| కావ్యములు | శివరాత్రి మాహాత్మ్యము | శ్రీనాథుఁడు |
| క. | శ్రీహిమవద్గిరిపుత్రిమ- నోహరపదభక్తిజాతనూతనసరస- వ్యాహారకావ్యనాయక మోహనతనుజితజయంత ముమ్మయశాంతా. | 1 |
| వ. | అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లని చెప్పందొణంగె. | 2 |
| సీ. | కాంచనాచలముతో గర్వించి యే కొండ | [1]పెరిఁగె బ్రహ్మాండకర్పరము మోవ నే కొండచఱులపై హిమశైలకన్యక | చెంచులేమలఁ గూడి సంచరించు వజ్రాల కమరు ఠేవ విడంబనము సేయు | నే కొండమొలచుట్టు నిందుతనయ యల్లోనేరెడుదీవి యవనీధ్రములలోన | నే కొండ కైశ్వర్య మెక్కుడయ్యె | |
| గీ. | నట్టి వింధ్యనగేంద్రపర్యంతభూమి | దండకారణ్యవిపినమధ్యంబునందు రత్నపురమనఁ గల దొక రాజధాని | కిన్నరాధీశు నగరకిఁ గీస వెలితి. | 3 |
| గీ. | స్ఫటికమాణిక్యపాషాణఘటితమైన యప్పురముకోట యాకాశ మంటి యొప్పు వేడ్కఁ బాతాళభువనంబు వెడలివచ్చి [2]చుట్టుముట్టినయట్టి వాసుకియుఁ బోలె. | 4 |
| గీ. | [3]పట్టణంబున దేవతాభవనకోటి తుహినగిరికూటములతోడఁ దులలుతూఁగు నమరగంగాపయఃప్రవాహములఁ బోలుఁ దచ్ఛిరస్థాపితోన్నతధ్వజపటములు. | 5 |
| సీ. | [4]ప్రణతదేవకిరీటమణిమయూఖచ్ఛటా- | పటలకిమ్మీరాంఘ్రిపంకజుండు వికటపాటలజటామకుటకోటిఘటిత- | కోమల[5]తారకాకాముకుండు గంధదంతావళక్రవ్యాదరాట్కృత్తి- | కంథాధురంధరకంధరుండు కుంభినీధరసుతాకుచకుంభమృగమద- | స్థాసకస్థగితవక్షస్థలుండు | |
| గీ. | శంభుఁ డోంకారనాథుండు శాశ్వతుండు | పాయకయ యుండు నవ్వీటి పరిసరమున నర్మదా సింధుతీర కాంతారభూమి | మఱ్ఱి యను పేరి కల్పద్రుమంబు [6]నీడ. | 6 |
| వ. | అప్పట్టణంబునకుం జుట్టును జనపదంబు [7]లైరావతీశతద్రూ విపాశాసింధునదీమాతృకంబులును, విశ్వవిశ్వంభరాభ్రూలతానుకారిసేతురేఖాలంకారంబులును, దటాకతరుకుసుమకేసరక్షర దమందమకరందధారాధోరణీసహస్ర[8]సంవర్ధితకుల్యా సలిలకల్లోలమాలికా[9]స్ఫుటస్ఫాయత్కాయమాన నానావిధోద్యానవాటికాసంఘటితాకాలకాలాంధకారంబులును, నారామచూతపోతనికరసుకుమార కిసలయాస్వాదకషాయకంఠ కలకంఠకామినీ కోమలకుహూకార కోలాహలాంకురిత పంచమరాగరాజంబులును, రాజాన్నకలమషాష్టిక పతంగ[10]ప్రియ నానావ్రీహిసస్య[11]ప్రశస్తంబులును, బ్రవర్ధమానవనంబులును, [12]నిబిడిత సారసికంబులును, గుళుత్థాభ్యుత్థానంబులును, సముద్గతముద్గసామగ్రీసంగ్రహంబులును, [13]అణుకచణకచణంబులును, సిద్ధార్థ [14]శ్యామాక గోధూమ [15]గర్ముత్తిలజర్తిలంబులును, అదూషిత [16]మాషకోరదూషితకోన్మేషంబులును, [17]కుసుంభకుసుమగుచ్ఛచ్ఛాయాచ్ఛటా[18]భ్యంగణ శోణభంగోమాణుశృంగారిత జాంగలక్షేత్రంబులునునై దాశరథి[19]చరిత్రంబునుం బోలె సీతావృత్తి[20]సరళంబును, జంద్రోదయంబునుం బోలెఁ గరసహస్రసంవర్ధిత[21]రత్నాలయంబును, యదువంశంబునుం బోలెఁ గులక్రమాగత శూరపురుషోత్తమ బలాభిపాలితంబునునై యుండు వెండియు. | 7 |
| మ. | పరలోకస్థు [22]బతిన్ ఝుషాంకు బ్రతికింపంగోరి యోంకారశం- కరు మ్రోలన్ రతి [23]ముక్తకంఠముగ నాక్రందించునా [24]నొప్పు న- ప్పురబాహ్యోపవనాంతదీర్ఘికల (రేపున్ మాపు వీతెంచు) పు- ష్కరకింజల్కభుజిక్రియాసుఖితహంసక్రేంక్రియారావముల్. | 8 |
| మ. | ధరణీచక్రమువోలె నప్పురము విస్తారంబు నాయామముం బరికింపంగ నశక్యమైన గరిమం బాథోధిగంభీరతం బరిఖామండల మంబురాశి నుపమింపం బాత్రమై యొప్పు నం- బరకల్లోలలుఠత్తిమింగిలఢులీమత్స్యాహినక్రోద్ధతిన్. | 9 |
| గీ. | భద్రజాతి యేనుంగు లప్పట్టణమునఁ బ్రకటితస్ఫూర్తి నొప్పు సిబ్బములతోడ విమలవారాశిఫేనఖండములతోడి కవ్వపుంగొండబందులో కాక యనఁగ. | 10 |
| ఉ. | లక్షలసంఖ్య లప్పురి కెలంకులయందుఁ గొలంకు లొప్పు వాః- పక్షిగరుచ్ఛటాపవనపాతవికంపితపంకజంబులై [25]వీక్షణకౌతుకంబు ప్రభవింపుచునుండును లీలమై సహ- స్రాక్షుఁడు విశ్వరూపమహిమాద్భుతముం బ్రకటించెనో యనన్. | 11 |
| శా. | ఆ వింధ్యాచలదుర్గ [26]మేలు శబరాధ్యక్షుండు హేమాంగదుం డా వార్ధిద్వితయద్వయావధిగఁ జక్రాధీశ్వరుల్ గొల్వ నా- శావేదండఘటాకపోలతలమూర్ఛద్దానధారాజల- ప్లావప్రక్రమసంవిశుద్ధబహులప్రస్ఫూర్తిమత్కీర్తియై. | 12 |
| సీ. | శివుని కైవడి [27]మహాసేనానుయాతుండు | బలభేది పగిది [28]నపవ్యపాయుఁ డరవిందహితు లీల [29]నధిగతాభ్యుదయుండు | [30]బుధుని క్రియ నజహత్పుష్కరుండు గంగాప్రవాహంబు కరణిఁ బావనమూర్తి | భుజగాధిపుని భంగి భోగశాలి యేనుంగు చందాన దానధారాశోభి | శౌరి లాగున శంఖచక్రపాణి | |
| గీ. | కర్త యాశ్చర్యములకు నాకరము నీతి- | కఖిలవిద్యాగమములకు నాస్పదంబు పగఱ కుత్పాతకేతువు బంధుకోటి- | కమరలోకద్రుమంబు హేమాంగదుండు. | 13 |
| గీ. | ఆ నృపాలుండు నీతివిద్యానిరూఢిఁ జారదృష్టియౌఁ గాని విచారదృష్టి సమధికైశ్వర్యవైభవోజ్జ్వలత నాతఁ డష్టమూర్తియౌఁ గాని యనష్టమూర్తి. | 14 |
| యజ్ఞదత్త చరిత్రము | ||
