| శతకములు | కుక్కుటేశ్వరశతకము | కూచిమంచి తిమ్మకవి |
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
పీఠిక - స్వామీ శివశంకరస్వామీ
(శతకసంపుటము ద్వితీయభాగము - ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, 1968)
| కుక్కుటేశ్వరశతకము - కూచిమంచి తిమ్మకవి | ||
| సీ. | శ్రీకరధవళాంగ, శ్రితజనావనసంగ, | కరనివిష్టకురంగ, పురవిభంగ, తరణిచంద్రరథాంగ, ధరణీతలశతాంగ, | విదళితానంగ, గోవృషతురంగ, వలయీకృతభుజంగ, విలసితఖట్వాంగ, | ధృతనభోగంగ, వార్నిధినిషంగ, మునిమనోంబుజభృంగ, ఘనసమరాభంగ, | అతిదయాపాంగ, పుణ్యాంతరంగ, | |
| తే. | శైలజానుంగ, నీకొక శతక మిపుడు | కూర్చి యర్పింతుఁ గైకొమ్ము, కోర్కె లిమ్ము, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 1 |
| సీ. | కొక్కుఁ జొక్కువయాళి జక్కి నెక్కెడి వేల్పు | మినుసికయెకిమీని యనుఁగుఁబట్టి మేల్కడాని పసిండిమేని జేజేమిన్న | యిద్దఱుతల్లుల ముద్దుఁగొడుకు గుజ్జుదేవర వ్రేలుబొజ్జ మేటిమగండు | మొలకపూవుల పూజ నలరు వలఁతి, చిలువజన్నిదముల చెలువుండు సికను లేఁ- | దొగవిందుతునె పూను సొగసుకాఁడు | |
| తే. | నను గజాననుఁ డెపుడు నిన్ బొగడు కృతులఁ | జిరకృపాస్ఫూర్తి సంపూర్తి సేయుచుండు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 |
| సీ. | గురుతరకౌండిన్యగోత్ర పవిత్రుండ | గంగనమంత్రిశేఖరుని సుతుఁడ కూచిమంచన్వయాకూపార చంద్రుండ | వితతతావకకృపావీక్షణాప్త- సత్కలితామహాసామ్రాజ్యభార ధౌ- | రేయుండ బుధజనప్రియ సచివుఁడ ఘన దెందులూరి లింగన గురూత్తమదత్త | సారశైవాచార సంగ్రహుఁడను | |
| తే. | తిమ్మకవిచంద్రుఁడను నేను దివిరి నీకు | శతక మర్పింతుఁ గైకొమ్ము సంతసమున, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 3 |
| సీ. | కౌశిక కౌండిన్య కపిల కశ్యప కణ్వ | కౌత్స కాత్యాయన కలశజులును జహ్ను జరత్కార జాబాలి జమదగ్ని | జలజభవాత్మజ జైమినులును మందపాల మతంగ మౌసల మౌద్గల్య | మాండవ్య మైత్రేయ మంకణులును వల్మీకభవ వత్స వాలఖిల్య వశిష్ఠ | వరతంతు వామదేవ ప్రముఖులును | |
| తే. | నిక్కముగ నిన్ను వర్ణింపనేర రనఁగ | నెంతవారింక నరులు ని న్నెఱిఁగి పొగడ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 4 |
| సీ. | దండ ముద్దండదోర్దండకోదండవి- | ఖండిత చండవేదండ, నీకు! జోహారు హారామరాహారనీహార- | గోహర గోహీరదేహ, నీకు! నతి శతక్రతుముఖాదితిసుతాతతకృత- | స్తుతికృతామితహిత కుతుక, నీకు! జేజే పరాజితోగ్రాజివిరాజిత- | వ్యాజనిరీజసమాజ, నీకు! | |
| తే. | వందన ముదార దారుకావనమునీంద్ర- | సుందరీబృందమానసానంద, నీకు! భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 5 |
| సీ. | తపననందన భటోద్దండ చండభుజంగ | మేఘభీషణ విహంగోత్తమంబు బహుజన్మసంచిత బ్రహ్మహత్యాముఖో- | గ్రౌఘకాలాభ్ర ఝంఝూనిలంబు భూతవేతాళప్రభూత వాతజ్వరా- | ద్యామయారణ్య దావానలంబు ఘోరదారిద్ర్యవికారభారోదగ్ర- | వారణానీక కంఠీరవంబు- | |
| తే. | నైన వంచాక్షరిని భక్తి యతిశయిల్లఁ | దవిలి జపియించు వారెపో ధన్యతములు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 6 |
| సీ. | అమర మస్తకకిరీటాంచిత మనోవిభా- | నీరాజితాంఘ్రిపంకేరుహునకు శైలకన్యాఘనస్తనవిలిప్తమృగీమ- | దాంకిత విపుల బాహాంతరునకు గగనతరంగిణీకల్లోలమాలికా- | శోభిత పటు జటాజూటునకును, మరుదీశనీలోపమానమానిత మహా- | కాకోలరుగ్జాల కంధరునకు | |
| తే. | నీకు నతులు సమర్పించి నిష్ఠతోడఁ | గొల్చువారలె శమనుని గెల్చువారు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 7 |
| సీ. | అభవు నక్షయు నాద్యు నవ్యక్తు నవ్యయు | ననఘు ననంతు నాద్యంతరహితు నప్రమేయు నజేయు నకలంకు నసమాను | నానందమయు నాఢ్యు నాత్మరూపు నచలు ననామయు నఖిలేశు నద్వయు | నార్తరక్షాచణు ననఘహృదయు నమలాత్ము నజుగురు ననవద్యు నభయదు | నసహాయు నతిపుణ్యు నగ్రగణ్యు | |
| తే. | నహరహంబును నిను భక్తి నాత్మఁ దలఁచు | పుణ్యమతులకుఁ గడు సులభుఁడవు నీవు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 8 |
| సీ. | సర్వసర్వంసహాస్థలి శతాంగము గాఁగ | రవిసుధాకరులు చక్రములు గాగ వాణీవిలాసినీవరుఁడు సారథి గాఁగఁ | బ్రామిన్కుగములు బాబాలు గాగ రత్నసానుధరాధరము కార్ముకము గాగ | నాగాధినాథుండు నారి గాగ పంకజాతాక్షుండు కంకపత్రము గాఁగ | బర్హిర్ముఖులు వీరభటులు గాఁగఁ | |
| తే. | గూర్చి బారులు దీర్చి చిట్టార్చి పేర్చి | యోర్చి పురదానవులఁ దెగటార్చితీవు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 9 |
| సీ. | రక్షించితివి కదా రవిసూను బడఁదన్ని | చిరకృపామయబుద్ధి శ్వేతకేతు భక్షించితివి కదా బ్రహ్మాండనివహకో- | లాహలభయద హాలాహలంబు శిక్షించితివి కదా శితఖడ్గధారాంచ- | లమున దక్షాంధకప్రముఖ ఖలుల వీక్షించితివి కదా వితతఫాలానల- | జ్వాలచే మరుని భస్మంబు గాఁగ | |
| తే. | నిగ్రహానుగ్రహప్రౌఢి నీకె కాక | కలదె తక్కిన చిఱుత వేల్పులకు నెల్ల, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 10 |
| సీ. | పలుకుఁగ్రొన్ననఁబోఁడి కులుకు వీణియ మీట | వేయుఁగన్నులవేల్పు వేణువూదఁ గలుములతొగకంటి చెలఁగి గానము సేయ | నలువ కైతాళ మింపలర వ్రేయ మధుదైత్యమథనుండు మద్దెల వాయింప | సకలపారిషదు లెచ్చరికసేయ నందిభృంగీశు లందంద సందడి దీర్ప | మొనసి దేవతలెల్ల మ్రొక్కి కొలువ | |
| తే. | సంతసము మీఱఁ గేరి సాయంతనమునఁ | దాండవం బాడు నీ హొయల్ దలఁప వశమె భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 11 |
