| శతకములు | భర్గశతకము | కూచిమంచి తిమ్మకవి |
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
పీఠిక - కె. గోపాలకృష్ణరావు
(అధిక్షేపశతకములు - ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, 1982)
| భర్గశతకము - కూచిమంచి తిమ్మకవి | ||
| శా. | శ్రీకైలాస మహామహీధర శిరఃశృంగాటకాంచన్మణి- ప్రాకారాంతర చంద్రకాంత రజతప్రాసాదశుద్ధాంత సిం- హాకారోన్నతహేమపీఠమునఁ గొల్వైయుండు నిన్నెన్నెదన్ రాకాచంద్రనిభప్రభాకలిత! భర్గా! పార్వతీవల్లభా! | 1 |
| మ. | క్షితినంభోనిధి కర్ఘ్యమిచ్చు క్రియ భక్తిన్బద్మినీభర్త కా- రతి యర్పించు తెఱంగున న్బహుతరబ్రహ్మాండసంత్రాతకున్ శతకంబొక్కటి గూర్చి నీ కొసగెద న్సంరూఢిఁ గైకొమ్ము నా కృతి సంస్తుత్యలసద్గుణాభరణ! భర్గా! పార్వతీవల్లభా! | 2 |
| మ. | శుక శాండిల్య మృకండుజాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ- నక వాల్మీకి వసిష్ఠ గర్గ భృగు మాండవ్యాజసంభూత కౌ- శిక కణ్వాది మహర్షిశేఖరులు నిన్ జింతింపఁగా లేరు, కొం- కక నేనెంతటివాఁడ నిన్బొగడ భర్గా! పార్వతీవల్లభా! | 3 |
| మ. | వరకౌండిన్యసగోత్రపాత్రుని యశోవర్ధిష్ణునిం గుక్కుటే- శ్వరకారుణ్యకటాక్షలబ్ధ కవితాసామ్రాజ్యధౌరేయునిన్ స్థిరపుణ్యుండగు గంగమంత్రిసుతునిన్ దిమ్మప్రధానేంద్రునిన్ గరుణన్బ్రోవుము కూచిమంచికులు భర్గా! పార్వతీవల్లభా! | 4 |
| మ. | ప్రచురత్వంబుగ నెంతు నాత్మనెపుడు న్బ్రత్యూహసంశాంతికై విచలత్కర్ణసమీరదూరిత మహావిఘ్నంబుభృజ్జాలునిన్ రుచిరాస్వాంబురుహస్రవన్మదజలప్రోత్సాహ లీలాముహుః ప్రచురద్భృంగకులున్ గణాధిపుని భర్గా! పార్వతీవల్లభా! | 5 |
| శా. | వేమాఱున్ భవదీయ పావనకళావిఖ్యాతకావ్యక్రియా- సామీచీన్య హృదంతరాళకవిరాట్సంక్రదనశ్రేణికిన్ సామర్థ్యం బొనగూర్చి మంచినుడువుల్ సంప్రీతి నొందించు వా- గ్భామారత్నము లీలమై నిలిచి భర్గా! పార్వతీవల్లభా! | 6 |
| మ. | చిరభక్తిన్మదిలో భవద్వ్రతముగాఁ జింతింతు నశ్రాంతమున్ బరవాది ప్రమథద్విపేంద్రపదవీపంచాననశ్రేష్ఠు బం- ధురతేజోనిధి దెందులూరికులపాథోరాశిరాకానిశా- కరునిన్ లింగయసద్గురూత్తముని భర్గా! పార్వతీవల్లభా! | 7 |
| మ. | పులితోల్ముమ్మొనవాలు పాఁపతొడవుల్ భూత్యంతరాగంబు పు- న్కలపేర్లెక్కువకన్ను నీలగళమున్ గంగావతంసంబు క్రొ- న్నెలపూ వద్రిసుతాసమన్వయము విన్కీల్గంటు లేజింకయున్ గల నీ మూర్తిఁ దలంతు నెప్పుడును భర్గా! పార్వతీవల్లభా! | 8 |
| మ. | హర! మృత్యుంజయ! చంద్రశేఖర! విరూపాక్షా! మహాదేవ! శం- కర! భూతేశ! మహేశ! రుద్ర! మృడ! గంగాజూట! గౌరీమనో- హర! సర్వజ్ఞ! బిలేశయాభరణ! శర్వా! నీలకంఠా! శివా! కరిచర్మాంబర! యంచు నెంతు నిను భర్గా! పార్వతీవల్లభా! | 9 |
| మ. | జగదీశాయ నమోస్తు తే భగవతే చంద్రావతంసాయ ప- న్నగహారాయ శివాయ లోకగురవే నానామరుద్రూపిణే నిగమాంతప్రతిపాదితాయ విలసన్నిర్వాణనాథాయ ధీ- రగుణాఢ్యాయ యటంచు మ్రొక్కిడుదు భర్గా! పార్వతీవల్లభా! | 10 |
| మ. | వ్రతముల్ దేవగురుద్విజార్యపదసేవల్ వైశ్వదేవాది స- త్క్ర తుహోమాదులు దానధర్మములు వైరాగ్యప్రచారంబు లా- శ్రితరక్షావిధు లించుకే నెఱుఁగ నీ చిత్తంబు నా భాగ్య మే- గతి రక్షించెదొ కాని నన్నిఁకను భర్గా! పార్వతీవల్లభా! | 11 |
| మ. | మరుదర్కేందుకృశానుయజ్వ గగనాంభకుంభినీమూర్తి నం- బరకేశున్ శరణాగతార్తిహరణు న్బాలేందుచూడామణిన్ ధరణీభృత్తనయాస్తనద్వయమిళిత్కస్తూరికాపంకసం- కరదోరంతరు నిన్ భజించెదను భర్గా! పార్వతీవల్లభా! | 12 |