| వ. | ఆ రాజునకు నఖిలశాస్త్రవిద్యాకళా[31]పావనగంభీరబుద్ధి యజ్ఞదత్తుండను బ్రాహ్మణుండు దేవేంద్రునకు బృహస్పతియును వృషపర్వునకు శుక్రుండును దశరథునకు వసిష్ఠుండును రామునకు విశ్వామిత్రుండును నజాతశత్రునకు ధౌమ్యుండును [32]నలునకు సుమతియుం బోలెఁ బ్రధానియై రాజ్యభారంబు భరియించియుండు నమ్మంత్రి భార్య వినయవతియు వివేకవతియు విభ్రమవతియు విలాసవతియు సౌభాగ్యవతియు లక్షణవతియు నౌదార్యవతియు గాంభీర్యవతియు లజ్జావతియునై సర్వగుణసంపూర్ణ సుశీలాభిధానయగు [33]భామారత్నం బతనికిఁ [34]బ్రేమాస్పదంబై యుండు. | 15 |
| గీ. | అన్ని భాగ్యంబు [35]లున్న నా యజ్ఞముఖికి శ్రీమహాలక్ష్మి గలుగఁగ నేమి సెలవు పుత్రవచనావలోకనోద్భూతమైన యొక్క సౌఖ్యంబు బ్రాఁతియై యుండుఁ గాన. | 16 |
| గీ. | [36]తనయసంతానలబ్ధి దౌదవ్వుగాఁగ విభవసంపత్తి గల్గియు విన్నఁబోయి వనిత నిష్ఫలపుష్పదర్శనముఁ [37]దాల్చె శరలతాకాననము వోలె జవ్వనంబు. | 17 |
| సీ. | కాంత పుష్పాది బోగంబు [38]లింపనివను | వైరాగ్యవిధికిఁ దా వాల్చుఁ జిత్త- మన్వయంబునకుఁ దా నాలంబమయ్యును | దను నిరాలంబఁగా దలఁచు నింతి ప్రొద్దునఁ [39]దగినట్టి భోజనం బొల్లక | యుపవాస [40]నియమంబు నువిద దలఁచు సంపత్పరంపర సంభవిల్లిననైన | సంతోష మొదవదు చామ [41]మదికిఁ | |
| గీ. | గోమలాంగుళదళహస్తతామరసము | కర్ణపూరత్వలీలకై కాలుసాఁప గండతలదర్పణంబునఁ గదియఁ జేర్చి | [42]తరుణి చింతించు [43]సుతులబ్ధి తడయుటకును. | 18 |
| ఉ. | సంతతి లేని దుఃఖమున సామజరాజఘటాంతవైభవం- బెంతయుఁ గల్గియున్ సరసిజేక్షణ [44]విన్నఁగఁబోయియుండు సీ- మంతిని బోటికత్తెలకు మానసవృత్తి యెఱుంగఁ జెప్ప కై- [45]కాంతికకేళిశయ్యపయిఁ గాంత గుణించు మనోరథార్థముల్. | 19 |
| ఉ. | [46]ఆ చపలాయతాక్షి కనకాంబురుహంబులఁ [47]బూజ సేయు విం- ధ్యాచలకందరానిలయు నద్రిసుతాప్రియనాథు నర్మదా- వీచిపరంపరాసలిలవిప్రుషదాశ్రయశీతగంధవా- హాచమనప్రవృద్ధభుజగాధిపకంకణు నోంకృతీశ్వరున్. | 20 |
| సీ. | అభిషేక మొనరించు నలినీలకుంతల | శంభు సోమోద్భ[48]వాసలిలధార నెలఁత యభ్యర్చించు నీలోత్పలంబులఁ | దరుణనిర్మలసుధాధామమౌళి గరళకూటగ్రాసకల్మాషకంధరు | మేన గంధ మలందు మీన[048]నేత్ర యర్పించు దివ్యోపహారంబు లెలనాఁగ | కుటిల[49]కుండలిరాజకుండలునకు | |
| గీ. | నతివ దిరుగుఁ బ్రదక్షిణం బభవు [50]గుడికి | గుచభరంబున నరగౌను [51]గూనుగిలఁగ [52]రవలిమట్టెల మ్రోతతో రాయిడింపఁ | జరణనూపురఝళఝళంఝళరవంబు. | 21 |
| వ. | ఒక్కనాఁ డోంకారనాథునకుఁ బ్రదక్షిణం బాచరిం[53]చుచు నప్పద్మాక్షి ప్రాకారపురఃప్రఘాణంబున నొక్క పౌరాణికుండు శ్రీమహాభారతంబు వక్కాణించు వాఁ [54]డపుత్రకులకుఁ బుణ్యలోకంబు లేదని కథానుకథనప్రసంగంబునం బలికిన నయ్యింతి సంతానవిరహవేదనాదూయమానమానసయై మందిరంబున కేతెంచి యేకాంతభవనంబున [55]విహారశయ్యపై మేనువైచి చింతాక్రాంతయై యుండె నంత యజ్ఞదత్తుం డమ్మత్తకాశిని నన్వేషించి. | 22 |
| ఉ. | కాంత సరోజనాళలతికాతనుపాండుశరీరయష్టి నే- కాంతగృహాంతరస్థితఁ బ్రియాంగనఁ జేరఁగవచ్చె మంత్రి క- ల్పాంతమునన్ రసాతలగుహాకుహరంబున [56]డాఁగియున్న భూ- కాంత వరాహమూర్తి హరి గ్రచ్చఱ డాయఁగవచ్చు కైవడిన్. | 23 |
| వ. | డాయవచ్చినఁ గృతప్రత్యుత్థానయగు నప్పంకజాక్షియుఁ దానునుం పర్యంకంబునఁ గూర్చుండి యవిరళాశ్రుపాతార్ద్రీకృతదుకూలయు ననలంకృతయునైన సుశీలం జూచి యజ్ఞదత్తుం డిట్లనియె. | 24 |
| గీ. | ఏల యేడ్చెదు చెప్పవే యిందువదన విపులశోకభరంబున వెక్కివెక్కి త్రాట గ్రుచ్చిన [57]క్రొత్తముత్యాలవోలెఁ [58]జన్నుఁగవ నున్న వీ బాష్పజలకణములు. | 25 |
| సీ. | కుదురునిండిన మంచి గుబ్బచన్నుల మీఁద | ధరియింపవేల ముత్యాలపేరు ఫాలేందురేఖపైఁ బచరింప విది యేల | కుంకుమంబున బొట్టు గోరఁ దీర్చి [59]యానబంధోద్ధురంబగు నితంబంబున | సవరింపవేల వజ్రాల [60]కమరు పాయవట్టములతోఁ బసిఁడి నూపురములు | హత్తింపవేల పాదాంబుజములఁ | |
| గీ. | [61]బంచవన్నియరాచిల్కఁ బంజరమున | నేల సదివింప [62]వనురాగ మెసకమెసఁగ నేల చింతించెదవు [63]చెప్పు మిందువదన | గండపాళికఁ గెంగేలు గదియఁజేర్చి. | 26 |
| గీ. | నెలఁత నులివేఁడియైన నీ నిడుదయూర్పు మాటిమాటికి నిపుడు నా మానసంబు గంపమొందించుచున్నది కల్లగాదు ప్రబల భవదీయ వక్షో[64]భవంబుఁ బోలె. | 27 |
| క. | అపరాధము సేయఁ గదా చపలాయత[65]నేత్ర! [66]యేను జనవున[67]నేనిన్ నిపుణతతోఁ జింతించిన నెప మేమియుఁ గానరాదు నీ నెగులునకున్. | 28 |
| క. | భవదాయత్తము విభవము భవదాయత్తంబు సువ్వె ప్రాణము నాకున్ భవదాయత్తము సర్వము ధవళాంబుజపత్ర[68]నేత్ర తథ్యం బరయన్. | 29 |
