| శతకములు | శ్రీమదొంటిమిట్ట రఘువీరశతకము | అయ్యలరాజు త్రిపురాంతకకవి |
| శా. | శ్రీకల్యాణగుణాభిరామ! విబుధశ్రేణీ కిరీటద్యుతి వ్యాకీర్ణాంఘ్రి సరోరుహద్వయ! సహస్రాక్షస్తుతా! యచ్యుతా! నాకుం బ్రాపును దాపు నీవె యగుచున్ నన్నేలుమీ రామభ ద్రా! కారుణ్యసముద్ర! ధీర! రఘువీరా! జానకీనాయకా! |
1 |
| శా. | తారుణ్యోదయ! యొంటిమిట్టరఘునాథా! నీకు నేఁ బద్యముల్ నూఱుం జెప్పెద నూరుఁబేరు వెలయన్ నూత్నంబుగా; నంత నా నోరుం బావన మౌను, నీ కరుణఁ గాంతున్, భక్తి నన్నందఱున్ రారమ్మందురు గారవించి రఘువీరా! జానకీనాయకా! |
2 |
| శా. | ఆ కర్ణాటకమండలాధిపతిచే నాస్థానమధ్యంబులో నా కావ్యంబులు మెచ్చఁజేసితివి నానారాజులుం జూడఁగా నీకుం బద్యము లిచ్చుచో నిపుడు వాణీదేవి నా జిహ్వకున్ రాకుంటెట్లు? వసించుఁగాక రఘువీరా! జానకీ నాయకా! |
3 |
| శా. | నీ కేలన్ దృణ మంది వైవ నదియున్ నిర్ఘాతపాతక్రియన్ గాకాకారనికారదానవుని లోకాలోకపర్యంత మీ లోకంబుల్ పదునాల్గు త్రిప్పినది కాలున్మోపఁగానీక యౌ రా! కాకుత్స్థ కులాగ్రగణ్య! రఘువీరా! జానకీనాయకా! |
4. |
| మ. | సకలామ్నాయములం బఠించు ఫల మబ్జాతాక్షు నామంబులం దొక టేదైనఁ బఠింపఁ గల్గు నటువం టుత్కృష్ట పుణ్యప్రవ ర్తకనామంబులు చక్రపాణికి సహస్రంబుండుఁ దత్తుల్య మ ర్కకులా! నీ శుభనామ మౌర! రఘువీరా! జానకీనాయకా! |
5 |
| శా. | కొంకం గారణ మేమి ధర్మములు పెక్కుల్ చేసి మర్త్యుండు నీ వంకం జిత్తము నిల్పలేక పెరత్రోవల్ త్రొక్కినన్ సర్వముం బొంకై పోవుఁ; గురంగనేత్ర తగునోముల్ వేయునున్ నోచి తా ఱంకాడంగఁ దొడంగినట్లు రఘువీరా! జానకీనాయకా! |
6 |
| శా. | ఆ గౌరీశ్వరకీర్తనీయుఁ డగు ని న్నర్చింపఁగా లేనివా రోగు ల్గారొకొ చాల యోగ్యులయినన్ యోగానుసంధాను లీ మాగుల్గాన యథార్థమాడితిని నీమంత్రంబె మంత్రంబురా! రాగద్వేషవిదూర! ధీర! రఘువీరా! జానకీనాయకా! |
7 |
| మ. | జగముల్ మూఁడు సృజింపఁబ్రోవఁ బిదపన్ సంహారముం జేయఁగాఁ ద్రిగుణాకారముఁ దాల్చినట్టి వరమూర్తీ! వాసుదేవా! హరీ! నిగమస్తుత్యపవిత్రగాత్ర! నృహరీ! నీలాభ్రవర్ణా! మహో రగతల్పా! జనకల్పభూజ! రఘువీరా! జానకీనాయకా! |
8 |
| శా. | నీ చారిత్రముఁ జెప్ప నద్భుతమగున్, నీ నామసంకీర్తనం బాచండాలునకైన మోక్ష మొసఁగున్, హత్యాదిదోషంబులన్ వే చించున్ విదళించుఁ ద్రుంచుఁ దునుమున్ వేఁటాడు నంటంబడున్ రాచుం ద్రోచు నడంచు నొంచు రఘువీరా! జానకీనాయకా! |
9 |
| శా. | తేజం బొప్పఁగ నీవె కావె మొదలం ద్రేతాయుగాంతంబునన్ రాజై పుట్టితి వింక నీకలియుగాంత్యం బందునన్ రౌతవై వాజిం దోలి విరోధులం దునుమ దేవా! నీవ యొండెవ్వఁ డా రాజున్ రౌతును నీవె కావె రఘువీరా! జానకీనాయకా! |
10 |
