిభృతపరభృతనఖ(శిఖరోల్లిఖితాంగణ)సహకారద్రుమశాఖా ఘనఫలరసధారామృతపానోత్కంఠవివృత్తాననవటుకంబున్. | 59 |
| క. | [102]పాణసివారము కమ్మని ప్రాణము నెఱజాణదేవరా వినవలదా వీణావాద్యముఁ బాటయు వేణుస్వానంబు వేనవేల్ చందములన్. | 60 |
| వ. | అని చండాలకన్యక పలికిన నవ్విప్రుండు భవితవ్యతాబలంబున. | 61 |
| సీ. | ఇది యసజ్జనగోష్ఠి యిది [103]మోహవిలసితం | బిది [104]మహాపాపకం బిది యకీర్తి యిది దుర్మదాంధత్వ మిది [105]కామవిక్రియ | (యిది యాగ్రహావేశ) మిది కుదృష్టి యిది నారకద్వార మిది ప్రమాదస్థలం | బిది మౌర్ఖ్యకారణం బిది యనియతి యిది యధర్మముత్రోవ యిది [106]పథప్రచ్యుతి | యిది యధోగతిహేతు విది యకృత్య- | |
| గీ. | మని విచారింప కవనీసురాధముండు | కలికి చండాలకన్యపైఁ గన్ను వైచెం దీయతీయనివింట లేఁదేఁటినారి | శంబరారాతి మోహనాస్త్రంబు [107]దొడుగ. | 62 |
| వ. | [108]అప్పుడతండు నిజాంతర్గతంబున. | 63 |
| సీ. | మాంసంబు భక్షింప మనసు వెట్టిననాఁడ | దాక్షిణ్యగుణము [109]విధ్వంసమయ్యె గంజాయిఁ దినఁగ నుత్కంఠ చేసిననాఁడ | లజ్జాభిమానంబు లుజ్జగిల్లె హాలారసము గ్రోల నభిలషించిననాఁడ | సూనృతోక్తుల సుద్ది చూఱవోయెఁ బరకళత్రముల[110]పైఁ బడఁదలంచిననాఁడ | ప్రజ్ఞావిలాసంబు పదటఁ గలసె | |
| గీ. | నింక నేటికి వంచింప [111]నిలుపు నాకు | బరువె యీ పాపములలోనఁ బాపమొకటి వరుస వేయింటిమీఁద జవ్వాదికొమ్ము | తివుటఁ జండాలకన్యకఁ గవయువాఁడ. | 64 |
| వ. | అని పరమసాహసంబు చేసి సుకుమారుండు చండాలకన్యకం జేరవచ్చి యిట్లనియె. | 65 |
| కవిరాజ విరాజితము[112]. | సరసిజలోచన యొక్కమహాముని శాపవశంబునఁ బాణచివై ధర జనియించినదానవు నీవిది తథ్యము కిన్నరభామినివో గరుడపురంధ్రివొ [113]ఖచరవధూటివొ గాని జఘన్యవు గావిఁక నన్ ధరణిసురోత్త[114]ము దగ వరియింపు సుధాకరసూర్యులు సాక్షులుగాన్. | 66 |
| వ. | సామాన్యస్త్రీజనంబుల కిట్టి యమానుషలోకోచితంబులైన సౌభాగ్యంబు[115]లుం గల్గునె మునికోపవశంబున సముజ్ఝితదివ్యశరీరలగు దేవ[116]కాంతలు శాపవశోపనీతంబైన శరీరంబు నధిష్ఠింతురు తొల్లి [117]స్థూలశిరుండను మహాముని త్రిభువనలలామభూతయగు రంభ నేదేని యొక్కనిమిత్తంబున శపించెననియును దచ్చాపంబున నయ్యప్సరస బాడబరూపంబు ధరియించి మృత్తికాపతియందు శతధన్వుఁడను రాజును సేవించుచుం బెద్దకాలంబు మర్త్యలోకంబున నుండెననియును విందుము. | 67 |
| సీ. | జలజగర్భుని మానసంబు వేదంబులు | దక్షప్రజాపతి దర్పకుండు సౌదామనీవల్లి చంద్రికాలోకంబు | సప్తజిహ్వ జ్వాలసప్తకంబు రవిమయూఖములు నీరవని దుగ్ధాంభోధి | మృత్యుదేవత[118]నోరి మెఱుఁగుఁబండ్లు ముని కరిష్టాదేవికిని సంభవించిన | దివ్యగంధర్వజాతిద్వయంబుఁ | |
| గీ. | గారణంబులుగాఁ బుట్టినారు [119]పదియుఁ | నాల్గు కోట్లప్సరసలునా నాకసతులు వారిలో నొక్కతెవు నీవు వారిజాక్షి | యేమి దుష్కృతిఁ బుట్టితోఁ హీనజాతి. | 68 |
| గీ. | తివుచుచున్నది భవదీయదృగ్విలాస- మెత్తుకొనిపోవుచున్నవి యింద్రియములు వెనుక ద్రొబ్బుచునున్నాడు మనసిజాతుఁ డేమి సేయుదుఁ జెప్పవే యిందువదన. | 69 |
| గీ. | వనిత నీ చిత్తమున కేను వత్తునేని కామతంత్రంబునకు సంచకర్వు గాఁగఁ జుంబనము సేయని మ్మోష్ఠబింబ మిపుడు గండుఁగోయిల చిగురాకుఁ గమిచినట్లు. | 70 |