| మ. | మిహిరప్రోద్భవఘోరకింకరసమున్మేషోరగశ్రేణికా విహగోత్తంస మశేషదోషపటలీవేదండకంఠీరవం బహితక్రూరగణాటవీహుతవహంబైనట్టి పంచాక్షరం బహహా! కల్గెను నాకు భాగ్యమున భర్గా! పార్వతీవల్లభా! | 13 |
| మ. | నృపసేవా పరకామినీ పరధన ప్రేమాతిరేకంబు లొ- క్కపుడుం గూర్పక తావకీన పదపద్మారాధనేచ్ఛారతుల్ కృప దైవాఱ నొసంగి భక్తవరుగా నేప్రొద్దు నన్బ్రోవుమీ కపటారాతినిశాటసంహరణ! భర్గా! పార్వతీవల్లభా! | 14 |
| మ. | అభవున్ శాశ్వతు నాద్యు నక్షయుని నవ్యక్తుం బరేశు న్మహా- ప్రభు నాద్యంతవిహీను భూతమయు సర్వజ్ఞున్ గుణాతీతుఁ బ- ద్మభవాండోదరు నాత్మరూపభవు నద్వంద్వుం జిదానందునిన్ రభసంబొప్పఁ దలంతు నిన్నె్పుడు భర్గా! పార్వతీవల్లభా! | 15 |
| మ. | తనర న్నిన్మదినెంతు నెప్పుడును నా దైవంబుగా దాతఁగా జనకుంగాఁ జెలికానిగా గురువుఁగా సద్బంధుగా నన్నఁగా ఘననిక్షేపముగా మహాప్రభునిగాఁ గల్యాణసంధాయిగా గనకోర్వీధరకార్ముకోల్లాసిత భర్గా! పార్వతీవల్లభా! | 16 |
| మ. | ప్రతివారంబు శివోహమస్మి యనుచు న్భావింతు గంగాధర- స్తుతులెల్లప్పుడుఁ జేతు శంకరకథల్ సొంపార నాలింతు నా- యుతబుద్ధిన్ జగమెల్ల నీశ్వరమయం బంచు న్విచారింతు నే- గతి రక్షించెదొ కాని నీవు నను భర్గా! పార్వతీవల్లభా! | 17 |
| మ. | పురుహుతాగ్నిపరేతరాట్పలభుగంభోదీశవాతార్థపాం బరకేశాబ్జభవాచ్యుతాదిక మహాబర్హిర్ముఖానేకభా- స్వరకార్తస్వరవిస్ఫురన్మకుట శశ్వత్పద్మరాగప్రభో- త్కరనీరాజిత పాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా! | 18 |
| శా. | వ్యాకీర్ణాచ్ఛజటాటవీతటనితాంతాలంబితోద్యత్తమి- స్రాకాంతప్రథితప్రభాసముదయాశ్రాంతప్రఫుల్లన్మహా- నాకద్వీపవతీవినిర్మిలజలాంతర్భాగభాగ్దివ్యరే- ఖాకాంతోత్పలకైరవప్రకర! భర్గా! పార్వతీవల్లభా! | 19 |
| మ. | సతతానందితసర్గ! సర్వసుమనస్సంస్తుత్యసన్మార్గ! యూ- ర్జితకారుణ్యనిసర్గ! రాజతధరిత్రీభృన్మహాదుర్గ! హృ- త్కుతుకాలింగితదుర్గ! సంహృతసమిద్ఘోరద్విషద్వర్గ! సం- యతనీరంధ్రసుఖాపవర్గ! జయ! భర్గా! పార్వతీవల్లభా! | 20 |
| మ. | పురరక్షఃపటుతూల హవ్యవహ! విస్ఫూర్జద్రురుక్రూరగో- పరిపంథిక్షణదాచరోరగ మహాపక్షీంద్ర! ఘోరాంధకా- సురగంధద్విరదేంద్ర పంచముఖ! యక్షుద్రప్రభావోల్లస- త్కరిలేఖద్విషదభ్ర గంధవహ! భర్గా! పార్వతీవల్లభా! | 21 |
| మ. | అమరాహార్యము విల్లుగా ఫణికులాధ్యక్షుండు తన్మౌర్విగాఁ గమలాధీశుఁడు తూపుగా, నిగమముల్ గంధర్వముల్ గాఁగ స- ర్వమహీచక్రముఁ దేరుఁజేసి విధి సారథ్యంబు మీఱం బరా- క్రమలీలన్ దిగప్రోళ్ళఁ గూల్చితివి భర్గా! పార్వతీవల్లభా! | 22 |
| శా. | కోటీరాంగదమేఖలాఘనతులాకోటీ కవాటీనట- ద్ఘోటీ హాటకపేటికాభటవధూకోటీ నటాందోళికా- వీటీ నాటకచేటికాంబరతతుల్ వే చేకుఱు న్నిన్నిరా- ఘాటప్రౌఢి భజించు ధన్యులకు భర్గా! పార్వతీవల్లభా! | 23 |
| శా. | కంఠేకాలుఁడటంచు నిన్నెపుడు లోకవ్రాత మగ్గింప వై- కుంఠేంద్రాంబుజసంభవప్రముఖులం గోలాహలప్రక్రియం గుంఠీభూతులఁ జేయు దుర్భయదకాకోలంబు హేలాగతిన్ గంఠాగ్రంబునఁ బూనినాఁడవట! భర్గా! పార్వతీవల్లభా! | 24 |
| మ. | నిను డెందంబునఁ జీరికిం గొనక వాణీనాథజంభద్విష- ద్దనుజారిప్రముఖాఖిలామరతతిన్ దట్టంబుగాఁ గూర్చి యా- మున జన్నంబొనరించు దక్షుని దురాత్ము న్వీరభద్రోగ్రసం- హననం బూని వధించితౌరా! భళి! భర్గా! పార్వతీవల్లభా! | 25 |