| వ. | ఈ దుఃఖంబునకుం గారణం [69]బేమి చెప్పుమని [70]యడుగుటయుం బ్రత్యుత్తరం బీక యూరకున్న దాని తాంబూలకరండవాహిని మంత్రితో నిట్లను దేవ దైవంబు కరుణలేమి జేసి, పెద్దకాలం బిమ్మహాదేవి సంతానలాభంబు దూరంబగుట కారణంబుగా శయనాసన[71]పానభోజనవిభూషణపరిధానాది సముచితవ్యాపారంబులు పరిజనప్రయత్నంబున *(బ్రతిదినంబు) నెట్టకేల[72]కు నిర్వర్తించుచు దేవరకు హృదయ[73]వేదన గావింపనో[74]క యనవరతంబుఁ దోఁపకుండఁ జరియించుచున్నయది [75]నిన్నటి రేపు తపనమండలంబు కుపిత *(కపికపోల) క్రోడతామ్రంబై యుదయగిరికవాటవిటంకంబు [76]నలంకరింప వింధ్యాచలనితంబబింబంబునకు మణిమేఖలాకలాపంబునుం బోలిన నర్మదాప్రవాహంబునం గ్రుంకి యోంకారేశ్వరు శశాంకరేఖాలంకారు హేమపంకజంబులం బూజించి గుడికి బ్రదక్షిణంబు నేయునది దేవభవనప్రాకారగోపుర ప్రఘాణంబునం బౌరాణికుండు మహాభారతంబు వక్కాణింపుచుం [77]గథానుకథనప్రసంగంబున నపుత్రకులకుఁ బుణ్యలోకంబులు లేవని పలికిన నప్పలుకులు నెమ్మనంబునం గీలుకొని వాలంప [78]ములుకులుం బోలె వేదన యుత్పాదింప భవనంబునకు వచ్చి [79]యేకాంతంబ యిచ్చోట నవిరళబాష్పధారాదుర్దినాంధ[80]కారితముఖియై యీ దుర్దశం బొందియున్నయది *(యనుటయు). | 30 |
| ఆ.వె. | మంత్రి యొక ముహూర్త మాత్రంబు చింతించి యుష్ణదీర్ఘమైన యూర్పు నిగుడ [81]నెంత చింత దీనికిది మహాబలవంత మేమి సేయవచ్చు నిందువదన. | 31 |
| ఉ. | ఊరక [82]కుందనేమిటికి నోంకృతినాథుఁడు నర్మదానదీ- తీరనివాసి భక్తజనదివ్యమహీరుహ [83]మున్నవాఁడు నీ- రేరుహనేత్ర తత్పదపరీష్టి యభీష్టశుభాభివృద్ధికిం గారణమౌ టెఱుంగవె వికారము దక్కు భజింపు శంకరున్. | 32 |
| గీ. | ఈశ్వరుం డద్రిజానాథుఁ డిందుమౌళి కరుణ [84]లేకున్న మనకెట్లు కలుగనేర్చుఁ జంద్రచందనచంద్రికాశైత్యమైన పుత్రపరిరంభసౌఖ్యంబు పువ్వుఁబోణి. | 33 |
| గీ. | గురుజనంబుల [85]సేవింపు కువలయాక్షి [86]కమలలోచన ముక్కంటి కరుణఁ జేసి [87]మున్ను గురు నుపదేశంబు మొనయఁ గాంచి- రభిమతార్థంబు లెందఱే [88]ననుదినంబు. | 34 |
| వ. | సర్వజగత్ప్రసిద్ధంబుగదా యితిహాసంబు తొల్లి చండకౌశికు వరప్రసాదంబున మగధాధిపతియగు [89]బృహద్రథుండు జనార్దను గెలువం దగినట్టి శౌర్యనిధి జరాసంధుం గాంచె; దశరథుండు విభాండక తనయుం(డగు ఋశ్యశృంగు) నారాధించి దిగ్గజంబులం బోలిన కుమారుల *(సకలలోకహితంబుగా) నలుగురం [90]బడసె సమారాధిత గురుదేవతాప్రసాద*(వశ)ంబున. | 35 |
| గీ. | వెలఁది పుత్రోదయారంభవేళయందు నిన్ను నెన్నఁడు చూతునో కన్నులార విమలచంద్రోదయారంభవేళయందుఁ బూర్ణిమా[91]యామినినిఁ బోలెఁ బుణ్యగరిమ. | 36 |
| వ. | దేవీ శోకంబు విడువుము ధైర్యం బవలంబింపుము ధర్మంబు నడువుము దానంబు సేయుము [92]వ్రతంబులు సలుపుము సత్యంబు పలుకుము; మన పాలి దేవతలు మన కభీష్టలాభంబుఁ బొందింపఁగలవారు; భవ్యసంతాన లాభంబున సంతోషంబు వహింపం గలవవి [93]దుఃఖాపనోదననిపుణంబులు ధర్మోపదేశ[94]గర్భంబులు [95]చాటుమధురంబులు నగు మాటల నూరార్చి, కాంచనకలశోదకంబులు కరపల్లవంబున ధరియించి [96]నయనంబులు దుడిచి యగ్గజయానకు ముఖప్రక్షాళనం బాచరించి, మందీభూతదుఖయగుట యెఱింగి మంత్రి యంతఃపురంబు వెడలి సముచితవ్యాపారంబులం బ్రవర్తిల్లె నది యాదిగ [97]నాగమోక్తప్రకారంబున సభక్తివినయతాత్పర్యంబున. | 37 |
| ఉ. | ఆ ధవళాయతాక్షి వసుధామరకోటి భజించు దేవతా- రాధన మాచరించు మునిరాజి కుపాస్తి యొకర్చు [98]మంత్ర వి- ద్యాధరులన్ నుతించుఁ గొనియాడును యోగిజనంబు వర్ధమా- నాధికభక్తిభావమున నాత్మజసంతతిలబ్ధికామనన్. | 38 |
| గీ. | ఎఱుఁగునే నీడకన్నును నెండకన్నుఁ [99]జెలఁగి పూఁచునే కర్మవంచిన లతాంగి యెట్టి క్లేశంబులకునైన [100]నీడఁబోదు తన మనంబున [101]నిగ్రుచు సంతానకాంక్ష. | 39 |
| సీ. | భక్తితో మాతృకాభవనంబుఁకు నేఁగుఁ | గావించు [102]నతి దిశాదేవతలకు వాయసంబులకు నిర్వర్తించు దధిబలిఁ | గొలుచు జ్యేష్ఠాదేవి నలఘుమహిమఁ జదివించుకొనుఁ బుణ్యసంహితావ్రాతంబు | మూలికామాణిక్యములు ధరించుఁ [103]దాంబూలగంధాక్షతలు చిరంటుల కిడు | [104]విప్రశ్నికల గారవించుఁ దఱచుఁ | |
| గీ. | గుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు | బాలురకుఁ దియ్యపండులు పంచి యిచ్చుఁ జెలులుఁ దానునుఁ [105]రేలు పోచిళ్ళువోవుఁ | దామరస[106]నేత్ర పుత్రసంతానకాంక్ష. | 40 |
| వ. | ఇవ్విధంబునఁ [107]బుణ్యోపవాసవ్రతదానధర్మదేవతారాధనంబు[108]లఁ బ్రతిబంధదోషంబులుం బాసిన [109]నా సుశీలాదేవియందుం బ్రతిమాచంద్రబింబంబు సరసియందునుం బోలె గర్భం బావిర్భవించిన. | 41 |
| సీ. | అభ్యంతరస్థాగ్నియగు శమీలత వోలె | నిధిగర్భయగు నబ్ధి[110]నేమి వోలె [111]నంతస్స్థదిగ్దంతియగు వియన్నది వోలె | శశికుక్షియగు నస్తసంధ్య వోలె నాలీనహర్యక్షయగు నద్రిగుహ వోలె | వినయధారిణి యగు [112]విద్య వోలె [113]జలదాంతరితయగు నళినాప్తరుచి వోలె | సూనృతాభిధయగు సూక్తి వోలె | |