| గీ. | అనుచు విప్రుండు తమకించి యంటుకొనియె సమ్మతించియ యుండె నా చంద్రవదన శూకలాశ్వంబు నస రేఁపఁ జొచ్చినప్పు డనుమతింపదె యత్తళువైన బడబ. | 71 |
| వ. | ధీరోదాత్త [120]యగుట నమ్మత్తకాశిని చిత్తజాయత్త యయ్యును దత్తఱపాటు లేక యతనితో నిట్లనియె. | 72 |
| సీ. | కలుగుచున్నవి యనేకములు వికల్పము | లాడుచున్నవి యపాయంబు లెదుర నంతరాయము లసంఖ్యములు గన్పట్టెడు | సందేహములు పెక్కు చాయవాఱె నంకురితములయ్యె శంక లేరాళంబు | వికృతు లెన్నేని యావిష్కరించె శాఖోపశాఖలఁ జాఁగుచున్నది రట్టు | గుఱిలేక యుదయించె గోసనాస | |
| గీ. | యిన్నిటికి నోర్చి నీ కోర్కి యేను దీర్తు | నింతవానికి [121]నీకు నన్నీయ బరువె యెప్పటికి [122]నిత్తునో లేక యీ శరీర | మిప్పటికిఁ జాలునో నిక్కమెఱుఁగఁ జెపుమ. | 73 |
| గీ. | మొదలఁ గక్కుర్తిపడి [123]కూడి పిదప వాయు నొక్క కమలాననకు డిక్కి యుండఁజాలఁ డడవిఁ బెక్కు పుష్పములయందు వ్రాలు చంచరీకంబు మగవాఁడు సరియ సువ్వె. | 74 |
| ఉ. | చందురుఁ డంత చూడఁడు నిశా[124]సతి బున్నమనాడు గూడుచో గందళితానురాగుఁడయి కానఁగవచ్చు నవోదయంబులం జందము దప్పి మీఁద నొకచాయకు వచ్చుఁ గ్రమక్రమంబునన్ సుందరి పట్టునందుఁ బురుషుండును [125]నట్లయకాఁ దలంపుమీ. | 75 |
| వ. | *అనిన విని సుకుమారుండు. | 76 |
| క. | మగవారల నిందింపకు తగవును బంతంబు నిజము ధర్మముఁ గృపయున్ మగవారికెగా కెందును మగువలకుం గలవె చంద్రమండలవదనా. | 77 |
| సీ. | హరుని చిచ్చఱకంట నసమాస్త్రుఁ డీల్గిన | రతిదేవి యెట్లు జీవితముఁ జెందె బాండుభూపాలుండు పరలోకగతుఁడైనఁ | గుంతి చావక యేమి కుడువనుండెఁ బ్రథనాంగణమున సౌభద్రుండు చచ్చిన | బ్రతికె నెట్లు విరాటరాజతనయ సింధురా జస్తమించిన నేల దుస్సల | కాషాయవస్త్రంబు గట్టుకొనియెఁ | |
| గీ. | బంక్తిరథుఁ డన్యలోకసంప్రాప్తుఁడైన | నేల కౌసల్య ప్రాణమీ నెఱుఁగదయ్యెఁ. దగవు ధర్మంబు పాడి పంతంబు లెట్లు | భామ లెట్లు వృథానులాపంబులేల? | 78 |
| గీ. | అనినఁ జండాలకన్యక యాఁడువారి మంచితనమును మగవారి మంచితనము సరియ కీడని మేలని చర్చలేల మనకు మన యాడికలు తప్పకునికి చాలు. | 79 |
| వ. | విశ్వావసుండను గంధర్వరాజునకు మేనకయను నప్సరసకుం బ్రభవించిన ప్రమద్వరయను కన్యక స్థూలకేశాశ్రమవనంబునఁ బాదమర్దితంబగు పన్నగంబు గఱచినఁ బ్రవిలుప్తజీవిత యగుటయు భార్గవుండగు చ్యవనునకుఁ బౌత్రుండు ప్రమతికొడుకు [126]రురుం డాయురర్ధం బొసంగి యయ్యంగన బ్రతికించెననియును, నర్జునుం డశ్వమేధాశ్వానుసారియై యాత్మజుండగు బభ్రువాహనునిచేత నాహవాంగణంబున (నతినిశాత) శరాహృతప్రాణుండైన నులూచి యను నాగకన్యక రసాతలంబుననుండి యేతెంచి (యుపచరించి) యుపగతప్రాణునిం జేసెననియు విందుము. మంచితనంబు లాఁడువారికి మగవారికి సరియ యద్ది యటులుండె నా పంతంబు వినుము. | 80 |
| ఉ. | నాకు మనంబునిండ నొక నమ్మిక సేయుము (సర్వకాలమున్) గైకొనువాఁడ [127]నిన్ ననుము కాదన కెక్కడకైన వచ్చెద న్నీ కొకటయ్యెనేని యవనీసురమన్మథ నిర్విశంకత న్నాకముఁ జూఱ[128]వెట్టెద ధనంజయతీవ్రశిఖాముఖంబునన్. | 81 |
| వ. | అనిన విని సంతోషించి సుకుమారుండు. | 82 |