| శా. | గాజుం బూస సురేంద్రనీలమణిగాఁ గల్పించు చందంబునన్ బాజుం జర్మము మీఁది బేగడపొరల్ బంగార మౌ రీతిగన్ నా జన్మంబు పవిత్రభాజనముగా నన్నేల రావేలరా రాజీవాక్ష! కృపాకటాక్ష! రఘువీరా! జానకీనాయకా! |
11 |
| శా. | నా జన్మాంతర వాసనావశమునన్ నాపాలి భాగ్యంబునన్ నా జాడ్యంబులు పోవుకాలముతఱిన్ నా పుణ్యపాకంబునం దీజన్మంబున నిన్నుఁ గొల్వఁ గలిగెన్, హీనుండఁ గా నింక, నే రాజన్, నాకెదు రెవ్వ రుర్వి? రఘువీరా! జానకీనాయకా! |
12 |
| శా. | నేఁటం దీఱె ననేకజన్మములనుండి న్నన్ను వెంటాడుచున్ వాటంబై చనుదెంచు పాపములు; శ్రీవత్సాంక! యీవంక నీ పాటల్ పాఠము సేయువారికి మఱిం బాపంబులం బాపుఁ గ ర్ణాటాధీశ్వర! యొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా! |
13 |
| మ. | పటునిర్ఘాత కఠోరనాదము ఘనబ్రహ్మాండ భాండంబుఁ బి క్కటిలం జేయుచు వచ్చునప్పు డితరుల్ గాండీవినామంబు లె న్నుట మేలందురు; వైష్ణవుల్ తలఁప రన్యుం గోరి యెంతెంత దు ర్ఘటముల్ వచ్చిన నిన్నెగాక రఘువీరా! జానకీనాయకా! |
14 |
| మ. | కొడుకు ల్బ్రహ్మలు, కూఁతు రీశ్వరశిరఃకూటంబుపైఁ గాఁపురం, బుడురాజుం దినరాజుఁ గన్ను, లహిరా జుయ్యాలమంచంబు, నీ పడఁతుల్ శ్రీయు ధరిత్రియున్, సవతు చెప్పన్ లేరు నీకన్యు, లా ఱడి మర్త్యు ల్గనలేరుగాక రఘువీరా! జానకీనాయకా! |
15 |
| మ. | వడి మీఱంగ నమోఘమై నిగుడు నీ వాలమ్ము వాలమ్ముఁ దాఁ కెడు నంచున్ మెడ యొడ్డినన్ జమరిపైఁ గీల్కొన్న కారుణ్య మే ర్పడ మున్నేసిన యమ్ము వేఱె యొక నారాచమ్మునం ద్రుంచి పే ర్పడి తౌరా విలుకాండ్రలోన రఘువీరా! జానకీనాయకా! |
16 |
| మ. | చెడుగన్, గష్టుఁడ, దుష్టచిత్తుఁడఁ, బరస్త్రీలోలుఁడన్, బాలుఁడన్ జడుఁడన్, మూఢుఁడఁ, గొండెకాఁడను, దురాచారి, న్నిషిద్ధాత్ముఁడన్ గడుసంగాకరిఁ గల్ల గుల్లఁ గపటిన్ గర్విన్ ననుం గావు మూ ఱడి యున్నాఁడను నీవె దిక్కు రఘువీరా! జానకీనాయకా! |
17 |
| మ. | అడుగున్విద్యకు లోనుజేసితివి న న్నావంత నావంతలే కడియాసల్ గొనుచున్ దురాత్మకుల నే నర్థించుచున్నాఁడ; నె న్నఁడు రక్షించెదు, నీవు నన్ను బలె నెన్నం బేదవా? యేల యా ఱడిఁ బెట్టంగ? రమావిహార! రఘువీరా! జానకీనాయకా! |
18 |
| మ. | ప్రణుతింపన్ మృతదేహుఁ జూచి బ్రదికింపన్ బ్రహ్మరుద్రుల్ మరు ద్గణనాథాదులు నోప, రద్భుతము గాఁగన్ నీదు భృత్యుండు ల క్ష్మణు ప్రాణంబులు దెచ్చెఁ జచ్చినతఱిన్ సంజీవనీప్రక్రియన్ రణభూభాగములోనఁ దానె రఘువీరా! జానకీనాయకా! |
19 |
| శా. | ఏ తాత్పర్యము గల్గి కొల్చెదవురా? యే నేల నిన్మెత్తురా? నీతో నాకుఁ బనేమిరా? యనక మన్నింపం దగున్; మున్ను నీ చేతన్ మోక్షముఁ గన్నవారి వినమా చిత్రంబుగా నిర్జరా రాతిన్ నాతిని రాతిఁ దొల్లి రఘువీరా! జానకీనాయకా! |
20 |
