| శతకములు | భక్తమందారశతకము | కూచిమంచి జగన్నాథకవి |
కవిపరిచయము
- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)
| భక్తమందారశతకము - కూచిమంచి జగన్నాథకవి | ||
| శా. | శ్రీసాకేతపురీవరంబున సునాసీరోపలస్థాపిత- ప్రాసాదాంతర చంద్రకాంతమణియుక్పర్యంకభాగంబునన్ శ్రీసీతాసతిఁ గూడ వేడ్కలలరం గ్రీడించు మిమ్మెప్పుడున్ మా సన్మానసవీథిఁ గొల్చెదము రామా! భక్తమందారమా! | 1 |
| శా. | అస్తోకామలకీర్తికామ! లసదుద్యన్నీరదశ్యామ! భూ విస్తారప్రభుతాలలామ! త్రిజగత్ప్రఖ్యాతసన్నామ! ధీ- రస్తుత్యోరుగుణాభిరామ! భుజసారస్ఫారపౌలస్త్యదు- ర్మస్తస్తోమవిరామ! ధీమహిత! రామా! భక్తమందారమా! | 2 |
| మ. | కదనప్రాంగణకార్తికేయ! విలసద్గాంగేయకౌశేయ! భా- స్వదుదంచద్ఘననీలకాయ! త్రిజగత్సంరక్షణోపాయ! స- మ్ముదితాశేషమరున్నికాయ! దివిషన్ముఖ్యాతిగేయా! గరు- త్మదమేయాశ్వ! సుధీవిధేయగుణ! రామా! భక్తమందారమా! | 3 |
| మ. | అకలంకాయతకీర్తి జాల! మహనీయాభీలశౌర్యస్ఫుర- న్మకరాక్షాసురరావణప్రముఖ నానాదానవోత్తాలతూ- లకరాళస్ఫుటవహ్నికీల! జయశీలా! సద్దయావాల! హే- మకనచ్చేల! బుధానుపాల! రఘురామా! భక్తమందారమా! | 4 |
| మ. | దురితధ్వాంతపతంగ! సంగరమహాదుర్వారగర్వాహితో- త్కర సేనాకదళీమతంగ! లసదేకాంతాత్మపంకేజసం- చరదుద్యన్మదభృంగ! పుంగవ ఘనశ్యామాంగ! సద్గంగ! క- మ్రరమాలింగనసంగతాంగ! రఘురామా! భక్తమందారమా! | 5 |
| శా. | దండం బీయదె నీకుఁ గైకొనుము దోర్దండాగ్రజాగ్రన్మహో- దండోత్తాలవిశాల దివ్యతరకోదండాగ్రనిర్ముక్త స- త్కాండవ్రాతవిఖండితాహితశిరఃకాండా! కనత్కుండలా! మాండవ్యాది తపోధనప్రణుత! రామా! భక్తమందారమా! | 6 |
| శా. | వింతల్గాఁ గడు మీకు సత్కృతులు గావింతున్ దుషారాద్రిజా- కాంతాక్రాంతజటాంతరాళవిలుఠద్గంగాతరంగచ్ఛటో- త్క్రాంతాత్యంత ఝళంఝళన్నినద రంగద్ధాటి మీఱంగ సా- మంతా! సంతతశాంతిమంత! జయరామా! భక్తమందారమా! | 7 |
| మ. | రకపుం గావ్యకళాకలాపరచనాప్రాగల్భ్యసంసిద్ధికై ప్రకటప్రేమ భజింతు నీశ మకుటప్రస్ఫీతగంగాజలా- ధికమాధుర్యకవిత్వధూర్వహన ధీదివ్యప్రభావాఢ్యఁ ది- మ్మకవిశ్రేష్ఠు మదగ్రజున్ మదిని రామా! భక్తమందారమా! | 8 |
| మ. | సకలాభీష్టఫలప్రదాయకుఁడవై చంచద్దయాశాలివై ప్రకటస్నేహరసార్ద్రమానసుఁడవై భంగీకృతానేకపా- తకఘోరామయశాత్రవోత్కరుడవై ధాత్రీసుతం గూడి మా- మక చిత్తాబ్జమునన్ వసించు మొగి, రామా! భక్తమందారమా! | 9 |
| మ. | మణిపుంఖాంకితకంకపత్రచయ సమ్యగ్దివ్యతూణద్వయం- బణుమధ్యంబునఁ దళ్కు గుల్క ఖలదైత్యానీకహృద్భేదకృ- ద్ధణనీయోగ్రకఠోరకార్ముకము చేతంబూని నా వెంట ల- క్ష్మణుడు న్నీవును నంటి త్రిమ్మరుము రామా! భక్తమందారమా! | 10 |
| మ. | పలుమాఱున్ భవదీయకావ్యరచనాప్రాగల్భ్య మొప్పార ని- న్గొలుతున్ మామక మానసాబ్జమున బొంకుల్ గావు నీ వెచ్చటం గలలోనం బొడకట్ట విట్టి వగ బాగా! మేల్! బళా! శ్యామకో- మలవిభ్రాజితమందరావయవ! రామా! భక్తమందారమా! | 11 |
| మ. | రఘువంశాంబుధిపూర్ణచంద్ర! విలసద్రాజన్యదేవేంద్ర! నా యఘసంఘంబులఁ బాఱఁద్రోలి భవదీయామేయకారుణ్యదృ- ష్టి ఘనప్రక్రియఁ జూచి యేలుకొనుమా! సేవింతు నత్యంతమున్ మఘవప్రస్తుతసద్గుణాభరణ! రామా! భక్తమందారమా! | 12 |
