| శతకములు | చిరవిభవశతకము | కూచిమంచి తిమ్మకవి |
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
| చిరవిభవశతకము - కూచిమంచి తిమ్మకవి | ||
| చ. | సిరిమగఁడున్ బితామహుఁడుఁ జేరి భజింపఁగ వెండికొండపై సరస నవేందుకాంతమణిసౌధమునందుఁ బసిండిగద్దెపై గిరిసుతఁ గూడి వేడుకలఁ గేరెడు నిన్ను మదిన్ దలంచెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 1 |
| చ. | కరులు హరుల్ చమూవరులు గాటపు మేల్నగరుల్ కడానిబం- గరులు సరుల్ తలోదరులు గంధమిళన్మృగనాభిచందనా- గరులు విరుల్ జగాసిరులు గల్గి సుఖింత్రు త్వదీయులౌ నరుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 2 |
| చ. | పరమకృపార్ణవా! తుహినపర్వతరాజకుమారికాధవా! వరవృషసైంధవా! కుటిలవైరినిశాటసమిద్ధవా! మనో- హరకరసారసాగ్రనిహితాజిగతానతబాంధవా! శివా! చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 3 |
| చ. | నిరుపమ కూచిమంచికులనీరధిచంద్రుడు గంగమంత్రికిన్ బరమపతివ్రతామణియు భాగ్యసమన్వితయైన లక్ష్మికిన్ వరసుతుఁడై న తిమ్మకవివర్యుఁడ నే శతకం బొనర్చెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 4 |
| చ. | శరనిధి కర్ఘ్యమిచ్చు క్రియ సారసబంధున కారతిచ్చు వై- ఖరి నిఖిలాబ్జజాండచయకర్తకు నీకు సమగ్రభక్తి శ్రీ- కరముగఁ గోరి యొక్కశతకంబు సమర్పణ సేయఁబూనితిన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 |
| చ. | మరలని భక్తితోడ మును మల్హణబిల్హణముఖ్యసత్కవీ- శ్వరులు కవిత్వవైఖరిని సారెకు నిన్ బ్రణుతించి ధన్యులై బరగిరటంచు నేను నినుఁ బద్యముఖంబుగ సంస్మరించెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 6 |
| చ. | హరిముఖసర్వదిక్పరివృతార్చితపాదసరోజుఁడైన య- క్కరిముఖుఁ డెప్పుడున్ వితతకౌతుకలీలఁ బొసంగఁజేయుఁబో నిరతముగాఁ ద్వదీయపదనీరజభక్తు లొనర్చు సత్కృతుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 7 |
| చ. | శరశరదిందుకుందహరిచందనహారతుషారతారకా- దరఘనసారవర్ణ వరదండశుకాంబుజపాణి వాణి యా- దరమునఁ బ్రోచుచోఁ గవికదంబము నిన్బ్రణుతించు ధన్యమై చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 8 |
| చ. | తరలని భక్తి నా హృదయతామరసంబున సంస్మరింతు దు- ర్భరదురితాంధకారవిసరప్రసరన్నళినీసుహృల్లస- త్కిరణములైన దెందులురి దివ్యకులోద్భవు లింగనార్యు స- ద్గురుచరణంబు లుగ్రభవతోయధిసంతరణంబు లెప్పుడున్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 9 |
| చ. | గురుతరలీలఁ బీఠపురి కుక్కుటలింగమహాప్రభుండవై బరగెడు నిన్ను నేనిపుడు భక్తి దలర్పఁగ నాశ్రయింతు నీ వరకరుణానిరీక్షణము వాలెము నాపయి నిల్పి ప్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 10 |
| చ. | నరవతి కొక్కకావ్యమిడినన్ ధనధాన్యమణీచోళముల్ పురములు వాహనంబులు విభూషణగోవసుధాదికంబులుం గురుకృపనిచ్చి బ్రోచు నిదిగో మరి నీవిఁక నేమియిచ్చెదో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 11 |
