| శతకములు | సదానందయోగి శతకము | సదానందయోగి కృతము |
|
శ్రీమహోన్నత విజ్ఞాన సిద్ధి నొసఁగు సద్గురుస్వామి పాదాంబుజములు తలఁచి సకలతత్త్వార్థ సంగతుల్ సంగ్రహించి గీతశతకంబు రచియింతుఁ గీర్తి వెలయ నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
1 |
|
ధరణిలోపలఁ దనరారు తత్త్వములకు నవ్వలై యున్న తత్త్వంబు నెవ్వఁ డెఱుఁగు శివుఁడు గురురూపమై వచ్చి చెప్పకున్న నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
2 |
|
పుట్టుచావులు రెండును బొరయనట్టి నిర్మలజ్ఞానసంపన్ననిష్ఠ గలుగు తెరువుఁ గల్పించునాతఁడె గురువరుండు నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
3 |
|
బట్టబయలైన యీ పరబ్రహ్మమహిమ దేశికస్వామికృప లేక తెలియరాదు యెన్నిచదువులు చదివిన నేమిఫలము? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
4 |
|
సకలశాస్త్రంబు లెల్లను చదువువారు చదువుకోనట్టివారితో సమముగాదె, గురుముఖంబున ననుభవం బెఱుఁగకున్న? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
5 |
|
దేవపూజల గొడవేల? తీర్థమేల? చెలఁగి యష్టాంగయోగముల్ సేయనేల? గురుముఖంబున క్షణములో గుఱియు గనిన నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
6 |
|
తన్నుఁదెలిసిన మఱివేఱె తనకు లేదు; తన్నుఁదెలిసిన బ్రహ్మమై తాను నిలుచు తన్నుఁ దెలిసిన సద్గురూత్తముని వలన నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
7 |
|
సద్గురువు గల్గునటమీఁదఁ జదువులేల? నిజమెఱింగినపిమ్మట నిష్ఠలేల? సర్వమును దానయై యున్నసరణి గాదె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
8 |
|
తత్పదంబును నదియపో 'త్వం'పదంబు, అసిపదంబును నీరెంటి కైక్యమగును; దెలియు శివయోగి, మూఢుండు దెలియలేఁడు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
9 |
|
సకలనైష్ఠికములు గాదు, శక్తిగాదు, జీవుఁడును గాదు, పరమునై చెలఁగు బ్రహ్మ మద్భుతానంద మైనట్టి యనుభవంబు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
10 |
|
రూపులకునెల్ల రూఢియౌ రూపు గాక, వెలుఁగులకునెల్ల వెలుఁగునై వెలుఁగుఁగాక చెలఁగు ననుభవవేద్యమై చిద్ఘనంబు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
11 |
|
లోను జూడంగఁ జూడంగ లోనుగాదు; బయలు చూడంగఁ జూడంగ బట్టబయలు; బైటలోపలఁ బూర్ణుఁడై పరఁగుశివుఁడు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
12 |
|
శివుఁడు జీవుండు రెండువస్తువు లటంచు నిచ్చ నెంచిన సాయుజ్య మెట్లు కల్గు? శివశివా భేద మన్నది సేయరాదు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
13 |
|
నీట వెలసినలవణంబు నీటఁ గలియు నీరు గాకుండ దారీతి నిశ్చయముగ; శివుని దలఁచిన జీవుండు శివుఁడు గాఁదె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
14 |
|
సత్తు నెఱుఁగ దసత్తు దా జడముగాన, సత్తసత్తువు నెఱుఁగ బ్రసక్తి లేదు; అట్టి సదసత్తు లెఱిఁగెడి దాత్మ సువ్వె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
15 |
|
సత్తుఁ గూడినయపుడెల్ల సత్తె యౌను; సత్తు లోఁగూడ మఱి తానె సత్తు వౌను; గాన జీవుండు సదసత్తుగాఁడె తలఁప? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
16 |
|
సూర్యదివసాదికంబులు చూచుకొన్న నాస్పదంబును బుద్ధికి నాస్పదంబు, పెక్కుభ్రమలను నెందుకుఁ జిక్కినారు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