| మ. | కిరిహంసాకృతులూని వెన్నుఁడును బంకేజాతగర్భుండు నీ చరణంబుల్ శిరము న్గనం దలఁచి నిచ్చల్భోగిలోకంబు పు- ష్కరమార్గంబును రోసి కానక నిరాశం జెందుచో వారలం గరుణం బ్రోవవె లింగమూర్తివయి! భర్గా! పార్వతీవల్లభా! | 26 |
| మ. | తరమే యేరికిఁ దావకీన ఘననిత్యశ్రీవిలాసక్రియల్ గరిమ న్దెల్పఁగ? దారుకావనిని లోకఖ్యాతిగా వర్ణివై పరమానందరసార్ద్రమానసుఁడవై పల్మారు గ్రీడించితౌ నరుదార న్మునిదారలం గలిసి భర్గా! పార్వతీవల్లభా! | 27 |
| మ. | హరికన్న న్మరి దైవ మెవ్వఁడును లేఁడంచు న్భుజంబెత్తి ని- ర్భరగర్వోద్ధతిఁ గాశికానగరిలోఁ బల్మాఱు వాదించు ని- ష్ఠురవాగ్దోషరతుం బరాశరసుతున్ స్రుక్కింపవే భీమవై- ఖరి దోఃస్థంభన మాచరించి మును భర్గా! పార్వతీవల్లభా! | 28 |
| మ. | దనుజారాతి మృదంగము న్నలువ కైతాళంబు గోత్రాహితుం- డెనయ న్వేణువు వాణి వీణయును వాయింపన్ రమాకాంత నే- ర్పున గానం బొనరింప సంజతఱి వేల్పుల్మెచ్చఁగా హాళిమై ఘనతన్ దాండవకేళి సేయుదఁట! భర్గా! పార్వతీవల్లభా! | 29 |
| శా. | నీలాంభోధరమధ్యసంస్థితతటిన్నీకాశమై విస్ఫుర- ల్లీల న్నివ్వరిముంటి చందమున నెంతే సూక్ష్మమై పచ్చనై చాలన్భాసిలు తేజమీవ యనుచు న్స్వాంతంబునం దెన్నుదుర్ వాలెంబున్ ఘనులైన తాపసులు భర్గా! పార్వతీవల్లభా! | 30 |
| మ. | గొనబార న్విటజంగమాకృతిని మున్ గొంకేది భల్లాణరా- యని సద్మంబున కేఁగి యాతని సతి న్బ్రార్థించి యా లేమ య- క్కునఁ జక్క న్నెలనాళ్ళబాలకుఁడవై గోమొప్పఁ గన్పట్టితౌఁ గన నబ్రంబులు నీ విహారములు భర్గా! పార్వతీవల్లభా! | 31 |
| మ. | యమరాడ్భీకరకాలపాశమథితుండై శ్వేతకేతుండు దు- ర్దమశోకాకులచిత్తవృత్తిమెయి నిన్బ్రార్థింప వైళంబ యా శమనుం గ్రొవ్వఱఁ దన్ని మౌనితనయున్ శశ్వద్గతిన్బ్రోవవే కమలేశార్చితపాదపంకరుహ! భర్గా! పార్వతీవల్లభా! | 32 |
| మ. | త్రిజగద్రక్షణశక్తిఁ గోరి కమలాధీశుడు నిన్వేయిపం- కజపత్త్రంబులఁ బూజసేయునెడ నొక్కండందులేకుండినన్ నిజనేత్రాబ్జ మతండొసంగినఁ గృప న్వీక్షించితౌఁ జక్ర మ- క్కజ మొప్పారఁగ నిచ్చి యేలుకొని భర్గా! పార్వతీవల్లభా! | 33 |
| మ. | చిరుతొండండను భక్తునింటికి హొయల్ చెన్నార వేంచేసి త- ద్వరపుత్రున్ దునిమించి నంజుడుతునె ల్వండించి భక్షించుచో సిరియొప్ప న్నిజమూర్తిఁ జూపి యతనిన్ జేపట్టి రక్షింపవే కరిదైత్యాధమగర్వనిర్మథన! భర్గా! పార్వతీవల్లభా! | 34 |
| మ. | విజయుం డుగ్రవిపక్షశిక్షణకళావృత్తి న్మిముం గోరి య- క్కజమొప్పన్ దప మింద్రకీలశిఖరిన్ గావించుచో బోయవై విజయఖ్యాతిగఁ బోరి పాశుపతమీవే వాని కిష్టంబుగా రజతక్షోణిధరాగ్రసద్భవన! భర్గా! పార్వతీవల్లభా! | 35 |
| మ. | తనకున్ మిక్కిలి ముజ్జగంబుల కిఁకన్ దైవంబు లేఁడంచుఁ బా- యని దర్పంబున దైత్యదానవమునీంద్రామర్త్యసంసత్పదం- బున వాదించు విరించి పంచమమహామూర్ధంబు ఖండింపవే కన నత్యుద్ధతభైరవాకృతిని భర్గా! పార్వతీవల్లభా! | 36 |
| మ. | సకలాధీశుఁడ వెన్న నీవొక్కఁడవే సత్యంబు సత్యంబు కొం- చక యంతర్బహిరుజ్జ్వలద్భువనరక్షాదీక్షఁ గాకోల ము- త్సుకతం గంఠమునందుఁ దాల్చితివి మెచ్చుల్మీఱఁ గ్రూరాత్ములై యకటా! మూఢు లెఱుంగఁజాలరిది భర్గా! పార్వతీవల్లభా! | 37 |
| శా. | ఏరీ నీ కెనయైన దైవతములీ యీరేడులోకంబులన్ గారామారమృకండుసూనుఁడు మహోగ్రక్రూరమృత్యువ్యథా భీరుండై శరణన్న మిత్తి నపుడే పెంపార్చి రక్షించిత- య్యారే! శాశ్వతజీవిగా నతని భర్గా! పార్వతీవల్లభా! | 38 |
