| శతకములు | కుమార శతకము |
|
| క. |
యోగ్యుల నరయఁగ లేక య యోగ్యులకున్ దాన మొసఁగు చుండుట యది స ద్భోగ్యసతిన్ షండునకున్ భాగ్యముఁగని పెండ్లిచేయు పగిదిఁ గుమారా! |
91 |
| క. |
దీనుం డైనను శాత్రవుఁ డైనన్ శరణనుచు వేఁడు నపుడు ప్రియత న మ్మానవుని కోర్కెఁ దీర్చిన వాని సుజనుఁడండ్రు బుధులు వసుధఁ గుమారా! |
92 |
| క. |
పాపంబులందు నెక్కుడు పాపములు సుమీ! ధరిత్రి పై క్రోధగుణం బేపారు లోభమును నివి యేపురుషులఁ జెందఁగూడ దిలను గుమారా! |
93 |
| క. |
మునుగల్గి ధర్మమును జే యునతఁడు పేదవడెనేని యున్నంతకుఁ దోఁ చిన భంగి నర్థులకు ని చ్చునతఁడె బహుపుణ్యపూరుషుండు కుమార! |
94 |
| క. |
కడుమెల్లన నిడు నుత్తర మడఁచును గోపమును దీక్ష్ణమమరఁగ దా న ప్పుడు నుడివెడు నుత్తరముడి వడిఁ గోపముఁ బెంచు నరయ వసుధఁ గుమారా! |
95 |
| క. |
మిత్రుండు దనకు విశ్వా మిత్రముఁ జేసినను గాని మే లనవచ్చున్, శాత్రవుఁడు ముద్దు గొన్నను, ధాత్రిం దన కదియె కీడు తలపఁ గుమారా! |
96 |
| క. |
ధర నొక్క బుద్ధిహీనునిఁ దిరముగ రోటనిడి దంచెఁ దేనియుఁ బెలుచం దురు మగును గాని, యతనికి సరసత్వము గలుగదండ్రు సతము కుమారా! |
97 |
| క. |
విత్తంబు విద్య కుల ము న్మత్తులకు మదం బొసంగు మాన్యులకున్ స ద్వృత్తి నొసంగున్, వీనిం జిత్తంబున నిడి మెలగఁ జెలఁగు కుమారా! |
98 |
| క. |
ధరఁ గఱవుఁ గోరి ధాన్యం బిరవున నిడుకొనినవాని నెగ్గింపఁ దలం తురు, వాని నమ్మఁ దలఁచిన పురుషుని నుత్తముఁడటంచుఁ బొగిడి కుమారా! |
99 |
| క. |
ఋణ మధిక మొనర్చి సమ ర్పణ జేసిన తండ్రి, విద్య రాని కొడుకు, ల క్షణశాలి రాణి దుశ్చా రిణి యగు జననియును దలప రిపులు కుమారా! |
100 |