17 |
|
కలదు కల దన్నవారికి కలదు జగము; లేదు లే దనువారికి లేదు జగము; కలిమిలేములు మాయకుఁ గలగుణములు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
18 |
|
మతము లెన్నైనఁ గలవు భూమండలమున; మతము లన్నియు సామాన్యమాయ సువ్వె; మతము విడిచిన మదికి సమ్మతము గాదె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
19 |
|
తనకు దేహాభిమానంబు తఱిఁగెనేని మాయసంసార మప్పుడే మాయ మయ్యె; మాయరూపంబులే నష్టమాయె మాయ, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
20 |
|
అతిరహస్యము మఱిబయ లనఁగ వినియుఁ దెలియఁజాల రదేమొకో తేటపడఁగ? మాయ బలమైగదా యిట్లు మఱుఁగుచేసె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
21 |
|
మనసు మాయని తానును మచ్చికాయె; మనసు మాయగదా యన మాయ మాయె; అందు నేమాయె? సత్తె యానంద మాయె; నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
22 |
|
గాలి నిలిచినఁ గలదండ్రు కాయసిద్ధి; కాయమును గాలియును రెండు మాయ గాదె? కాయ సిద్ధౌట తత్త్వంబుఁ గనుట కాదె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
23 |
|
కాయ సిద్ధైనవారినిఁ గన్నవారు నున్నవారును గలరె యీ యుర్విలోనఁ? గాయ సిద్ధులు తొల్లింటికథలు సువ్వె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
24 |
|
తనువు గలుగుట ప్రారబ్ధ మనుభవింప ననుభవము దీఱి నిశ్శేష మైనవెనుక; కాయసిద్ధికిఁ బడుపాటు గాలిఁబోదె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
25 |
|
గరికివేళ్లును నీళ్లును గాయకసరు నాకటికిఁ దిన్నఁ గాయసిద్ధౌటయెట్లు? మనుజు లి ట్లేల వెఱ్ఱులై మరులుకొనిరి? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
26 |
|
చెనఁటి మానవు లణిమాదిసిద్ధులందు మోహమొనరింతు; రదికాదు ముక్తిపథము; పరమవిజ్ఞానపరు లిట్లు భ్రమలఁబడరు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
27 |
|
పుట్టగోఁచులు పెట్టి, విభూతిఁ బూసి జడలు ముడివెట్టి, కడసము చంకఁ బెట్టి, గుహల గూర్చుండి, ప్రాణాలు కుదియఁబట్టి తనువు పీడింపఁ దత్త్వంబుఁ గనుట యెట్లు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
28 |
|
కరకమండలమును బట్టి కావికోకఁ బూనునంతనె ముక్తిని బొందుటెట్లు? సమయవర్ణాశ్రమాదులు భ్రమలుకావె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
29 |
|
సప్తకోటిమహామంత్రజాలమెల్లఁ జిత్తవిభ్రమ; మదిగాదు శివపదంబు; నభ్యసింపఁడు దాని మోక్షాధికారి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
30 |
|
హెచ్చరిక గల్గి మానవుఁ డిహపరార్థ ఫలము లాసింపకను బ్రహ్మపదముఁ గోరి నిర్గుణాష్టాంగయోగంబె నెఱుఁగవలయుఁ నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
31 |
|
సగుణచింతన, మణిమాదిసాధనంబు, నిర్గుణోపాస్తి, కైవల్యమార్గ మిదియఁ గాన, నిర్గుణయోగంబె పూనవలయు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
32 |
|
మంత్రలయహఠ మనియెడుమాయఁ విడిచి, రాజయోగంబు సద్గురురాజువలనఁ దెలియ నేర్చినవాఁడెపో దివ్యయోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
33 |
|
ముక్కుబిగియించుకొని, గాలి మూటగట్టి వట్టి పసలేనిపెనుబయల్ ప్రాఁక నేర్చి యద్భుతానందమును బొందునతఁడె యోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
34 |
|