| సీ. | అబ్జగర్భునకు లోకానీకనిర్మాణ- | చాతుర్య మేరీతి సంభవించె జలజాక్షునకు నిశాచరశిక్షణోపాయ- | పాటవం బేలీల నాటుకొనియె పురుహూతునకు దివ్యభోగభాగ్యాస్పద- | స్వర్లోకపదవి యేసరణి వచ్చె దిననాథునకు జగజ్జనలోచనదురాప- | ఘనవిభాస్ఫూర్తి యేకరణి నొదవె | |
| తే. | నహహ తావక పదసరోజార్చనావి- | ధానమునఁ గాదె కలిగె ననూనమహిమ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 12 |
| సీ. | ధననాయకుడు నితాంతము బ్రియమిత్రుండు | సిరులపైదలిగేస్తుఁ డరిదితూపు కలధౌతశైలంబు కాఁపురంబు బిడారు | కాంచనాహార్యంబు కార్ముకంబు రత్నాధివాసంబు రహి మించు తరకసం- | బల సర్వమంగళ యనుఁగురాణి పంటలపువుఁబోఁడి బాళి మీఱిన తేరు | కళలీను రాజు కీల్గంటిపువ్వు | |
| తే. | గాఁగ నణిమాది భూతులు గల్గు నీకుఁ | బునుకలెత్తంగ నేరీతిఁ బొసఁగెనయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 13 |
| సీ. | చెలిమి నోగిర యిడ్డ చిరితొండబత్తుని | కొడుకుఁ జంపించుట దుడుకు గాదె పరకాంత యని మది నరయక భల్లాణు | నిల్లాలి గోరుట యెగ్గు గాదె మాలని యెంగిలిమాంసంబు రోయక | తవిలి మెసంగుట తప్పు గాదె మొనసి యాడుది పంపు పనులకై కినియక | కుంటెనల్ తిరుగుట కొఱఁత గాదె | |
| తే. | శివశివా! నీవె యిటువలెఁ జేయునప్పు | డవని నరులకు నింకేమి యడ్డు కలుగు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 14 |
| సీ. | దశశతాబ్దముల నిన్ దవిలి పూజించిన | మెచ్చి చక్రికిఁ జక్రమిచ్చినావు తరలక నిను గూర్చి తప్పమొనర్చిన క్రీడి | కెసఁగఁ బాశుపతాస్త్ర మొసఁగినావు మిత్తి చేఁ బడి నిన్ను హత్తి బత్తిఁ దలంచు | మునిపుత్రుఁ జేపట్టి మనిచినావు కాలకూటాగ్నిచేఁ గ్రాఁగి కుయ్యిడుచున్న | దివిజుల యాపదన్ తీర్చినావు | |
| తే. | బళిర జగముల నీవంటి భక్తిసులభుఁ | డైన దైవంబు గలఁడె లోనరసి చూడ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 15 |
| సీ. | పుఱియలు పునుకలు నెఱియఁ బేర్లుగ వైచి | కుత్తుక గరళంబు కుదురు కొలిపి కడఁగి పెన్బాముల తొడపులుగాఁ బెట్టి | పచ్చియేనుఁగుతోలు పైని గప్పి నెమ్మేన శవభస్మ మిమ్ముమీఱ నలంది | బికిరంబు చలికూడు ప్రేమఁ దినుచు భూతపిశాచముల్ ప్రీతిఁ గొల్వగఁ బ్రేత- | భూములయందు నబ్బురము మీఱ | |
| తే. | మెలఁగుచుండియు భువనమంగళవిలాస- | లీలఁ జెలగుదువంట మేల్ బళీ యయారె! భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 16 |
| సీ. | జంభాహితుని భుజాస్తంభనం బొనరించి | విష్ణుని చక్రంబు విఱిచి పుచ్చి బ్రహ్మదేవునిఁ బటాపంచలుగాఁ గొట్టి | భగుని కన్నులు నేలఁబడఁగఁ దిగిచి పూషార్కు దంతముల్ పొడిపొడిగాఁ దన్ని | సోముని నరకాల భూమిఁ జమరి దక్షుని తలఁ గొట్టి తవిలి వేల్పులనెల్లఁ | దఱిమి వేఁటాడిన తావకీన | |
| తే. | వీరభద్రావతార విహారలీలఁ | దలఁచినప్పుడె యాపదల్ తలఁగు నౌర భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 17 |
| సీ. | బాపని కొక స్వయంపాకాన కియలేక | చుట్టాలకును గూడు పెట్టలేక పిడికెఁడు బిచ్చ మెన్నఁడు నొసంగగ లేక | కడుపార నన్నంబు గుడువలేక పైమీఁద నొకగట్టిబట్ట గప్పఁగలేక | నదనునఁ గాసైన వదలలేక కడుగైనఁ దవుడైన విడిచివెట్టఁగలేక | మాడైన మక్కైన మానలేక | |
| తే. | ఖలుఁడు విత్తంబు గూర్చినఁ గట్టి కొట్టి | పట్టి పుథించి నృపు లరి బలిమిఁ గొంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 18 |
| సీ. | జారచోరులకు గంజాయికల్లులకును | దొత్తుల కగ్గికి దొమ్మరులకు కుంటెనకత్తెలకును వెలయాండ్రకు | నల్లమందునకు భూవల్లభునకు తప్పుదండుగలకు దబ్బరగాండ్లకు | నంజుటికిని గోడిపుంజులకును మందులవాండ్రకు మాలదాసర్లకు | నాటపాటలవాండ్ర కౌను గాని | |
| తే. | సుకవిజనదేవతాగృహసూరివరుల | జేరదింతయుఁ దులువ కూర్చిన ధనంబు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 19 |
| సీ. | విధవాకుచంబుల విధమున ససి చెడ్డ | పాడింట నిడిన దీపంబు కరణి, గాననాంతరమునఁ గాయు వెన్నెల రీతి | షండున కబ్బిన చాన పోల్కిఁ గ్రోఁతి చే నొదవిన కొబ్బరికాయ య- | ట్లంబుధిం బడిన తోయంబు మాడ్కి ముసిడిఁ బండిన ఫలమ్ముల చందమున దుష్ట- | ఫణిశిరంబున వెల్గు మణి విధమున | |
| తే. | ధరణిఁ బరమనికృష్టుని దండనున్న | ధనము వృథయగు నేరికిఁ బనికిరాక, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 20 |
| సీ. | వేదశాస్త్రపురాణవిద్య లక్కఱగావు | పరిహాసవిద్యలు పనికివచ్చు గద్యపద్యవిచిత్రకవితలు కొఱగావు | గొల్లసుద్దుల కతల్ పెల్లుమీఱు దేవతాభాషల తీరు లేమియుఁ గావు | పారసీకోక్తులు ప్రణుతి కెక్కు శైవవైష్ణవమతాచారంబు లొప్పవు | పాషండమతములు బాళి నలరు | |
| తే. | నౌర యిక్కలికాల మహత్త్వమెంతొ | వింతయై తోఁచుఁ గద ధరాభ్యంతరమున, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 21 |
| సీ. | కాపుకవీశ్వరుల్ కంచఱయోగులు | సాతానివైష్ణవుల్ సాలెభటులు కోమటిదాతలు కొంటెభాగోతులు | మాలవెజ్జులు బోయమావటీలు గొల్లపౌరాణికుల్ పల్లెదైవజ్ఞులు | బానిసవేశ్యలు జైనబాఁప లాడుదీర్పరు లుగ్రయవనధరాధీశ్వ- | రులు వైదికప్రధానులును మిగుల | |
| తే. | భూతలంబునఁ గలిదోషహేతుకమునఁ | బ్రబలురై రింకనేమి చెప్పంగవలయు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 22 |
| సీ. | బొగ్గులఁ దైలంబు బుట్టింపగా వచ్చు | ధట్టించి జలరాశి దాటవచ్చు జెలరేఁగి ఘనదవానలము మ్రింగఁగ వచ్చు | భుజగులఁ బేర్లుగాఁ బూనవచ్చు బెబ్బులి నఱచేతఁ బెనఁగి పట్టఁగ వచ్చు | దివిరి ఱాతిని నార దీయవచ్చు గొదమసింగమును నక్కునఁ జేర్పఁగా వచ్చు | గాలి పోగిడి మూట గట్టవచ్చు | |