| గీ. | నాదిమబ్రహ్మసంభరితోదరయగు | కైటభారాతినాభ్యబ్జ[114]కళిక వోలె నధిగతాగస్త్యయగు దక్షిణాశ వోలెఁ | బ్రథమగర్భంబు ధరియించెఁ బల్లవోష్ఠి. | 42 |
| గీ. | [115]పలుచఁ బాఱెను గండదర్పణయుగంబు నవమధూకప్రసూనంబు [116]నవమధుకర [117]మానుగతిఁ జూచుకంబులు నసితమయ్యె సవతి పూఁబోండ్ల యాననాబ్జములతోడ. | 43 |
| చ. | మనమున కుత్సవం బొసఁగె మంత్రికిఁ [118]బట్టపుదేవి గర్భశో- భనమునఁ [119]జేసి వెల్వెలఁగబారిన ముద్దుల నెమ్మొగంబుతో ఘనసమయంబునందుఁ బొడకట్టిన చల్లని తూర్పుగాలిచే ననిచిన కన్నెగేదఁగికి నచ్చిన కూరిమిచుట్టమో యనన్. | 44 |
| గీ. | గర్భభారాలసాంగియై కంబుకంఠి చెవి శిరీషప్రసూనంబు [120]చేర్పనోప- దెట్లు ధరియింపఁగానోపు హేమరత్న- కంఠికాహారకేయూర[121]కటకములను. | 45 |
| క. | ఎలదోఁట తీఁగెయుయ్యెల కలకంఠికిఁ [122]బిన్ననాఁటి కతలై తోఁచెం జెలువకుఁ బాదాంబుజములు [123]గిలిగింతలు వోవుఁ గేలిగిరివార్తలకు. | 46 |
| శా. | ఆ సారంగవిలోలలోచనను గాఢాలింగనక్రీడలన్ వాసాగారము కేలితల్పముపయిన్ మన్నించి మంత్రీశుఁ డ- త్యా[124]సక్తిం జవిచూచు నెట్టుకొని మృత్స్నాస్వాదనప్రక్రియా వ్యాసంగంబు[125]నఁ గమ్మనైన యదసీయంబైన బింబోష్ఠమున్. | 47 |
| క. | జలరుహనాభుని వక్షః- స్థలికౌస్తుభమునను [126]మృడుని జడముడి నుడురా- ట్కలికాలంకృతి వోలెం బొలఁతుక ప్రత్యగ్రగర్భమున నొప్పారెన్. | 48 |
| వ. | ప్రతిదివసోప[127]చీయమానగర్భనిర్భర[128]యగు నయ్యాదిగర్భేశ్వరి కౌముదీ[129]మహోత్సవంబునఁ బ్రియసఖీవిలోచనచకోరి[130]కలం గోరికలు [131]నిండించి వెండియు. | 49 |
| చ. | బహుదినముల్ మహాసచివు [132]పట్టపుదేవికి వృద్ధిఁ బొందె దు- స్సహనవగర్భ[133]సంగ్రహము [జాడ] సఖుల్ ప్రియమందఁగా ముహు- ర్ముహురనుబద్ధజృంభితసముద్గతవిహ్వల[134]లోలనేత్రముల్ జహదజహత్సమగ్రపురుషాయితకేలివిజృంభణంబు[135]లై. | 50 |
| గీ. | [136]అల్లనల్లన మెలఁగుఁ బద్మాయతాక్షి సముదితంబైన గర్భభారము కతమున సమ్యగాపీతజలరాశిసలిల[137]మైన ప్రావృడారంభనవమేఘపంక్తి వోలె. | 51 |
| శా. | [138]సీమంతోన్నయనంబుఁ బుంసవనముం జేయించె శ్రీయజ్ఞద- త్తామాత్యాగ్రణి[139]చే నృపాలకుఁడు వింధ్యాధీశ్వరుం డర్మిలిన్ సామంతక్షితిపాలమంత్రు లసమానంబైన ప్రేమంబునన్ భామా[140]హేమతురంగరత్నములు పైపైఁ బావడల్ దేరఁగన్. | 52 |
| సీ. | కమ్మగొజ్జఁగి నీటఁ గలయంపి చల్లిరి | [141]మేఁగి మెత్తిరి క్రొత్త మృగమదమున రంగవల్లులు కప్పురపు [142]ధూళిఁ దీర్చిరి | [143]కీరించి రొగి మాల్యతోరణములు తరుణరంభాతరుస్తంభంబు లెత్తిరి | కట్టి రెల్లెడఁ బట్టు కలువడములు కమలచందనమాలికలు [144]వినిర్మించి రు- | త్తంభించి రున్నతధ్వజపతాక- | |
| గీ. | [145]లాలిఖించిరి గేహకుడ్యములయందు | సర్వతోభద్రమకరికాస్వస్తికములు పరిజనంబులు రాజాజ్ఞఁ బట్టణమున | యజ్ఞదత్తుని ప్రథమకళ్యాణవేళ. | 53 |
| గీ. | [146]వేడ్క నృత్యంబు లాడిరి వీథులందుఁ బాడి [147]రెత్తిలి పికకుహూపంచమమున [148]బంజళంబున ధవళప్రబంధగీతి [149]కనుమ యవ్వలి కర్ణాటకమలముఖులు. | 54 |
| మ. | *అదనన్ వచ్చిరి సంభ్రమంబునను బంచారామలీలావతుల్ పదునాల్జాతుల యప్సరోంగనలునుం బాలిండ్లపై హారముల్ గదలం బెన్నెఱి సేసకొప్పులపయిం గహ్లారగుచ్ఛంబులొ- ప్పఁ దదీయత్వరగండభాగములఁ గంపంబొందఁ దాటంకముల్. | 55 |
| సీ. | [150]పూజెకుండలు నిల్పెఁ బువ్వుఁబోఁడి యొకర్తు | శుభవితర్దిక చతుష్కోణములను [151]జాజాలపాలికల్ సర్వౌషధుల నించి | ప్రోక్షించె జలము పద్మాక్షి యొకతె కాంత యొక్కతె సన్నెకలుఁ బొత్తరంబును | [152]దోరించె వటశాఖతోడఁ గూడఁ బీఠికంబులు [153]వెట్టి బింబోష్ఠి యొక్కతె | మడుఁగుఁ బుట్టము [154]గప్పె నడుగు మునుఁగ | |
| గీ. | రమణి యొక్కతె వింజామరంబు దాల్చెఁ | దరుణి యొక్కతె తాళవృంతంబు పూనె లలన యొక్కతె పసిఁడి సంబెల ధరించె | నాలవట్టంబు [155]వహియించె నతివ యోర్తు. | 56 |
| గీ. | మంత్రి [156]వేల్పించె గృహ్యోక్తమార్గ మొప్ప బ్రహ్మపదమునఁ గూర్చుండి బ్రాహ్మణుండు హోమములు రెండు బుగ్యజుస్సామవేద- మంత్ర[157]మాది జయాదిహోమంబు తుదగ. | 57 |
| మ. | [158]చెవికిం గేలివతంసకోత్పలదళశ్రీలై కపోలంబులన్ నవకాలాగరు[159]పత్రరేఖలయి మేనం గమ్మకస్తూరియై ధవళాంభోరుహ[160]నేత్రపైఁ గురిసె నుద్యల్లీల సీమంతపుం- సవనాజ్యాహుతిహోమసంప్రభవచంచద్వహ్నిధూమచ్ఛటల్. | 58 |
| మ. | చెలికత్తెల్ చిఱునవ్వు చెక్కులపయిం [161]జెల్వార వీక్షింప నొ- జ్జలు [162]మంత్రంబులు సెప్పఁ బ్రెగ్గడ శరత్సంపూర్ణచంద్రాస్యకున్ వలిచన్నుంగవమీఁద ముత్పులకము [163]ల్వర్ధిల్లఁ గేల్వంచుచున్ శలలీకంటక మెత్తి యౌఁదలపయిన్ సంధించె సీమంతమున్. | 59 |
| క. | కుటిలాలక [164]కుడి నాసా- పుటరంధ్రము[165]నందు మూఁడుబొట్టులు [166]మిడిచెన్ వటఫలదళరస మధిపతి కటకఝణత్కార మెసఁగ గరపద్మము[167]లన్. | 60 |