| మ. | గణుతింతున్ భవదీయ సద్గుణకథల్ కౌతూహలం బొప్పఁగాఁ బ్రణుతింతున్ సచరాచరాదిక మహాబ్రహ్మాండభాండచ్ఛటా- గణితప్రాణిజనాంతరాత్మవని వేడ్కన్ సంతతంబున్ నభో- మణివంశాంబుధిశీతభాను! రఘురామా! భక్తమందారమా! | 13 |
| మ. | సారాసారవిచార! ధీరజనతాసంరక్షణాధార! స- త్కారుణ్యాకరమూర్తివంచు నెద నత్యంతంబు మీ దివ్యశృం- గారాగారపదారవిందములు వేడ్కన్ గొల్తు నన్ బ్రోవుమీ మారీచప్రమదప్రహారశర! రామా! భక్తమందారమా! | 14 |
| మ. | మిహికాంశూపమసుందరాననముతో మేలీను కందోయితో నహిజిద్రత్నవినీలవిగ్రహముతో నంచత్కిరీటంబుతో విహగాధీశ్వరు నెక్కి నా యెదుటికిన్ విచ్చేయవే యో పితా- మహసుత్రామముఖామరప్రణుత! రామా! భక్తమందారమా! | 15 |
| శా. | కంజాతప్రభవాండభాండచయరంగచ్చేతనాచేతనా- ళిం జెన్నారఁగఁ బ్రోదిసేతువని హాళిన్ ధీజనుల్ దెల్ప హృత్ కంజాతంబున మిమ్ము గొల్తు నను వేడ్కన్ వేగ రక్షింపుమీ మంజుశ్రీకరుణాకటాక్షమున రామా! భక్తమందారమా! | 16 |
| మ. | తళుకుం బంగరుకామ గుబ్బగొడు గందంబొప్ప శత్రుఘ్నుఁడ- ర్మలి బట్టన్ భరతుండు చామరము గూర్మి న్వీవఁగా లక్ష్మణుం- డలదుం దూపుల విల్లు డాల్పఁ గపిసేనాధీశ్వరుల్ గొల్వ ని- ర్మలలీలం గొలువుండు నిన్ దలఁతు రామా! భక్తమందారమా! | 17 |
| శా. | నిక్కంబారయఁ దావకాంఘ్రివిలసన్నీరేరుహద్వంద్వమే దిక్కెల్లప్పుడు మాకటంచు మదినెంతే వేడ్క భావించెదన్ జిక్కుల్ పన్నక నమ్మికిచ్చి సరగం జేపట్టి రక్షింపు స- మ్యక్కారుణ్యకటాక్షవీక్ష నను రామా! భక్తమందారమా! | 18 |
| మ. | అతసీపుష్పసమానకోమలవినీలాంగున్ సముద్యన్మహో- న్నతకోదండనిషంగగంగు బలవన్నక్తంచరాఖర్వప- ర్వతజీమూతతురంగుఁ గింకరజనవ్రాతావనాత్యంతర- మ్యతరాపాంగుని నిన్ భజింతు మది రామా! భక్తమందారమా! | 19 |
| శా. | ఆర్తత్రాణపరాయణుండవని నిన్నత్యంతమున్ సజ్జను- ల్గీర్తింపన్ విని తావకీన పదనాళీకద్వయంబాత్మ వి- స్ఫూర్తిం జెందఁగ నెంతు నెల్లపుడు నన్బోషింపుమీ సత్కృపన్ మార్తాండద్విజరాజసన్నయన! రామా! భక్తమందారమా! | 20 |
| మ. | మదనాగాశ్వశతాంగ కాంచనకనన్మాణిక్యభూషా మృగీ మదదివ్యాంబరచామరధ్వజ లసన్మంజూషికాందోళికా- మృదుతల్పార్థసమృద్ధిగల్గి పిదప న్నీ సన్నిధిం జేరు నిన్ మదిలో నెప్పుడు గొల్చు మానవుఁడు రామా! భక్తమందారమా! | 21 |
| శా. | శ్రీకంఠాంబుజసంభవేంద్రరవిశోచిష్కేశముఖ్యామరా- నీకంబుల్ గడుభక్తి నిన్ గొలిచి పూన్కిన్ ధన్యులైనారు నేఁ- డాకాంక్షన్ భజియింతు మేమఱక చిత్తానంద మొందింపుమా మాకుం బ్రాపును దాపు నీవగుచు రామా! భక్తమందారమా! | 22 |
| మ. | కరిరా, జార్జున, పుండరీక, శుక, గంగానందన వ్యాసులున్ పరమాధీశ, బలీంద్ర, మారుతసుతుల్, సంప్రీతి సద్భక్తి మీ పరమాంఘ్రిద్వయచింతనాభిరతిమైఁ బ్రాపించిరౌ సద్గతిన్ స్మరకోటిప్రతిమానరూపయుత రామా! భక్తమందారమా! | 23 |
| మ. | అహితార్తుల్ వెడఁబాయు లేము లెడలున్ వ్యాధుల్ దొలంగు న్నవ- గ్రహదోషంబులు శాంతిఁ బొందుఁ గలుషవ్రాతంబు జాఱున్ శుభా- వహమౌ తావక దివ్యనామ మెలమిన్ వాక్రుచ్చినన్ ధాత్రిపై మహితోద్దండతరప్రతాపగుణ! రామా! భక్తమందారమా! | 24 |
| మ. | గర్గాగస్త్య వసిష్ఠశుక మార్కండేయగాధేయు లం- తర్గాఢాధికశత్రుశిక్షణకళాధౌరేయతాబుద్ధి సం- సర్గప్రక్రియ మిమ్ముఁ గొల్తురుగదా క్ష్మాకన్యకోరోజస- న్మార్గస్ఫాయదురఃకవాటతట! రామా! భక్తమందారమా! | 25 |