| శా. | దాతల్ ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్ భ్రాత ల్దక్కినవారు చుట్టములు మీపాదాలపై నాన నా దాత ల్ద్రాతలు తల్లిదండ్రులు మఱిన్ దైవంబు లాప్తుల్ చెలుల్ భ్రాతల్ సర్వము నీవె కావె రఘువీరా! జానకీనాయకా! |
21 |
| మ. | శ్రుతిపాథోధి మథించి శాస్త్రమహిమ ల్శోధించి యష్టాదశ స్మృతు లాలించి మహేతిహాసకథలుం జింతించి తా రొక్క స మ్మతమై సన్మును లాచరించిన మహామార్గంబు నీసేవ; దు ర్మతు లీమార్గముఁ గానలేరు రఘువీరా! జానకీనాయకా! |
22 |
| మ. | మతి నూహింపరు కొంద ఱీసుకృత మేమార్గంబునం దున్న ను గ్రతపోధ్యానము సామగానమును దీర్థస్నానమున్ దానమున్ గ్రతుసంధానము లేల? నేలఁ దులసిం గర్వయ్యెనో? యూర నీ ప్రతిమ ల్లేవొ నమస్కరింప? రఘువీరా! జానకీనాయకా! |
23 |
| మ. | సుతు లంచున్ హితు లంచు బంధుజను లంచుం దల్లులుం దండ్రులున్ సతులుం బౌత్రులు నంచు నెంచుకొనుచున్ సంసారమోహాబ్ధిలో గతజన్మంబులఁ దేలుచున్ మునుఁగుచున్ గర్వించి యే ని న్ననా రతముం గొల్వని మోస గల్గె రఘువీరా! జానకీనాయకా! |
24 |
| మ. | క్షితిలోఁ దామును బ్రహ్మసృష్టికిఁ బునస్సృష్టిన్ వినిర్మించియున్ గ్రతువిఘ్నం బొనరించు దానవుల వీఁకం దోలఁగా లేక నాఁ డతిబాలున్ నినుఁ దోడు తోడుకొనిపోఁడా గాధిసూనుండు నీ ప్రతివీరాగ్రణి యెవ్వఁ డింక? రఘువీరా! జానకీనాయకా! |
25 |
| మ. | క్షితిలో నల్పులమీఁదఁ జెప్పిన కృతుల్ ఛీఛీ నిరర్థంబులౌ నుతిపాత్రమ్ములు గావు మేఁక మెడ చన్నుల్ నేతిబీఱల్సుమా వితత ప్రౌఢిమ నీకుఁ జెప్పిన కృతుల్ వేదాలు శాస్త్రాలు భా రత రామాయణముల్ దలంప రఘువీరా! జానకీనాయకా! |
26 |
| శా. | సంతానంబును బారిజాతకమహీజాతంబు మందారమున్ జింతారత్నముఁ గామధేనువు సుధాసింధూత్తమంబున్ మదిన్ జింతింపన్ సరిగావు నీకు విజయశ్రీధామ! యో రామ! య శ్రాంతత్యాగ వివేకపాక! రఘువీరా! జానకీనాయకా! |
27 |
| శా. | ఏ దైవాల వరాలకంటె సులభం బెవ్వారికైనన్ మదిన్ నీ దాతృత్వము చెప్పనేల శరణంటేన్ గాతు వింతేల నీ పాదాంభోజరజంబు రాతికయినన్ బ్రాణంబు లీఁజాలు నౌ రా! దిక్పూరితకీర్తిపూర! రఘువీరా! జానకీనాయకా! |
28 |
| శా. | విందున్ వేదపురాణశాస్త్రముల గోవిందున్ ముకుందున్ హరిన్ విందున్ వేల్పులలోన భక్తసులభున్ విశ్వంభరున్ సచ్చిదా నందున్ నందుఁడు కన్న చిన్నశిశువున్ నాపాలి పాపాళిఁ బా ఱం దోలంగ నృసింహు నిన్ను రఘువీరా! జానకీనాయకా! |
29 |
| శా. | సందిం బూసలలోన నీ కవచరక్షామంత్రరాజంబుఁ బెం పొందన్ వ్రాసి ధరించినాతఁడు రిపువ్యూహంబులో నైన నే కందుం బొందక వజ్రపంజరములోఁ గాఁపున్న చందానఁ బా ఱం దోలుం బగవారి నౌర రఘువీరా! జానకీనాయకా! |
30 |
| మ. | వృథగా దెవ్వఁడు నిన్నుఁ గొల్చినఁ గృపన్ వీక్షించి వాఁ డేమనో రథముల్ వేఁడిన నట్లె సేయుదువుగా రక్షావిధేయుండవై కథగాదీ వచనంబు నిక్క మటులే కాదేని మున్నేల సా రథివై తర్జునుతేరిఁ దోల రఘువీరా! జానకీనాయకా! |