| గీ. | మృదులగోధూమసరులతో మేలవించి వన్నెకుచ్చుల పేరుతో [168]వక్కరించి పుష్పడుండుభకంబుతోఁ బొత్తు [169]వడసి బడఁతి పాలిండ్లపై [170]నొప్పె పసిఁడిపేరు. | 61 |
| గీ. | తగవులిచ్చిరి [171]పుట్టింటితల్లి ప్రజలు వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు [172]కట్టనిచ్చె నృపాలుండు కన్నుదనియఁ బరమహీపాలురిచ్చిరి పావడములు. | 62 |
| సీ. | క్ష్మామండలము తురంగమధట్టమయమయ్యెఁ | గరిమయంబయ్యె దిక్చక్రవాళ- మంబరం బాతపత్రావళిమయమయ్యె | సౌరభమయమయ్యె మారుతంబు పరివారమయమయ్యె బ్రహ్మప్రపంచంబు | జయశబ్దమయమయ్యె సకల[173]జగము- లాత[174]పంబు విభూషణాలోకచయమయ్యె | సంతోషమయమయ్యె జనులమనము | |
| గీ. | వింధ్యపర్వత మేలు పృథ్వీవరుండు | దానుఁ బట్టంపుదేవియుఁ దగవుగలిగి సచివునింటికి [175]నేతెంచి సమ్మదమున | నొద్దనుండి యా శోభన మొనరుచుటయు. | 63 |
| గీ. | [176]జవిలె నరఁబూలు ముడిచిన సాధ్వి యొకతె [177]యోలగందంపుఁ బసపున నూన్చెఁ గదిసి పసిఁడి యుత్తర[178]జందెముల్ [179]పాయఁబట్టి రాచప్రెగ్గడ బ్రహ్మసూత్రమున నగుచు. | 64 |
| గీ. | దశరథుని వాజపేయంబు ధర్మసూను రాజసూయంబు నుపమింపఁ [180]బ్రాఁతియె యని [181]పట్టణంబును దేశంబుఁ బరిఢవింప బెట్టె దొడ్డుగ [182]నామెత ప్రెగడగారు. | 65 |
| వ. | *అంత. | 66 |
| సుకుమారుని జననము | ||
| క. | నవమాసంబులు నిండిన ధవళేక్షణ గాంచె సుతు సుధాకరతారా- [183]రవిబుధధిషణవిధుంతుద [184]కవు లుచ్చగముగను నమృతఘటికలు నడువన్. | 67 |
| వ. | ఇవ్విధంబున సుశీలాదేవి నందనుం గాంచిన వార్త [185]యంతఃపురపరిచారిణి యొకర్తె విన్నవించిన నమృతరపధారామయంబయిన యమ్మాటకు సద్యఃప్రరూఢరోమాంకురనికరకంటకితగాత్రుండును దరస్మిత *(వికసిత)కపోలమండలుండునునై మంత్ర్యాఖండలుండు. | 68 |
| ఆ.వె. | తాను గట్టినట్టి చీనాంబరంబులుఁ దాను బెట్టినట్టి మేనితొడవుఁ బ్రమదమొప్ప నిచ్చెఁ బారితోషికముగ మంత్రి యంతిపురము మానవతికి. | 69 |
| సీ. | [186]తలయంపి ధవళముద్రాకుంభ మిడువారు | రక్షాభసితరేఖ వ్రాయువారు గౌరసర్షపరాజి కలయఁ జల్లెడువారు | బలివిధానంబులఁ బరఁగువారు లవణంబు నింబపల్లవముఁ ద్రిప్పెడువారుఁ | [187]బ్రేము మంచంబుతోఁ బెనఁచువారు [188]గవలధూపంబు సంఘటియించువారును | [189]మంచిము ట్టెడఁద యోజించువారు | |
| గీ. | గదిసి దీవించువారును [190]గంధతైల | [191]మలదుకొనువారుఁ గాయంబు లందువారుఁ బాడువారును బరిహాసమాడువారు- | నైరి శుద్ధాంతసతు లరిష్టాలయమున. | 70 |
| సీ. | కర్పూరసమ్మిశ్రగంధసారంబునఁ | జఱచెఁ [192]జప్పట భిత్తిఁ జామ యొకతె [193]వెలికిలం బెట్టె నుత్పలగంధి యొక్కర్తు | గప్ప గర్భగృహోపకంఠభూమి జ్యేష్ఠాధిదేవత సేవించె నొకయింతి | పసపుఁబుట్టము గట్టి భక్తిగరిమఁ బటముపై లిఖియించెఁ బాటలాధర యోర్తు | క్రొత్తలత్తుక [194]శశాంకుని ఖరాంశు | |
| గీ. | [195]జరఠమేంఠంబు కంఠదేశమునఁ జుట్టెఁ | బుష్పడుండుభముల నొక్క పువ్వుఁబోఁడి యంబుజానన యొకతె నెయ్యభిఘరించె | భుజగనిర్మోక మొకతె నిప్పులఁ గమర్చె. | 71[196] |
| ఉ. | మంగళరత్నదీపముల మధ్యమునం బురుటింటి పాన్పుపై నంగజసన్నిభుండు సచివాగ్రణినందనుఁ డొప్పె నెంతయున్ నింగిఁ బ్రదోషవేళ నతినిర్మలతారక[197]చక్రవాళముల్ సంగతిఁ జుట్టునుం గొలువఁ జాలఁగ నొప్పు శశాంకు కైవడిన్. | 72 |
| గీ. | బాలకుఁడు చంద్రచంద్రికాపాండు [198]వయిన [199]పాన్పుపై నొప్పెఁ బొత్తులపై శయించి యమృతవారాశిలోన శేషాహి మీఁదఁ బవ్వళించిన కౌస్తుభాభరణుఁ బోలి. | 73 |
| గీ. | దానధర్మంబు లొనరించి త్యాగ మిచ్చి బ్రసవగేహంబు సొచ్చి భూపాలమంత్రి [200]యంబుపావకసంస్పర్శ మాచరించి ప్రథమతనయు ముఖేందుబింబంబు సూచె. | 74 |
| గీ. | పురుడు చెల్లంగఁ బుణ్యాహమును నొనర్చె నిలయదైవతములఁ గొల్చి నిజసుతునకు మారసన్ని భునకు సుకుమారుఁ డనెడి పేరువెట్టెఁ బ్రధానబృందారకుండు. | 75 |
| గీ. | పసపుఁబుట్టంబు ధరియించి పద్మనయన సుతుని నుత్సంగమునఁ దాల్చి చూడనొప్పె దరణిబింబహారిద్రవార్ధరముతోడ లలితరుచి నొప్పు నాకాశలక్ష్మివోలె. | 76 |
| గీ. | పల్లవాధర మడుఁగైన యొల్లెఁ గట్టెఁ గొంగు మణిహేమకంఠికాకోటిఁ జెరివి సొబగుఁ గాటుకబొట్టుతోఁ జూడనొప్పె వింతచెలువునఁ బచ్చిబాలెంత[201]రాలు. | 77 |
| ఉ. | [202]రక్షకుఁ బుండరీకనఖరంబు సువర్ణలతానిబద్ధమున్ వక్షమునన్ ధరించి సచివప్రియసూనుఁడు చూడనొప్పె ను- గ్రతతిసంభ్ర మోద్ధతిగ [203]గాఁడి విడంబితమైన [మర్త్య]హ- ర్యక్షుని గోరు పేరురమునందు ధరించిన దైత్యు కైవడిన్. | 78 |
| గీ. | రత్నవేదికపై మంత్రిరాజసుతుఁడు తల్లిహృదయంబు [204]దృష్టియు తన్నుఁ గొలువ [205]ఫాలతలమున రావ్రేక పరిణటింప జానుచంక్రమణక్రీడ సంచరించె. | 79 |