| మ. | అకలంకాయతభోగభాగ్యదము నిత్యానందసంధానహే- తుక మాభీలతరాఘమేఘఘనవాతూలంబు ముక్తిప్రదా- యక మత్యంతపవిత్ర మెంచ నిల నాహా! తారకబ్రహ్మ నా- మకమంత్రంబు భళీ! భవన్మహిమ! రామా! భక్తమందారమా! | 26 |
| మ. | ఇనుఁ డద్దంబగు నగ్ని నీరగు భుజగేంద్రుండు పూదండయౌ వనధుల్ పల్వలపంక్తులే జలధరాధ్వం బిల్లెయౌ రాజయో- గనిరూఢస్థితిఁ దావకీన పదయుగ్మం బెల్లకాలంబు ప్రే- మ నెదం బూని భజించు ధన్యులకు రామా! భక్తమందారమా! | 27 |
| మ. | ముదమొప్పార నిరంతరంబు బలవన్మోక్షప్రదామేయభా- స్వదుదలచ్ఛవదంఘ్రితామరససేవాసక్తచిత్తంబు దు- ర్మదులం జేరునే పారిజాతసుమనోమత్తద్విరేఫంబు దా మదనోర్వీజము చెంతకుం జనునె రామా! భక్తమందారమా! | 28 |
| శా. | ఖండించున్ బహుజన్మసంచితచలద్గాఢోగ్రదోషావలిం జండప్రక్రియ శైలజావినుతభాస్వచ్చారుదివ్యన్మహో- ద్దండశ్రీ భవదీయనామ మిలమీఁదన్ భూతభేతాళకూ- ష్మాండవ్రాతఘనాఘనశ్వనన రామా! భక్తమందారమా! | 29 |
| శా. | సారాసారకృపాకటాక్షమున నిచ్చల్ భూర్భువస్వః త్రిలో- కారూఢాఖిలజంతుజాలముల నెయ్యం బొప్పఁగాఁ బ్రోచు ని- న్నారాధించి సుఖింపలేక శిలలం బ్రార్థింతురెంతే నప- స్మారభ్రాంతిమదాత్మమూఢు లిల రామా! భక్తమందారమా! | 30 |
| మ. | సరసీజాతభవాభవామరుల్ చర్చింప మీ మాయ గా- నరటంచున్ సతతంబు ప్రాఁజదువులు న్నానాపురాణంబులున్ సరసప్రక్రియఁ జాటుచుండఁగఁ బిశాచప్రాయు లెంతేని సో- మరిపోతుల్ నరులెట్లు గాంచెదరు? రామా! భక్తమందారమా! | 31 |
| శా. | ధర్మంబంచు నధర్మమంచుఁ గడుమిథ్యాలీల లేపారఁగా నిర్మాణం బొనరించి ప్రాణులను నిర్నిద్రప్రభావంబులన్ బేర్మిం జెందఁగఁ జేసి యంత్రకుగతిన్ బిట్టూరకే త్రిప్పు నీ మర్మం బెవ్వ రెఱుంగఁగాఁ గలరు? రామా! భక్తమందారమా! | 32 |
| మ. | వ్రతముల్ పట్టిన దేవభూసురగురువ్రాతంబులం గొల్చినం గ్రతుతంత్రంబులు దానధర్మము లపారంబౌనటుల్ చేసినన్ శతవర్షంబులు గంగలో మునిఁగినన్ సంధిల్లునే ముక్తి దు- ర్మతికిం దావక భక్తి గల్గమిని ? రామా! భక్తమందారమా! | 33 |
| శా. | సందేహింపక కొంచకెప్పుడు హృదబ్జాతంబులో భక్తి నీ యందంబై తగుమూర్తి నిల్పికొని యత్యాసక్తి సేవించువాఁ డొందుం గుప్పున వాంఛితార్థములు బాగొప్పారు వందారు స- న్మందారంబవు గావె నీ వరయ, రామా! భక్తమందారమా! | 34 |
| మ. | అరిషడ్వర్గముఁ బాఱఁద్రోలి సకలవ్యామోహముల్ వీడి సు- స్థిరయోగాంతరదృష్టి మీ చరణముల్ సేవించు పుణ్యాత్మకుల్ వరవైకుంఠపురాంతరాళమున భాస్వల్లీలలన్ ముక్తి తా- మరసాక్షీరతికేలిఁ జొక్కుదురు రామా! భక్తమందారమా! | 35 |
| మ. | ఉదయార్కాంశువికస్వరాంబుజరమాయుక్తంబులై యొప్పు నీ పదముల్ ధ్యానము చేసి ముక్తియువతిం బ్రాపింపఁగా లేక దు- ర్మదవృత్తిన్ బశుమాంస మగ్ని దనరారన్ వేల్చుఁగా దేవతా మదిరాక్షీసురతేచ్ఛ, భూసురుఁడు రామా! భక్తమందారమా! | 36 |
| శా. | ప్రాణివ్యూహలలాటభాగముల లీలాలోలచిత్తంబునన్ పాణీకోకిలవాణినాథుఁడు లిఖింపంబొల్చు భాగ్యాక్షర- శ్రేణిం బెంపఁ గరంబె యెవ్వరికి సంసిద్ధంబు స్వారాట్ఛిరో- మాణిక్యస్ఫురదంఘ్రితామరస రామా! భక్తమందారమా! | 37 |
| మ. | నిను సేవింపని పాపకర్ములకు వాణీనాథగోరాజవా- హనసుత్రామముఖామరప్రవర వాచాగోచరంబై సనా- తనమై ముక్తి రమాసమేతమగు నీ ధామంబు సిద్ధించునే మనురాడ్వంశసుధాబ్ధిసోమ! రామా! భక్తమందారమా! | 38 |