| తే. | గాని తులువల డెందంబు గరగఁ జేయ | వశము గాదయ్య భువిని నెవ్వరికినైన, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 23 |
| సీ. | సల్లగా మాలదాసర సటారయగారి | తిర్నామములు సాన తేప వింటి గొల్లమారన బోయ దెల్లఁగా సతికితే | బొల్లేవు పోట్లాటలెల్ల యింటి జయన యెంకటబొట్లు సబ్బండుసారాలు | పూరాండములు సెప్పఁ గోరి యింటి సరవయ్య బయలీదు జమిలికతోఁ బాడు | నంకమ్మపాట లెన్నైన యింటి | |
| తే. | గాని సీ యెద్దుమాంసుల కయితకంబు | లందమనిపించు కాయల యందమండ్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 24 |
| సీ. | అబ్బబ్బ కిందటేఁ డప్పయ్య తీర్తాన | జోలెజంగము కిస్తి సోలెఁడుప్పు సాతాని జియరయ్య సతికితే పోయిస్తి | కొల్లఁగా గుల్లెఁడు సల్లబొట్టు లంక సత్తెలవాఁడు పొఁకాన పొగిడితే | మాలదాసరికిస్తి మానెఁడూద వేదాలు వాగితే యెల్లుబొట్టయ్యకు | కొలకుండ దోసెఁడు కొఱ్ఱలిస్తి | |
| తే. | నౌర తమకన్న కూసుగాఁ డవల నింకఁ | గలఁడె యను మూర్ఖుఁ డిద్ధరఁ గామవైరి! భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 25 |
| సీ. | ఆసనబేదంబు లనుకొంటి సేనియా- | డులు సాల రచ్చింపవలెనటంట కైసవరుఁడనంట నాసారపుసుకుఁడ- | నంట యేధాంతుండనంట పెద్ద- యెద్దు మారిసుఁడనంట సిద్దాంతుడనటంట | వాసి పేగుల నంటదోసినంట సోమాదిగులనంట సామిపాకాలంట | సంతుకు తంబులు సతుకుకుంట | |
| తే. | యెంటఁబట్టిరి యబ్బబ్బ యేమి సేతు | బాపనపిసాసు లనుచోట్ల బలుకఁ దరమె, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 26 |
| సీ. | మోట బొల్లెద్దుకు ముకుదాడు గట్టిన- | ట్టెద్దెరా మొగమెల్ల సుద్దపట్టె- లద్దించుకొని వచ్చి అయగారు యేంచేసె | తడియాకుఁ గావలె తయ్యడాడు బళ్ళంట ఆమీఁద పరపామదంట మం- | గలదాని బొందంట గనడమంట ముత్తి గలుగునంట ముద్రదానము గమ్మ- | టంట దాసరికొయ్య యెంటఁబట్టి | |
| తే. | పట్టిబుజములు గాలసబట్టెననెడు | చెనటుల తెఱంగు లేమని చెప్పనేర్తు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 27 |
| సీ. | బోలెఁడు గందంబు బొమలదాఁకా మెత్తి | మెంటెఁ డీబూడిద ఒంట బామి రుదురాకపేర్లు జన్నిదములు మోఁకాలి | లాపున దిగయేసి యావుపాస- నానికి నేతిదారైనను దెమ్మంట | దాఁ బల్కునెడ నమేద్యాలటంట పచ్చాలు మాలయ్యపచ్చాలుననుకొంట | సంకలో కబ్బాలు సప్పుకొంట | |
| తే. | సెడుగుబాపఁడు నాబంటుకొడు కబ్బబ్బ | యెంటఁబడె నను మూర్ఖుల నెన్నదరమె భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 28 |
| సీ. | బట్టయ్యగాళ్ళంట బబ్బాయువంటను | బొజ్జయుంబనుకొంట బోజనాలు గావలెనంట తేగాలు దెమ్మనుకొంట | సేరి బూసుండాలు సేసుకొంట యెల్లనికొడుకంట మల్లనికొడుకంట | పోయిన పెతరుల పొగుడుకొంట కలయిర్పులెట్టి తొందరగాఁగ దండకాల్ | సతకాలు సోకాలు సతుకుకొంట | |
| తే. | ఎంటఁ బట్టిరి గదరబ్బ యనెడు మూఢ | కష్టచిత్తుల కిఁక మఱెక్కడి యశంబు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 29 |
| సీ. | పాతపొత్తపుకట్ట సేత పట్టుకవచ్చి | దోసిబాపఁడనంట దోసిలొట్టి జలము సంద్రుఁడటంట సని సాలదనుకొంట | సెడుగు వాసారులు సెప్పుకుంట తిండికిఁ దెమ్మంట దేయిరింపుచు తూపె- | తూపెకు సేతులు సాపు గాని మఱఁదలెన్నఁడు పెదమనిసైనదంటేను | తప్పక మూత్రంబె సెప్పలేఁడు | |
| తే. | సీ యితనికంటె సాకలిసెల్లిగాఁడు | మేలనెడు మోటకొయ్యల నేల దెలుప, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 30 |
| సీ. | కరణాలటంటను కైలకట్టల యిప్పి | పాతికలంటను పరిగలంట కాన్లంట గీన్లంట కలయి లేనియి కొన్ని | సెల్లులు బాకీలు సెప్పుకొంట బిరబిర గంటాలు గిరగిర దిప్పుతా | నాకులన్నియు నెడ గోఁకుకుంట యెగరాసి దిగరాసి సగమేసి యెగదొబ్బి | కొంపలు పడదోసి సంపుతారు | |
| తే. | దయ్యమా కాయకసరైన దక్కనియ్య- | రేమి సేయుదు మను మోటులిలను గలరు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 31 |
| సీ. | యెద్దుమందను గూర్చి యెగసాయమిడితేను | తుది నది యధికారి దోసుకొనియె దాపుదప్పులకంట దర్మకర్చులకంట | కాసువీసము లాగె కరణపయ్య సల్లమ్మి పవకమ్మి సిల్లర దాసితే | కోమటి నాబంటుకొడుకు దొబ్బె కళ్ళము కంకులు గాలిఁ బట్టగఁ బోతె | బట్టుబాపనవోళ్ళు బతగనీయ- | |
| తే. | రహహ దందర మిటులయ్యె ననెడి మోటుఁ | బెద్దదొక్కుడుగాళ్ళఁ జెప్పెడిదిఁకేమి, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 32 |
| సీ. | కాకంబునకు రత్నఖచితపంజరమేల | పందికి ముత్యాలపందిరేల యీపిటీఁగకు మేటి తీపుఁదేనియ యేల | శ్వానంబునకుఁ బట్టుజాలరేల మహిషంబునకు మృగమదవిలేపనమేల | కోతికి బంగారుగొలుసులేల గర్దభంబునకు బంగారుపల్లంబేల | షండున కందమౌ జాణ యేల | |
| తే. | పరమలోభికి నృపసభాప్రథితమహిమ- | సుకవికృతభవ్యకావ్యవిస్ఫురణ యేల భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 33 |
| సీ. | పొడవైన కారెనుబోఁతుఁ గన్గొని తేంట్లు | మదగజేంద్రంబని పొదవునట్లు దళమైన యెండమావులు సూచి నీళ్ళని | చెలఁగి జింకలు దాడిసేయునట్లు వలయు దవాగ్నిధూమముఁ గాంచి మొగులని | చాతకంబులు డాయఁ జనినయట్లు బూరుగచెట్టుపైఁ బూవులుండుట చూచి | చిలుకలు ఫలముకై చేరినట్లు | |
| తే. | ధరణి నధముల దాంభికత్వములు చూచి | చేరి యాచింపఁ దలతురు సూరిజనులు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 34 |
| సీ. | ఇల జొన్నఁ బడు గ్రుడ్డియెద్దు చాడ్పున మృదు- | పదగతు లరయక పరుపుకొనుచుఁ బెనకున నోడిన పిఱికిబంటును బోలె | వడి లేక ప్రాసంబు విడిచివైచి సారెఁ గొక్కెర రీతి జడధుల నెరసుల | నెమకుచు మిగులభంగములఁ దోఁగి పెంటలపైఁ బొరల్వెట్టు రాసభమట్లు | పలుమఱు నపశబ్దమునె పలుకుచు | |