| శా. | లోకశ్రేణికి నీవె కర్త వను టాలోకింప నిక్కంబెపో వైకుంఠాధిపుఁడైన శౌరి దినరాడ్వంశంబునన్ రాఘవుం- డై కన్పట్టి జగద్ధితంబుగ నసంఖ్యన్ శంభులింగంబులన్ వ్యాకీర్ణేచ్ఛఁ బ్రతిష్ఠ చేసెఁ గద భర్గా! పార్వతీవల్లభా! | 39 |
| మ. | శిలలన్ఱొప్పియుఁ జెప్పుఁగాలను గడున్జిత్రంబుగాఁ ద్రొక్కియున్ వెలివెట్టించియుఁ గుంటెనల్నడపియు న్వే రోఁకటం గ్రుమ్మియు న్నిలయద్వారమునందుఁ గాఁపునిచియున్ నీవారలైనారు వా- రల భాగ్యం బిఁక నేమిచెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా! | 40 |
| మ. | అజినంబు న్వృషఘోటియుం బునుకలు న్హాలాహలంబు న్మహా- భుజగంబు ల్శవభస్మము ల్గొఱలఁగా భూతాళితో నుండియున్ ద్రిజగన్మంగళదాయకాకృతిఁ గడున్ దీపించు టబ్రం బహా రజనీనాథకళాశిరోభరణ! భర్గా! పార్వతీవల్లభా! | 41 |
| శా. | డాయన్రాద యటండ్రు మాదృశులు చండాలాదుల న్డాసినన్ బాయుం బుణ్యచయంబులంచుఁ జదువు ల్పల్కంగ నీ వయ్యయో బోయం డెంగిలిమాంసమిచ్చుటకు లోబుల్పూని చేకొంటి వే ప్రాయశ్చిత్తము కద్దు దీనికిఁక? భర్గా! పార్వతీవల్లభా! | 42 |
| శా. | భంజించుం గద! ఘోరదుష్కృతతతిన్ భస్మత్రిపుండ్రంబుల- న్మంజుశ్రీలలితాక్షమాలికలఁ బ్రేమం బూని సద్భక్తి నీ- కుం జేమోడ్చు మహానుభావుఁ డెపుడుం కుక్షిస్థలప్రోల్లస- త్కంజాతప్రభవాండభాండచయ! భర్గా! పార్వతీవల్లభా! | 43 |
| శా. | శ్రీశైలంబును గుంభఘోణమును గాంచీస్థాన కేదారముల్ కాశీ ద్వారవతీ ప్రయాగములు నీలక్ష్మాధరావంతికల్ లేశంబున్ ఫలమీవు నిన్నెపుడు హాళిం గొల్వలేకున్నచోఁ గాశాకాశధునీఘనాభరణ! భర్గా! పార్వతీవల్లభా! | 44 |
| శా. | కావేరీ సరయూ మహేంద్రతనయా గంగా కళిందాత్మజా రేవా వేత్రవతీ సరస్వతుల కర్థిం బోవఁగానేల నీ సేవాసంస్మరణార్చనాదు లెపుడున్ సిద్ధించు మర్త్యాళికిన్ గ్రైవీభూతభుజంగమప్రవర! భర్గా! పార్వతీవల్లభా! | 45 |
| మ. | అరిషడ్వర్గముఁ దోలి సర్వహితులై యష్టాంగయోగక్రియా- పరులై గాడ్పుజయించి ముద్రవెలయన్ బ్రహ్మంబునీక్షించి వా- విరి సోహమ్మని యెంచుచుండెడి మహావేదాంతులౌ యోగిశే- ఖరులెల్లన్ మిముఁ గాంచుచుండ్రు గద! భర్గా! పార్వతీవల్లభా! | 46 |
| మ. | తలపోయన్ దిలజాలకాంతరమహాతైలంబు చందానఁ బూ- సలలో దారము పోల్కి నాత్మమయతన్ సర్వాంతరస్థాయివై విలసల్లీలల నిండియుండుకొను నిన్వీక్షంపఁగా నేర్చువా- రలె ధన్యుల్ గద ముజ్జగంబులను భర్గా! పార్వతీవల్లభా! | 47 |
| శా. | ఏణాంకుండొకఁడై పయోఘటములందెల్ల న్బహుత్వంబుచే రాణం బొల్చు తెఱంగునం బృథుతరబ్రహ్మాండభాండాంతర ప్రాణిశ్రేణులయందు నీవొకఁడవే రాణింతువౌ సర్వగీ- ర్వాణస్తుత్యచరిత్ర! యాత్మమయ! భర్గా! పార్వతీవల్లభా! | 48 |
| శా. | ఓంకారప్రముఖాక్షరోచ్చరణసంయోగంబు గావేన్ముఖా- లంకారార్థము శబ్దబిందుకళలున్ లక్ష్యప్రయోగక్రియల్ పొంకంబౌ గురుమార్గముల్ యతిగతిం బో దుష్కృతిం బోలి సా- హంకారుండయి ప్రాకృతుండు చెడు భర్గా! పార్వతీవల్లభా! | 49 |
| మ. | అకలంకం బతులం బఖండ మమృతం బానందకందం బనూ- నక మాద్యంతవిహీన మక్షర మనంతం బప్రమేయం బరూ- పక మవ్యక్త మచింత్య మద్వయమునౌ బ్రహ్మంబు నీవంచుఁ గొం- కక లోఁ గన్గొనువారు బల్లిదులు భర్గా! పార్వతీవల్లభా! | 50 |