31 |
| మ. | ఘనసారంబును లోనికిం గొనిన శ్రీగంధంబుఁ బైఁ బూసినన్ దినమున్ మర్దనఁ జేసినం గడిగినన్ దిష్టంబులోనం దొలం గని దుర్గంధము నైజ మీముఱికి డొక్కల్ నమ్మి ని న్గొల్వనే రని మూఢాత్ముల నేమి చెప్ప రఘువీరా! జానకీనాయకా! |
32 |
| మ. | ఇనుమా రాశ్రితు నిల్ప; వాడ వినుమా రేమాటయున్; సాయకం బినుమా రాహవభూమిఁ బూన; విదిగా కింకొండు మేలంచు నీ వినుమా రీ దురితాంధకారపటలం బేరీతి వీక్షింతు? వు గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! |
33 |
| మ. | మును నే నెన్నఁడు వేదశాస్త్రపఠనంబుల్ రిత్తతీర్థాటనం బును దానంబును జేయఁ బోను సతతంబున్ నిన్ను సేవించి కీ ర్తనఁ జేయన్ మతిలేదు దానమున కర్థం బల్ప మింకెట్లు బో రన నా దుష్కృతముల్ దొలంగు? రఘువీరా! జానకీనాయకా! |
34 |
| మ. | విను నా కెన్నియొ దోసముల్ గలవు నొప్పిం బొందఁగా మ్రంద ర మ్మని రౌద్రంబుగఁ గాలుబంటు లన నే రాఁపేరు? నా పేరుఁ బె ట్టినవానిన్ బరలోకదూరుఁడని యండ్రే పొండు పొండంచు బో రన సాయమ్మయి యడ్డగింపు రఘువీరా! జానకీనాయకా! |
35 |
| మ. | అనఘంబైన దశాశ్వమేధకృత పుణ్యస్ఫూర్తి నీకొక్క మా టు నమస్కారము సేయఁ గల్గునని విందున్; యాగధర్మంబులున్ గొనసాగున్; జననంబు లుక్కడఁగు నీకున్ మ్రొక్కెనేనిన్ బున ర్జననంబేది దలంచి చూడ రఘువీరా! జానకీనాయకా! |
36 |
| మ. | దనుజారి జ్వలనాంతకాసుర సముద్రస్వామి వాయు త్రిలో చనమిత్రాభవ సూర్యసోమధరణీజాతాంబుజాత ద్విష జ్జననాంగీరస శుక్రభానుతనయ స్వర్భానుకేతు ప్రవ ర్తనముల్ నీ విభవంబులౌర రఘువీరా! జానకీనాయకా! |
37 |
| మ. | కనుఁగొన్నప్పుడె గుప్పఁడే కుజనులం గాలుండు కాలుండు పొం డనుచున్ రౌరవనారకాగ్నులఁ బడన్ హత్తించి, యయ్యగ్నుల న్మునుఁగం జాలఁ బరేతరాజునకు న న్నొప్పింపఁగాఁ బోవ కు గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! |
38 |
| మ. | నిను సేవించెద నంచుఁ గోరుకొనియున్నేన్ వానికిం బూర్వక ర్మనిమిత్తంబులు కష్టముల్ గలుఁగఁగా మన్నించి నీవడ్డ మౌ దని చెప్పంబడు, ద్రౌపదిం గరినిఁ బ్రహ్లాదున్ ధ్రువున్ మున్ను బో రన రక్షించుట కల్దొ లేదొ రఘువీరా! జానకీనాయకా! |
39 |
| మ. | అనిశంబున్ నినుఁ గొల్చు మానవులు ప్రాణాంతంబునన్ రోగబా ధ నిమిత్తంబున రామరామ యనుచున్ దల్పంగ లేకుండినన్ జననాథాగ్రణి! నీవు వారి రసనాస్థానంబున న్నిల్చి బో రన రామా! యనిపింతు వౌర! రఘువీరా! జానకీనాయకా! |
40 |
| మ. | ఇనవంశోత్తమ! వేదశాస్త్రములలో నే వింటి నేవింటి వాఁ డును నీకుం బ్రతిగాఁడు, నీకుఁ గల బంటు, న్నన్ను రక్షింపు; కా లుని బంట్లన్ విదళింపఁగా వలయు, నాలో నుండుమీ గండుమీ ఱ నమోఘాస్త్రము విల్లుఁ బూని రఘువీరా! జానకీనాయకా! |
