శతకములు వేంకటేశ్వర శతకము
1 11 21 31 41 51 61 71 81 91
శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము - తాళ్లపాక అన్నమాచార్య
చ. కులికెడు పండుటామనులఁ గోయిలకూఁతల గుండె ఝల్లనన్‌
జెలువము గల్గు రాకలను జెంగట శ్రీయలమేలుమంగ కో
విలకలనాదకోటులచవిం బచరింపఁగ నెట్టు లోర్తువో
వలపులవార్ధిలోన ననివారణఁ దేలుచు వేంకటేశ్వరా!
61
చ. తొలఁకెడుకొప్పులో నెరులొ తుమ్మెదదాటులొ చూపువంపులో
గులుకులొ మంచివెన్నెలల గుంపులొ శ్రీయలమేలుమంగకున్‌
బలుకులు పచ్చకప్పురపుఁ బల్కులు తావులె దివ్యగంధముల్‌
పలుచనినవ్వులే విరులపాన్పులు నీకును వేంకటేశ్వరా!
62
ఉ. అందము చూతు రుప్పవడమై ఘను లాయలమేలుమంగ మో
మందము గాఁగఁ జూతువు ప్రియంబున మెల్లన నీవటుండఁబో
యందఱి మోముటద్దములు నవ్వల నవ్వుల గోటికొండలై
యందములోన నందములునై వెలుగొందుచు వేంకటేశ్వరా!
63
చ. తలఁచిన గుండె జల్లనును దల్లడమందెడు నేమిసేతు నా
చెలువుఁడు రాఁడటంచు లలసీనవి వో యలమేలుమంగ నీ
తొలకరిమించు నెమ్మనముతొయ్యలిఁ జూడక యెట్టులోర్తువో
యలుగకు మన్న మాన విఁకనైనను నెన్నఁడు వేంకటేశ్వరా!
64
ఉ. ఆయలమేలుమంగ కమలాననయుం గలుహార నేత్రియుం
బాయక తానయై చెలఁగుబద్మ హితాక్షముఁజంద్ర నేత్రము\న్‌
సోయగలీల మించు నెటుచూచినఁ బొందిక నెద్ది నిద్ర నీ
కేయెడ మేల్కొనంగఁ దఱి యెయ్యది చూడఁగ వేంకటేశ్వరా!
65
చ. నెఱి నలమేలుమంగకును నీకును పద్మభవాండభాండమే
మెఱసిన బొమ్మరిల్లు తగుమేడలు మీఁదటిలోకముల్‌ ప్రభల్‌
తెఱలఁగ మించు నయ్యినుఁడె దీపము గుజ్జనఁగూడు చంద్రుడే
తొఱలిన దేవసంఘములె తొత్తులు బంట్లును వేంకటేశ్వరా!
66
చ. వడి నలమేలుమంగ నిడువాలికచూపునివాళి నీపయి\న్‌
సుడిసిన తమ్మిరేకులంబ్రసూనశరంబులు గల్వరేకుల\న్‌
బడిబడి మీఁదమీఁద రసభావనగా దిగఁబోసినట్ల పో
పొడవగు పువ్వుజొంపముల పూజలు నీకును వేంకటేశ్వరా!
67
చ. నిను నలమేలుమంగ ఘననీరజపంక్తులు దాఁక నేసిన\న్‌
జనుఁగవ నొత్తినట్లు కెరజంబుల వాండ్లును నొత్తినట్లు ని
గ్గునఁగనుదోయితామరలఁ గొంకక సారెకు నొత్తినట్లు మైఁ
జెనకి మరుండు బాణములు చిమ్మినయట్లగు వేంకటేశ్వరా!
68
చ. అపు డలమేలుమంగ పొలయల్కలు వద్దని చాఁటి చెప్పిన\న్‌
గపటపుటల్క లల్లితివి గర్వితనంబునఁ గాంత కోరమే
రపమునఁ జూతుగా కలుక రాజసలీలల నింత దీఱునా
విపులవియోగతాపమున వేడుకకూటమి వేంకటేశ్వరా!
69
చ. ఇల నలమేలుమంగ నిను నేమని తిట్టునొ యేకతంబున\న్‌
గలికి మెఱుంగుడాలు తెలికన్నులజంకెన నద్దలింపుచు\న్‌
బలుకులముద్దు లింపొలయ భారపుగుబ్బల దూర నెత్తుచు\న్‌
జలజల కొప్పుసంపెఁగలు జాజులు రాలఁగ వేంకటేశ్వరా!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEshvara Satakamu - vEMkaTEshvara shatakamu - annamayya - annamAchArya - ( telugu andhra )