| చ. | హర పరమేశ శంకర పురాంతక భర్గ గిరీశ చంద్రశే- ఖర మృడ కృత్తివాస శితికంధర శర్వ నగేంద్రజామనో- హర శివ మృత్యుసంహర యటంచు నిను న్స్మరియింతు నెప్పుడున్, చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 12 |
| చ. | కరయుగళంబు మోడ్చి కుతుకంబున మ్రొక్కెద సర్వదేవతా- పరివృఢమౌళిభాగ్మకుటపంకజరాగమణిప్రభాచ్ఛటా- నిరతవిరాజమానరమణీయభవచ్చరణాగ్రపీఠికిం జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 13 |
| చ. | తరమె నుతింప నేరికిని దావక దివ్యపదప్రభావమున్ గరికిని సాలెపుర్వునకు గాడుపుదిండికి మోక్షమిచ్చి యా- దరమున నేలుకొంటివట దాన వరేణ్యులఁ బ్రోచుటబ్రమా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 14 |
| చ. | తరలని భక్తి నెల్లపుడు ధ్యానము సేతు తుషారధారుణీ- ధరవరకన్యకావిలసితస్తనకుంభవిలిప్తకుంకుమా- గరుఘనసారచందనసుగంధవిభాస్వదురఃస్థలు న్నినున్ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 15 |
| చ. | శరధిశయాంబకాయ రవిచంద్రకృపీటభవాంబకాయ గో- పరివృఢకేతనాయ సితపర్వతకూటనికేతనాయ సు- స్థిరకరుణామతే భగవతే శివ తే నమ యంచు మొక్కెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 16 |
| చ. | సరసీరుహాక్ష పద్మభవ శక్ర కృశానుకృతాంత యామినీ- చర వరుణానిలైలబిల చంద్రకిరీట సుధామయూఖ భా- స్కరముఖదేవతాప్రముఖసర్వము నీవె యటంచు వేఁడెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 17 |
| చ. | శిరములు వేయిగల్గు నహిశేఖరుఁడైన చతుర్ముఖంబులన్ బరగు విధాతయైన సులభంబుగ నొక్కిసుమంతయైన నీ చరితము లెన్నఁజాలరట శక్తులమే మముబోంట్ల మెన్నఁగాఁ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 18 |
| చ. | వరుణభవాత్రిగౌతములు వ్యాసవసిష్ఠఘటోద్భవుల్ పరా- శరసుతకణ్వకౌశికులు జహ్నుశమీకముఖాఖిలర్షిశే- ఖరులు నుతింపఁజూలరటకా నిను మాదృశు లెన్ననేర్తురే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 19 |
| చ. | హరిణము ఢక్క శూలము గజాజిన మెక్కువకన్ను పాపరా- సరములు బూదిపూత వినుజక్కర లేనెలపున్క లెద్దు దా నిరుమెయి కప్పు కుత్తుకయు నెమ్మిగఁ గల్గు నిను న్భజించెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 20 |
| చ. | ధరణి రథంబుగా శృతివితానము వాజులుగా రమామనో- హరుఁడు శరంబుగా మరుదహార్యము సింగిణిగా బిలేశయే- శ్వరుఁడు గుణంబుగా నలువ సారథిగాఁ దిగప్రోళ్లఁ గూల్చితౌ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 21 |
| చ. | హరి మిము వేయుపద్మముల నర్చన చేసిన సర్వలోకభీ- కరఖరదైత్యసంహరణకారణమై కనుపట్టు చుట్టువా- లరుదుగ నిచ్చిమెచ్చి భువనైకధురంధరుఁ జేసి యేలితో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 22 |
| చ. | తరణిసుతోగ్రపాశవితతవ్యథ గాసిలి స్వేతుఁ డర్థి నిన్ స్మరణము నొంద నజ్జము వెసం బడదన్ని ధరామరోత్తమున్ గరమనురక్తిఁ బ్రోవవె జగంబున శాశ్వతజీవిఁ జేసి మేల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 23 |
| చ. | అరుదుగ నింద్రకీలగిరి నర్జునుఁ డుగ్రతపం బొనర్చుచో నరిగి కిరాతరూపమునఁ జక్కఁగ నిల్చి కరంబు వానితో దురమొనరించి మెచ్చి కృపతోడుతఁ బాశుపతాస్త్రమీయవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 24 |