| మ. | వలిచన్నుల్ వడఁకాడ వేనలులు గైవ్రాలంగ గారాపు దా- దులు తన్నేమఱ [206]కంతనంత దిరుగన్ ధూర్తుండు తా నుద్ధతిన్ గలకాంచీమణికింకిణీకలకలా[207]త్కారంబు తోరంబు గాఁ గలహంసంబులఁ బట్టఁ [208]బాఱుసు వడిం [209]గక్ష్యావిభాగంబులన్. | 80 |
| వ. | అంత [210]నా సుకుమారుడు నత్యంతసంతోషవంతులగు తలిదండ్రుల మనోరథంబు ఫలియింప ననుదినప్రవర్ధమానుండై వర్ధమానసంపదనురూపంబు[211]లగు నైశ్వర్యానుభవంబులు గలిగి క్రమంబునఁ గృతచౌలోపనీతుండై యాచార్యగృహంబున కరిగి. | 81 |
| సీ. | చదివె వేద మెఱింగెఁ బదము [212]వాక్యంబుఁ బ్ర- | మాణంబు దివ్యాగమములు చూచెఁ దరచె నాదిపురాణధర్మశాస్త్రంబులు | నేర్చె వీణావేణునృత్యకళలు వాదనశ్యాంజన[213]వదనికాదులును జూ- | దంబును గణితశాస్త్రంబు దెలిసె సరహస్యముగ నింద్ర[214]జాలమంత్రక్రియా | తంత్రమంత్రములఁ జిత్తరువు గఱచె | |
| గీ. | గ్రోల్చె యోగంబు సాధించె రుద్రభూమి | [215]సకలశస్త్రాస్త్రసంచయసమితి నేర్చె [216]నాకళించెను విపులవైద్యక్రమంబు | సంగ్రహించెఁ గవిత్వంబు సచివసుతుఁడు. | 82 |
| వ. | ఇవ్విధంబున సర్వవిద్యాపరిశ్రమంబునఁ [217]బ్రాగల్భ్యంబు వహించిన సుకుమారునకు శైశవంబు సరిగడచుటయుఁ బ్రదోషంబునకుఁ జంద్రోదయంబును, [218]జలధరంబునకు శక్రచాపంబును, [219]బుష్పంబునకు వాసనాప్రకారంబును, గమలవనంబునకు సూర్యోదయంబును, గంధగజంబునకు దానంబును, విజ్ఞానంబునకు మౌనంబును, [220]నవధ్యునకు గేయంబును, రాజ్యబలంబునకు నాజ్ఞాబలంబునుం బోలె భువనసమ్మోహనంబైన సౌందర్యంబున [221]కనురూపంబై జవ్వనం బావిర్భవించిన. | 83 |
| గీ. | బాల్యమునయందుఁ గలుగు సౌభాగ్యరేఖ నినుమడించిన సౌందర్య మెసకమెసఁగ సచివతనయుండు [222]తారుణ్యసంక్రమమునఁ [223]బద్మముఖులకుఁ గన్నులపండువయ్యె. | 84 |
| శా. | పంచారామవిలాసినీధవళదృక్పాఠీనజాలాయమా- నాంచ[224]త్కోమలనిర్నిబంధనమనోజ్ఞాకారరేఖా(కళా)- పంచాస్త్రుండగు నా కుమారుఁ [225]డురుదర్పస్ఫూర్తి నవ్వీటిలో సంచారం బొనరించెఁ గాంచనమహాసౌధాగ్రభాగంబులన్. | 85 |
| గీ. | ఆదిగర్భేశ్వరత్వంబు యౌవనంబుఁ జక్కఁదనమును నతిసాహసంబుఁ జనవు నొక్కఁడొక్కం[226]డు చాలు దోషోత్కరమున కన్నియును [227]గూడియున్నవి యతనియందు. | 86 |
| సీ. | ఒకకొంతప్రొద్దు కందుకకేళి యొనరించుఁ | గంకణంబుల ఝణత్కార మెసఁగ నొకకొంతప్రొద్దు వల్లకి నఖాగ్రంబుల | బహురాగముల నేర్పుఁ [228]బ్రస్తరించు నొకకొంతప్రొద్దు [229]కొండికజవంబు లొనర్చు | పరిహాసగోష్ఠికిఁ బల్లవించు నొకకొంతప్రొద్దు లోకకథాప్రహేళికా- | బిందుమత్యాదులఁ బిచ్చలించుఁ | |
| గీ. | గొంతప్రొద్దు వినోదించుఁ [230]గొఱతలయిన | తోడివేడుకకాండ్రతో మేడమీఁద విమలచంద్రోదయారంభవేళయందు | [231]బిల్లదీవాటలను మల్లు[232]పెనఁగుటలను. | 87 |
| వ. | ఇవ్విధంబునఁ దృష్ణావిషవల్లి [233]కాలవాలంబును, నింద్రియగుణంబులకు శరణంబును, మోహ[234]నిద్రకు విభ్రమశయనంబును, శాస్త్రదృష్టికి దిమిరోద్గమంబును, దోషాశీవిషంబులకు [235]నావాసవల్మీకంబును, *(సుగుణకలహంసంబులకుఁ బ్రావృట్కాలంబును,) గపటనాటకంబునకుఁ [236]బ్రస్తావనయు, ధర్మేందుమండలంబునకు రాహువక్త్రంబునునైన యౌవనారంభంబున. | 88 |
| సీ. | ఆజానుదీర్ఘబాహార్గళస్తంభుండు | కోమలాళివినీలకుంతలుండు కర్ణాంతవిశ్రాంతకమలాయతాక్షుండు | పరిఫుల్లచంపక [237]ప్రసవనసుఁడు బహుళాష్టమీశశిప్రతిమఫాలతలుండు | కంబుసన్నిభచారుకంధరుండు పరిపక్వబింబికా[238]ఫలపాటలోష్ఠుండు | గంధవారణకుంభ[239]కఠినభుజుఁడు | |
| గీ. | సచివతనయుండు కుపితధూర్జటిలలాట- | చక్షురనలార్చి రుద్గమసంప్రభూత విస్ఫులింగచ్ఛటా[240]ఘటావేష్టనమునఁ | బసిమి దప్పని వలరాజు పగిది నొప్పె. | 89 |
| సీ. | [241]చరిగొన్న వెలిపట్టు జన్నిదంబులతోడ | [242]రత్నాలతారహారము ధరించి వలిపనీర్కావిదోవతిపైఁ బదార్వన్నె | [243]కళయైన పసిఁడిమేఖల [244]ఘటించి గంగమట్టియమీఁదఁ గస్తూరిరసమునఁ | బుండ్రకంబు లలాటమున నమర్చి [245]విమలసన్మణికుండలముల పార్శ్వములందు | లలితంబులగు [246]నొంటు లలవరించి | |
| గీ. | యాత్మవంశపరంపరాయాతమైన | వైదికాచారమార్గంబు వక్కణించి [247]యారజము రాచఱికమును నలవరించి | నగరవీథులఁ జరియించుఁ బ్రెగడసుతుఁడు. | 90 |
| గీ. | సచివనందను కర్ణపాశముల వ్రేలు కుండలంబుల ముత్యాలగుళిక లొప్పు నన్యలోకస్థుఁడగు శంబరారి కేడ్చు రతిమహాదేవి యశ్రుపూరములు వోలె. | 91 |
| క. | కుసుమాయుధనిభుఁడగు నా రసికునిపై వ్రాలు సానురాగముతోడన్ బిసరుహనయనల చూపులు భసలంబులు పూపుఁదోఁటపయి వ్రాలు గతిన్. | 92 |
| గీ. | భావ మభిరామరూపైక[248]పక్షపాతి యౌవనము దోషముల కెల్ల నాస్పదంబు మన్మథుఁడు [249]కోపి యెటు నియమంబు నిలుచు సుదతులకు వానిఁ గడకంట జూచినపుడు. | 93 |