లోకదృష్టియు మఱియు నాలోకదృష్టి గానరా దిందు; నీరెండుఁ గాననట్టి భావదృష్టిని గలవాఁడె భవ్యయోగి నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
35 |
|
వెలుఁగుకవ్వల వెలిఁగెడు వెలుఁగుఁజేరి, బయలుఁ గొనిపోయి యచ్చట బయలుఁగలిపి, నిశ్చలత నున్నయతఁడెపో నిత్యయోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
36 |
|
ఒక్కటే లేదు మఱి వేయి లెక్క లేదు; నొండు రెండును గాక దా నిండియుండు నట్టితత్త్వంబుఁ దెలిసినయతఁడె యోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
37 |
|
చూడకే చూచు జగమెల్లఁ జోద్యమంది; చావకే చచ్చు నత్యంతసరసలీల; చేయకే చేయుఁ గ్రియలెల్ల సిద్ధయోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
38 |
|
చూచువాఁడును, మఱి చూపు, చూడఁదగిన వస్తువులు లేక, సమరసత్త్వమునఁ దలఁపు నిలుపనేర్చినవాఁడె పో నిత్యయోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
39 |
|
కర్తయై యుండియును మఱి కర్త గాఁడు భోక్తయై యుండియును మఱి భోక్త గాఁడు అట్టితత్త్వంబుఁ దెలిసినయతఁడె యోగి నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
40 |
|
తలఁపు మఱపను వస్తుద్వితయము విడిచి, శుద్ధమైన యవస్థందు సుస్థిరముగ నిలిచి, యనుభూతిఁ గనువాఁడె నిత్యయోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
41 |
|
మూఁడు ద్రోవలలోపల ముఖ్యమైన నడిమిత్రోవను జని, లోన నాగకన్య నూరడించినవాఁడె పో యుచిత యోగి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
42 |
|
ఎచట నేవంకఁ జూచిన నచటనెల్ల దొడరి చిన్మయలింగమై తోఁచవలదె; యదిగదా యోగసిద్ధికి నాలయంబు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
43 |
|
చదువవచ్చును వేదశాస్త్రంబులెల్ల; బలుకవచ్చును తానెపో బ్రహ్మ మనుచు; ననుభవజ్ఞుఁడు గానేర్చు టదియె యరుదు నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
44 |
|
పూయవచ్చును బట్టెఁడు బూడిదైన; వేయవచ్చును రుద్రాక్ష వేలసంఖ్య; సేయఁగా రాదు మనసు సుస్థిరముగాను, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
45 |
|
ఒక్కఁడే పోయి యడవుల నుండవచ్చు; నీరుద్రావుచు బ్రాణము ల్నిలుపవచ్చు; రాజయోగంబు సేయంగ రాదుగాక, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
46 |
|
వనధి లోఁతని చెప్పఁగా వచ్చుఁగాక; మునుఁగవచ్చునె మేనెల్ల ముద్దగాను సోఽహమనవచ్చుఁ; దన్నుఁ దాఁ జూచుటరుదు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
47 |
|
ఎవ్వరైనను బరమార్థ మిట్టి దనుచు తెలియనేర్తురె తమలోన తేటపడఁగ? నుత్తమజ్ఞాని శివయోగి యుండుఁ గాక, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
48 |
|
స్నానమొల్లఁడు, దేవతార్చనము సేయఁ డమల విజ్ఞానసంపన్నుఁ డైనయోగి; లోకులకుఁ దెల్సునే వానిలోనిగుట్టు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
49 |
|
తమనిజం బేమి యెఱుఁగరు ధాత్రిజనులు; మృచ్ఛిలాకాష్ఠతామ్రనిర్మితములైన దేవతలఁ గొల్చువాఁ డెట్లు తెలియనేర్చు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
50 |
|
ఱాళ్లఁ జేసిన వొకకొన్ని రాగికొన్ని, మ్రానఁ జేసిన వొకకొన్ని, మంటిఁ గొన్ని; యిట్టిదేవుళ్ళు ముక్తీయ నెట్లు నేర్తు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
51 |
|