| చ. | సురలును దైత్యులుం గదసి స్రుక్కక వార్ధి మధింపుచున్నచో నురుగతినందు హాలహల ముద్భవమై జగముల్ హరింప న- గ్గరళము కంఠసీమనిడి కావవె లోకములెల్ల నాఁదటన్ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 25 |
| చ. | కిరికలహంసరూపములఁ గృష్ణుఁడు నంబురుహాసనుండు నీ చరణములున్ శిరంబు గనఁ జాగి రసాతలము న్నభంబు వే- సరి వెదుకంగ వారికిఁ బ్రసన్నతనొందవె లింగమూర్తివై చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 26 |
| చ. | శరధిశయానుఁడైన హరి సారసబంధుకులంబునందు దా- శరథి యనం జనించి బహుసంఖ్యలు మీఱిన లింగమూర్తులన్ సరవిఁ బ్రతిష్ఠఁ జేసెనఁట శక్యమె నీ యధికత్వమెన్నఁగాఁ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 27 |
| చ. | గరువముతోడ నిన్ను వెలిగా నిడి దక్షుఁడు జన్న మొక్కెడన్ హరిహయపుండరీకనయనాబ్జభవాదులఁ గూర్చి చేయుచో నరుదుగ వీరభద్రభయదాకృతిఁ గైకొని సంహరింపవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 28 |
| చ. | కరమరుదార నల్వఁ దనకన్న ఘనుండగు వేల్పు లేఁడటం- చురుగతి దేవతాసభ దురూక్తులు బల్కఁగ నల్గి వాని దు- ర్భరతరగర్వభారమును బల్వడిఁ ద్రుంపవె భైరవాకృతిన్ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 29 |
| చ. | అరయ మృకండుసూనుఁడు నిరంతరమృత్యుభయాకులార్తుఁడై వెఱవు దలిర్ప నిన్ శరణు వేడిన మిత్తి నడంచి యమ్మునీ- శ్వరసుతుఁ బ్రోచినాఁడవట శాశ్వతజీవునిఁ జేసి వాసిగాఁ జిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 30 |
| చ. | ముఱియుచుఁ గాశికాపురిని మూఢత బాహువులెత్తి ధారుణీ- ధరములకన్న నెవ్వఁడును దైవము లేడని పల్కు నప్పరా- శరసుతు బాహుయుగ్మకము స్తంభనమొందఁగఁ జేసి కుంచవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 31 |
| చ. | అరయ నశేషలోకముల కాఢ్యుఁడ వీవె నిజంబు బాలిశు- ల్మెఱమెఱగాఁ దలంత్రు కడిమిం బహిరంతరలోకరక్షకై గరళము కంఠమూలమున గట్టిగ నిల్పు టెఱుంగరేమొకో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 32 |
| చ. | హరి నరసింహరూపధరుఁడై సమరాగ్రమహోగ్రభంగి న- బ్బురమొదవన్ హిరణ్యకశిపు న్బరిమార్చి చెలంగుచున్నచో సరగఁ దదుగ్రతం శరభసాళువదేహుఁడవై యడంపవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 33 |
| చ. | సరసవిహారలీల విటజంగమరూపముతోడ నేగి య- బ్బురముగ మున్ను భల్లణుని పత్నిని చల్లమదేవిఁ గోరి యా గురుకుచ కౌఁగిట న్నిలవె గోమెలయ న్నెలనాళ్లపట్టివై చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 34 |
| చ. | ఇరవుగ దారుకావనమునీంద్రవధూతిలకంబుల న్మనో- హరవటుకాకృతిం బొలిచి యబ్జశరాహవలీలలం గడున్ గరచిన నీ విలాసరతికౌశలముల్ గణుతింప శక్యమే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 35 |
| చ. | సరభసలీల మున్ముసలిజంగమువై చిరితొండనంబి మం- దిరమున కేఁగి తత్తనయునిం బొలకై వధియింపఁజేసి చె- చ్చెర నిజమూర్తి చూపి కృప చిప్పిల వానిఁ గృతార్థుఁ జేయవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 36 |