| మ. | మొదలంజేసిన పుణ్యపాపములు సన్మోదాతిఖేదంబులై యదన న్వచ్చి భుజింపఁ బాలుపడు నాహా! యెవ్వరి న్వేఁడిన న్వదలంజాల వవెన్నిచందములఁ దా వారింపఁ జింతించినన్ మదనారాతికినైనఁ దథ్యమిది రామా! భక్తమందారమా! | 39 |
| శా. | ఇందందున్ సుఖమీయఁజాలని మహాహేయార్థసంసారఘో- రాంధూబృందనిబద్ధులై సతతమన్యాయప్రచారంబులన్ గ్రిందున్మీఁదును గానకెంతయును రక్తిన్ ధాత్రి వర్తింతురౌ మందుల్ సుందరమందహాసముఖ రామా! భక్తమందారమా! | 40 |
| మ. | అమరశ్రేష్ఠుని వారువంబునకు దూండ్లాహార మీశానమౌ- ళి మహాభోగికి గాలిమేఁత, నిను హాళిన్మోయు మాద్యద్విహం- గమలోకేంద్రున కెల్లఁ బుర్వుగమియే బోనంబు ప్రారబ్ధక- ర్మ మవశ్యంబ భుజింప కెట్లు చను ? రామా! భక్తమందారమా! | 41 |
| మ. | నరుఁడెల్లప్పుడు నాజవంజవభరానమ్రాత్ముఁడై యున్నఁగా- ని రహస్యంబుగ నీ పదద్వయము ధ్యానింపన్ వలెన్ భక్తితో బరమానందసుధాసారనుభవలిప్సాబుద్ధియై నుర్విఁ గు- మ్మరిపుర్వుం బలెఁ బంకదూరగతి రామా! భక్తమందారమా! | 42 |
| శా. | దానం బాభరణంబు హస్తమునకు దద్జ్ఞానికి న్నీపద- ధ్యానం బాభరణంబు భూసురున కత్యంతంబ గంగానదీ- స్నానం బాభరణంబు భూతలమునన్ నాడెంపుటిల్లాలికిన్ మానం బాభరణంబు తథ్యమిది రామా! భక్తమందారమా! | 43 |
| మ. | అదన న్వేఁడిన యాచకప్రతతి కీయంగావలెన్ రొక్కమిం- పొదవన్ మీ కథలాలకింపవలె మేనుప్పొంగ గంగామహా- నదిలో స్నానము లాచరింపవలె హీనప్రక్రియ న్మాని స- మ్మదచిత్తంబున మర్త్యుఁడెల్లపుడు రామా! భక్తమందారమా! | 44 |
| శా. | ఉద్యానాదిక సప్తసంతతుల బాగొప్పార నిల్పన్ వలెన్ సద్యోదానమునన్ బుధాళి కెపుడున్ సంప్రీతి సల్పన్ వలెన్ ప్రోద్యద్విద్యలు సంగ్రహింపవలె నిత్యోత్సాహియై మర్త్యుఁ డో మాద్యద్దానవకాననజ్వలన! రామా! భక్తమందారమా! | 45 |
| మ. | నిను భక్తిన్ భజియించినన్ గురువుల న్నిత్యంబు సేవించినన్ ధనవంతుండయి గర్వదూరుఁడగుచున్ ధర్మంబు గావించినన్ జనతామోదకపద్ధతి న్మెలఁగినన్ జారుండు గాకుండినన్ మనుజుం డారయ దేవుఁ డిమ్మహిని రామా! భక్తమందారమా! | 46 |
| శా. | అన్యాయంబు దొఱంగి యెల్లరకు నత్యానంద మింపొంద సౌ- జన్యప్రక్రియ నేల యేలునతఁడున్ శాస్త్రానుసారంబుగాఁ గన్యాదానము సేయు నాతఁడును వేడ్కన్ భూసురున్ బిల్చి స- న్మాన్యం బిచ్చినవాడు ధన్యుడిల రామా! భక్తమందారమా! | 47 |
| మ. | చెఱువున్ సూనుఁడుఁ దోటయుం గృతియు నిక్షేపంబునుం దేవమం- దిరమున్ విప్రవివాహమున్ జగతి నెంతే వేడ్క గావించుచున్ నిరతంబున్ భవదీయపాదవిలసన్నీరేరుహద్వంద్వ సం- స్మరణం బూనెడువాఁడు ముక్తుఁడగు రామా! భక్తమందారమా! | 48 |
| శా. | ఆకాంక్షన్ గృహదాసికాసురతలీలాసక్తి వర్తించినన్ లోకస్తుత్యచరిత్ర! సత్కులవధూలోలుండు గాకుండినన్ కోకాప్తాస్తమయోదయంబుల యెడన్ గూర్కూనినన్ మర్త్యుపై మా కారుణ్యకటాక్ష మూన దిల రామా! భక్తమందారమా! | 49 |
| మ. | గణుతింపంగ నరాధముల్ సుకవికిం గాసీనివాఁడున్ దయా- గుణ మొక్కింతయు లేనివాఁడు నొరుపై గొండెంబు గావించువాఁ డణుమధ్యన్ సతిఁ బాసి దాసిపొం దాసించువాఁ డుర్వి బ్రా- హ్మణవిత్తంబు హరించువాఁ డరయ రామా! భక్తమందారమా! | 50 |
| మ. | వృషలీభర్తయు దేవలుండు నటుఁడున్ వేదాభిశస్తుండు మా- హిషికుం డగ్నిద కుండగోళకులునున్ హింసాపరస్వాంతుడున్ విషదుండుం గొఱగాఁడు పంక్తి కెపుడుర్విన్ భక్తసంఘాతక- ల్మషమత్తద్విరదౌఘ పంచముఖరామా! భక్తమందారమా! | 51 |