| తే. | తస్కరుని చందమునఁ బదార్థములు మ్రుచ్చి- | లించుచుఁ జరించు కుకవుల నెంచనేల? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 35 |
| సీ. | దేశాటనంబును దేవతోపాస్తియుఁ | బండితస్నేహంబు బహుపురాణ- శోధకత్వము పరిశుద్ధతయును మహా- | ప్రతిభయుఁ గల్పనాపాటవంబు ఛందోముఖాశేషశాస్త్రవేదిత్వంబు | సంగీతసాహిత్యసౌష్ఠవంబు నిఖిలకలానైపుణియు నహంకారరా- | హిత్యంబు జనహితకృత్యములును | |
| తే. | గలిగి కవిరాజ రాజశేఖరులు మెచ్చు | కబ్బములు గూర్చువాఁడె పో కవి యనంగ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 36 |
| సీ. | అలికులవేణి సింహకిశోరనిభమధ్య | పరిపక్వబింబోష్ఠి పద్మగంధి రాకేందువదన శరచ్చంద్రికాహాస | కోకిలకలవాణి కుందరదన పల్లవపాణి శంపాలతావిగ్రహ | లికుచవక్షోజ నాళీకనేత్ర ముకురకపోల చంపకపుష్పసమనాస | భుజగరోమావళి పులినజఘన | |
| తే. | యనఁగ నెన్నిక గన్న లేయన్నుమిన్న | దొరకి ఘను నిన్ను నుతిగొన్న పురుషుఁ డహహ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 37 |
| సీ. | పతిని దైవమ యంచు మతి నెంచి యరయుచుఁ | గలనైనఁ గ్రోధంబు నిలుపఁబోక యతిథులఁ జుట్టాల నతిభక్తిఁ జూచుచు | సత్యవాక్యనిరూఢి జరుపుచుండి యుభయవంశములకు నుపకీర్తి నించుచు | నిమ్ముగా నగు సుచిత్తమ్ము పూని యత్తమామల మాట కడుగు దాఁటగఁబోక | మాన మాభరణంబుగా నమర్చి | |
| తే. | మెలఁగుచుండెడి యిల్లాలు కలుగవలయు | మహితభాగ్యాన్వితుండైన మానవునకు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 38 |
| సీ. | తన యింటి యర్థంబుఁ దానె మ్రుచ్చిలుదాని | ననయంబుఁ గొరకొరలాడుదాని గయ్యంబునకు నెప్డు కాలు దువ్వెడిదాని | నెడపక యేవేళ నేడ్చుదాని పొరుగిండ్ల వెంబడిఁ దిరుగుచుండెడిదాని | ధట్టించి శిశువులఁ గొట్టుదాని పరహితశీలయై పరగుచుండెడిదాని | గయ్యాళియై పతిఁ గలఁచుదాని | |
| తే. | తవిలి పదుగురుబిడ్డల తల్లియైన | విడువవలెనండ్రు పెద్ద లిప్పుడమియందు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 39 |
| సీ. | జగడాలచీలి వేసాలవెల్లి బిసాళి | తిండిపోతు గయాళి మొండికట్టె హేయభాజనము పల్మాయలపుట్టిల్లు | కంతులరాకాసి పంతగత్తె యవలక్షణముల తా వవివేకములప్రోవు | చెరపనచేట మాసికలమూట నిక్కులబండి బందెలమారి కల్లల- | పాతర సోమరిపో తనంగ | |
| తే. | నెన్నఁబడు బేరజపురండ నేలుచుండు | పురుషుని యభాగ్య మేమని పొగడవచ్చు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 40 |
| సీ. | కిలకిల నగుచు ముద్దులు గుల్కు నొకవేళ | నొకవేళఁ గొరకొరలూని మెలఁగు మలితవిచారబాములఁ గుందు నొకవేళ | నొకవేళ దృఢపరుషోక్తులాడు రతికళాకౌశలోన్నతి సూపు నొకవేళ | నొకవేళ మొగమీక యూరకుండు లలిఁ బెక్కురీతుల లాలించు నొకవేళ | నొకవేళఁ బెనువంత నొందఁజేయు | |
| తే. | నౌర వింతలు భూమిపై నాఁడుదాని | మనసు దెలియంగరాదు పద్మజునికైన, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 41 |
| సీ. | ఒరుల భాగ్యము సూచి యోర్వఁజాలనివాడు | బుధజనద్వేషంబు పూనువాఁడు చెలిమిమైఁ దల్లిదండ్రులను బ్రోవనివాఁడు | పరకామినుల కాసపడెడివాఁడు శివవిష్ణుదూషణల్ సేయుచుండెడివాఁడు | పలుమఱు కొండెముల్ పలుకువాఁడు భూసుపర్వక్షేత్రములు మ్రింగఁజూచువాఁ | డాడినమాట లేదనెడువాఁడు | |
| తే. | ప్రోది చేసినవానితోఁ బోరువాఁడు | చేరు దుర్గతి నిహపరదూరుఁడగుచు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 42 |
| సీ. | బహుపుత్రసంప త్తిఁ బ్రబలుచుండెడివారు | నిక్షేపములు ధాత్రి నిలుపువారు క్షితి శివోద్వాహముల్ సేయుచుండెడివారు | కొంచక గుళ్ళు కట్టించువారు ఘనతటాకమ్ము లిమ్మొనరఁ ద్రవ్వెడివారు | విరివిగాఁ దోఁటలు వేయువారు కవిబుధోత్తములకుఁ గామితార్థములిచ్చి | యందంబుగాఁ గృతులందువారు | |
| తే. | సప్తసంతానకర్త లీ సదమలాత్ము | లెపుడు నిహపరసుఖముల నెనయుచుండ్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 43 |
| సీ. | వలవని చెలువతో మెలగువాఁ డొకకూళ | వాసిడించి చరించువాఁడు కూళ సిరి గల్గి కుడువక చిక్కువాఁ డొకకూళ | వనిత కుంకువ చెప్పువాఁడు కూళ చెడి బంధునింటికిఁ జేరువాఁ డొకకూళ | వసుధేశుఁ జెడనాడువాఁడు కూళ ధనికుతోఁ బగవెట్టుకొనెడువాఁ డొకకూళ | వడిలేని దొరఁ గొల్చువాఁడు కూళ | |
| తే. | కూడదన్నను గవితలఁ గూర్చి బలిమి | గుమతులకు నిచ్చువాఁ డొక్కకూళ సుమ్ము, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 44 |
| సీ. | ఆరకూటములోన నపరంజి యిడినట్లు | చెరువులోఁ బన్నీరు చిలికినట్లు చౌటినేలను మంచిసస్యం బిడినయట్లు | వెలిమిడిలో నెయ్యి వేల్చినట్లు షండున కందమౌ సకిని గూర్చినయట్లు | పేడలోఁ గస్తూరి పెట్టినట్లు పాడింటిలోన దీపంబు నిల్పినయట్లు | వార్ధిలోఁ గురిసిన వానయట్లు | |
| తే. | తొడరి సుజనులు ధరణిలో దుర్జనులకుఁ | జేయు నుపకృతి వ్యర్థమై చెడు గదయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 45 |
| సీ. | పరమలోభిని దివాకరతనూభవుఁ డంచు | ఛద్మచిత్తుని హరిశ్చంద్రుఁ డనుచు నిర్దయాత్ముని రామనృపశిఖామణి యంచుఁ | గడుకురూపిని రతికాంతుఁ డనుచు పాపకర్ము నభంగపాండవాగ్రజుఁ డంచు | సమరభీరుని సవ్యసాచి యనుచు కుండబీదను మరున్మండలేశ్వరుఁ డంచు | మతివిహీనుని భోగిపతి యటంచు | |
| తే. | కవులు కక్కూర్తి నిసుమంత కడుపు కొఱకు | పొగడుచుండుదు రవివేకబుధు లగుచు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 46 |