| చ. | దొరకొని చెప్పుగాల తలఁ ద్రొక్కి యొకించుక నంజు డెంగిటన్ బొరసిన దప్పనంబొసఁగి పుక్కిటనీ ర్మెయిఁ జిల్కు బోయకున్ సరగున మోక్షమిచ్చితఁట సజ్జనకోటుల కిచ్చు టబ్రమే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 37 |
| చ. | ఇరుసతలోకము ల్మహిమ నేలెడు స్వామివి నిన్ను వాకిటన్ దరలకయుండ గాపునిచి ధన్యతఁ జెందిన బాణదైత్యుఁ డే కరణిని నిన్ను మున్నెరవు గ్రాలఁగఁ బూజ యొనర్చెనో కదా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 38 |
| చ. | మెరమెర లేక నీవు మును మేదరిసెట్టియు బోయలెంకయున్ బెరసుకులంపు చాకలియు బెట్టిన యోగిర మారగించితౌ సరిసరి నిన్ను నర్చనలు సల్పెడుచో నియమంబులేలయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 39 |
| చ. | పురుడె గణింప భక్తసులభుండవు నీకు నిలింపులెల్ల కి- న్నరనరుఁ డెట్టు లర్చన లొనర్చెనొ కాని కడుం గడిందిగా సెరబడి చేసి వానికి విచిత్రధనాధిపతిత్వమివ్వవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 40 |
| చ. | గరళము కంఠమూలమున గట్టిగ దాల్చుట నీకు నంగదల్ బరగునటంచు రుద్రపశుపత్యభిధానుఁ డెదం గలంగఁగా నొరిమెర నంగపీఠమున నుంచవె యాతని శాశ్వతంబుగాఁ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 41 |
| చ. | విరసముతోడ నిన్ శిలల వ్రేసియు రోకటఁ గ్రుమ్మియున్ గృహాం- తరమునఁ గాపువెట్టియును సిద్ధముగా వెలివెట్టు కుంటిన- ల్దిరగఁగఁ జేసినట్టి ఘనులే తగుభక్తవరేణ్యులైరి మేల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 42 |
| చ. | సురపతి వేణువుం గలిమికొమ్మమగండు మృదంగవాద్య మం- బురుహభవుండు తాళమును పొత్తముముత్తవ వీణఁ బూనఁగా హరిసతి బాడినం జదల నద్భుతతాండవకేళి సల్పితౌ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 43 |
| చ. | ఉరగము లెమ్ములుం బునుక లుగ్రపిశాచములుం గళాసముల్ గరళము కంఠమూలమున గట్టిగ నెప్పుడు గల్గియుండియున్ బరమశివాకృతిం బొలుచు భద్రములిచ్చెద వబ్బురం బహా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 44 |
| చ. | ఇరవుగ నెల్లలోకముల నేలెడు స్వామివి నీవు కూర్మితో దొరతనమెల్లఁ బో కడచి తుచ్ఛపుజాలరిపూపకన్నియన్ శిరమునఁ బెట్టుకొంటివఁట చిత్రములౌర భవద్విలాసముల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 45 |
| చ. | హరుఁడు మురారి యబ్జభవుఁ డాఢ్యులటంచు పురందరుండు దే- వర యనుచు న్విభావసుఁడు వహ్నియు వేల్పులటంచు నెంత్రు బు- ద్ధిరహితమానవు ల్పశుపతిత్వము నీయెడఁ గల్గుటెన్నకే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 46 |
| చ. | సరవి విధాతరూపమున సర్వచరాచరముల్ సృజించి శ్రీ- హరివయి బ్రోదిచేసి నిటలాక్షుఁడవై యడఁగింపుచుందు వ- బ్బురముగ నీవెకా జననపోషణనాశనకర్త వారయన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 47 |
| చ. | శరనిధికన్యనాగ హిమశైలతనూజయనంగ వాణినాఁ బరగు వధూట్లఁ గూడి భవపాలననాశము లోలిఁ జేయుచున్ హరిహరధాతృమూర్తి వగు నాఢ్యు నినుం గనుగొందు నీశ్వరా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 48 |