41 |
| మ. | జననాథాగ్రణి! నిన్నుఁ గొల్చునతఁ డాచండాలుఁడైనం బున ర్జననం బొందక ముక్తిఁ గాంచు నొనరన్ సద్భక్తుఁడైనం దుదిన్, జనుఁ జండాలకులంబులోన నుదయించం గోరి నీ నామకీ ర్తన సేయ న్నిరసించెనేని రఘువీరా! జానకీనాయకా! |
42 |
| మ. | జనకుం డెవ్వఁడు నీకు? నీ కడుపులో సర్వంబు నుండంగ నీ యునికి స్థానము దుగ్ధవార్ధి నడుమన్ యోగీంద్రహృద్గేహ! యే మని వర్ణింపుదు నీ మహత్త్వములు సర్వాశ్చర్యముల్ పుణ్య వ ర్తన రాజన్యయశోవిహార రఘువీరా! జానకీనాయకా! |
43 |
| మ. | జనకుండా జనకుండు నీ సతికిఁ, గౌసల్యా యహల్యాఘమో చన!నిన్ గాంచిన తల్లి, పంక్తిరథుఁడా సర్వేశ! మీ తండ్రి, యే మి నిమిత్తంబున నుద్భవించితివొ నెమ్మి న్నిట్టు లీపుట్టు వు గ్రనిశాటాంతక! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! |
44 |
| మ. | హనుమంతుం డొక యబ్ధి దాఁటె నని యేలా ప్రస్తుతుల్ సేయఁగా దనుజారాతి! భవత్పదాబ్జములు హృత్పద్మంబున న్నిల్పు నా ఘనపుణ్యుండు భవాంబురాశులు తృణీకారంబుగా దాఁటు బో రన నెన్నైనను గొంకులేక రఘువీరా! జానకీనాయకా! |
45 |
| శా. | నీ పాదోదక మక్షులం దదుముకొంటిం, గొంటి నాలోనికిన్, నీ పళ్లెంబు ప్రసాదముం గుడిచితిన్, నీ పేరునుం బెట్టితిన్, నీ పెన్ముద్రలు దాల్చితిన్ భుజములన్, నీవింక నన్నేగతిన్ బ్రాపై ప్రోచెదొ కాని పూని రఘువీరా! జానకీనాయకా! |
46 |
| మ. | తపముల్ చేసినఁ బోనిపాపములు మంత్రంబుల్ సమర్థంబుగా జపముల్ చేసినఁ బోని దోషము నదీస్నానంబునం బోని ఘో రపుఁ గర్మంబులు వాయు నొక్కమఱి శ్రీరామా యనే మాట క ర్ణపుటం బించుక సోఁకెనేని రఘువీరా! జానకీనాయకా! |
47 |
| మ. | కంపింతున్ మును దండధారికిని మత్కాయంబు వీక్షించి శం కింపం గారణ మేమి నాకిఁక నినున్ గీర్తించుచున్నాఁడ; బల్ దుంపల్ గట్టిన ఘోరపాపముల సంధు ల్గోసివేయంగ బల్ ఱంపంబైనది నీ చరిత్ర రఘువీరా! జానకీనాయకా! |
48 |
| శా. | నీ మంత్రంబు సదా సదాశివుఁడు పత్నీయుక్తుఁడై కాశిలో నేమం బొప్ప జపించె నంచు శ్రుతులన్ని న్నిన్నె వర్ణింపఁగా నేమా నిన్ను నుతించువార మయినన్ నిన్నెంతు నోరారఁగా రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! |
49 |
| శా. | నీ మంత్రంబు జపించు మానవులకున్ నిశ్శ్రేయ మౌ నర్థముల్ హేమంబు ల్గొడుగుల్ తురంగములు మత్తేభంబు లాందోళికల్ గ్రామంబుల్ నగరంబులున్ విభవముల్ రాజ్యంబులున్ రత్నముల్ రామారత్నము లేమిలెక్క రఘువీరా! జానకీనాయకా! |
50 |
| శా. | గోమేధాధ్వర వాజిమేధశతముల్ గోదాన భూదానముల్ హేమాద్రుల్ తిలపర్వతంబులు సువర్ణేభాశ్వదానంబులున్ నీ మంత్రంబగు నక్షరద్వయముతో నే పుణ్యముల్ పోల వో రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! |
51 |