| శా. | ఆకుల్ మెక్కదె మేఁక? చెట్టుకొననొయ్యన్ వ్రేలదే పక్షి? పె- న్గాకుల్ గ్రుంకవె నీట? గాలిఁ గొనదే నాగంబు? బల్గొందులన్ ఘూకం బుండదె? కోనలం దిరుగదే క్రోడంబు? నిన్గాంచినన్ గాకిన్నింటను ముక్తి చేకుఱునె? భర్గా! పార్వతీవల్లభా! | 51 |
| మ. | ధర మృద్దారుశిలామయప్రతిమలన్ దైవంబు లంచుం బర- స్పరవాదంబులఁ బోరుచున్ నిబిడసంసారాంధులై మేలు చే- కుఱకే మగ్గములోని కండెల గతిన్ ఘోరార్తులై ప్రాకృతుల్ కరముం జచ్చుచుఁ బుట్టుచుంద్రు గద! భర్గా! పార్వతీవల్లభా! | 52 |
| మ. | జననీగర్భమహామహోగ్రనరకస్థానవ్యథం గొన్నినా- ళ్లెనయన్ బాల్యకుమారతాదశలఁ గొన్నేడుల్ వధూమీనకే- తనగేహభ్రమఁ గొన్నినాళ్ళు ఘనవృద్ధప్రాప్తిఁ గొన్నేళ్ళుఁ బా- యని దుఃఖంబులఁ బ్రాణి గుందుఁ గద? భర్గా! పార్వతీవల్లభా! | 53 |
| శా. | కేదారాదిక పుణ్యభూముల కశక్తిం బోవఁగారాదు; బల్ పేదర్కంబున దానధర్మవిధు లోలిం జేయఁగారాదు గా- కేదే నొక్కతఱిన్ సమస్తభువనాధీశున్ నినుం గొల్వఁగా రాదో? కానరుగాక దుర్మతులు భర్గా! పార్వతీవల్లభా! | 54 |
| మ. | తరుణీశుంభదురోజకుంభములపై ధమ్మిల్లబంధంబుపైఁ గరమూలంబులపైఁ గపోలములపైఁ గందోయిపై మోముపై నిరతంబున్ విహరించు చిత్త మెపుడున్ నీయందొకప్డేనిఁ జే- ర్పరుగా మూఢు లదేమిదుష్కృతమొ? భర్గా! పార్వతీవల్లభా! | 55 |
| మ. | మిము నొక్కప్పుడుఁ గొల్వనేరక వృథామిథ్యాప్రచారంబులం- గములై వాఁగులయందు నెల్ల మునుగంగాఁ బుణ్యము ల్సేరునే? తమి నశ్రాంతము నీటఁ గ్రుంకులిడి యేధర్మంబు లార్జించెనో కమఠగ్రాహఢులీకుళీరములు! భర్గా! పార్వతీవల్లభా! | 56 |
| మ. | హరి దైవంబు విరించి సర్వభువనాధ్యక్షుండు బృందారకే- శ్వరుఁడాఢ్యుండు హుతాశనుండు పతి భాస్వంతుండు వేల్పండ్రు లో నరయ న్నేరరుగా ‘శివాత్పరతరం నాస్తీ’తివాక్యార్థ మే- కరణిం గోవిదులైరొ కాని మఱి! భర్గా! పార్వతీవల్లభా! | 57 |
| శా. | వేయేనూఱుపురాణముల్ సదివినన్ వేదాంతముల్ గన్న నా- మ్నాయంబుల్ పరికించినన్ స్మృతులు వేమాఱుల్ విమర్శించిన న్నీయం దాఢ్యత దోఁచుచున్నయదివో నిక్కంబు భావింపఁగా గాయత్రీపతివై తనర్చుటను భర్గా! పార్వతీవల్లభా! | 58 |
| శా. | ఆఘంటాపథపద్ధతిన్ శివశివే త్యాలాపసంశీలులై రేఘస్రంబులు ద్రోచు పుణ్యతము లుర్విన్ బ్రహ్మహత్యాద్యనే- కాఘౌఘంబులు వాసి తావకపదప్రాప్తిన్ విడంబింతురౌ ద్రాఘిష్ఠప్రభుతాగుణోల్లాసన! భర్గా! పార్వతీవల్లభా! | 59 |
| మ. | పృథివిన్ మర్త్యుఁ డొకప్డు నీ శిరముపై బిల్వీదళం బొక్కట- త్యాధికాహ్లాదముతోడ నిడ్డ నది యాహా! ఘోటకాందోళికా- రథనాగాంబరపుత్రపౌత్రవనితారత్నాదులై యొప్పుఁబో ప్రథితాదభ్రసితాభ్రశుభ్రయశ! భర్గా! పార్వతీవల్లభా! | 60 |
| మ. | మిము సేవించుటచేతఁ గాదె చిరలక్ష్మీసంగతుల్ శౌరికిన్ నముచిద్వేషికి శాశ్వతస్థితమహానాకాధిపత్యంబు వా- గ్రమణీభర్త కశేషసృష్టిరచనాప్రావీణ్యమున్ గల్గె నీ క్రమ మజ్ఞుల్ గనలేరు గాని భువి భర్గా! పార్వతీవల్లభా! | 61 |
| శా. | వాణీశాంబుజలోచనప్రముఖ గీర్వాణార్చితాంఘ్రిద్వయున్ క్షోణీభాగశతాంగునిన్ గజహరున్ శ్రుత్యంతవేద్యున్ నినున్ బాణాదిప్రమథోత్తముల్ గొలిచి మేల్పట్టూనిరౌ సంతత- ప్రాణివ్యూహమనోంబురుడ్భవన! భర్గా! పార్వతీవల్లభా! | 62 |
| శా. | దారిద్ర్యంబు దొలంగు మృత్యువెడలున్ దవ్వౌనఘవ్రాతము ల్ఘోరవ్యాధులు గండదోషము లడంగున్ జారచోరవ్యథల్ దూరంబౌ నహితానలగ్రహగణార్తుల్ వీడు నిక్కంబు నీ కారుణ్యం బొకయింత గల్గునెడ భర్గా! పార్వతీవల్లభా! | 63 |