| చ. | పురుషులలోన విప్రుఁడును పుష్పకదంబములోన జాజియున్ దరువులలోన రావియును దానచయంబుల నన్నదానమున్ ధరణిఁ బ్రశస్తిఁ గన్న ప్రియదైవములం దధికుండ వీవయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 54 |
| చ. | పరుసము సోకి లోహము శుభస్థితి బంగరమైన రీతి స- ద్గురుకరుణానిరీక్షణ మకుంఠితలీల నొకింత సోకినన్ నరుఁడు మహాత్ముఁడై బుధజనస్తుతుఁడై నినుఁ జెందుఁబో తుదిన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 55 |
| చ. | అరయఁగ నీరబుద్బుదములట్ల నశించుచునుండు మేనులున్ శరధితరంగమాలికల చందమునం గనుపట్టు ఠీవులు స్థిరమని నమ్మి నిన్గొలువనేరక రిత్త నశింతురౌ ఖలుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 56 |
| చ. | పొరిఁబొరిఁ బుణ్యభూములకు బోవఁగనేలఁ గడు న్దపోమహా- ధ్వరము లొనర్చనేల యుపవాసములన్ గృశియింపనేటికిన్ హరహర యంచు నొక్కతరి నాడినఁజాలు నఘప్రశాంతికై చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 57 |
| చ. | తరణిసుధామయూఖవసుధాయజమానసమీరణానలాం- బరజలమూర్తివైన నిను భక్తిఁ దలంచినవారి కెందులన్ దిరుగఁగనేల యే శిలల నిచ్చలుఁ గోరి భజింపనేలయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 58 |
| చ. | సరవి చతుశ్రుతు ల్నిఖిలశాస్త్రపురాణకథారహస్యముల్ విరివిగ నిచ్చనిచ్చలును విందుముగాని తలంచిచూడ మా గురుచరణంబులాన నినుఁ గొల్వక యేరికి ముక్తి లేదయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 59 |
| చ. | గరుడముఁ గన్న పన్నగనికాయములట్ల మృగేంద్రుఁ గన్న కుం- జరములకైవడిన్ దురితసంఘములెల్లఁ దొలంగి పారుచో నరుఁడొకచో ననాస్థనయినం భవదాహ్వయ ముచ్చరించినన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 60 |
| చ. | ధరణిసురు న్వధించిన మదంబున గోనిధనంబొనర్చినం గురుసతిఁ గూడినన్ మధువుఁ గ్రోలిన హేమము మ్రుచ్చలించినన్ దొరకొను పాతకంబు లొకతూరి శివా యనినన్ దొలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 61 |
| చ. | గురుహరిణేక్షణామణినిఁ గూడిన దుష్కలుషాత్ముఁ జంద్రునిన్ శిరమునఁ బెట్టుకొంటివఁట చెప్పఁగ నబ్రమయారె మేలుమే- ల్గురుతరభక్తితోడ నినుఁ గొల్చినవారి కిఁకేటిపాపముల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 62 |
| చ. | దురితము లేమిసేయు గ్రహదోషపిశాచరుజామృగోరగో- త్కరభయమేల కల్గు నృపతస్కరవహ్నిభయంబులే ప్రియం బెరయు నరుం డొకప్డు నినుఁ బేర్కొని నెమ్మది సంస్మరించినన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 63 |
| చ. | అరదము లందలంబులు హయంబులు రత్నవిభూషణంబు లం- బరములు చామరంబులు ద్విపంబులు నాదిగఁ గల్గు ఠీవులు- న్బొరసెడువారు మిమ్ము మునుఁ బూజయొనర్చినవారె కారయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 64 |
| చ. | వెరవిరవార నేపగిది వేఁడినఁ గానియు నియ్యలేని ము- ష్కరనరనాయకాధముల సావడులం బడి ప్రేలువారికిన్ నిరతకృపార్ద్రదృష్టిమెయి నీవిడ కన్యుఁ డొసంగఁజాలునే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 65 |