| శా. | గోమాంసాశని, మద్యపాని, నగరిన్ గొండీఁడుఁ, చండాలుఁడున్ హేమస్తేయుఁడు, సోదరీరతుఁడు, గూ డేకాదశిన్ భుక్తిగొ న్నామూఢాత్ముఁడు లోనుగాఁ గలుగు దుష్టాచారుఁడైనం దుదిన్ రామా! యన్నను ముక్తిఁ గాంచు రఘువీరా! జానకీనాయకా! |
52 |
| శా. | ఏమీ పాతకులార! మా పురికి రా రీపట్టునం దున్నత శ్రీమైఁ బోయెద రెందుకన్న జమునిం గ్రేగన్నులం జూచుచున్ రామయ్యా! యిఁక నంచుఁ బల్కి యపవర్గస్థానమున్ జొత్తురో రామయ్యా! నినుఁ గొల్చువారు రఘువీరా! జానకీనాయకా! |
53 |
| శా. | స్వామిద్రోహికిఁ దమ్ముఁడెట్లు? ఘనరాజ్యంబేల నీవిచ్చుటె? ట్లామాటల్ విని కాదె నిన్నడుగ నత్యాసక్తి నాకున్న దొ డ్డేమిన్ పల్మఱు వేసరింపఁ గవి నే నీరాదె నీ సీమలో గ్రామం బొక్కటి చాలు నాకు రఘువీరా! జానకీనాయకా! |
54 |
| శా. | మామా యంచును మామ యంచు నెపుడే మా యల్లుఁ డుద్యద్గతిన్ హేమాద్రిప్రతిమానమైన యొక విల్లేపార మో పెట్టఁగా సామర్థ్యంబున మేటి యీతఁడని నీ సత్త్వంబె వర్ణింతు నో రామా! రాఘవ! రామభద్ర! రఘువీరా! జానకీనాయకా! |
55 |
| మ. | కమురం గ్రాఁగిన లోభివాని తల పున్కం, గుక్కమాంసంబు మ ద్యముతో వండుచుఁ దిన్న మాలఁడయినం, దత్పాపకర్మంబులన్ యమకూపంబుల లోపలం బడఁడు జిహ్వాగ్రంబునన్ రామమం త్రముఁ బేర్కొన్నను నొంటిమిట్ట రఘువీరా! జానకీనాయకా! |
56 |
| మ. | యమకూపంబుల లోపలం బడి మహాహైన్యంబునుం బొందకుం డ ముదంబారఁగ నన్నుఁ బ్రోచి కరుణన్ సాయుజ్యమిమ్మీ తుదిన్ గ్రిమిరూపుం దన రూపుగాఁ బెనిచి రక్షింపన్ విచారించునా భ్రమరంబుం బలెఁ బాపదూర! రఘువీరా! జానకీనాయకా! |
57 |
| మ. | మమకారంబున సర్వకాలమును నీ మంత్రంబు వాక్రుచ్చు డెం దము నాకుం గలుగంగని మ్మటులయైనన్ మృత్యువక్త్రమ్ము దూ ఱము; నిన్నున్ మతి దూఱ మంత నపవర్గస్వర్గమార్గంబు దూ రము గాకుండును మాకుఁ జేర రఘువీరా! జానకీనాయకా! |
58 |
| మ. | తమ గర్వంబునఁ దారు పొంగిపడుచున్ దైవంబు మంత్రంబుఁ దం త్రములన్ వీడఁగ నాడుచున్ దిరుగు నిర్భాగ్యుల్ మహారాజులై మము నూరింపఁగ నేము నిన్నెఱిఁగి నీ మంత్రం బెఱింగిన్ దరి ద్రమతిన్ వేడఁగఁ బోవుటెట్లు రఘువీరా! జానకీనాయకా! |
59 |
| మ. | హిమధామ ప్రతిమాన కాంతియుతులై యింద్రాది దిక్పాలకుల్ తములన్ స్తోత్రముచేయ నుండుదురు నీ దాసానుదాసుల్ సుర ప్రమదాపల్లవపాటలాధర సుధాపానాది కేలీవిహా రములన్ మీఱుచు మీరు చూడ రఘువీరా! జానకీనాయకా! |
60 |
| శా. | మిమ్ముం గొల్చి తలంచి పాపముల నెమ్మిన్ సోఁక రానీక నే నెమ్మిన్ సౌఖ్యముఁ బొందువాఁడ ననుచున్ నీ మూర్తి భావించెదన్ రమ్మా వీని తలంపు మేలని కృపన్ రక్షింప నాలోనికిన్ రమ్మా నన్నుఁ గృతార్థుఁ జేయ రఘువీరా! జానకీనాయకా! |
61 |