| సీ. | కలహంససంపద గల కలక్రేంకార- | కలకలంబైన యీ కొలను సాక్షి ప్రసవసౌరభనటద్బంభరంబైన యీ | [129]ఫలినీలతామంటపంబు సాక్షి ప్రచ్ఛాయశీతలోపరిభాగమైన యీ | శశికాంతమణిశిలాస్థలము సాక్షి తరులతాగుల్మసంతతపిధానాతప- | వ్యాపారమైన యీ వనము సాక్షి | |
| గీ. | మకరకేతను పాదపద్మములు సాక్షి | రతిమహాదేవి జఘనభారంబు సాక్షి సత్య మెన్నఁడు నినుఁ బాయ సమ్మతించి | కౌగిలింపఁగఁ నీఁగదే కమలవదన. | 83 |
| వ. | అనినఁ జండాలి కరారవిందంబులు [130]మొగిడిచి సవినయంబును *(సగౌరవంబును) సానురాగంబునుగా నతని కిట్లనియె. | 84 |
| ఉ. | నేఁడు గృతార్థులైరి జననీజనకుల్ ఫలియించెఁ బుణ్యముల్ నేఁడు పురాకృతంబు లవనీరుహమూలనివాసియైన కా- ట్రేఁ డిలు[131]వేల్పు నేఁడ యొనరించె మనోరథద్ధిసంపదల్ నేఁడుగదా (సువార మిది నీ కృపఁ) గంటి ధరాసురోత్తమా. | 85 |
| ఉత్సాహ. | మలుసమర్త నంటకుండి మాలదాన నగుట నేఁ గలయ [132]నీళ్ళనాడి కడవ గ్రంత యంటుకొనుటకై కొలనఁ గ్రుంకిపోవుచుండి కుసుమబాణనిభుని ని- న్నలఘు(తేజు) లోచనంబు లలరఁ జూచి వలచితిన్. | 86 |
| గీ. | ఏమి సేయుదు నీకు నెట్టిత్తు నన్నుఁ [133]బచ్చిముట్టునఁ గలుగు బీభత్స మెఱిఁగి [134]యిచ్చగింపక యుండ నేనెట్లు నేర్తు నధికతరమైన మన్మథాయత్తు నిన్ను. | 87 |
| వ. | అనిన సుకుమారుండు చండాలకన్యక కిట్లనియె. | 88 |
| శా. | ఏమాసించినఁ బ్రాణరక్షకయి యేమేఁ బాపముల్ సేసినన్ భామా చెల్లుఁ బురాణసంహితలఁ జెప్పన్ విందుమే కాదె వి- శ్వామిత్రుం [135]డెడరైనచో శునకమాంసంబున్ భుజింపండె నీ వ్యామగ్రాహ్యకుచంబు లంటి యిదె [136]నా ప్రాణంబు రక్షించెదన్. | 89 |
| వ. | ఇదె యెదుర (ససంభ్రమభ్రమద్భ్ర)మరకుల చరణనఖశిఖాశిఖరవిశీర్యమాణ కుసుమకేసరరేణు త్రసరేణువిసరపిశంగితోపకంఠంబు లతామండపం బిదె వెనుకఁ గుటిలశుకత్రోటికోటివిపాటిత మధురఫలరసధారాసార దుర్దినాయమానాభ్యంతరప్రదేశంబు చూతతరువాటికాభ్యాశంబిదె కెలన మదకలమల్లికాక్షపక్ష[137]పాళీనవపవనసంపాతకంపమాన కమలకేసరపరాగధూళీవిరచితాళీక సంధ్యానుబంధచకిత చక్రవాకనీడోద్భవక్రీడానీడంబులు, సరససైకతవేతసీనికుంజక్రోడంబు లిందు నీకు నింపు వుట్టినట్టియెడ నన్ను మన్నింపు మంటకున్నదాననని భయంబందకు కుసుమసమయంబు గదా ఫలావాప్తికి మూలంబింకఁ గాలక్షేపంబు చేసితేని కందర్పుండు దర్పాతిరేకంబున భవద్భ్రూవల్లీమతల్లికిం దల్లియగు [138]నించువింటిం బద్ద దిగిచి కొదమ తుమ్మెదఱెక్కగఱిగట్టిన పూమిట్టకోలల హృదయం బుద్ఘాటించి చంపుఁ జంపకకుసుమగంధీ ప్రాణంబు రక్షింపుమిదె నీకు సేవాంజలి యని కంకణఝణఝణత్కారంబు తోరంబుగా సుకుమారుండు నఖకిరణపరంపరాకుసుమ కుట్మలాభిరామంబులగు కరకిసలయంబులు మోడ్చి ఫాలభాగంబునం గీలించిన. | 90 |
| శా. | వాలాయంబుగ నద్ధరాసురుఁడు దన్ వాంఛించినన్ మందహా- సాలంకారమనోజ్ఞమైన ముఖ మొయ్యన్వాం[139]చి చండాలి యా లీలా[140]భావము కీలెఱింగి నవమల్లీకుంజమధ్యంబునం గేలీతల్పముఁ దీర్చెఁ[141]బో మృదులకంకేలీప్రవాలంబులన్. | 91 |
| వ. | అనంతరం [142]బధరీకృతకుసుమాయుధరూపసంపన్నుఁడగు నవ్వసుధానిలింపుం డపహసితసురసిద్ధగంధర్వవిద్యాధర లీలావిలాసినీవిలాసవతి యగు నవ్వెలివాడచేడియం గూడి సురతసౌఖ్యం [143]బనుభవించె నంత. | 92 |