| మ. | అగసాలిన్ దిలఘాతకున్ యవనునిన్ వ్యాపారి దాసున్ విటున్ జగతీనాథుని వేటకాని గణికన్ జండాలునిన్ జోరునిన్ బ్రెగడం గోమటి జూదరిన్ బుధజనుల్ పెన్రొక్కమర్పింప న- మ్మఁగ రాదెంతయుఁ దథ్య మిద్ధరణి రామా! భక్తమందారమా! | 52 |
| మ. | అలుకన్ మిక్కిలి సాహసంబు ఘనమన్యాయప్రచారంబునుం జలముం దట్టము కామమెక్కుడు మహాజాలంబు శీలంబహో తలపైఁ జేయిడి బాసచేసిన యథార్థం బుర్విపైఁ బుష్పకో- మలుల న్నమ్మఁగరాదు పూరుషులు రామా! భక్తమందారమా! | 53 |
| మ. | కుకవుల్ కూళలు కొంటెతొత్తుకొడుకుల్ కొండీలు కోనారులుం దకతైతత్తలవారు పాచకులు జూదంబాడువారు న్మహిం బ్రకటంబై సిరిగాంచిరీ కలియుగప్రామాణ్య మాశ్చర్య మో మకరాక్షాసురగర్వసంహరణ రామా! భక్తమందారమా! | 54 |
| మ. | కలికాలంబున వైద్యలక్షణపరీక్షాశూన్యమూఢావనీ- తలనాథుల్ బలుమోటకాఁపుదొరలున్ దట్టంబుగా బిల్చి మం- దుల వేయింప భుజించి క్రొవ్వి కడువైద్యుల్ గారె సిగ్గేది? త- మ్మళులన్ నంబులు క్షౌరకాంత్యజులు రామా! భక్తమందారమా! | 55 |
| శా. | దీనత్వంబునఁ గూడులేక చెడి యెంతే భైక్ష్యముల్ గొంచు ల- జ్జానామంబులు లేకయుంబు బలురాజన్యుండు చేపట్టి దా నానావస్తువులిచ్చి వైభవమిడన్ న్యాయజ్ఞుఁడై వాఁడిలన్ మానం జాలునె తొంటినీచగతి రామా! భక్తమందారమా! | 56 |
| శా. | ఎన్నం గార్ధభ ముత్తమాశ్వమగునే; హీనుండు దాతృత్వసం- పన్నుండౌనె; ఖలుండు పుణ్యుఁడగునే; పల్గాకి సాధౌనె; క- ల్జున్నౌనే; మహిషంబ హస్తి యగునే; జోరీగ దేఁటౌనెటుల్ మన్నుం బిల్లి మృగేంద్రమౌనె భువి రామా! భక్తమందారమా! | 57 |
| మ. | బలిభిక్షన్ దయఁ బెట్టఁబూనిన మహాపాపాత్మకుల్ భూమిలో- పలఁ గోట్యర్బుదసంఖ్యయైనఁ ద్రిజగత్ప్రఖ్యాతదానవచ్ఛటా- కలనావర్తితపుణ్యమూర్తియగునే గాటంబుగాఁ బర్వు దో- మలు వేయైన మదద్విపంబగునె రామా! భక్తమందారమా! | 58 |
| మ. | ధరలోనన్ సుకవిప్రణీతబలవద్ధాటీనిరాఘాటభా- స్వర సత్కావ్యకథాసుధారసపరీక్షాదీక్ష విద్వన్మహా- పురుషశ్రేష్ఠున కబ్బు పామరునకే పోల్కిన్ లభించున్ సదా మరుదాత్మోద్భవసేవితాంఘ్రి నల! రామా! భక్తమందారమా! | 59 |
| శా. | పద్యంబేల పిసిండి? కీప్సితము దీర్పన్ లేని జేజేకు నై- వేద్యంబేల? పదార్థచోరునకు నుర్విన్ వేదవేదాంతస- ద్విద్యాభ్యాసకబుద్ధియేల? మది భావింపంగ నెల్లప్పుడున్ మద్యం బానెడువానికేల సుధ? రామా! భక్తమందారమా! | 60 |
| మ. | ముకురంబేటికి గ్రుడ్డివానికి జనామోదానుసంధానరూ- పకళాకౌశలకామినీసురతలిప్సాబుద్ధి ధాత్రి న్నపుం- సకతం గుందెడువానికేమిటికి మీసంబేమిటికిన్ లోభికిన్ మకుటంబేమిటికి మర్కటంబునకు రామా! భక్తమందారమా! | 61 |
| మ. | కుజనున్ ధర్మతనూజుఁడంచు నతిమూర్ఖున్ భోజరాజంచు ఘో- రజరాభారకురూపకారిని రమారామాకుమారుండటం- చు జడత్వంబున వేఁడి కాకవులు కాసుం గానరెన్నంగ సా- మజరాజోగ్రవిపద్దశాపహర! రామా! భక్తమందారమా! | 62 |
| మ. | చలదశ్వత్థతరుప్రవాళమనుచున్ సారంగహేరంబటం- చలరుం దింటెనపూవటంచు ముకురంబంచున్ భ్రమన్ సజ్జనుల్ కళలూరంగ రమించుచున్ వదల రేకాలంబు ముగ్ధాంగనా- మలమూత్రాకరమారమందిరము రామా! భక్తమందారమా! | 63 |
| మ. | సుదతీపీనపయోధరద్వయముపై సొంపొందు నెమ్మోముపై మదనాగారముపైఁ గపోలములపై మధ్యప్రదేశంబుపై రదనావాసంబుపయి న్నితంబముపయిన్ రాజిల్లు నెంతేని దు- ర్మదవృత్తిన్ ఖలుచిత్త మిద్ధరణి రామా! భక్తమందారమా! | 64 |