| మ. | ప్రమదారత్న మహల్య గౌతముని శాపప్రాప్తి పాషాణరూ పముతోఁ బెక్కుయుగంబులుండఁగ హరబ్రహ్మాదులుం బాపలే ని మహాపాపము పాపనోపినదిగా నీ పాదరేణుప్రకా రము నేనేమని సన్నుతింతు రఘువీరా! జానకీనాయకా! |
62 |
| శా. | నా యజ్ఞానముఁ బాపుమంచు మదిలో నానాప్రకారంబులన్ గూయం గూయ నదేమిరా యనవు నీకున్ మ్రొక్కనా? కుక్కనా? చీ యంచేటికి రోఁతగించెదవు? నీచిత్తంబు రాకుండినన్ బ్రాయశ్చిత్తము నాకునెద్ది? రఘువీరా! జానకీనాయకా! |
63 |
| మ. | నియమంబొప్ప ననేకజన్మములనుండిన్ దాఁచుకొన్నట్టి సం చయదోషంబుల మాటమాత్రమున దోఁచంబోవు చోరత్వ మె న్ని యుపాయంబుల నభ్యసించినవియో నీ నామముల్ వేయు నా రయ నిన్ను న్వివరించుటెట్లు రఘువీరా! జానకీనాయకా! |
64 |
| మ. | సకృపాలోకన! నందగోపుని తనూజాతుండవై గొల్లవై సకలక్షోణుల నేలినాఁడవఁట, మించం గశ్యపబ్రహ్మ గ న్న కుమారుండన మిన్నుముట్టి కుఱుచై నాఁడేల నాడేల నే రక దానంబుగ వేఁడుకొంటి రఘువీరా! జానకీనాయకా! |
65 |
| శా. | చీరల్ దీయకు చన్నుగుబ్బల పయిం జీకాకుగాఁ గాకుగాఁ జీరల్ దీయకు మందబోయఁడిదె వచ్చే బ్రొద్దు రావల్దు నా జారా! మేలను జారలం గవయు కృష్ణా! యేకపత్నీవ్రత ప్రారంభం బిపుడేల నీకు రఘువీరా! జానకీనాయకా! |
66 |
| మ. | తిరునామంబు ధరింపఁడేని నొసలన్ దిక్పూరితంబైన నీ వరనామంబుఁ దలంపఁడేని మదిలో వాంఛించి నీ పాదపం కరుహ శ్రీతులసీదళోదకముఁ ద్రాగండేని వాఁడేటి నే ర్పరి వైకుంఠపురంబుఁ జేర రఘువీరా! జానకీనాయకా! |
67 |
| మ. | శరణంబన్నను మాటమాత్రమున విశ్వద్రోహి తోఁబుట్టుకున్ గరుణాపూర్ణవిలోకనం బొదవ లంకారాజ్యసింహాసన స్థిరపట్టం బొనరించినాఁడ వఁట యేదేవుండు నీసాటి యు ర్వరలోనన్ భవరోగదూర! రఘువీరా! జానకీనాయకా! |
68 |
| మ. | పరనారీ కుచకుంభపాలికలపైఁ బాదాబ్జయుగ్మంబుపైఁ గరమూలంబులపైఁ గపోలతటిపైఁ గంఠంబుపైఁ గొప్పుపైఁ బరువుల్ వాఱెడు నా తలంపులు మిమున్ భావింపఁగాఁ జేసి స ర్వరసాధీశ్వర! నన్నుఁ బ్రోవు రఘువీరా! జానకీనాయకా! |
69 |
| మ. | నరకుల్ క్రాఁగిన యిన్పకంబముల నంటంగట్టఁగాఁ గొట్టఁగాఁ బొరలం బొర్లఁగఁ గక్కరాలఁ గొని వీఁపు ల్గోయఁగా వ్రేయఁగా నరకావాసులలోన నుండుదురు నీ నామంబు వర్జించి దు ర్మరణంబు ల్గని చన్నవారు రఘువీరా! జానకీనాయకా! |
70 |
| మ. | పురసంహారుని చాపమున్ జివుకువంబున్ ద్రుంచి పోఁజూచినన్ బరశూదగ్రభుజుండు పోవిడుచునే భంజించుఁగాకంచు ని ష్ఠురముల్ పల్కిన భార్గవున్ భుజబలాటోపంబు వారించి ని ర్భరశాంతంబునఁ గాచితౌర రఘువీరా! జానకీనాయకా! |
71 |
| మ. | స్మరసంహారుఁడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ నే రాను, శ్రీ హరినామంబులు వేయునెన్నవలె నిత్యంబైన నోమన్న నో యరవిందానన! వేయునేటికిని రామా యన్నఁ జాలన్న మం త్రరహస్యంబుఁ దలంతు నేను రఘువీరా! జానకీనాయకా! |
72 |