| ఉ. | కాయజవిక్రియం [144]బడఁగఁ గానికులంబున సంభవించి య- న్యాయము సేయునే యిటు దురాత్ముఁడు వీఁడు [145]త్రపాభిమానముల్ మాయఁగఁదట్టి యంచు నతిమాత్రము లజ్జితుఁడైన కైవడిం దోయజషండబాంధవుఁ డధోముఖుఁడయ్యె నభోఽంగణమ్మునన్. | 93 |
| గీ. | గగనయానవేగంబున గలమరించి కడుపునిండంగఁ గ్రోలిన కమలమధువుఁ గ్రక్కెనో నాఁగ గగనమార్గంబునందు భానుబింబంబు రక్తాతపంబుఁ గాసె. | 94 |
| శా. | వ్రాలెం బశ్చిమశైలశృంగముపయిం బ్రత్యగ్ర[146]మధ్వాగమో- న్మీలత్కింశుకకోరకస్తబకకాంతిన్ భానుమన్మండలం- బాలంబించె మరుండు హస్తమున దాక్షారామలీలావతీ- భ్రూలేఖానిభవిభ్రమాభ్యుదయముం బుండ్రేక్షుకోదండమున్. | 95 |
| క. | క్రుంకె విభాకరంబము పంకజషండములు మొగిడెఁ బ్రత్యగ్వీథిం గంకేలీతరుపల్లవ- సంకాశచ్ఛాయఁ గొమరుసంజ జనించెన్. | 96 |
| గీ. | పద్మినీషండములనుండి పాసి చనియెఁ గోకమిథునంబు లత్యంతశోకపరతఁ దోన యేతెంచె భ్రమరసందోహ మపుడు కంఠలోహార్గళంబుల కరణి [147]మొఱయ. | 97 |
| వ. | ఇవ్విధంబునం బ్రతీచీకర్ణపూరరక్తోత్పలంబును జక్రవాకచక్రవాళకులచక్రవర్తియునగు మార్తాండుండు లోకాంతరంబున కవతరించిన గ్రమంబున నంబరతటాకవికచకమలినిసంజ మంజుమంజిష్టాపరాగసౌష్ఠవంబు [148]సంధించెఁ గృష్ణాగురుపంకవల్లికల యుల్లాసంబు నుల్లసంబాడుచుఁ జిలుపచిలుప చీఁకటి సిద్ధవిద్యాధరనితంబినీజనంబుల చెక్కుటద్దంబులతోడం జరలాడె [149]సాంధ్యదేవార్చనా బలిపిండంబులుం బోలె గగనమండలంబున వెండి[150]తగడుఁ దెగడి క్రిక్కిఱిసి చుక్కలు వొడిచెఁ బురుహూతాంతఃపురపురంధ్రీవిలాసదర్పణంబు దర్పకుని [151]మాటుఁ బొంది చందురుం డుదయగిరిశృంగశృంగాటకంబునఁ [152]బటికంబు గుండు చందంబొందె నప్పుడు చండాల*(కుల)వరారోహ వాహకుం డెక్కి విడిచిన వారువంబుఁ గొదమయుం బోలె సంభోగంబునం దృప్తి చని తనివోవని కౌతుకంబున సుకుమారుఁ గౌఁగిటం జేర్చి యిట్లనియె. | 98 |
| ఉ. | అల్లదె వేఁటపల్లె యట నావల మా వెలివాడ యావలన్ భల్లనిపాతమాత్రమునఁ బర్వతనిర్ఝరసింధు వావలం దెల్లని గోపురంబుల నతిప్రమదావహమైన రోహిణీ- వల్లభమౌళిభామిని నివాసము (లా మహిత) ప్రదేశముల్. | 99 |
| గీ. | ప్రతిభ సతతంబుఁ గొల్తు రా భద్రకాళి జగతి నేఁబదియాఱు దేశములవారు దశదినంబులు సింహకేతనము నిలిపి హూణభూమికి దైవ మీ యుత్పలాక్షి. | 100 |
| వ. | నీ వమ్మహాస్థానంబున వసియింపు మేను నీకు నాయావేళలఁ బరిచర్య [153]సేయుచు వంచన బయల్పడకుండ మెలంగెద సర్వకలావిశారదుండవైన నీకుం బ్రాకారగోపురద్వారవేదికా*(ప్రాకార) ప్రఘాణకుట్టిమహట్ట సౌధవీథీవిటంకంబులం గావ్యగోష్ఠీపరిహాసకథా బిందుమతీభిత్తికాప్రహేళికాభావన సుభాషితశ్రవణంబు, వారవిలాసినీదర్శనంబు, వైతాళికస్తుతిపాఠకంబు, దురోదరక్రీడ చిత్రకర్మంబు, వీణాస్ఫాలనంబు మొదలయిన వినోదంబులం [154]బ్రొద్దుపుచ్చం గలిగెడి వెండియు. | 101 |
| క. | వెలివాడకుఁ గడుఁ జేరువ సెలయేటికిఁ బొరువు [155]తాళ్ళుఁ జిట్టీఁదులు నా- వలఁ దఱచు భద్రకాళీ- నిలయం బది లెస్స నీకు నెలవు వసింపన్. | 102 |
| గీ. | ప్రొద్దు వోకుండ [156]ముందటఁ బొదమ నీవు కాళికాస్థానమునకు నీ [157]కాలిత్రోవ విప్రగృహమున నీకు నే విందొనర్తు ధర్మమిషమున నింటిపెద్దలకు జెప్పి. | 103 |