| సీ. | హృదయ మువ్విళ్లూర నేకాంతమున నుండి | వానిఁ [250]జింతింపని వనజముఖియు నొకమా ఱతనిఁ జూచి యొండొక్కమఱి చూడ | [251]నభిలషింపని విద్రుమాధరయును గలలోన వానిఁ జిక్కఁగఁ గౌఁగిటను జేర్చి | ముకుళితేక్షణగాని ముద్దియయును నతని రూపంబుఁ గుడ్యములందు లిఖియించి | [252]యందంబుఁ జూడని యంగనయును | |
| గీ. | [253]జెలులచేతను బ్రోది రాచిలుకచేత | వాని గుణములు విని కుచద్వంద్వసీమఁ [254]జాదుకొనఁ బులకింపని పైదలియును | బన్నిదము వ్రేసినను లేదు పట్టణమున. | 94 |
| సీ. | ద్యూతకేలియ వినోదోపాయ[255]మయ్యెను | బరదారగమనంబు ప్రౌఢియయ్యె నాత్మభార్యాపరిత్యాగంబు ధృతియయ్యె | [256]నాఖేటలీల విహారమయ్యె గురుతిరస్కా[257]రంబ గరిమ[258]యయ్యెను నట- | విటకీర్తనంబు[259]లే పటిమయయ్యెఁ బానంబె యధ్యాత్మపరత[260]యై విలసిల్లె | తరలతాగతియ యుత్సాహమయ్యె | |
| గీ. | గుణము [261]దోషంబు దోషంబు గుణమునయ్యె | నపుడు సుకుమారునకుఁ దద్వయస్యులకును నాదిగర్భేశ్వరత్వంబు యౌవనంబు | [262]సవురు ధనమును జనవు హేతువులు గాఁగ. | 95 |
| గీ. | [263]త మ్మమానుషకాలోచితంబులైన కీర్తనంబుల [264]మై పులకించుకొండ్రు తా రమర్త్యులుగా మదిఁ దలఁతు రహహ విత్తమదమత్తచిత్తులై వెఱ్ఱిజనులు. | 96 |
| సీ. | అయ్య నీవు చతుర్భుజావతారుఁడ వన్నఁ | దమ భుజాదండపార్శ్వములఁ జూతు- రయ్య నీవు త్రిలోచనావతారుఁడ వన్న | ఫాల మంటుదురు దోఃపల్లవమున- నయ్య నీవు గజాననావతారుఁడ వన్నఁ | గుంభపీఠము లంటికొనఁ దలంతు- రయ్య నీవు [265]చతుర్ముఖావతారుఁడ వన్న | [266]నద్దంబుఁ జూడంగ నభిలషింతు- | |
| గీ. | రవసరం బిచ్చుట యనుగ్రహంబు గాఁగ | మోముఁ జూచుట యుపకారముగను బలుకు మైత్రిగా నప్పు డధిక[267]సమ్మానముగఁ ద- | లంతు రైశ్వర్య[268]వైభవవంతు లుబ్బి. | 97 |
| ఉ. | సంపద పేరి కట్టిఁడిపిశాచము సోఁకిన మానవుండు పూ- జింపఁ డభీష్టదేవత భజింపఁడు సజ్జనులైనవారి మ- న్నింపఁడు మిత్రబంధుల గణింపఁడు ధర్మరహస్యముల్ విచా- రింపడు (నేమముం దగ భజిం)పఁ డహంకరణంబు పెంపునన్. | 98 |
| గీ. | ఉద్ధతుం [269]డయి సుకుమారుఁ డుండలేక [270]వీటఁ జక్కని జవరాలి వెదకివెదకి వలపు పుట్టించి సంకేతములకుఁ దార్చి [271]చలుపు రతికేలి బహుళపక్షంబు రేలు. | 99 |
| గీ. | పద్మనాభుండు మదనగోపాలమూర్తి ఘోషమున [272]నెట్లు వలపించె గొల్లసతుల నెట్టుకొని [273]యట్లు వింధ్యాద్రిపట్టణమునఁ బరపురంధ్రుల [274]వలపించె బ్రాహ్మణుండు. | 100 |
| సీ. | యమునానదీసైకతమున జాలరికన్య | చనుదోయి నంటఁ డే శక్తిసుతుఁడు నందవ్రజంబులో నలిననాభుం డెట్లు | విహరించెఁ బదియాఱువేలసతుల దేవదారువనంబులో విరూపాక్షుండు | మునిభామినుల నెట్లు మోసపుచ్చెఁ గొక్కొరొకోయని కోడియై యెలుఁగించి | యమరనాయకుఁ డె ట్లహల్యఁ గలసె | |
| గీ. | మొలకచన్నులపాయంపు ముద్దుఁగూఁతుఁ | బట్టుకొనె నెట్లు పైకొని పద్మభవుఁడు చందురుం డెట్లు వొందె నాచార్యులేమ | ననుచు విప్రుండు [275]రమియించె నన్యసతుల. | 101 |
| సీ. | [276]సంధ్యాభివందనశ్రద్ధ యుద్వాసించె | గాయత్రి దవ్వులఁ గట్టిపెట్టె నగ్నిహోత్రముమీఁది యాస నుత్పాటించె | నఘమర్షణస్నాన మరసి [277]మానె [278]నిహపరసామగ్రి నీయఁజాలెడునట్టి | విధిదేవతార్చన వీటిఁబుచ్చె [279]వేదపాఠము మానె వివిధసత్కర్మాది | సత్కలాపంబులు జాఱవిడిచెఁ | |
| గీ. | [280]సిగ్గుఁ బోకార్చెఁ గుక్కలఁ జేతఁబట్టె | [281]నిలిచియుండియు మూత్రించెఁ గలిసె లజ్జఁ [282]గాలపరిపాటి ప్రారబ్ధకర్మవశతఁ | బయిసికొట్టనం బడియె నా బ్రాహ్మణుండు. | 102[283] |
| వ. | ఇవ్విధంబునం దృగున్మీలనంబునం బోలె మార్గంబు దప్పి, జిహ్వాచ్ఛేదనంబునం బోలె మూఁగై, ఇంద్రజాలపింఛికాప్రచారంబునం బోలె తత్వం బెఱుంగక, ఊహజ్వరంబునం బోలె [284]నసంబద్ధంబు లాడుచు, లోకాయతవిద్యాభ్యాసంబుననుం బోలె నధర్మంబు మరగి, పైశాచగ్రహణంబునం బోలె గళవళింపుచు, మదనా వేశంబునం గావరంబెత్తి వర్తింపుచున్న సుకుమారు రావించి యజ్ఞదత్తుండు సుశీలాదేవి [285]సమక్షంబున వాని కిట్లనియె. | 103 |
| గీ. | అన్న సుకుమార! యేలయ్య యనుదినంబు గొఱకుఁదనమున ధూర్తులఁ గూడి తిరిగె దకట మీ యమ్మ గాంచె నిన్నధికనియతిఁ గోరి వీరవ్రతంబున గొడ్డు వీఁగి. | 104 |
| సీ. | ఓరి నీకాచార్యుఁ డుపదేశ మిచ్చెనో | దర్శించితెట్లు శాస్త్రములలోన ధర్మం బుపార్జింపఁ దగిన మార్గమె యిది | తపము వర్ధిల్లునే తనరఁ దీనఁ గైవల్యపదవి యెక్కఁగవచ్చునే దీనఁ | గంటె నాకమునకుఁ గారణముగఁ గాదేని [286]నియమంబు క్రమమే యిది దలంప | భవదుఃఖములు దీనఁ బాయుటెట్లు | |
| గీ. | మూర్ఖుఁడైనను శిశువైన మూఢుఁడైన | దన కరిష్టంబుఁ దలఁచునే మనమునందు నంతరహితుల యార్గురయందు ఘనుఁడు | మన్మథుఁడు దద్వికారంబు మాను మిపుడు. | 105 |