| మ. | సుత, పద్మాకర, దేవతాగృహ, వన, క్షోణీసురోద్వాహ, స- త్కృతి, నిక్షేపము లంచు నెంచ నలువౌ నీ సప్తసంతానముల్ హితవారంగ నొనర్చు పుణ్యమెనయున్ హేలాగతి న్మర్త్యుఁడొ- క్కతఱిన్ మిమ్ముఁ దలంచెనేని మది భర్గా! పార్వతీవల్లభా! | 64 |
| మ. | అమరం ద్వత్పదపంకజాతయుగళధ్యానక్రియాశ్రాంతసం- భ్రమలీలన్ విలసిల్లు డెంద మొరులన్ బ్రార్థింపఁగా నేర్చునే? సుమనోనిర్ఝరిణీసువర్ణకమలస్తోమాసవాలంపట భ్రమరం బేఁగునే తుమ్మకొమ్మలకు భర్గా! పార్వతీవల్లభా! | 65 |
| మ. | శివుఁ జూడం దగదండ్రు గొందఱధముల్ చిత్రంబు తారెన్నఁడు న్రవిచంద్రాగ్నిగృహిక్షమాపవననీరవ్యోమముల్ నీ స్వరూ- పవిశేషంబు లటంచుఁ దెల్ప వినరో భావింప నమ్మూర్ఖపుం గవు లెల్లం దదధీనతన్ మనరొ భర్గా! పార్వతీవల్లభా! | 66 |
| మ. | ద్విపగంధర్వవిభూషణాంబరవధూవీటీభటాందోళికా- తపనీయాదులచేత మత్తిలి బుధేంద్రశ్రేణిఁ బీడింతురౌ తపనప్రోద్భవఘోరకింకరగదాదండోగ్రదుఃఖంబు లొ- క్కపుడుం దుష్ప్రభులేల యెంచరొకొ? భర్గా! పార్వతీవల్లభా! | 67 |
| శా. | నానాద్వీపధరాధురావహనమాన్యస్ఫారబాహాబలా- నూనఖ్యాతిసమేతులైన శశిబిందుక్ష్మాతలేశాదిక క్ష్మానాథు ల్చనిపోవుట ల్దెలియరో సత్యంబులా దేహముల్? కానంజాలరు గాక దుర్నృపులు భర్గా! పార్వతీవల్లభా! | 68 |
| మ. | చవిలెల్ కాసులు వీసముల్ గొని యథేచ్చాలీలలం బ్రేలు దు- ష్కవుల న్మెచ్చుచు భవ్యకావ్యఘటనాశాలుల్ ప్రసంగించుచో నవివేకక్షితినాయకాధమవరుల్ హాస్యోక్తులం బొల్తురౌ కవితాసార మెఱుంగకుండుటను భర్గా! పార్వతీవల్లభా! | 69 |
| మ. | చెలుల న్బంధుల విప్రులన్ బ్రజల దాసీభృత్యమిత్రాదులం గల విత్తంబులు వృత్తులుం గొని కడున్ గారింతు రధ్యక్షతం దలపంజాల రదేమొ మీఁదటికథల్ దర్పాంధకారాంధులై కలనైనన్ మహిభృద్దురాత్మకులు భర్గా! పార్వతీవల్లభా! | 70 |
| శా. | మన్నెల్లం దమ సొమ్మటంచు వసుధామర్త్యోత్తమక్షేత్రముల్ కన్నారం గని యోర్వలేక దిగమ్రింగం జూతు రల్పప్రభుల్ వెన్నప్పంబులొ బూరెలొ వడలొ భావింపంగ నొబ్బట్లొకో యన్నా! యెన్నఁగ వారిపాలి కవి? భర్గా! పార్వతీవల్లభా! | 71 |
| మ. | ప్రజలం గాఱియఁబెట్టి పెట్టియల నర్థంబెప్పుడు న్నించుచున్ ద్విజవిద్వత్కవివందిగాయకుల కేదే నొక్కటీలేక య- క్కజమొప్పం బలుమూలలం దిరుగు భూకాంతాంళికిం గీర్తిధ- ర్మజయౌద్ధత్యము లేక్రియం గలుగు? భర్గా! పార్వతీవల్లభా! | 72 |
| శా. | ఆజిన్ వైరివరూధినీమథనదీక్షారూఢిఁ గ్రాలన్ వలెన్ భోజుం బోలి సమస్తయాచకతతిం బోషించుచుండన్ వలెన్ తేజం బెప్పుడు నుర్విలోఁ బ్రజకుఁ జెందింపన్ వలెన్ గానిచో రాజా వాఁడు? తరాజు గాక! భువి, భర్గా! పార్వతీవల్లభా! | 73 |
| శా. | తేజంబొప్పఁ బురాకృతంబున జగద్ధ్యేయత్వదంఘ్రిద్వయీ- పూజాపుణ్యఫలంబునం దమరిటుల్ భూపత్వముం గంటకున్ వ్యాజంబూని కడుం జెడంగవలెనా యాలింపరా యీ నృపుల్ ‘రాజాంతే నరకం వ్రజే’త్తనుట? భర్గా! పార్వతీవల్లభా! | 74 |
| మ. | కవివిద్వద్ధరణీసుధాశనవరుల్ కార్యార్థులై యొద్ద డా- సి వడిం జేతులు దోయిలించుకొని యాశీర్వాదముల్సేయ నె- క్కువదర్పంబున నట్టిట్టుం బొరలకే కొర్మ్రింగినట్లుండ్రుగా రవళిం దుర్నృపు లేమి యీఁగలరొ భర్గా! పార్వతీవల్లభా! | 75 |
| శా. | గాజుంబూస యనర్ఘరత్నమగునా? కాకంబు రాయంచయౌ- నా? జోరీఁగ మధువ్రతేంద్రమగునా? నట్టెన్ము పంచాస్యమౌ- నా? జిల్లేడు సురావనీజమగునా? నానాదిగంతంబులన్ రాజౌనా ఘనలోభిదుర్జనుఁడు? భర్గా! పార్వతీవల్లభా! | 76 |