| చ. | సరయువు గృష్ణ నర్మదయు జాహ్నవి బాహుద తుంగభద్ర భా- స్కరసుతయు న్సరస్వతియు గౌతమియుం మొదలైన దివ్యని- ర్ఝరులను మున్గు పుణ్య మొకసారె శివా యనినన్ లభించుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 66 |
| చ. | ధర శ్రుతిమంత్రకోటికిఁ ప్రధానము నాగమమాతయైన య- గ్గురుతరమంత్రరాజమునకుం బతి వీవని లోగణింపకే వెకవరి కొల్తురౌ ఖలులు వెంగళులై కుఱకుఱ్ఱవేల్పులన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 67 |
| చ. | హరువులు దీర్ప నీవు హృదయంబున నెప్పుడు గల్గియుండఁగా వెరవరి యందు నందులకు వేరడులై చనుచుంద్రు పామరుల్ నెరయఁగ వెన్న చేతినిడి నేతికి ద్రిమ్మరు కైవడిం గటా! చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 68 |
| చ. | ఉరగము గాలిఁ గ్రోలి గుహనుండదె యాకులు నించుకోనల- న్దిరుగదె మేఁక నీళ్ల వెనుదీయకఁ గృంకదె కప్ప యెవ్వరే- కరణిఁ జరించుచున్న నినుఁ గన్గొనకున్నఁ బరంబు లేదుగా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 69 |
| చ. | హరహర! మేరుభూధరమునంత పదార్థము సంగ్రహించిన- న్సురనగరాభిపత్యము త్రిశుద్ధిగ నబ్బిన రంభయంత సుం- దరి నిజభార్యయైన మది దార్కొను తృష్ణ యడంగదేరికిన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 70 |
| చ. | బురుదను హాళితో నురెడిపుర్వు మెలంగుచునుండి యెప్పుడు- న్బురుద యొకింతయైనఁ దనుఁ బొందకయుండ మెలంగునట్లు నే- ర్పరి గృహమేధియయ్యు భవబంధమునంటక నిన్నుఁ జెందుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 71 |
| చ. | ఒరుల భజింపఁబోడుగద యొక్కపుడు న్నినుఁగొల్చు మేటి భా- స్వరసరసామ్రభూరుహలసత్కిసలానుభవానుమోదియౌ పరభృతరాజమెందు నొకపట్టున వేములఁ జేరనేర్చునే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 72 |
| చ. | సరవిని జీవనార్థముగ చర్మసితాభసితాక్షమాల లే నరుడు ధరించు కైతవమునన్ భువినాతఁ డశేషధారుణీ- భరణధురీణప్రచురభాగ్యసమన్వితుఁడై చెలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 73 |
| చ. | సురచిరభక్తితోడ మనుజుం డొక బిల్వదళం బొకప్డు నీ శిరమున నుంచెనేని యది సింధురసైంధవచామరధ్వజాం- బరమణిభూషణాది విభవస్ఫురణ న్గనుపట్టి యుండుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 74 |
| చ. | నరుఁ డొకనాఁడు నీ నగరు నంగనఁ బట్టి విచిత్రఘంటికో- త్కరరవమాలకించిన నతండు వినం డెపుడున్ కృతాంతకా- సరగళఘంటికావ్రజవిశంకటసాంద్రఘణంఘణధ్వనుల్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 75 |
| చ. | దురదుర జాగి మర్త్యుఁ డొకతూరె సమంచిత తావకీన మం- దిరమునకుం బ్రదక్షిణ మతిప్రమదంబునఁ జేసెనేని య- ప్పురుషుఁడు శేషభూభువనపోషణధూర్వహుడై విరాజిలున్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 76 |
| చ. | తిరమున నీ నివేశమున దీప మొకానొకనాఁ డొకింత బం- ధురమతి నిడ్డ ధన్యుఁడు చతుర్ముఖముఖ్యనిలింపమాన్యుఁడై నిరుపమ తావకీన పద నిత్యసుఖోన్నతుల చెలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 77 |