| వ. | (అని చండాలి) చెలికత్తెయుఁ దానును వేఱొక్కతెరువున నిజనివాసంబునకుం జనియె సుకుమారుడు చెఱువుకొమ్ము దాపలం బట్టుకొని విపినషండంబు నడుమఁగా బక్కణంబునకు దక్షిణంబు(న వెలివాడ) యొరసికొని పోయి [158]కాలిత్రోవం జని సెలయేఱు గడచి ముందట. | 104 |
| సీ. | [159]బ్రహ్మ యెక్కెడి జాలపాదంబునకుఁ గేళి- | వసతియైన సరోజవాటితోడ నైంద్రవాహనమైన యైరావణగ(జంబు | నోరూర్చు మోకయిందువులతోడ) వైష్ణవరథమైన వైనతేయున [160]కాఁగ | నిరవైన ప్రాకారపరిధితోడఁ గౌమారయానశిఖావళంబునకుఁ దాం- | డవమాడ సొబగైన గవనితోడ | |
| గీ. | వేడ్క [161]మాహేశుఁడెక్కెడి వృషభరాజు | దాఁక నిల్చిన కేళిభూధరముతోడ సకల[162]శక్తినివాసమై చాలనొప్పు | చండిభవనంబు పొత్తెంచె సచివసుతుఁడు. | 105 |
| మ. | [163]తన దౌశ్శీల్యము తా నెఱుంగుట వెలిన్ దౌదవ్వులన్ నిల్చి దు- ర్జనుఁ డాతండు లలాటభాగమున హస్తద్వంద్వమున్ మోపి యొ- య్యన లోలోన నమస్కరించెఁ బటుగర్వారంభసరంభశుం- భనిశుంభప్రథనక్రమప్రకటబాహాకేళికిం గాళికిన్. | 106 |
| ఉ. | మాలెత విందు బ్రాహ్మణకుమారుడు పక్కణవాసి వేణుకం- డోలమునందుఁ దెచ్చిన గఠోరితచంద్రిక నిర్ఝరాపగా- కూలమునన్ భుజించి ఘనగోపురవేదిక నిద్రవోయె న- య్యాలరి బ్రాహ్మణుండు తుహనాచలకన్యకయాశ్రమంబునన్. | 107 |
| వ. | మఱునాఁడు ప్రాతఃకాలంబున నిర్ఝరాంధఃప్రవాహంబున నవగాహనంబు చేసి కపటసంధ్యావందనంబును గృతకజపంబును (మిథ్యా)సూర్యోపాస్తియు నడపి బ్రాహ్మణ[164]బ్రువుండు. | 108 |
| సీ. | దంతిదంతార్గళస్తంభభారముతోడ | రాజిల్లు ఘనగోపురములు సూచి గండశైలచ్ఛేదఘటితమై యొరపైన | మేటికొమ్మలతోడి కోట సూచి యమృతదీధితిలోని హరిణంబు వెఱపించు | సౌధాగ్రసింహధ్వజములు సూచి యాటమండపముపై నభ్ర ముల్లేఖించు | జాంబూనదత్రిశూలంబు సూచి | |
| గీ. | చమురుగా(కులు కుసు)మగుచ్ఛములు వోలె | సకలశాఖోపశాఖల సంశ్రయింపఁ బుష్పితాశోక[165]పాదపంబులునుఁ బోని | నింబములు సూచి యతఁ డద్భుతంబు సెందె. | 109 |
| ఉ. | కాళికదివ్యమందిరము (కట్టెదురం బశుకంఠ)నాళకీ- లాలరసంబు గ్రోలు నభిలాషమునం జనుదెంచియున్న వే- తాళగణంబు వోలె నతిదైర్ఘ్యమునన్ దివి దాఁకియున్న హిం- తాళవనంబు గన్గొని యతండు మహాద్భుతమందె నాత్మలోన్. | 110 |
| ఉ. | పైపయి గర్భగేహమునఁ [166]బన్నికమీఱి వెలుంగు మాలికా- దీపశిఖాప్రరోహములు దేఱగఁ జూచి యనుస్మరించె లో- నా పృథివీసురుండు మహిషాసురమస్త(కశోణితార్ద్ర)దు- ర్గాపరమేశ్వరీపదనఖంబుల [167]రూపము సంవదించినవ్. | 111 |
| గీ. | [168]సదనవనవాటికానికుంజములయందు నెలుక లధరోష్ఠసంపుటంబులు గదల్ప శక్తిమంత్రాక్షరంబులు జపముసేయు నవియువలె నున్న నద్భుతంబందె నతఁడు. | 112 |
| సీ. | మంత్రవాదులతోడి మైత్రి సంపాదించు | యంత్రవాదులఁ గని యాదరించు సిద్ధయోగీశ్వరశ్రేణి సంసేవించు | ధా(తువాదులకు వం)దనము సేయు కదలి [169]వశ్యాశ్చర్యకథ లెఱుంగఁగఁగోరు | బిలము సాధింప నపేక్ష సేయు బహుదేశభాష లభ్యాసింప వాంఛించు | శల్యతంత్రముమీఁదఁ జాఁపు మనసు | |
| గీ. | (ఘుటిక కట్టఁగఁ) బెన్నిధి [170]గుద్దలింప | నింద్రజాలంబు వన్నంగ నిచ్చగించుఁ [171]గట్టిభవనములకు సురంగములు ద్రవ్వ | నేర్చుకొనుఁ బ్రత్యహంబును నీచబుద్ధి. | 113 |