| శా. | కోపం బెక్కువ, తాల్మి యిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్, కాపట్యంబు ఘనంబు, లోభము నహంకారంబు దట్టంబు, హృ- చ్చాపల్యం బధికంబు, ద్రోహ మతివిస్తారంబు, ఛీ! యిట్టి దు- ర్వ్యాపారప్రభు లేరిఁ బ్రోతు రిఁక? భర్గా! పార్వతీవల్లభా! | 77 |
| శా. | హృద్వీథిం గనరుం దిరస్కృతియు బిట్టేపార నొక్కప్పుడున్ సద్వాక్యంబును దర్శనం బిడని రాజశ్రేణి కాశింతురౌ ‘విద్వద్దండ మగౌరవం’ బను స్మృతుల్ వీక్షింపరా దుర్నృపా- గ్రద్వారంబుల వ్రేలు పండితులు భర్గా! పార్వతీవల్లభా! | 78 |
| మ. | అపవర్గం బొనగూడునో చిరసుఖాహ్లాదంబు చేకూరునో జపహోమాధ్యయనార్చనాదిక మహాషట్కర్మము ల్డించి దు- ష్కపటోపాయవిజృంభమాణధరణీకాంతాధమాగారని- ష్కపటభ్రాంతి జరింతు రార్యు లిల భర్గా! పార్వతీవల్లభా! | 79 |
| మ. | అకటా! జుత్తెఁడు పొట్టకై కృపణమర్త్యాధీశగేహాంగణా- వకరక్షోణిరజశ్ఛటావిరతసంవ్యాప్తాంగులై క్రుంగి నె- మ్మొకముల్ వెల్వెలఁబాఱ వ్రేలు దురదేమో యెందులం బోవనే- రక ధీమజ్జను లెంతబేలలొకొ! భర్గా! పార్వతీవల్లభా! | 80 |
| మ. | అతిలోభిన్ రవిసూనుఁడంచుఁ గపటస్వాంతున్ హరిశ్చంద్రభూ- పతియంచున్ మిగులం గురూపిని నవప్రద్యుమ్నుఁడంచు న్మహా- పతితున్ ధర్మజుఁడంచు సాధ్వసమతిం బార్థుడటంచు న్బుధుల్ ప్రతివేళన్ వినుతింతు రక్కఱను భర్గా! పార్వతీవల్లభా! | 81 |
| మ. | జనసంస్తుత్యమహాప్రబంధఘటనాసామర్థ్యముల్ గల్గు స- జ్జను లత్యల్పుల దీనతం బొగడుదుర్ జాత్యంధతం జెంది కా- కనువొప్పం దమరెన్నఁడున్ ‘సుకవితా యద్యస్తి రాజ్యేన కి’ మ్మను వాక్యంబు వినంగలేదొ మును? భర్గా! పార్వతీవల్లభా! | 82 |
| మ. | సుగుణోద్దామమహాకవింద్రఘటితాక్షుద్రప్రబంధావళుల్ జగదుద్దండపరాక్రమక్రమవిరాజద్భూమిభృన్మౌళికిన్ దగుఁ గా కల్పుల కొప్పునే? కరికి ముక్తాకాయమానంబు సొం పగుఁ గా కొప్పునే యూరఁబందులకు? భర్గా! పార్వతీవల్లభా! | 83 |
| మ. | పటులోభాత్మున కెవ్వరైనఁ గడఁకం బద్యాదు లర్పించినం గుటిలుండై యవియెల్ల నిల్పుకొనఁగా గోరండు నిక్కంబహా! దిట మొప్పారఁగ నిల్పుకోఁగలదె ధాత్రిన్ గొంతసేపైన మ- ర్కటపోతం బురురత్నహారంబులు? భర్గా! పార్వతీవల్లభా! | 84 |
| మ. | భువిలో మేదరసెట్టి చివ్వతడకల్ పొంకంబుగా నల్లి పె- న్రవళిన్ సంతలనెల్లఁ ద్రిప్పు క్రియ దైన్యంబెచ్చఁగా దుష్కవుల్ తివుటొప్పం జెడుకబ్బపుం దడక లోలిం ద్రిప్పఁగా నద్దిరా! కవితల్ కాసుకు గంపెఁడయ్యెఁ గద భర్గా! పార్వతీవల్లభా! | 85 |
| మ. | అవివేకక్షితినాయకాధమసభాభ్యాసప్రదేశంబులన్ బవళుల్రేలును జుట్టఁబెట్టుకొని దుష్పాండిత్యము ల్చూపుచుం గవిముఖ్యుం బొడగాంచి జాఱుదురు వేగంబుండ విల్గన్న కా కవులట్లే నిలఁబోక కాకవులు భర్గా! పార్వతీవల్లభా! | 86 |
| మ. | భువిలో నిక్కలిదోషహేతుకమునం బొల్పారి గోసంగులున్ బవినాలు న్బలుమోటకాఁపుదొరలుం బాషండులు న్దాసరుల్ సివసత్తుల్ నెఱబోయపెద్దలును దాసేయప్రభుల్ దుష్టకా- కవులు న్మీఱిరిఁకేమి చెప్పనగు? భర్గా! పార్వతీవల్లభా! | 87 |
| మ. | కలుము ల్నిక్కమటంచు నమ్మి తులువ ల్గర్వాంధులై యెన్నఁడు- న్బలిభిక్షంబులు వెట్టకుండ్రు పిదప న్బ్రాణంబులం బాసి యా ఖలులేమౌదురో, వాండ్రు గూరిచిన రొక్కంబెల్ల నేమౌనొకో కలుషోద్గాఢతమస్సహస్రకర! భర్గా! పార్వతీవల్లభా! | 88 |