| సీ. | పూదోఁటఁ గారెనుబోతు దూఱినయట్లు | పైరులోఁ బెనుగాబు బలిసినట్లు గుడిమీద మఱ్ఱిమ్రాన్ గుదురు మీఱినయట్లు | చెదపుర్వునకు ఱెక్కలొదవినట్లు వెరవొప్పఁ జెఱకున వెన్ను పుట్టినయట్లు | తులసిలో గంజాయి మొలచినట్లు నట్టింట గడితంపుఁ బుట్ట పుట్టినయట్లు | గందమ్ములోఁ బేడ కలిసినట్లు | |
| తే. | వంగడంబున నొక క్రూరవర్తనుండు | పొడమి తత్ప్రాభవంబెల్ల నుడుగఁజేయు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 47 |
| సీ. | కాకిమూఁకలలోనఁ గోకిలం బున్నట్లు | కొంగలలో నంచ కూడినట్లు సైరిభబులలోన సామజంబున్నట్లు | నక్కలలో జింక చిక్కినట్లు ధుత్తూరములలోనఁ దులసిచెట్టున్నట్లు | ఱేఁచులలోఁ బులి రేఁచినట్లు గ్రద్దలలో విహంగప్రభుఁడున్నట్లు | ఖరములలో వాజి దొరలినట్లు | |
| తే. | ధరణిఁ బెక్కండ్రు నీచవర్తనులలోన | ఘనుఁ డొకఁడు చిక్కి యేమియుఁ గాక యుండు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 48 |
| సీ. | చక్కెరలోఁ బిప్పి సంగతంబైనట్లు | మొగిలిపువ్వున ముండ్లు మొలచినట్లు మాలి పంటికి జీడి మట్టు మీఱినయట్లు | కనకంబునకు గామ కలిగినట్లు గొనబుముత్తెమునకు గొగ్గి పుట్టినయట్లు | చందమామకుఁ గందు వొందినట్లు పాలలోఁ దోడుఁ బాల్ మేళనంబైనట్లు | గంగలోపల నాఁచు గలిగినట్లు | |
| తే. | ఘనున కొక నేరమించుక కలిగెనేని | గొఱఁతగాఁ జూచి యెగ్గెన్నుకొనరు బుధులు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 49 |
| సీ. | కొఱగాని పంచమకులునైన నడిగించుఁ | బరదేశములవెంటఁ దిరుగఁజేయుఁ గులములో వన్నె తక్కువయై మెలంగించు | మదిని హింసాంభోధిఁ గుదురుపఱచు సభ నాడుమాట హాస్యరసాస్పదము సేయు | తెలివి యొక్కపుడైనఁ గలుగనీదు తివిరి సాధులఁ బట్టి తెరవాట్లు కొట్టించు | గడలేని యిడుమలఁ గుడువఁజేయు | |
| తే. | ధరణిలోపల నకట పేదఱికమెంత | కాని దది వద్దు సుమ పగవానికైన, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 50 |
| సీ. | కులమున కెల్ల మిక్కిలితనం బొనఁగూడు | నాడినమాటయే పాడి యెసఁగు నిఖిలవిద్యాభ్యాసనిపుణత లభియించుఁ | జేసిన పనులెల్ల వాసికెక్కు మనుజేశ్వరాస్థానమాన్యత సమకూఱుఁ | గడలేని తేజంబు గలిగియుండు కవిబుధవందిమాగధుల చెల్మి ఘటించుఁ | బగరయైనను వెంటఁ బడి చరించు | |
| తే. | గలియుగంబున నబ్బబ్బ కలిమివంటి | మంచివస్తువు కలదె యోజించి చూడ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 51 |
| సీ. | బంధుజాతములోన బహుమాన మెడలించు | సభలలో మాటాడఁ జనవులేదు పరమైన విజ్ఞానసరత సిద్ధించదు | కుమతులు గెగ్గెర్లఁ గొట్టుచుంద్రు పరభూమి కేఁగినఁ బాటింపరెవ్వరుఁ | బ్రతిభావిశేషంబు పట్టువడదు ధారుణీపతు లొక్కదానమే నొసఁగరు | కులసతి యతనిఁ దక్కువగఁ జూచు | |
| తే. | నకట విద్యావిహీనత యంత కీడు | లేదు గద మర్త్యులకు ధాత్రిమీఁద నరయ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 52 |
| సీ. | కడుపార ఘృతమాంసఖండముల్ కడు మెక్కి | పుక్కిటఁ దమలంబు తుక్కు ద్రొక్కి లావగు గడితంపుఠీవి గన్గొని నిక్కి | విడువక గేస్తుల మెడలు నొక్కి కూర్చు రొక్కము చందుగులఁ గ్రిక్కిఱియఁ గ్రుక్కి | కసరుచు జనులపై విసము గ్రక్కి కవిబుధవరుల ఢాకలకు మూలలఁ జిక్కి | కక్కుచుఁ బల్లకీ కుక్కులెక్కి | |
| తే. | నిక్కి మిక్కుటమైన యాదొక్కి బొక్కి- | లో టక్కరి నృపాలకులకీ ర్తి దక్కునొక్కొ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 53 |
| సీ. | అనయమ్ము రాజ్యాంతమున నరకము ధ్రువ | మ్మని స్మృతుల్ వచియింప వినఁగలేదొ మును హరిశ్చంద్రాది మనుజేంద్రు లనఘులై | చనిరన్న సత్కథల్ వినఁగలేదొ దండధరుండు మీఁదట దురాత్ములఁ బట్టి | వెతఁ బెట్టునను మాట వినఁగలేదొ మహిలోన జాతస్య మరణం ధ్రువమ్మని | విబుధులు పలుకంగ వినఁగలేదొ | |
| తే. | కాని దుర్మతులయి ప్రజఁ గలంచి ధనముఁ | గూర్పఁజూతురు బేలలై కూళదొరలు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 54 |
| సీ. | మరుమరీచికలు తామరసపత్రాంతర- | సలిలబిందువులు చంచలలు హస్తి- కర్ణాంతములు దీపకళికాశిఖలు బుద్బు- | దములు మంగలి చేతిదర్పణములు మిణుఁగురుఁ బురువుల మెఱపు లభ్రచ్ఛాయ- | లైంద్రజాలికు నాట లంబురాశి- వీచులు చలదళవృక్షపలాశముల్ | తృణహుతాశనముల తెఱఁగు లిట్టి | |
| తే. | సిరులు నిలుకడలని నమ్మి చెనఁటు లురక | చెడుదు రెన్నడు ధర్మంబు సేయలేక, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 55 |
| సీ. | భోగియై ప్రతిదినత్యాగియై పుణ్యసం- | యోగియై సుజనానురాగి యగుచు దాతయై బుధజనత్రాతయై నిఖిలవి- | జ్ఞాతయై కుశలసంధాత యగుచు ధీరుఁడై రణరంగవీరుఁడై నిర్మలా- | చారుఁడై నిరుపమోదారుఁ డగుచు శాంతుఁడై సదమలస్వాంతుఁడై కీర్తిది- | గంతుఁడై పటుబలవంతుఁ డగుచు | |
| తే. | రాజ్యమేలంగఁ గలవాఁడె రాజు గాక | హీనమతియై చరించువాఁ డేటి రాజు? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 56 |
| సీ. | ఘూకంబు తెఱఁగున గొందుల నిరుకుచు | భుజగంబు చాడ్పున బుస్సుమనుచు బెబ్బులి కరణిఁ గంపిల డాక సేయుచు | భేకంబు గతి మేనిబెంపు గనుచు భల్లూకమట్లు చొప్పడ విఱ్ఱవీఁగుచు | నాఁబోతు కైవడి నాముకొనుచు గోమాయువట్ల యెన్నోమాయ లూనుచుఁ | గ్రోడంబువలెఁ గొరకొర నెగపుచు | |
| తే. | దనరు క్రూరనృపాలకాధముల నమ్మి | సిరుల కాసించువాఁ డొక్క చెనఁటికాఁడె భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 57 |
| సీ. | కోప మెక్కువ తాల్మి కొఱఁత కార్యము సున్న | నిలుకడ నాస్తి దుర్నీతి ఘనము కనికరం బిల్ల దుర్గర్వ మగ్గము సత్య- | కౌచముల్ కల్ల మచ్చరము హెచ్చు కాపట్య మురు వహంకారంబు గాటమ్ము | పొగరు దట్టము ద్రోహబుద్ధి దళము పరధనాపేక్ష నిబ్బరము లోభము పెల్లు | పరహితచింత నిప్పచ్చరమ్ము | |