| చ. | [172]బతిచెడి మాంసభుక్తి మధుపాన జనంగమవంశ భామినీ రతిఁ బరతంత్రుఁడై నడుపుఁ [173]బ్రత్యయమున్ ధరియింపుచుండు న- ప్పతితుఁడు గంగమట్టియయుఁ బ్రన్నని నున్నని నీరుకావిదో- వతులును (బ్రహ్మసూత్ర)ములు వంశ్యులయిండ్ల [174]భుజించు కోరికన్. | 114 |
| గీ. | మాధుకరభిక్షలను స్వయంపాకములను సత్రభోజవములఁ బితృశ్రాద్ధములను విందులను దేహయాత్ర గావించు నతఁడు వేదశాస్త్రపురాణప్రవీణుఁ డగుట. | 115 |
| సీ. | నీరాట నెపముగా నిర్ఝరంబుల కేఁగి | సవిధవానీరకుంజముల [175]నొండె భూధరంబుల కిప్పపువ్వు దే ననిపోయి | కందరామధ్యభాగముల [176]నొండె [177]శిశిరభూధరకన్య సేవింప ననిపోయి | [178]నక్తమాలముల నెన్నడుమ [179]నొందె కలమ సస్యక్షేత్రములకుఁ గూళ్ళొగి మోసి | శణవాటికాప్రదేశముల [180]నొండె | |
| గీ. | నెట్టు [181]కనుఁబ్రామి వచ్చునో యింటివారి | [182]నెట్టు (వెరవదొ యొం)టిమై నిక్క కరుగ నతివ పగలైన మాపైన నతనితోడ | నిచ్చ [183]నొకసారి సాగించు నిధువనంబు. | 116 |
| వ. | [184]ఒక్కనాఁ డక్కనిష్ఠవర్తనుండు పక్కణశబరులం గూడి కరిక్రవ్యాదంబు(లగు కుక్కలం బట్టు)కొని ప్రత్యుషఃకాలంబున విపినవీథుల [185]నీవారభసలవిఘటితసరఃకమలషండసౌరభోద్గారభరిత దిక్కటాహంబు కరటిమార్గం బిదె, విదళితసమస్తముస్తాశకలసారంబు వరాహయూథపథం బిదె, కఠిన[186]విషాణకోటివిభిద్యమాన వల్మీకధూళిపాళికానిచుళిత తరుపలాశంబు మహిషవర్త్మం బిదె, దూర్వాప్రవాళచర్వణ[187]హరిచందన పరిపాండురంబు [188]హరిణమార్గం బిదె, [189]కటుదీర్ఘఘర్ఘరవ్యాక్రోశంబు కర్కరేటుకులకులాయస్థానం బిదె, కహ(కహారా)వంబు, దాత్యూహవ్యూహప్రదేశంబు ననుచు నాఖేటకౌతుకంబున నాఖేలనక్రీడావిహారంబుల [190]నృశంసుండై, ప్రాణిహింస [191]యొనర్చుచు వెండియు. | 117 |
| గీ. | పాపకర్ముండు కాంతారపథమునందు [192]నదరిపా టొంటినంటి బ్రాహ్మణుల మొత్తి యవహరించిన విత్త మన్యాయపరత నంత్యజస్త్రీయుఁ దానును ననుభవించు. | 118 |
| గీ. | ఇవ్విధంబున సుకుమారుఁ [193]డీలు వుడిగి మాలచిగురాకుఁబోఁడితో మనువు మనఁగ వచ్చె నొయ్యన మధుమాసవాసరములు [194]వాసితాశోల్లసత్ఫుల్లకేసరములు. | 119 |
| సీ. | కామినీగండూషకాదంబరీధారఁ | బులకించె నారామభూమిఁ బొగడ చివురాకుఁ జవిచూచి చవిచూచి [195]యెలుఁగించెఁ | బంచమస్వరమునఁ బరభృతంబు సంఫుల్లకోరకస్తబకాచితంబైన | కొరవిపై [196]భ్రమరించెఁ గొదమతేఁటి పరిపక్వసహకారఫలరసాస్వాదన- | [197]మదమునం గీరంబు చదువదొణఁగె | |
| గీ. | విటవిటీసముదయములు వివిధవిధుల | నుపవనక్రీడ సల్పిరి యుబ్బుమిగిలి యఖిలజనులకు సంతోష మావహించె | మాసరములైన [198]మధుమాసవాసరములు. | 120 |
| వ. | ఇట్లు సకలజనమనోహరంబులగు మధుమాసవాసరంబుల(యందు), [199]నప్పాపిష్ఠుఁడు చండాలకన్యకం దగిలి యొండెఱుంగక లజ్జ యుజ్జగించి మానం బూనంబు చేసి కులంబు పదటం గలిపి శీలంబు పరిత్యజించి దిట్టకూళయై కన్నుగానక కావరంబెత్తి తిరుగుచుండఁ గర్ణాకర్ణి నతని దుశ్చారిత్రంబులెల్ల విని [200]యెక్కడెక్కడ నాడికొనం దొణంగి రంత నెంతేనియుఁ [201]దేటతెల్లయైన యతని దుర్వర్తనంబు ప్రసంగించి ప్రకాశంబుగా నాడుచుండి రంత. | 121 |
| క. | క్రూరాత్ముఁ డితఁ డనఁగాఁ జోరుం డితఁ డనఁగ నితఁ డశుద్ధుం డన దు- శ్చారుఁ డితం డనఁగా సుకు- మారున కపకీర్తి హూణమండలిఁ బ్రబలెన్. | 122 |