మండలాంతర దేదీప్యమాను శివుని మూఁడు నాలుగు పాఁతల ముడిచి ముడిచి యఱుతఁ గట్టుదు రొకకొంద ఱల్పమతులు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
52 |
|
కులము రూపును గుణమును గూలఁబెట్టు నరుఁడు శివయోగివిద్యలు మరగెనేని; చెడ్డసంసార మైతేను చెప్పనేల? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
53 |
|
బ్రహ్మవిద్యకుఁ దనయింటి ప్రజలు చాల సమ్మతించిన గృహమందె సలుపవలయు; నట్లు గాకున్న మఱి యింటియాస లేల, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
54 |
|
మనుజమాత్రుండె శివయోగి మహితకీర్తి యఖిలజగములు తానైన యట్టివిధము దృష్టముగఁ జూచు ననుభవదృష్టిచేత నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
55 |
|
పరమసుజ్ఞాననిధిఁ జూచి పాపజనులు దమకు సరియైనవారుగాఁ దలఁతు రెపుడు వారు గన నేరరెట్టి నిర్వాణమహిమ నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
56 |
|
కట్టఁగావచ్చు మృదువైన కావికోకఁ బెట్టఁగావచ్చుఁ బాదుక లెట్టివైనఁ బట్టఁగారాదు మనసింత పాఱనీక నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
57 |
|
కూడు దినరాదటంచును గొందఱయ్య లేలకో వెఱ్ఱిత్రోవల నెఱుఁగలేరు కూడు విడిచిన విడుచునా కుటిలబుద్ధి నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
58 |
|
పాలు నీరును నొక్కటై పరిణమించు కరణి బ్రహ్మంబులో మాయ గలసియుండు చారు శివయోగి తెలియు హంసంబు పగిది నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
59 |
|
నిత్యనైమిత్తికాదులు నెఱపకున్న పాతకం బని వెఱచునే పరమయోగి? పోతురాజుకు నేల నీభూతశంక? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
60 |
|
ఊరు మేలైన నుండును యోగివరుఁడు; తోడు మేలైన బోవును తోడుతోనె; వాని కెక్కడ లోకంబువారి నడత? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
61 |
|
తన్నుఁ దాఁ దెల్సి జగమెల్లఁ దానయైన మర్మ మెఱుఁగంగఁ జాల రీమందమతులు; గడవఁజాలరు సంసారఘనపయోధి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
62 |
|
ఏమి భుజియింపఁ గోరిన, నెచట నున్న, నెందుబోయినఁ, దన కెందు నేమికొదువ పూర్ణభావంబు తనయందు బొడమియున్న? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
63 |
|
బుద్ధిజాడ్యులు తమలోనఁ బూర్ణమైన నిండుబంగారమున వన్నె నిలిచినట్లు కఠినమై యున్న బ్రహ్మంబు గానలేరు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
64 |
|
చదువులేఁటికి? దేవతార్చనము లేల? నిత్యనైమిత్తికాదుల నియమ మేల? స్వానుభూతి రసామృతాస్వాదనులకు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
65 |
|
పూజలును మంత్రకథలును బుస్తకములు యంత్రజాలంబు యోగంబు తంత్రములును కడఁగి బ్రహ్మానుభవవిఘ్నకరము లరయ నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
66 |
|
అనుభవము చాల కొకకొంద ఱవనిలోన సిద్ధయోగుల మనుకొంద్రు సిగ్గులేక; తేటతెలివిగఁ ద మ్మేమి తెలిసినారు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
67 |
|
స్మార్తకర్మంబుఁ గొందఱు సలుపలేక బ్రహ్మవేత్తల మనుకొంద్రు బైసిమాలి; అట్టిజనులకుఁ గైవల్య మెట్టు గలుగు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
68 |
|
అనుభవముఁ దెల్పనేరని యతని చేత చారు సుజ్ఞానమును విన్నవారిప్రజ్ఞ అంధకుడు చూపుతెరువున నరుగుకరణి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
69 |
|