| సీ. | రత్నాంశుదీపాంకురములచేఁ బాయదు | యౌవనోద్భూతమైనట్టి తమము శిశిరోపచారంబుచేత సాధ్యముగాదు | ప్రత్యగ్రమైన దర్పజ్వరంబు మంత్రమూలములచే మణులచేఁ దేరదు | విషయవిషాస్వాదవిషమమూర్ఛ సలిలాభిషేక శౌచములచేఁ బోవదు | ఘనభోగమను పూతిగంధకళిక | |
| గీ. | యామవతిఁ దెల్లవారిన నణఁగిపోవ- | దుదరసుఖసన్నిపాతనిద్రోదయంబుఁ బ్రతిదినంబును లక్ష్మీసురామదంబు | విరియనేరదు పరిణామవేళయందు. | 106 |
| క. | [287]ఏమగునొకొ బాంధవమున నామలకశలాటురసము యౌవనలక్ష్మీ- సామగ్రికినా యొగరు గ- దా మధురత యొసఁగు విషయమను జలమునకున్. | 107 |
| గీ. | [288]జవ్వనమునను సదుపదేశములు గావు తి(ఱ్ఱిఁబోసిన సలి)లంబు తెఱుఁగు దోఁప శంబరారాతిపుష్పాస్త్రసంప్రహార- జర్ఝరీభూతమగు మనస్సంపుటమున. | 108 |
| వ. | తండ్రి! గురూపదేశం బఖిలమలప్రక్షాళనక్షమంబైన తీర్థస్నానంబు, జరామరణవైకల్యంబు లేని వార్ధకంబు, మేదోభారంబు లేని గౌరవంబు, సువర్ణరచన లేని కర్ణాభరణంబు, నుద్వేగంబు లేని ప్రజాగరంబు; [289]ఇది యభవ్యులకు సలిలంబునుం బోలెఁ గర్ణస్థితంబై యుపద్రవంబు నాపాదించు. నీ విటవట్టి నెట్టుకొని పెద్దలమాట వినుము, వింటేని ధూర్తులు నిన్నుఁ [290]బ్రశాసింపలేరు, *(కుటిలులు నిన్ నలమరింపలేరు), వంచకులు నిన్ను వంచింపలేరు, పల్లవులు నిన్ను వలపింపలేరు, మదంబు నిన్నుఁ గదల్పలేదు, [291]విషయంబులు నిన్ను నాశ్లేషింపలేవు, విను మనూచానాచారంబును, నాముష్యాయణంబును, [292]నామేధితామ్నాయంబును, నధీతాశేషశాస్త్రంబును, [293]నలింగవృత్తియు, [294]ననవకీర్ణంబు, ననభ్యుదితంబును, ననభిష్ఠుతంబునునైన [295]యాయావరవంశంబునం బ్రభవించినాఁడవు మూఢుఁడవై యనుష్ఠానబంధంబులగు విషయోపభోగంబులయందు సుఖబుద్ధి యారోపించెదవు. నీయట్టి [296]దుర్బుద్ధిశీలురుగదా నిస్త్రింశంబుఁ జూచి కువలయమాల యనియును, గృష్ణసర్పంబు వీక్షించి కాలాగురుధూమరేఖ యనియును, నంగారంబు [297]దర్శించి బంగారం బనియును భ్రాంతిఁ బొందుదురు. దుందుమార[298]కరంధమ మాంధాతృనహుష నాభాగసన్నిభుండు వింధ్యాచలపతి, హేమాంగదుండు మనల గురుస్థానంబుగా మన్నింపుచున్నవాఁడు. మన వంశంబునకు నీవొక్కండవ సంతానబీజంబ వింతయు నెఱింగి బుద్ధిమంతుడవై మమ్ము నుద్ధరింపవలదా యని*(పలికి) మంత్రి కన్నీరు దొరఁగ ముహూర్తమాత్రం బూరకుండె సుశీలాదేవియు. | 109 |
| సీ. | రవలయుంగరముల రత్నాంకురము లొత్తఁ | గేల్దమ్మి చెక్కులఁ గీలుకొల్పి మొకరితుమ్మెద మూతిముట్ట నోడెడి వేఁడి- | నిశ్వాసపవనంబు నివ్వటిలఁగ నాకర్ణదీర్ఘంబులగు క్రాలుఁగన్నులంఁ | బరిపాటలచ్ఛాయ పల్లవింప గంఠగోళంబు గద్గదికాను[299]బద్ధమై | బాష్పభారంబు నిబ్బరము గాఁగఁ | |
| గీ. | బక్ష్మములు జాఱి గండదర్పణము లొరసి | వ్రాలి పాలిండ్లపై నశ్రువాఃకణములు హారలతలకు నాతిథ్య మాచరింప | గుబ్బతిల నేడ్చె [300]నొత్తిలి కువలయాక్షి. | 110 |
| వ. | ఇవ్విధంబునఁ దల్లియుఁ దండ్రియుఁ [301]దనకు హితోపదేశంబు చేసి తన సౌమనస్యసౌముఖ్యంబులతోఁ దగిన ప్రత్యుత్తరం [302]బీయమి నిర్వేదించుట యెఱింగి. | 111 |
| సీ. | ధర్మశాస్త్రాభ్యాసతాత్పర్యముననైన | సంస్కార [303]మె ట్లౌరుసౌరు పడియె నిరుపాధినిస్సీమనిర్నిబంధన[304]శక్తి | గల మహాప్రతిభ యే కాటఁ గలసె బంచేంద్రియ[305]విజయోపాయభూతములైన | వినయంబు లే ప్రయోజనముఁ దీర్చె నవయోవనాంకు[306]రోన్నతవంశదవమైన | [307]శ్రుతివైభవం బేమి హితవు చేసె | |
| గీ. | జిన్ని వయసున [308]గురులు శిక్షించినట్టి | పుణ్యవాసన నేల గోల్పోయె మనసు కటకటా! నందనుండ [309]వొక్కఁడవ కల్గి | గురుల నేడ్పించుచున్నావు [310]కోరగమున. | 112 |
| వ. | అనినఁ దల్లిదండ్రులకుం బ్రణామంబు చేసి యింతనుండి మీ యాజ్ఞ [311]శిరంబున ధరియించి బుద్ధిమంతుండనై యుండెద మీరు [312]వగవకుండుండని పలికి సముచితప్రకారంబున వీడుకొనియె ననిన నటమీఁది వృత్తాంతం [313]బెట్టిదని యడిగిన. | 113 |
| మ. | వరశైవైకవిధాన [314]దానకథనవ్యాపార పారంగతా- స్థిరలక్ష్మీనవశారదోదయ దయాధీనాయతాలోక లో- కరమాపాదన పాదపద్మవినతక్ష్మాపాలసంశీల శీ- లరతిప్రస్ఫుటశాంత శాంతనవకల్పద్వీర వీరాగ్రణీ. | 114 |
| క. | ధీమత్కవితావిస్తర- ధామాయిత నిరుపమానదానాంబుద హృ- ద్భీమ జయోత్కలసీమా- రామామన్మథవిశేష రాజితమూర్తీ! | 115 |
| మందారదామ. | లింగార్చనా[315]రూఢలీలావిశాలా గంగాంబు[316]సుస్వచ్ఛకావ్యైకజాలా *సంగీతసాహిత్యసౌహిత్యలోలా శృంగారసద్భక్తసేవాను[317]పాలా. | 116 |
| గద్యము. | ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన శివరాత్రి మాహాత్మ్యంబునందు ద్వితీయాశ్వాసము. | |
| వ. | ఇవ్విధంబునఁ గుమారుండు విహరింపఁజూచి. |
| క. | ప్రేమమునఁ గూర్చు సుతునకు, వేమఱు సద్బుద్ధి చెప్ప వినమికి వగచున్, సామగ్ర్యదుర్గుణాళి క,దా మధురత యొసఁగు విషమమగు చలమునకున్. |