| చ. | కరతలతాళవృంతములుఁ గ్రమ్మఁగ నెవ్వఁడు తావకాలయా- జిరమున నాఁడు నాతఁడు వసించు విరాజితరాజతావనీ- ధరశిఖరాగ్రరత్నసముదంచితకాంచనసౌధవీధులన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 78 |
| చ. | పరిచితి మీఱ మీ శిరముపై పురిసెండు జలంబొకప్పుఁ డా- దరమునఁ జిల్కు బల్లిదుఁడు తథ్యముగా నఖిలాఘదూరుఁడై ధరఁ గల పుణ్యతీర్థములఁ దప్పకఁ గ్రుంకు ఫలంబుఁ జేకొనున్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 79 |
| చ. | బెరసిన వేడ్క యుల్లమునఁ బిక్కటిల న్మనుజుండు నీకుఁ గొ- వ్విరిసరమొక్క టచ్చపువివేకముతోడ నొసంగిన న్బురం- దరధరణీరుహప్రసవదామవిభూషితుఁడై చెలంగుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 80 |
| చ. | కరయుగమెత్తి నీకుఁ గుతుకంబున మొక్కునతండు శేషభూ- వరమకుటాగ్రరత్నసమవాయసమగ్రవిభాసముల్లస- చ్చరణసరోజుఁడై వివిధసంపదలం గొదలేక యుండుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 81 |
| చ. | తొరలెడు భక్తిఁ గప్పురపు ధూపము నీకు జనుం డొసంగుచో గొరగొర వానిమేనఁ గల ఘోరతరాఘపిశాచసంఘముల్ బరువడి కూయి వెట్టుచును బారి చనుంగద తత్క్షణంబునన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 82 |
| చ. | పరునిఁ బరేశు భక్తజనపాలనశీలు ననంతు నాద్యు న- క్షరు నపవర్గదాయకు జగన్మయు నద్వయు నప్రమేయు నం- బురుహభవాండభాండపరిపూర్ణపిచండుఁ దలంతు నిన్మదిన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 83 |
| చ. | హరునకు వందనంబు ఫణిహారునకు న్శరణ్యార్థి దేవతా- వరదునకుం జొహారు పురవైరికి మ్రొక్కు నగేంద్రజామనో- హరునకు జోత యంచు ననయంబును నీకు నమస్కరించెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 84 |
| చ. | దిరమున స్నానసంధ్యలును దేవ సపర్యలు సువ్రతంబులు- న్గురుభజనాదికంబులు నకుంఠితభక్తి నొనర్పనేర నీ చరణము లాశ్రయించితి నిజంబుగ నన్నిక నెట్లు బ్రోచెదో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 85 |
| చ. | గురుఁడవు బాంధవుండవు సఖుండవు తల్లివి దండ్రి వన్న వీ- శ్వరుఁడవు దాత వాప్తుఁడవు సర్వము నీవె యటంచు నమ్మితి- న్వరదుఁడవై కృపారసము వావిరి నాపయిఁ జిల్కి బ్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 86 |
| చ. | కెరలెడు ఘోరపాపతతికి న్మదిఁ గంపిలి యేయుపాయమున్ దొరకక యొక్క పెన్వెరవు దోచిన నుబ్బుచు నిబ్బరంబుగా హరహర యంచుఁ బల్కితి నహా! దురితంబులు వీడి పారెఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 87 |
| చ. | దొరకెను నాకు భాగ్యమున దుస్సహదండధరప్రచండకిం- కరపటుదర్పసంహరణకారణమై యయిదక్షరంబులు- న్బరగిన మంత్రరాజము సుపర్వులకైనఁ దలంక నేనిఁకన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 88 |
| చ. | గిరిశ నమోస్తు యోగిజనగేయ నమోస్తు మహోగ్రదోషసం- హరణ నమోస్తు భోగికులహార నమోస్తు సమస్తదేవతా- చరణ నమోస్తు తే యనుచు సారెకుఁ గోరి నమస్కరించెదన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 89 |