| మ. | రసికోత్తంసులు సత్కులీనులు మహాద్రాఘిష్ఠసంసారఘో- రసముద్రాంతరమగ్నులై దరికిఁ జేరన్ లేక విభ్రాంతిచేఁ బసులం గాచిన మోటకొయ్యదొరలం బ్రార్థింతురెంతేని దే- మసగాదే యిది యెంచి చూచినను రామా! భక్తమందారమా! | 65 |
| మ. | సరసుం డాతఁడు పెద్ద యాతఁడు మహాసౌందర్యవంతుం డతం డరిహృద్భీకరశౌర్యధుర్యుఁ డతఁ డుద్యద్దానకర్ణుం డతం డురుగోత్రోద్భవుఁ డాత డెవ్వడిల నుద్యోగార్థసంపన్నుఁడౌ మరుదీశోపలనీలమూర్తి ధర! రామా! భక్తమందారమా! | 66 |
| శా. | విత్తంబొత్తుగఁ గూర్చి మానవుఁడు దుర్వృత్తిం బ్రవర్తించి యు- వ్వెత్తుం దేహమెఱుంగలేక తిరుగున్ హేలాగతిన్ బత్తిఁ దాఁ జిత్తాంబ్జంబున మిమ్ముఁ గొల్వఁ డెపు డిస్సీ యెంత పాపంబొకో మత్తారాతినిశాటసంహరణ! రామా! భక్తమందారమా! | 67 |
| మ. | శమ మావంతయుఁ బూననొల్లఁడు గరిష్ఠజ్ఞానవిద్యావిశే- షము గోరంతయు నాత్మలోఁ దలఁపఁ డాచారప్రచారంబు ధ- ర్మము వీసంబును జేయఁజాలఁడు గదా మందుండు పెన్ రొక్కపున్ మమతన్ దేహమెఱుంగలేక ధర రామా! భక్తమందారమా! | 68 |
| మ. | భువిలో లోభులు కూడఁబెట్టిన ధనంబున్ బందికాం డ్రూడిగల్ బవినీలున్ దరిబేసులున్ దొరలొగిన్ బచ్చుల్ నటీదాసికా- యువతుల్ గుంటెనకత్తెలున్ గొనుదు రోహో! యెట్టి కర్మంబొ! హై- మవతిసన్నుతదివ్యనామ! రఘురామా! భక్తమందారమా! | 69 |
| మ. | సిరులెంతేనియు నిక్కువంబనుచు దుశ్శీలన్ మదిన్ నమ్మి ని- ర్భరగర్వంబున మీఁదు చూతు రహహా! భావంబుతో నెంచినం గరికర్ణాంతము లంబుబుద్బుదతతుల్ ఖద్యోతకీటప్రభల్ మరుదగ్రార్పితదీపమాలికలు! రామా! భక్తమందారమా! | 70 |
| మ. | ఇటు రా రమ్మని పిల్చి గౌరవముగా హేమాంబరాందోళికా- కటకప్రాకటభూషణాదు లిడి వేడ్కన్ ఱేఁడు ప్రార్థింప వి- స్ఫుటభంగిం దగు కావ్యకన్య నిడనొప్పున్ గానిచో నుర్వి కో- మటి మేనర్కమె బల్మిఁ గట్టఁగను? రామా! భక్తమందారమా! | 71 |
| మ. | తనకుం బద్యము లల్లి సత్కవులు నిత్యంబుం బ్రసంగింపఁగా విని యొత్తుల్ దిను దాసరిం బలె బయల్వీక్షించుచుం గానియై- న నొసంగన్ మదిలోఁ దలంపని మదాంధక్షోణిపాలుం డిలన్ మను మార్గంబు గ్రహింపఁగాఁ గలడె రామా! భక్తమందారమా! | 72 |
| శా. | ధాటీపాటవచాటుకావ్యరచనోద్యద్ధోరణీసారణీ- వాటీకోద్గతి సత్కవీశ్వరుఁడు నిత్యంబుం దమున్ వేఁడఁగా వీటీఘోటకహాటకాదు లిడ రుర్విన్ నిర్దయాబుద్ధిచే మాటే బంగరు నేటి రాజులకు రామా! భక్తమందారమా! | 73 |
| మ. | పలుమాఱుం ద్విజరాజు లొక్కటఁ దముం బాధింతురంచున్ విషా- నలఘోరాననము ల్ముండుంచుకొని కానన్ రాక దుర్గస్థలం- బుల వర్తించుచు బుస్సురందు రిల నాభోగేశు లెందైననున్ మలఁకల్మాని చరింపఁగాఁ గలరె? రామా! భక్తమందారమా! | 74 |
| మ. | గడియల్ రెండిక సైచి రా వెనుక రా కాసంతసేపుండి రా విడిదింటం గడె సేద దీర్చుకొని రా వేగంబె బోసేసి రా యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుం డీగతిన్ మడఁత ల్వల్కుచుఁ ద్రిప్పుఁ గాసిడక! రామా! భక్తమందారమా! | 75 |
| మ. | బలరాజన్యుఁడు ధూర్తకాకవిఁ గనం గంపించి విత్తంబు దా- నలఘుప్రక్రియ నిచ్చు సత్కవివరున్ హాస్యంబు గావించు నౌ నిల బర్బూరము గాలివానఁ బడుఁగా కింతైనఁ గంపించునే మలయోర్వీధరమారుతంబునకు రామా! భక్తమందారమా! | 76 |