| వ. | అంత నొక్కనాఁ డతండును నదియును బాతాళపంకకలుషంబగు మహాజలధిపూరంబునుం బోలె నంధకారంబు తోరంబై దిక్కులఁ బిక్కటిల్ల బహుళపక్షంబు*(నాఁటి) రాత్రి కాళికాగోష్ఠంబు కెలన జీర్ణోద్యానంబు నడుమ నక్తమాలతరుషండంబులోఁ దార కల్పించిన సంకేతస్థలంబునం దృణకుటీరంబునం గోద్రవ[202]పలాలపర్యంకంబున మదిరోమదోద్రేకసంభవంబైన మదనావేశంబున మనోభవశర [203]సీత్కారంబులనుం బోలె సీత్కారంబులవలనను, బంచబాణమాణిక్యకంకణక్వణితం(బులునుం బోని మణితంబులవలనను, ప్రద్యుమ్నరథరథ్యరాజకీరహేషాకలకలంబులం బోలె కులుకుటెలుంగులవలనను, శంబరారాతినికేతన లీలోద్యానవాటికాతరులతాసంవేష్టనబంధనబులుం బోని యాలింగప్రబంధంబులవలనను, మకరధ్వజోపహార ద్రాక్షాఫలరసపానానుబింబంబులుం బోని చుంబనంబులవలనను, కుసుమకోదండదండయాత్రాసమారంభజృంభమాణ విజయతుత్తుంభగంభీరభాంకారంబులకుఁ దాతలుం బోని ముష్టిఘాతలవలనను, బహువిధోపచారసంపన్నంబైన సురతంబు సాగించి రప్పుడు. | 123 |
| శా. | హాలాపానమదాతిరేకమున నయ్యబ్జాక్షి గుంజాఫల- ప్రాలంబంబు నటింపఁ జూపెను [రతిప్రౌఢిన్ స్వపుంభావమున్] దాళీగర్భపలాశకల్పితబృహత్తాటంకచక్రద్వయీ డోలాడోలనముల్ మనోభవభుజాటోపంబు రూపింపఁగన్. | 124 |
| వ. | అనంతరంబ. | 125 |
| ఆ.వె. | కేలు గేలఁ బెనఁగఁ గాల్గాలఁ బెనఁగంగ వారు చొక్కి [204]సురతపారవశ్య- నిద్ర జెంది రపుడు నిశ్వాసమారుత- ప్రమదములను నట్టి సమయములను. | 126 |
| మ. | కనియె నిద్దురవోయె మేలుకొనియెం గర్లుబ్బ గాంధారిప్రొ- ద్దున వానీరము పువ్వు రాల్చు తఱి ముత్తో కంకటిం గూడి యొ- య్యనఁ గోర్కొయ్యలు పశ్చిమాచలము డాయంబోవఁ గాత్యాయనీ- వనమధ్యంబున బ్రహ్మబంధువు కుటీవాసాంతరాళంబునన్. | 127 |
| వ. | మేలుకాంచి తన దౌర్జన్యంబు కారణంబుగా హూణమండలంబునం బట్టిన రట్టుసడి నిమిత్తంబునం దన కచిరకాలంబున గా[ఁగ]ల ప్రాణాభిమానభంగంబు దర్కించి పరదేశంబునకుఁ బోవువాఁడై చండాలిక మనంబునుం దనమీఁదం గల యనురాగంబునుం దెలియు పొంటె తత్కాలంబున మేలుకనియున్నదానితో నిట్లనియై. | 128 |
| క. | సడియును రట్టును రవ్వయుఁ బొడమెన్ నాకిపుడు హూణభూమండలిలో బడితి[ని] నిట నీ దేశము విడిచి చనన్వలయు నకృతవిషయంబునకున్. | 129 |
| గీ. | మగువ పరదేశమున కేఁగి మగుడి వత్తు కొంతకాలంబునకు నన్యచింత యుడిగి యుండు నీ[వు] పుట్నింటియం దోర్పు గలిగి మరలి రాఁడెట్టు [205]పరదేశ మరిగి మగఁడు. | 130 |
| వ. | అని పలికిన నిర్ఘాతపాతంబునకంటె నిర్ఘృణంబైన యమ్మాటకు శిరీషకుసుమసుకుమారంబైన తన మానసంబున నుస్సురంచు పుల్కసి యాననంబు వాంచి నిట్టూర్పు నిగుడించుచు నూరకుండె నప్పుడు). | 131 |
| చ. | కువలయపత్రనేత్ర కనుఁగొల్కులయం దుదయించె బాష్పబిం- దువులు ధరాసురుండు తనుఁ దోడ్కొని[206]పోవ కుపేక్షసేయున- న్న వదరవిందచక్రమిథునంబు లసహ్యవశాంగజాగ్నిచే రవులుకొనంగఁ బుట్టిన నిరంతరధూమము సోఁకియో యనన్. | 132 |
| గీ. | చామ హృదయంబుమీఁద హస్తంబు వైచె నతఁడు తనుఁ బాసి యేఁగునో యనెడు భీతి నుల్లమునయందు వసియించి యున్న తన్ను వెడలిపోకుండ [207]నడ్డపెట్టెడు విధమున. | 133 |
| వ. | అనంతరంబ యా చాండాలి యతని కిట్లనియె. | 134 |