| తే. | ధర్మమతి తొట్టు నీ యిట్టి దుర్మదాంధ- | నృపకులాధము లేరి కేమియ్యఁగలరు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 58 |
| సీ. | అందలంబెక్కుట యవనిఁ బ్రశస్తమా | మ్రానెక్కి నిక్కదే మర్కటంబు తొడవులు దొడుగుట దొడ్డసౌభాగ్యమా | కడుసొమ్ము లూనదే గంగిరెద్దు విత్తంబు గూర్చుట విమలబ్రచారమా | బహునిధుల్ గావఁడే భైరవుండు ప్రజల దండించుట పరమసంతోషమా | ప్రాణులనెల్ల నేపఁడే జముండు | |
| తే. | దొరతనంబున కివి గావు వరుస లరయ | సాహసౌదార్యఘనపౌరుషములు గాని, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 59 |
| సీ. | దానవైఖరిని రాధాతనూభవుఁ బోలి | చిరభోగమున శచీవరుని బోలి కారుణ్యమున రఘుక్ష్మావరేణ్యుని బోలి | సత్యంబునను హరిశ్చంద్రుఁ బోలి న్యాయమ్మునందుఁ గౌంతేయాగ్రజుని బోలి | సాహసంబున సవ్యసాచిఁ బోలి భూరివిద్యాప్రౌఢి భోజరాజును బోలి | హరిభక్తినియతిఁ బ్రహ్లాదుఁ బోలి | |
| తే. | సర్వసర్వంసహాభుజాధూర్వహుఁడు న- | భంగుఁ డగువాఁడెపో నృపపుంగవుండు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 60 |
| సీ. | న్యాయంబు దప్పక నరులఁ గాపాడుచు | వసుమతిఁ బాలించువాఁడె రాజు దుష్టశిక్ష మహాశిష్టరక్షణ కళా- | వైఖరిఁ జెన్నొందువాఁడె రాజు కవివందిమాగధగాయకార్థులకెల్ల | వాంఛితార్థము లిచ్చువాఁడె రాజు శరణని వేఁడిన శాత్రవజనునైన | వదలక చేపట్టువాఁడె రాజు | |
| తే. | కాక తన పొట్టకై ప్రజఁ గలఁచు దురిత- | రతుఁడు వాఁ డొక రాజా తరాజు గాక, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 61 |
| సీ. | మరుదనంగుడు శిబి మాంధాత భరతుండు | రంతిదేవుఁడు భగీరథుఁడు పృథుఁడు శశిబిందుఁడు గయుండు జామదగ్ని దిలీపుఁ | డంబరీషుండు యయాతి దాశ- రథి సుహోత్రుఁడు పురూరవుఁడు నాభాగుండు | కార్తవీర్యార్జునక్ష్మాపతియును దుష్యంతుఁ డతని పుత్రుడు నలుండును పురు- | కుత్సుండు మొదలైన కుతలపతులు | |
| తే. | ధర్మపద్ధతి నిల నేలి తారమైనఁ | గొనక చనుచెల్ల వినరేమొ క్రూరనృపులు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 62 |
| సీ. | మొదవుల బదివేలు కదుపులు గూర్చిన | దూడ యొక్కటియైనఁ దోడరాదు మాత లసంఖ్యముల్ మాటుగా నించినఁ | బసిఁడి వీసమును వెంబడిని రాదు కోకలు మేట్లుగా గొట్ల నిండించిన | గుడ్డ యొక్కటియైనఁ గూడరాము గొలుసులు రాసులు బలుపాతరల నిడ్డ | గింజ యొక్కటియన గెలన రాదు | |
| తే. | కావున నొడళ్ళు నిల్కడల్ కావటంచుఁ | జెలఁగి సుజనులు ధర్మంబు సేయుచుంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 63 |
| సీ. | కొండంత విత్తంబు గూడఁబెట్టిననైనఁ | బొదలు ధనాపేక్ష వదలిపోదు స్వర్గాధిపత్యంబు సంభవించిన యేని | బహురాజ్యకాంక్ష యెప్పటికిఁ జనదు పదివేలు పుత్రులఁ బడసినప్పటికిని | పుత్రోదయభ్రాంతి పోవదెపుడు చతురంగబలము లసంఖ్యముల్ గూర్చిన | సేనాభిలాష మింతైనఁ దీఱ- | |
| తే. | దహహ డెందంబులోపల నంతకంత | నధికమగు నాస యింత కేమి మనఁగవచ్చు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 64 |
| సీ. | నిరతాన్నదానవైఖరిఁ జెలంగెడివారు | నెనరొప్ప దీనుల మనుచువారు గోవిప్రబాంధవగురుభక్తి గలవారు | శివు విష్ణుఁ బూజలు సేయువారు పరధన పరవధూపరతఁ జెందనివారు | పరహితాచరణులై పరఁగువారు సుజ్ఞానసహితులై సొబగు మీఱెడివారు | సత్యవచోరూఢి సలుపువారు | |
| తే. | తలఁపులోపల ననయంబు ధర్మకార్య- | నిష్ఠ గలవార లందఱు నీకుఁ బ్రియులు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 65 |
| సీ. | న్యాయపద్ధతి భూషణము ధరాధిపునకుఁ | బొలఁతికి మానంబు భూషణంబు శమదమంబులు భూషణములు నిశ్చలునకుఁ | బొసఁగ నింటికి సతి భూషణంబు నరుని కల్మికి భూషణము దానవైఖరి | భూసురునకు విద్య భూషణంబు నలినబంధుఁడు భూషణము నభోవీధికిఁ | బుడమికి సస్యంబు భూషణంబు | |
| తే. | బుధుల కెప్పుడు నీ పదాంభోజయుగళ- | పూజనాసక్తి వెలలేని భూషణంబు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 66 |
| సీ. | అంభోధి కభిషేక మాచరించినయట్లు | గంగకుఁ బాద్య మొసంగినట్లు మేరువునకు నలంకారంబు లిడినట్టు- | లినునకు నారతు లెత్తినట్లు మలయాచలమునకుఁ గలప మిచ్చినయట్టు- | లిల వసంతునకుఁ బూలిడినయట్లు భూపముఖ్యునకుఁ దాంబూల మిచ్చినయట్లు | సోమున కద్దంబు సూపినట్లు | |
| తే. | నిఖిలలోకైకభర్తకు నీకు నొక్క | బిల్వదళ మార్యవర్యు లర్పించుచుంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 67 |
| సీ. | నడచిపోవఁగ జవం బడరకుండుటఁ జేసి | పుణ్యతీర్థము లాడఁ బోవరాదు కాసు వీసము చేతఁ గల్గకుండుటఁ జేసి | దానధర్మక్రియల్ తలఁపరాదు తనువున రుగ్బాధ తరలకుండుటఁ జేసి | స్నానజపాదులు సలుపరాదు గడితంపుటాఁకలి విడువకుండుటఁ జేసి | యుపవాసములు నిష్ఠ నుండరాదు | |
| తే. | కాని నిన్నొక్కమాఱైనఁ గడఁగి తలఁప- | రాదె యెన్నరు గాక దుర్మతులు మదిని, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 68 |
| సీ. | శతవత్సరంబులు జనులకుఁగా నాయు- | వంబుజాసనుఁడు మర్యాద చేసె- నందులో సగమేఁడు లరుగు నిద్రలచేత | శైశవక్రీడల జరుగుఁ గొన్ని తారుణ్యమున మహామారభూతము సోఁక | నంగనాసక్తిచే నరుగుఁ గొన్ని వార్ధకంబున బహువ్యాధిపీడలచేతఁ | గడమ యేఁడులు రిత్త గడచుచుండు | |
| తే. | కటకటా యెన్నఁడును దెల్వి గలిగి నిన్నుఁ | జేరి భజియింపకే ప్రాణి చెడు గదయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 69 |