| శా. | కాయస్థు ల్గణికాజనంబులు తురుష్కశ్రేణులున్ దుష్టదా- సేయుల్ వైద్యులునుం బురోహితులు దాసీభూతముల్ గాయకుల్ బోయల్ గొందఱు లోభిభూవరు ధనంబున్ సంతతంబున్ మహా- మాయాజాలము పన్ని లాగుదురు రామా! భక్తమందారమా! | 77 |
| శా. | శ్రీలక్ష్మీ మదయుక్తుఁడై నృపుఁడు వాసిం బేర్చు భూదేవునిం గేలింబెట్టి తదీయకోపమహిమన్ గీడొంచు నెట్లన్న ది- క్ఖేలత్కీర్తి త్రిశంకుం డల్క నలశక్తిం బల్కి తద్వాగ్గతిన్ మాలండై చెడిపోవడోట మును, రామా! భక్తమందారమా! | 78 |
| మ. | లసదుద్యజ్జ్వలభవ్యదివ్యకవితాలంకారవిద్యావిశే- షసమాటోపవిజృంభమాణకవిరాట్సంక్రందనుం ద్రిప్పిత్రి- ప్పి సమీచానతఁ బ్రోవకుండు నృపతుల్ పెంపేది నిర్భాగ్యులై మసియై పోవరే తత్క్రుధాగ్ని నిల రామా! భక్తమందారమా! | 79 |
| మ. | రసికత్వంబును దానధర్మగుణముం బ్రత్యర్థిశిక్షాకళా- భ్యసనప్రౌఢిమ సాధుబంధుజనతాత్యంతావనోపాయలా- లసచిత్తంబును దృప్తియుం గొఁఱత వాలాయంబు దానెంచఁ దా- మసమే మిక్కిలి దుర్నరేంద్రులకు రామా! భక్తమందారమా! | 80 |
| మ. | ఖలభూనాథుఁడు నిచ్చనిచ్చ జనులన్ గారించి విత్తంబు మి- క్కిలిగా గూరిచి పుట్టలో నిఱికి వేఁగింపంగ నుద్దండతం బలవన్మ్లేచ్ఛులు పొంది లావనుచు లే బాధితురౌ పెట్టి జెఱ్ఱిఁజీ- మలు చీకాకుగఁ జేయు చందముగ రామా! భక్తమందారమా! | 81 |
| మ. | అతికష్టం బొనరించి భూమిజనుఁ డత్యాసక్తి విత్తంబు వి- స్తృతభంగిం గడియింపఁగా నెఱిఁగి ధాత్రీకాంతు లుద్దండప- ద్ధతి వానిం గొనిపోయి కొట్టి మిగులం దండించి యా సొమ్ము స- మ్మతిఁ గైకొండ్రు మఱెంత నిర్దయులొ రామా! భక్తమందారమా! | 82 |
| శా. | దానంబిల్లె, దయారసంబు నహి, సద్ధర్మంబు తీర్, మీ పద- ధ్యానంబున్ గడులొచ్చు సత్యవచనవ్యాపారముల్ సున్న సు- జ్ఞానం బెంతయు నా స్తి సాధుజనసన్మానేచ్ఛ లేదెన్న నీ క్ష్మానాథాధమకోటి కేది గతి రామా! భక్తమందారమా! | 83 |
| మ. | తనువుల్ నిక్కములంచు నెంచుకొని యత్యంతదుర్మార్గవ- ర్తనులై నిర్దయమీఱ భూమిప్రజలం దండించి విత్తంబు లా- ర్జవము ల్సేయుచు గొందులం దొదిగి నిచ్చల్గానరాకుంద్రు ఛీ! మనుజాధీశుల కేఁటి ధర్మములు రామా! భక్తమందారమా! | 84 |
| మ. | మురుగుల్ ప్రోగులు నుంగరాల్సరిపిణీ ల్ముక్తామణిహారముల్ తురంగంబు ల్గరు లందబులు భటస్తోమంబులున్ రాజ్యమున్ స్థిరమంచున్ మది నమ్మి పాపములు వే సేతు ర్మదోన్మత్తపా- మరభూవిష్టపదుష్టనాయకులు రామా! భక్తమందారమా! | 85 |
| మ. | మకరోగ్రక్రకచాగ్రజాగ్రదురుసమ్యక్ఛాతదంష్ట్రాక్షత ప్రకటాంఘ్రిద్వయనిర్గళద్రుధిరధారాపూరఘోరవ్యధా- చకితుండై మొఱసేయ నగ్గజపతిన్ సంప్రీతి రక్షింపవే మకుటీభూతశశాంకచాపహర! రామా! భక్తమందారమా! | 86 |
| మ. | అగవిద్వేషణుఁ గూడి వేడుక నహల్యాదేవి గ్రీడింపఁగా భగవంతుండగు గౌతముండు గని కోపస్ఫూర్తి శాపింప నీ జగతిం ఱాపడి తాపమొందగ పదాబ్జప్రస్ఫురద్ధూళిచే మగువం జేసితి వెంత వింత యది రామా! భక్తమందారమా! | 87 |
| మ. | అమరేంద్రాది సమస్తదేవభయదాహంకారహుంకార దు- ర్దదబాహాబలసింహనాద పటుకోదండోగ్రబాణచ్ఛటా- సమజాగ్రత్ఖరదూషణాసురుల భాస్వద్దండకారణ్యసీ- మ మును ల్మలని మెచ్చఁ ద్రుంచితివి రామా! భక్తమందారమా! | 88 |