| గీ. | ఎట్టు వేగింతు సంసార మిచట నుండి యేల నినుఁ బాసి యొంటి నా కిచట నుండఁ గలుగనిమ్ము [208]బంధువులు పెక్కండ్రు నాకు [209]బంధువు గలండె నాకు నీపాటివాఁడు. | 135 |
| శా. | ఇచ్చోటన్ మధుపానగోష్ఠి సురతం బిచ్చోట సంగీతకం బిచ్చోటం బరిపాటి నీ కలకలం [210]బిచ్చోట మానోదయం బిచ్చో నంచు భవద్వియోగమునఁ దా నెవ్వారికిం బ్రీతిగాఁ జచ్చున్ మన్మథవేదనానలమునం జండాలి విప్రోత్తమా. | 136 |
| మ. | కరవీరప్రసవచ్ఛదారుణ [211]పయఃకాషాయవస్త్రంబుతో శరతూలచ్ఛవి యజ్ఞసూత్రములతో జాంబూనదస్ఫూర్తిత- స్కరమృత్స్నానిటలోర్ధ్వపుండ్రకముతో సాక్షా[212]చ్ఛుకబ్రహ్మతోఁ దరమౌ నిన్ను మహాత్మ రేపకడ సందర్శించినం జాలదే. | 137 |
| ఉ. | ధీరత పూని నీవు పరదేశము వోవఁగ నేను రాక యీ [213]యూరనె యుంటినే ద్విజకులోత్తమ [214]నిత్యముఁ గాళికాగృహ- ద్వారవితర్దికాస్థలము దవ్వులఁ జూచినయప్పు డెట్లొకో కూరిమి పేర్మి గుండియ దిగుల్లని తల్లడ మందునో సుమీ. | 138 |
| సీ. | తను నిద్ర మేల్కొలిపిన మాత్రమున జర- | త్కారుండు విడువఁడే ధర్మపత్ని జమదగ్ని కొడుకుచేఁ జంపింపఁడే భార్య | లవమంత దోష ముల్లమున [215]నిల్ప [216]యొకమాటి తప్పుగావక యహల్యాదేవి | నక్షపాదుఁడు ఱాయియగుమనండె స్రుక్కి సన్నంబుగాఁ జూడఁడే కోపించి | సతి నరుంధతి వసిష్ఠర్షివరుఁడు | |
| గీ. | తగవు ధర్మంబు పాడి పంతంబు నిజము | పువ్వుఁబోఁడుల యెడ లేదు భూసురులకుఁ బ్రథమమున నీవు చేసిన బాస నమ్మి | మోసపోయితిఁ [217]గులములో నీసు వడితి. | 139 |
| సీ. | పద్మాకరమునకుఁ బసపాడఁ దెచ్చిన | దైవంబు చలము సాధ్యంబుగాఁగ ననురాగరసము నా మనములో నూన్చిన | నయనేంద్రియములకుఁ బ్రియముగాఁగ విడువ నిన్నెన్నఁడు విశ్వసింపవె యన్న | నీ సత్యమునకుఁ బున్నియముగాఁగ నిక్షుకోదండ మెక్కిడి బాణ మరిఁబోయు | కందర్పునకు మహాఖ్యాతిగాఁగ | |
| గీ. | [218]నెపుడు నీవు ననుం బాసి యేఁగి తపుడె | నీరనైనను నురినైన నెగడినైన విడుతుఁ బ్రాణంబు [219]లిపుడ నీ యడుగు లాన | పలుమఱునుఁ బెక్కుమాటలు వలుకనేల. | 140 |
| గీ. | అనినఁ జిఱునవ్వు నవ్వి నీ మనసు చూడ నంటిఁగా కేను నినుఁ బాసి యరుగఁగలనె యిట్టిపట్టున నెవ్వఱు నెఱుఁగకుండఁ [220]బోవుటయ లెస్స యీ హూణభూమి విడిచి. | 141 |
| గీ. | ఎల్లి శ్రీభద్రకాళికి నిద్దభక్తి యాత్ర యొనరించి వెళ్ళుద మర్ధరాత్ర మీ విచారంబు చెప్పకు మెవ్వరికిని వారిజానన రట్టువడ్డార మిచట. | 142 |
| ఉ. | సంగరసవ్యసాచి[221]వరశాస్త్రవిశారదదేశికేశ్వరా మంగళగీతవాద్యపరిమండిత [222]ముద్రకకుండలీకళా- భంగురనృత్త భవ్యపరిభాసితసంతతనిర్మలాత్మకా యంగజసన్నిభప్రథితహాట్టవిశేషమనోజ్ఞవర్తనా. | 143 |
| క. | గౌరీవల్లభసేవా- పారీణ విరాజివిభవభక్తిప్రతిభా- భారోన్నతదివ్యాంగా సారసగర్భప్రభావ సర్వజ్ఞనిధీ. | 144 |
| మాలిని. | సరససుఖవినోదా సారశైవార్థమోదా పరమపదవివేకా భానుతుల్యప్రభాకా ధరణిధరసుధైర్యా దండసంగ్రామశౌర్యా నిరుపమగుణధామా నిత్యకల్యాణసీమా. | 145 |
| గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర *(సకలవిద్యాసనాథ) శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన శివరాత్రి మాహాత్మ్యంబునందుఁ దృతీయాశ్వాసము. |