| మ. | తులువ ల్పెట్ట భుజింపలేక ధనమెంతో నెమ్మదిం గూర్చి మూ- లల దట్టంబుగఁ బాఁతుకొన్న నృపతు ల్వాలెంబు నిర్మోహులై పలుచందంబులఁ గట్టి కొట్టి మిగుల న్బాధించి రోధించుచుం గల సొమ్మెల్ల హరించుచుండ్రు గద! భర్గా! పార్వతీవల్లభా! | 89 |
| మ. | చెనఁటు ల్గూర్చుధనంబు మ్రుచ్చులకు దాసీవారయోషాహు- తాశనదుష్టక్షితిపాలకప్రతతికిన్ సంరూఢిఁ జేకూరు గా- కనవద్యప్రతిభావిభాసితబుధేంద్రానీకముం జేరునే? కనదుద్దామపరాక్రమప్రథిత! భర్గా! పార్వతీవల్లభా! | 90 |
| మ. | ధరణిన్ సద్గురుచెంత నెందఱు ఖలుల్ దార్కొన్న నచ్చోటికే కరమర్థి న్బుధులేఁగుచుండుదురు నిక్కంబారయన్ గంటకా- వరణోజ్జృంభితకేతకీవని కళుల్ వాలెంబుగాఁ జేరవే? కరుణాదభ్రపయఃపయోనిలయ! భర్గా! పార్వతీవల్లభా! | 91 |
| శా. | లోకానీకమునందు దుర్గుణులు కల్ముల్ గల్గియున్నప్డు ప- ల్గాకుల్ దార్కొని మెల్లమెల్లనె దురాలాపంబులం గేరుచుం గైకొం డ్రెల్లపదార్థము ల్నిజమహో కార్కూఁతలం గ్రోల్చుచు- న్గాకు ల్వేములఁ జేరు చందమున భర్గా! పార్వతీవల్లభా! | 92 |
| మ. | చదువు ల్వేదపురాండము ల్గయితలు న్సబ్బండువిద్దెల్ గతల్ మొదలెన్నేనిగ విద్దుమాంసువు లదేమో తెల్పఁగా వింటిఁగా నదిగో చౌలకు మాలదాసరి శటాలైగారి జ్ఞానమ్మలెన్ గదియం జాలవటండ్రు ముష్కరులు భర్గా! పార్వతీవల్లభా! | 93 |
| శా. | పో! పో! బాఁపఁడ! దోసె డూదలిడినం బోలేక పేరాసల- న్వాపోఁ జాగితివేమి! నీ సదువు తిర్నామంబులో! సుద్దులో భూపాళంబులొ లంకసత్తెలొ బలా బొల్ల్యావుపోట్లాటలో కా! పాటింపనటండ్రు బాలిశులు భర్గా! పార్వతీవల్లభా! | 94 |
| మ. | అదిగో బాఁపనయల్లుభొట్లయకు ముందప్పయ్యతీర్తంబులో నదనం ‘గిద్దెఁడు కొఱ్ఱనూక లిడితిన్ అబ్బబ్బ! తిర్నామముల్ సదువం జాగిన మాలదాసర యలన్ సంతోసనాల్ సేసితిం గద’ యంచుం బలుమోటులాడుదురు భర్గా! పార్వతీవల్లభా! | 95 |
| శా. | రాలన్ దైలము తీయవచ్చు భుజగవ్రాతమ్ముల న్బేర్లఁగా లీల న్బూనఁగవచ్చు నంబునిధి హాళిం దాఁటఁగావచ్చు డా- కేల న్బెబ్బులిఁ బట్టవచ్చు విపినాగ్ని న్నిల్పఁగావచ్చు మూ- ర్ఖాళిం దెల్పఁ దరంబె యేరికిని? భర్గా! పార్వతీవల్లభా! | 96 |
| శా. | ఆఁకొన్నప్పుడు వంటకంబయిన బియ్యంబైన జావైనఁ గూ- రాకైన న్ఫలమైన నీరమయినన్ హాళిం గల ట్లిచ్చుచున్ జేకోనౌఁ బరదేశులం గృహులకు న్సిద్ధంబు గావింప ఛీ! కాకున్న న్మఱి యేఁటికొంప లవి? భర్గా! పార్వతీవల్లభా! | 97 |
| మ. | మడతల్వల్కు నృపాలుతోఁ బలుమాఱు న్మారాడు పెండ్లాముతోఁ జెడుజూడం బ్రచరించు నాత్మజునితోఁ జేట్పాటు గోర్లెంకతో బొడవం జూడఁగవచ్చు కార్మొదవుతోఁ బోరాడు చుట్టంబుతోఁ గడతేరం దరమా గృహస్థునకు? భర్గా! పార్వతీవల్లభా! | 98 |
| శా. | కాకిన్శాశ్వతజీవిగా నునిచి చిల్కన్వేగ పోకార్చి సు- శ్లోకుం గొంచెపుటేండ్లలోఁ గెడపి దుష్టుం బెక్కునాళ్లుంచి య- స్తోకత్యాగి దరిద్రుఁ జేసి కఠినాత్మున్ శ్రీయుతుం జేయు నా- హా! కొంకేదిఁక నల్వచెయ్వులకు? భర్గా! పార్వతీవల్లభా! | 99 |
| మ. | ధరలో నెన్నఁగ శాలివాహనశకాబ్దంబు ల్దగ న్యామినీ- కరబాణాంగశశాంకసంఖ్యఁ జెలువై కన్పట్టు (సౌమ్యా)హ్వ- యస్ఫురదబ్దంబున నిమ్మహాశతక మేఁ బూర్ణంబు గావించి శ్రీ- కరలీల న్బుధులెన్న నీకిడితి భర్గా! పార్వతీవల్లభా! | 100 |
| మ. | ధనధాన్యాంబరపుత్రపౌత్రమణిగోదాసీభటాందోళికా- వనితాబంధురసింధురాశ్వ (మహితైశ్వర్యంబు) దీర్ఘాయువు న్ఘనభాగ్యంబును గల్గి వర్ధిలుదు రెక్కాలంబుఁ జేట్పాటులే- క నరు ల్దీని బఠించిరేని భువి భర్గా! పార్వతీవల్లభా! | 101 |
| సంపూర్ణము. | ||