| శా. | నే నీ బంటను నీవు నా దొర విదే నిక్కంబటంచు న్మదిన్ నానాభంగుల నమ్మి కొల్చితినె యెన్నాళ్ళాయె జీతంబు కా- సైన న్నేఁటి కొసంగవైతి భళి యాహా! లెస్స! బాగాయెగా! మౌనీంద్రాశయపద్మషట్చరణ! రామా! భక్తమందారమా! | 89 |
| మ. | బలదేవుం డతినీచవృ త్తిని సురాపానంబు గావింపఁగా జలజాతాస్త్రుఁడు మానినీపురుషలజ్జాత్యాగముల్ సేయఁగా చలమారంగ నలక్ష్మి సజ్జనుల నిచ్చల పట్టి బాధింపఁగా మలపం జాల విదే వివేక మిల? రామా! భక్తమందారమా! | 90 |
| మ. | అదిరా! పిల్చినఁ బల్కవేటికి? బరాకా చాలు నింకేలఁగాఁ గదరా! మిక్కిలి వేఁడి వేసరిలు బాగా? నీకు శ్రీజానకీ- మదిరాక్షీ శరణంబులాన! నను బ్రేమన్ ద్రోవరా వేడ్క శ్రీ- మదుదంచత్ర్పభుతాగుణప్రథిత! రామా! భక్తమందారమా! | 91 |
| శా. | వందిం బోలి భవత్కథావళులనే వర్ణింతు నత్యంత మీ చందం బొందఁగఁ గొందలం బుడిపి నిచ్చల్లచ్చి హెచ్చంగ నీ వందందుం దిరుగంగబోక దయ నాయందుండు మెల్లప్పుడున్ మందప్రక్రియ మాని పూనికను రామా! భక్తమందారమా! | 92 |
| మ. | అకటా! తావక కావ్యభవ్యరచనావ్యాపారలీలావిలో- లకసత్స్వాంతుఁడనైన నా పయిని నీ లక్ష్మీకటాక్షామృతం బొకవేళం జనుదేర దేమి? దయలేదో యోగిహృత్పద్మస- న్మకరందాసవపానకృద్భ్రమర! రామా! భక్తమందారమా! | 93 |
| మ. | నతమర్త్యవ్రజవాంఛితార్థఫలదానశ్రీవిరాజన్మహో- న్నతమందారమవంచు ధీరజను లానందంబునం దెల్ప నే వ్రతచర్య న్నినువేఁడి వేసరితి ప్రోవన్ రావిదే నీకు స- మ్మతమా! తెల్పుము తేటతెల్లముగ రామా! భక్తమందారమా! | 94 |
| మ. | పదపద్యంబు లొనర్చి నీకొసగనో ప్రాజ్ఞుల్ నుతింపగ మీ పదపద్మంబులు భక్తితోడ మదిలో భావింపనో? యేమిటం గొదవే దేఁటికి జాగుచేసెదవ ? కోర్కులు దీర్పు వేవేగ! శా- మదరాతిక్షణదాచరప్రమద! రామా! భక్తమందారమా! | 95 |
| మ. | క్రతువుల్ సేసెదనంటినా బహుపదార్థంబిల్లె! సంధ్యాజప- వ్రతముల్ సేసెదనంటినా దొరలఁ గొల్వంగావలెం గూటికై ధృతి నిన్వేడెదనంటినా నిలువ దొక్కింతైనగానీ దయా- మతి నన్నేగతిఁ బ్రోచెదో యెఁఱుగ రామా! భక్తమందారమా! | 96 |
| మ. | తగునా పావన తావకీన పదధ్యాననిష్ఠాగరి ష్ఠగతిన్ వర్తిలు మాకు నిప్పు డతికష్టప్రాప్తిఁ గావించి బల్ పగవానిన్ బలెఁ జూడఁగాఁ గటకటా! పాపంపు గాదోటు! జి- హ్మగసమ్రాట్కరకంకణప్రణుత! రామా! భక్తమందారమా! | 97 |
| మ. | నిను నా దైవముగా భజించుటకు నే నిత్యంబుఁ గావించు స- జ్జనతాకర్ణరసాయనప్రకటభాస్వత్ సోములే సాక్షి నీ వనుకంప న్ననుఁ బ్రోచుచుండుటకు నీ యైశ్వర్యమె సాక్షి నీ మనసు న్నా మనసు న్నెఱుఁగు నిది రామా! భక్తమందారమా! | 98 |
| మ. | జయమొప్పార నిను న్మదీయహృదయాబ్జాతంబునం గొల్తు నే- రములెల్లన్ క్షమచేసి ప్రోతువనుచున్ రాఁగం జనన్ నీదు చి- త్తము నా భాగ్య మదెట్టిదో యెఱుగ తథ్యం బిద్ధసంగ్రామధా- మమహాకాయవిరామశాతశర! రామా! భక్తమందారమా! | 99 |
| మ. | జయ! నారాయణ! భక్తవత్సల! హరే! శౌరే! జగన్నాయకా జయ! సీతాహృదయేశ! శేషశయనా! శశ్వద్దయాసాగరా! జయ! పీతాంబర! రామచంద్ర! జలదశ్యామాంగ! విష్ణో! నిరా- మయ! లీలామనుజావతారధర! రామా! భక్తమందారమా! | 100 |
| మ. | సరసప్రస్తుత కూచిమంచికులభాస్వద్వార్ధిరాకాసుధా- కరుఁడన్ గంగనమంత్రినందనుఁడ! రంగత్తిమ్మభూమండలే- శ్వరపర్యార్పిత “బేబదల్” బిరుదవిస్ఫాయజ్జగన్నాథనా మ రసజ్ఞుండను బ్రోవు మెప్డు నను రామా! భక్తమందారమా! | 101 |
| సంపూర్ణము. | ||