| సీ. | ప్రకృతి గుణంబులఁ బాసి షడ్వర్గంబు- | నడఁచి జితేంద్రియులైన యంచి- తాష్టాంగయోగక్రియారూఢులై చరా- | చరరూపమగు ప్రపంచంబు మిథ్య యని తలంచుచు సమస్తాంతరస్థాయివై | నువ్వులలోపల నూనె వోలె బూసలలో దారమును బోలి యెడపక | నిండారి యుండెడు నిన్ను నెపుడు | |
| తే. | లోనిచూపునఁ దగఁ దమలోనఁ గాంచి | సోఽహమనువారె సంతతోత్సాహమతులు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 70 |
| సీ. | వాయుభక్షణ చేసి వనటఁ గుందదె పాము | గుహలలో దూఱదే గూబపులుఁగు వృక్షశాఖలమీఁద వ్రేలుచుండదె పక్షి | కానలఁ దిరుగదే వానరంబు చెలరేఁగి కూయదే ఝిల్లికాకూటంబు | గహ్వరి దిరుగదే గంగిరెద్దు నీట మునుంగదే మాటిమాటికిఁ గప్ప | యాకులు మెసవదే మేఁకపిల్ల | |
| తే. | యెన్ని తెఱఁగులఁ బొరలుచునున్న నిన్ను | లీలఁ గొలువని ఖలునకు లేదు ముక్తి, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 71 |
| సీ. | పరుసంబు వలన నబ్బురముగా లోహంబు | మేల్మిబంగారమై మెఱసినట్లు భ్రమరంబు వలన విభ్రమరూఢి యలరారి | శలభంబు భ్రమరమై చెలఁగినట్లు మలయభూజాతంబు వలన నింబము పటీ- | రావనీజాతమై యలరినట్లు కతకంబు వలన నుద్గాఢపంకోదకం- | బతినిర్మలోదకంబైనయట్లు | |
| తే. | సద్గురుకృపాకటాక్షవీక్షణము వలన | బ్రాకృతుఁడు జ్ఞానియై ముక్తిపదము గాంచు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 72 |
| సీ. | మణిభూషణములు చామరములు ముత్యాల | గొడుగులు పడిగలు గుజ్జుపరపు మిద్దెటిళ్ళు మెఱుంగుటద్దముల్ గద్దియల్ | చందుగల్ చందువాల్ మందసములు పూలపాన్పులు శీరతాళవృంతము మేల్ | కలపముల్ తూగుటుయ్యెలలు పసిఁడి- పల్లకీలు గుఱాలు బంట్లు బానిసలును | ధనధాన్య వసన గో దంతి తతులు | |
| తే. | కులుకుప్రాయంపు ముద్దుగుమ్మలును గలిగి | పొలుచువారలె మును నిన్నుఁ గొలుచువారు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 73 |
| సీ. | దానహీనుండైన మానవాధము కల్మి | తెరలెడు జుంటీఁగ తేనెచుట్టు చుట్టాల నతిథులఁ జొరనీని ఖలునిల్లు | పెనుబాము వసియించు పెద్దపుట్ట సభలఁ బ్రసంగింపఁజాలని జనుని ప్ర- | హృష్టసాహితి సానక్రింది వన్నె పతివాంఛ దీర్పని పడఁతి చక్కదనంబు | కాననాంతరచంద్రికాప్రసక్తి | |
| తే. | చిత్త మిగురొత్త నినుఁ బూజ సేయలేని | నరుని జన్మము మహిషజన్మము గదయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 74 |
| సీ. | కుంభికుంభస్థలాక్షుద్రామిషము మెక్కు | సింగంబు కప్పల మ్రింగఁ జనునె సారభూరుహఫలాహారలీలఁ జెలంగు | కీర ముమ్మెతలఁ జేరుకొనునె యభ్రాపగాహాటకాబ్జమృణాళముల్ | కొను నంచ బురదవాగులకుఁ జనునె ప్రబలవర్షాంబుధారలు గ్రోలు వానకో - | యిల యిల మంచుసోనలకుఁ జనునె | |
| తే. | ప్రభుభుజానీతభూరివైభవనిమగ్న- | విద్వదవతంస మల్పుల వేడఁ జనునె? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 75 |
| సీ. | అడిగినప్పుడ తన యొడలి చర్మం బూడ్చి | కర్ణుఁ డీయండె యాఖండలునకు నుడివినప్పుడ యొప్పి పుడమి మూఁడడుగులు | వైరోచనుం డీఁడె వామనునకు శరణన్న యప్పుడు పరఁగ గువ్వను బ్రోచి | శిబి మేని పొలసీఁడె శ్యేనమునకు ప్రార్థించినప్పుడే బ్రాహ్మణుఁ గాచి ఖే- | చరుఁడు ప్రాణములీఁడె సురవిరోధి- | |
| తే. | కరయ వితరణశూరులైనట్టి ఘనులు | కొంచకేమైన ఘనుల కర్పించుచుంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 76 |
| సీ. | పురుషోత్తమము భద్రగిరి యహోబలము శ్రీ- | శైలంబు వేంకటాచలము కాంచి సింహాచలంబును శ్రీరంగమును ప్రయా- | గంబు కేదారంబు కాళహస్తి కుంభకోణంబు శ్రీకూర్మంబు కాశి సు- | బ్రహ్మణ్యమును చిదంబర మయోధ్య భీమేశ్వరంబును రామేశ్వరంబును | గోకర్ణమును హిమక్షోణిధరము | |
| తే. | మొదలుగాఁ గల పుణ్యభూములకుఁ జనఁగ | వలవ దరలేక నినుఁ గొల్చు నలఘుమతికి, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 77 |
| సీ. | లవణాబ్ధి లంఘించు పవనాత్మజున కొక్క | తోటకాలువ పూని దాటుటెంత జగమెల్ల ముంచు వర్షము నించు కాలాంబు- | ధరమున కొకపాదు దడుపుటెంత బహులోకవాంఛితఫలదమౌ సురశాఖి | కొక యణూపమఫలం బొసగుటెంత చెడుగు రక్కసిమూఁకఁ జెండు చక్రమునకుఁ | బుడమి నొక్కరుని జంపుట యదెంత | |
| తే. | సకలబ్రహ్మాండభాండరక్షణకలాభి- | రామునకు నీకు ననుఁ బ్రోచుటేమి వింత? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 78 |
| సీ. | నదులలో జాహ్నవి నరులలో విప్రుండు | గ్రహములలోనఁ బంకజహితుండు తృణములలో దర్భ మృగముల సింగంబు | వ్రతముల ద్వాదశి లతల జాజి దానమ్ములం దన్నదానమ్ము లోహజా- | తమ్ములలోనఁ గార్తస్వరంబు గిరులలో మేరువు పురములలో కాశి | తరువుల రావి సంతతులఁ గృతియు | |
| తే. | నెట్లు పూజ్యములయ్యె నట్లెల్లవేల్పు- | గములయందును నీవె కా ఘనుఁడ వరయ, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 79 |
| సీ. | నటుని పోల్కి ననేకనామరూపవిభేద- | ములు పూని శుభలీలఁ జెలఁగువాని తవిలి పూసలలోని దారంబు కైవడి | జగదంతరాత్మయై నెగడువాని నైంద్రజాలికు రీతి నఖిలంబు నుద్భవ- | స్థితిలయంబుల నొందఁజేయువాని విపులాంబువులఁ బ్రతిబింబితుండౌ హేళి | వలె సర్వసాక్షియై వెలుఁగువాని | |
| తే. | నిన్ను సేవింతు భావింతు సన్నుతింతుఁ | బ్రేమ యేపార సాక్షాత్కరింపుమయ్య, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 80 |
| సీ. | సాలెపుర్వునకుఁ కుంజరమున కహికిని | ముక్తి యొసంగిన భక్తసులభ! జముని దక్షుని పరాశరతనూజుని గర్వ- | దూరులఁ జేసిన భూరిశౌర్య! హరి విరించన పురందరుల కఖండవై- | భవము లొసంగిన భువనజనక! నంది భృంగీశ బాణ దశాననుల మహా- | ప్రమథులఁ జేసిన విమలచరిత! | |