| చ. | వరద పరాకు భక్తజనవంద్య పరాకు సమస్తపాపసం- హరణ పరాకు భక్తనివహావహదక్ష పరాకు యోగిహృ- శ్చరణ పరాకు సేయకిఁక సయ్యన నా మనవాలకించవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 90 |
| చ. | పరవనితా పరాస్థ నరపాలకసేవలయందుఁ గోరికల్ దొరలఁగనీక నీ చరణతోయజభక్తియు సూనృతోక్తి యె- వ్వరికినిఁ గీడు సేయమియు వాలెము నా కొనఁగూర్చి బ్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 91 |
| చ. | మురిపెముతోడ నక్షుసరము ల్భసితంబు ధరించినాఁడ మ- ద్గురువరదత్తమై సకలదోషములన్ దొలఁగించు ద్వాదశా- క్షరి జపియించినాఁడ కలుషంబులు నాకిఁకఁ గల్గుటెట్లయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 92 |
| చ. | మురువుగ నక్షమాలయును మోదికఁ బూనితి భూతి దాల్చితిన్ స్మరణగ నైదువర్ణముల మంత్రము వేమరు నుచ్చరించితిన్ దురితపిశాచముల్ దొరగి దూరముగా జనకుండుటెట్లికన్ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 93 |
| చ. | గురువరభక్తి మీఱ మిముఁ గొల్చినవాఁడనటంచుఁ దద్దయుం గరువముతోడ నేను కృతకర్మము లెవ్వియుఁ జేయనైతి దు- ర్భరదురితాత్ముఁడంచును దిరస్కృతిఁ జేయక నన్నుఁ బ్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 94 |
| చ. | ఒరిమెఁ గవీంద్రుఁ డేమెఱుఁగునో యని దర్శనమియ్యనోడి బ- ల్దొరలును మూలనీగుదురు లోభమున న్నిను నే మఱేమియు- న్వరములు వేడ నాకిపుడు వైళము దర్శనమియ్యరాగదే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 95 |
| చ. | నర పశు పక్ష్మి వేఁట మృగ నాగ ఝషాదిక జంతుయోనుల- న్బొరిఁబొరి నెన్నిమార్లు మును పుట్టితినో యెఱుఁగ న్మహాఘనుల్ హరు నినుఁ గొల్చు భాగ్య మిపుఁ డబ్బెనికే క్రియఁ బ్రోచెదో సుమీ చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 96 |
| చ. | ఒరుల నుతింపఁజాలఁ గలుషౌఘమహాదహనాగ్నికీలయై బరగుచుఁ గామితార్థము లపారముగా నిడు నీదు నామసం- స్మరణ యహర్నిశంబును బ్రశస్తిగ నాకొనరించి బ్రోవవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 97 |
| చ. | కరిముఖ నందిభృంగిరిటికాశిసముద్భవ కాలభైరవా- ద్యురు బలవన్మహాప్రమథయోధవరేణ్యులు గొల్వ ధారుణీ- ధరసుతఁ గూడి నాకిపుడు తావక మోహనమూర్తిఁ జూపవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 98 |
| చ. | సరభసలీల నొక్కనిమిషంబును నిన్భజియింపలేక బల్ దెరవుల దుర్విచారములఁ ద్రిమ్మరుచున్నది యెన్ని చెప్పిన- న్మరలదు పాపజాతిమతి నాకిపు డంకెము గాదికెట్లయా చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 99 |
| చ. | అరయఁగ నే నహర్నిశము నాఁడెడు వాక్యములెల్లఁ దావక స్ఫురణగఁ జిత్తగించి కలుషప్రకరంబులఁ బారఁదోలి నీ చరణసరోజభక్తి కొనసాగఁగఁజేపీ సముద్ధరింపవే చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 100 |
| చ. | ఇరవగు భక్తితోడ జనుఁ డీశతకంబుఁ బఠించిన న్సమా- దరమున వ్రాసిన న్వినినఁ దప్పవుగా వివిధేష్టభోగముల్ ధర భుజియించి యా తుదిని తావక దివ్యపదంబుఁ జేరుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 101 |
| సంపూర్ణము. | ||