| శతకములు | శ్రీ కాళహస్తీశ్వర శతకము |
|
| శా. |
అంతా సంశయమే శరీర ఘటనంబంతా విచారంబె లో నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే యంతానాంత శరీరశోషణమె దుర్వ్యాపారమే దేహికిన్ జింతన్నిన్నుఁ దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా! |
61 |
| శా. |
సంతోషించితిఁ జాలుఁజాలు రతి రాజద్వార సౌఖ్యంబులన్ శాంతిం బొందితిఁ జాలుఁజాలు బహురాజద్వార సౌఖ్యంబులన్ శాంతిం బొందెదఁ జూపు బ్రహ్మపద రాజద్వార సౌఖ్యంబు ని శ్చింత న్శాంతుఁడనౌదు నీ కరుణచే శ్రీకాళహస్తీశ్వరా! |
62 |
| శా. |
స్తోత్రంబన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ బుత్త్రీపుత్త్ర కళత్రరక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్ బాత్రంబంచు భజింపఁబోదు రిదియున్భావ్యంబె యెవ్వారి చా రిత్రంబెన్నఁడు మెచ్చనెంత మదిలో శ్రీకాళహస్తీశ్వరా! |
63 |
| మ. |
అకలంకస్థితి నిల్పి నాదమను ఘంటారావమున్ బిందు దీ పకళా శ్రేణి వివేక సాధనములొప్పన్బూని యానందతా రక దుర్గాటవిలో మనోమృగము గర్వస్ఫూర్తి వారించు వా రికిఁగా వీడు భవోగ్రబంధలతికల్ శ్రీకాళహస్తీశ్వరా! |
64 |
| మ. |
ఒకయర్థంబును నిన్ను నే నడుగఁగా నూహింప నెట్లైన బొ మ్ము కవిత్వంబులు నాకు జెందవని యేమోయంటివా నాదు జి హ్వకు నైసర్గిక కృత్యమింతయు సుమీ ప్రార్థించుటే కాదు కో రికల న్నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా! |
65 |
| మ. |
శుకముల్కింశుకపుష్పము ల్గని ఫలస్తోమంబటంచు న్సము త్సుకతం జేరఁగఁబోవ నచ్చట మహాదుఃఖంబు సిద్ధించుఁ గ ర్మకళాభాషలకెల్లఁ బ్రాపులగు శాస్త్రంబుల్విలోకించు వా రికి నిత్యత్వమనీష దూరమగునో శ్రీకాళహస్తీశ్వరా! |
66 |
| మ. |
ఒకరింజంపి పదస్థులై బ్రదుకఁ దామొక్కొక్కరూహింతురే లొకొ తామెన్నఁడు జావరో? తమకుఁ బోవో సంపదల్? పుత్త్రమి త్రకళత్రాదులతోడ నిత్యసుఖమందంగందురో? యున్నవా రికి లేదో మృతి యెన్నఁడుం గటకటా! శ్రీకాళహస్తీశ్వరా! |
67 |
| శా. |
నీ కారుణ్యముఁ గల్గినట్టి నరుఁడే నీచాలయంబుం జొరం డే కార్పణ్యపు మాటలాడనరుగం డెవ్వారితో వేషముల్ గైకోఁ డేమతముల్భజింపఁడిల నే కష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోఁడు జీవనదశన్ శ్రీకాళహస్తీశ్వరా! |
68 |
| శా. |
జ్ఞాతుల్ద్రోహులు! వాండ్రు సేయు కపటేర్ష్యాది క్రియాదోషముల్ మా తండ్రాన సహింపరాదు ప్రతికర్మంబించుకేఁ జేయగాఁ బోతే దోషముగాన మాని యతినై పోఁగోరినన్ సర్వదా చేతఃక్రోధము మానదెట్లు నడుతున్ శ్రీకాళహస్తీశ్వరా! |
69 |
| మ. |
చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్ వదరన్ సంశయ భీకరాటవులఁ ద్రోవల్దప్పి వర్తింపఁగా మదనక్రోధకిరాతులందుఁ గని భీమప్రౌఢిచేఁ దాఁకినం చెదరుంజిత్తము చిత్తగింపఁగదవే శ్రీకాళహస్తీశ్వరా! |
70 |