| తే. | నీ మహత్త్వంబు పూని వర్ణింపఁ దరమె | వాణికి వేయిమోములవానికైన, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 81 |
| సీ. | ఆరకూటమ్ము బంగారమై యొప్పునే | తగర ముజ్జ్వలకలధౌత మగునె గాజుపూస యనర్ఘగారుత్మత మ్మౌనె | జిల్లేడు దేవతాక్షితిజ మగునె కాసరం బతిదర్పకంఠీరవ మ్మౌనె | కాకంబు వరమానసౌక మగునె మతకరి జోరీఁగ మదపుటేనుఁగ యౌనె | ఘనబిడాలము చిత్రకాయ మగునె | |
| తే. | రాజగునె జాగ్రదుడు దురాగ్రహముచేతఁ | బ్రజల బాధించు ఘోరదర్పధ్వజుండు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 82 |
| సీ. | జింక బొడ్డునఁ దావి జిల్లు కస్తురివోలె | జంబాలమున నీరజంబు వోలె మొరవ మంచిహొరంగుమెఱుఁగువజ్రమువలెఁ | గప్పచిప్పను మౌక్తికంబు వోలె సరసోత్కరమునందు విరిదేనియలు వోలె | నెండుగడ్డిని గృశానుండు వోలె వనబిడాలమునందుఁ గన జవాదిని బోలెఁ | బ్రకటింపఁ గృమియందుఁ బట్టువోలె | |
| తే. | జగతిలోపలఁ గారణజన్ము లొక్క | కానియెడఁ బుట్టియుఁ బ్రసిద్ధిఁ గాంచుచుంద్రు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 83 |
| సీ. | సిరికిఁ దోఁబుట్టువౌ జ్యేష్ఠామహాదేవి | దీనత నింటింటఁ దిరుగఁజాగె హరికిఁ గూరిమిపట్టి యగు మకరాంకుండు | మెయిలేక సోకుఁడై మెలఁగుచుండె మృడునకు గాదిలికొడుకైన వెనకయ్య | యిప్పటికిని బెండ్లి యెఱుఁగఁడయ్యె నలినాసనునకు మానసపుత్రుఁడైన ద- | క్షుం డుక్కు సెడి తలకొట్లఁ బడియె | |
| తే. | నిలను దుష్కర్మసహితుల కెట్టి గట్టి | బంధుజనులున్నఁ గీడు వాపంగ లేరు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 84 |
| సీ. | గజముపై మహిషంబు కాలు ద్రవ్వెడునట్లు | కొండతోఁ దగరు డీకొనినయట్లు కార్చిచ్చుపైఁ బతంగము తారసిలునట్లు | మృగరాజుపై నక్క మొగియునట్లు బెబ్బులితో జింక పెనఁగఁబోయినయట్లు | పెనుబాముపైఁ గప్ప చనినయట్లు పిల్లితో నెలుక దర్పించి దార్కొనునట్లు | తోడేలితో మేఁక దొడరునట్లు | |
| తే. | క్రూరు లొక కొంద రసమానవైర మూని | పోరుచుందురు ఘనులతో బుద్ధిమాలి భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 85 |
| సీ. | పొద్దుపొద్దుకు వచ్చి పోలిబొట్లయ్య దా | పంచాగమిప్పి ఒప్పన్న సేసి సాతి బూదారంబు సాతి నచ్చత్తరా | మసిలేటి కారితే యల్లకలికి గాందారిపొద్దున గాని వర్చీర్జాలు | రావు మీఁదాతులా రాశి నీకు సూరీడు సందుడు సుకురుండు నని బుర- | స్సపతి పద్దనకొంట సాగినారు | |
| తే. | మంచిదని సెప్పి సూకలు మానెఁ డన్ని | కొల్లఁగొనిపోయె నని మూర్ఖకోటి పలుకు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 86 |
| సీ. | నింబభూజమునకు నిర్మలోదక మిడి | మనిచినఁ దన చేఁదు మానఁగలదె పాపకూనకు మంచిపాల్పోసి పెంచిన | నెడరూను తన విషం బుడుగఁగలదె ఉల్లిగడ్డకుఁ దుషారోదకంబిడి ప్రోది | యిడినను దన కంపు విడువఁగలదె కందదుంపకుఁ బానకము పోసి పెంచిన | గొదలేని తన దూల వదలఁగలదె | |
| తే. | దుర్గుణున కెన్ని మంచి వస్తువులు పెట్టి | మనుపఁ జూచిన తన యోజ మానఁగలఁడె, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 87 |
| సీ. | ఎనుబోతునకు విద్దె లెన్నింటి నేర్పిన | మడుగున కేగుటల్ మానఁగలదె శునకంబునకు నెన్ని సూడిదల్ వెట్టినఁ | బుల్లెలు నాకక మళ్ళఁగలదె గాడిద కెన్ని సింగారముల్ దిద్దిన | బూడ్దెలోఁ బొరలక పోవఁగలదె యూరబందికి నెన్ని తీరుల మేపినఁ | బరగళ్ళ కేగక బ్రదుకఁగలదె | |
| తే. | హీనుఁడగువాని సత్ప్రభు లెన్నిగతుల | నునిచి మనిచినఁ జెడుజాడ లుడుగఁగలఁడె, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 88 |
| సీ. | నోరు చేఁదై కూడుగూరలు చవి దప్పు | గడగడ నొడలెల్ల వడకుచుండు జెవుడున నేమియుఁ జెవులకు వినరాదు | తెగులును జింతయుఁ దగులుకొనుచు కన్నులఁ బొర గప్పి కానరాదెద్దియు | సిగ్గొకించుకయైనఁ జేరఁబోదు బాలు రందఱుఁ గూడి గేలి గావింతురు | మగువలు పకపక నగుచునుంద్రు | |
| తే. | మదిఁ దలంపగఁ గటకటా ముదిమియంత | రోఁత లేదు గదా ధారుణీతలమున, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 89 |
| సీ. | బావిలోపలఁ బడ్డ పామును వెడలింపఁ | జనువానిఁ గరువక చనఁగఁగలదె చిచ్చులోఁ బడెడు వృశ్చికమును వెడలింపఁ | జనువాని మీటక నడలఁగలదె పెనువెల్లిఁ బడి పోవు బెబ్బులిఁ బరికింపఁ | జనువాని మ్రింగక మనుపఁగలదె బురదగోఁతను బడ్డ పోట్లావు లెగనెత్తఁ | జనువాని బొడువక జరగఁగలదె | |
| తే. | అవనిలోపల ఖలుని నెయ్యంబు మీఱ | మనుపఁ జనువానిఁ జెఱుపక మానఁగలఁడె? భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 90 |
| సీ. | ఘనగహనాంతరోద్గతతృణానీకంబు | ధేనువునందుఁ బాలైనయట్లు వితతదుర్వర్ణరూపితలోహపిండంబు | రసమునఁ బసిడియై యొసఁగినట్లు సాంద్రాభ్రవారివృషత్కదంబము శుక్తి- | యందు ముక్తామణియైనయట్లు భూరికుల్యాతకవారి రసాలమూ- | లమునఁ బానకమై చెలంగినట్లు | |
| తే. | కరిహయాందోళికారత్నకాంచనాదు- | లగుచు నిజవక్త్రమున నిడ్డ హార్యమొప్పు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 91 |
| సీ. | అన్నంబు నాలుక కరుచియై కన్పట్టు | నిలిచినచో నిల్వ నలవికాదు మనుజేంద్రుతోనైన మాటాడ సైపదు | పనులయందేమియు మనసు లేదు నడుచుచో నడుగులు తడబాటు గైకొనుఁ | దగఁ బందువులనైన నగవు రాదు తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించుఁ | గలనైన నిద్దుర గలుగఁబోదు | |
| తే. | శివశివా ధాత్రిఁ దా వలచిన వధూటిఁ | బాయు వెత వద్దు సుమ్మెట్టి పలువకైన, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 92 |
| సంపూర్ణము. | ||