విశ్వమున నూట వేయింట వెదకి చూడ నొక్కశివయోగి దొరకుట యెక్కు వరయ కల్లయోగుల కేమి పెక్కండ్రు గలరు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
70 |
|
బ్రాహ్మణు లటంచుఁ గొందఱు పలుకు టెట్లు? బ్రహ్మ నెఱుఁగంగనేరఁక బాఁపఁడగునె? బ్రహ్మనెఱిఁగినవాఁడె పో బ్రాహ్మణుండు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
71 |
|
వేషధారులఁ జూచి వివేకు లైన బ్రమయుచుందురు వేషంబుబలిమిఁ జూచి; తెల్లముగ లోనిగుట్టెల్ల దేవుఁ డెఱుఁగు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
72 |
|
వేదశాస్త్రపురాణాది విద్యలెల్లఁ జదివి పాండిత్యములు సేయుజనుల కెల్ల ననుభవజ్ఞాన మెక్కడి దరసిచూడ? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
73 |
|
అనుభవజ్ఞానియైనట్టి యమలమూర్తి తన్నుఁ బ్రకటన సేయఁడు ధాత్రిలోన నివురు నుముకయు నిండిననిప్పురీతి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
74 |
|
తాను నిర్మలుఁడై యుండి తనకు లేని యంటుఁ గల్పించుకొని తీర్థ మాడనేల? మనము పోయెడిపోకలు మాన్ప వశమె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
75 |
|
మనసు వెగ టౌట యెఱిఁగిన జనము లెల్లఁ బాఱవిడి చూరకుందురు పట్టులేక వెఱ్ఱివాఁడైన సంకెళ్లువేయవలదె! నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
76 |
|
బ్రహ్మనిష్ఠాంగపరుఁ డైనపావనునకు తీర్థయాత్రల భూమెల్లఁ దిరుగ నేల? తాను గలచోట సకలతీర్థములు గలవు! నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
77 |
|
మాంసమును చీము నెత్తురు మలిన మైన తోలుఁ గొనిపోయి నీళ్ళలోఁ దొలిచినపుడె శుద్ధిగాదది, మనఃపరిశుద్ధిగాని నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
78 |
|
మఱియు సర్వేంద్రియములకు మనసు రాజు; మనసునకు రాజు తలఁపంగ మారుతంబు; మనసు మారుతమొకటైన మలయు సుఖము, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
79 |
|
మనసు నిల్పంగ నిలుచును మారుతంబు; చూపు నిలుపంగ నిలుచును స్థిరసుఖంబు; స్థిరమనోదృష్టి నిల్పినఁ జేరు ముక్తి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
80 |
|
పాలు నీరును రుచియును బరఁగునట్టి జీవుఁ డనుమాయ శివుఁడును జేరియుండు! మొదలఁగడపట నిత్యుండు మూఁడువగల నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
81 |
|
సత్య మిది యని తెలిసియె జనులతోడఁ జెనకి పలుమాఱు వాదము సేయఁబోక మౌనవృత్తిని జరియింప మంచితనము, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
82 |
|
ద్వైత మనుచును గొందఱద్వైత మనుచు వాద మొనరింతు రెఱుఁగక; వారు భువిని కలిమియై నట్టితత్త్వంబు గానలేరు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
83 |
|
మానవులు వార లెంత నజ్ఞాను లైనఁ గడఁపజాలరు ప్రారబ్ధకర్మఫలము; లిందుకై కాదె తనువుల నెత్తవలసె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
84 |
|
జనుడు దా నవివేకియై సాహసమునఁ బట్టు దుర్దానములు మఱి పాపమనక; వాని నన నేల! గతజన్మవాసన యది, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
85 |
|
ఒడలు సర్వేంద్రియంబుల కునికి గాదె? యొడలు గలవానికిని గాదె యోగవిద్య? యొడలు చెడినట్టివానికి యోగ మేల? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
86 |
|
బంధ మెచ్చటనుండి సంప్రాప్త మయ్యె? ముక్తి యేవంకనుండియు మొలచివచ్చె? బంధముక్తులు రెండును భ్రమలుసూవె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
87 |
|
ఇహపరాపేక్షలును రెండు నెంచిచూడ నినుము బంగారు సంకెలలే తలంపఁ గోర రిట్టివి మోక్షాధికారు లెపుడు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
88 |
|
గుహలఁ జొచ్చుక కొందఱు కూడు నీళ్ళు విడిచి త మ్మేమి కన్నారు వెఱ్ఱివారు? మూల బెట్టిన దేహాల ముక్తి యెట్లు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
89 |
|
చే టెఱుంగని నలికూన జీవులెల్ల విషయములఁ జిక్కుపడినట్టి విధము వినవె పొంగి ఝషకము గాలము మ్రింగుకరణి, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
90 |
|
దేహ మస్థిర మని యెంత తెలిసియుండు మంచిగతి చూచుకోలేరు మాయఁదగిలి జీవు లజ్ఞాన మే మని చెప్పవచ్చు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
91 |
|
చాలుచాలును సంసారసంగ మనుచు, వేఁడివెసలంటి గొబ్బున విడిచినట్లు విడిచి మనుజుండు సద్గురు వెదుకవలయు నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
92 |
|
దేవదానవమానవ తిర్యగాఖ్య జీవు లింతల భ్రమలచేఁ జిక్కినారు; శక్తి బలవంత మీజగజ్జాలమునకు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
93 |
|
సుతుని నాలిని సంపదఁ జూచి చూచి మోహియై నరుఁ డూరకే మోసపోవుఁ దనకు నవి మీఁదఁజే టని తలఁచుకొనఁడు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
94 |
|
ఆలుబిడ్డలు తన దని యాస సేయు; నందు నేమియు మేలు లే దరసి చూడ; వెంట వత్తురె తనువులు విడిచిపోతె నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
95 |
|
ఆలుబిడ్డల విడిచిన నందువల్ల మోక్ష మబ్బునె? తనుఁబట్టి ముంచుకొన్న కల్మషము తీఱినప్పుడుగానఁ గలదె? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
96 |
|
విషయముల రోసి నరుఁడు నిర్విషయుఁడైనఁ దనకు మోక్షంబు హస్తగతంబు కాదె? విషయములకన్న మఱిచేటు వేఱ లేదు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
97 |
|
వేడుకై యుండు ముందఱ విషయసుఖము; వెనుక బరువౌను సంసారవిషయసుఖము; కాదు సుఖ మిది మీసాలమీఁదితేనె, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
98 |
|
చుట్టములుఁ దల్లిఁదండ్రులు సుతులు హితులుఁ దాను పోయెడిగతులకుఁ దగిలి రారు, వారు త్రోవంప వచ్చెడువారుగాని, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
99 |
|
మొదల సంసారబద్ధుఁడై మోసపోయి వెనుక చింతించు దేహంబు విడుచువేళ; నిట్టిజీవుండు దుదముట్ట నెట్లునేర్చు? నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
100 |
|
తన్నుఁ గట్టను మఱి త్రాళ్లు తానె తెచ్చి కట్టుపడురీతి జనుఁడు సంకల్ప మనెడు పాశజాలంబుతో వాలబద్ధుఁ డగును, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
101 |
|
చేయుక్రియ లెల్ల శివుఁడైన సేయవలయు, తనకుఁ గర్తృత్వ మెన్నఁడుఁ దలఁపరాదు, మనుజుఁ డపరోక్షమునఁ బొందు మార్గ మిదియ, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
102 |
|
ఏమతంబున నుండిన నేమి తప్పు? ముక్తిగనువారి కొక్కటి ముద్రపదము; తాను సంకల్పరహితుఁ డైతేను చాలు, నవ్యతరభోగి శ్రీసదానందయోగి. |
103 |
|
సకల యోగీంద్రహృద్యమై సార మమరు వాక్యఫణితి సదానందవరుఁ డనియెడు యోగివిరచిత వైరాగ్యయోగ శతక మలరు నాచంద్రతారార్క మగుచు మహిని. |
104 |