| శా. | బాలత్వంబునఁ గొంతకాలము వృథా పాపంపు దుర్బుద్ధినై చాలన్ జవ్వనమందు గర్వమతినై సంసారినై దుష్క్రియా జాలభ్రాంతిఁ జరింతుఁగాని నినుఁ గాంక్షం గొల్వలేదయ్య హే రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా! |
73 |
| శా. | సాలగ్రామ శిలాశిలోచ్చయ గయాస్నాన ప్రయాగస్థలుల్ పోలం జూచెద నంచుఁ బోవఁదలఁతున్ బోలేను మీదాసులన్ బోలం గానఁగ బుద్ధిపుట్ట దిఁక నేఁ బుణ్యాత్ముఁ డౌటెట్లు? హే రాళంబైనది చింత వంత రఘువీరా! జానకీనాయకా! |
74 |
| మ. | కొలువం జాలక మాన, నీ నుతులు పెక్కుల్ సేయుటన్ మాన, నిన్ దలఁపం జాలక మాన, నేఁ గలసి నీ దాసానువర్గంబుతో నిలువం జాలక మానఁబో! కడపటన్ నీనామముల్ విన్నవా రలకుం గల్గును మోక్షలక్ష్మి రఘువీరా! జానకీనాయకా! |
75 |
| మ. | తలఁపం జిత్రము మీ మహత్త్వములు మీ దాసుల్ మహాభాగ్యవం తులు త్రైలోక్యమునన్ బదస్థుఁడు ధ్రువుం డుండున్ నభోమండలిన్, బలి పాతాళమునన్, విభీషణుఁడు భూభాగంబునం, బద్మజ ప్రలయంబైనను బోవరౌర! రఘువీరా! జానకీనాయకా! |
76 |
| మ. | చెలఁగన్ మర్త్యులు వేగి లేచి తమిచేఁ జేయంగఁ బాపంబు లీ కలుషంబుల్ పెడఁబాయ నేదిగతి? యింకన్ ద్రోవ యొండెద్ది? పు ర్వులగుంటం బడనీని పోకడయు నేర్పున్ బుద్ధియుం గల్గువా రలు నీ సేవకు లౌట లెస్స రఘువీరా! జానకీనాయకా! |
77 |
| మ. | కలకాలంబు వ్రతంబులుం దపములుం గావించి యన్యు ల్తుదిన్ గలకాలంబును బోలె నిర్జరపురీకాంతాకుచాలింగనం బులఁ గొన్నాళ్లు సుఖించి క్రమ్మఱ నిలం బుట్టంగ నే మెచ్చ ని ర్మలముక్తిన్ నినుఁ గొల్చి కాంతు రఘువీరా! జానకీనాయకా! |
78 |
| మ. | నిలువెల్లం బులకాంకురంబు లొదవన్ నీపాదతీర్థంబుతోఁ దులసీపర్ణ మొకించుకంత గొనినన్ దోషాలు ఖండించుఁ గా! పొలపాకుల్ దినఁ గాననంబుల బడిన్ బోనేల మోక్షంబు కూ రలను న్నారల నేల గల్గు? రఘువీరా! జానకీనాయకా! |
79 |
| మ. | చెలువంబొప్ప సువర్ణముద్ర లితరుల్ చెల్లించుటే క్రొత్త, కా కల నీ ముద్రలు చూడఁ జెల్లుబడి చక్రాలంచు వేయించుమం డలనాథాగ్రణి క్రొత్త, నీ బలిమి నానావర్ణపుం దోలుము ద్రలు చెల్లించితి విందు నందు రఘువీరా! జానకీనాయకా! |
80 |
| మ. | ప్రళయాపాదిత కాలమృత్యువగు నీ రాకాసి రాకాశివా దులు వారింపఁగ నేర రింక నెటఁ జొత్తుం జత్తుఁ గాకన్న సం చలితుం గౌశికుఁ గాచి తాటక మహాస్త్రజ్వాలచేఁ ద్రుంచి దో ర్బలశక్తిన్ విలసిల్లితౌర! రఘువీరా! జానకీనాయకా! |
81 |
| మ. | చిలుకన్ ముద్దులు చిల్క బిల్చుతఱి రాజీవాక్షి యొక్కర్తు ని చ్చలు రామా రఘురామ రావె యనినన్ సాలోక్యసాయుజ్యమున్ కొలఁదు ల్మీఱఁగ నిచ్చినాఁడవఁట నిన్నున్ బిడ్డపే రిడ్డవా రల పుణ్యంబున కెద్దిమేర రఘువీరా! జానకీనాయకా! |
82 |
| మ. | ఇల నిన్నుం దొలుబామునం దలఁప నే నీజన్మమందైన నా తలఁపు ల్మీపదపంకజంబులపయిన్ దాపింతు నే నింక బు ట్టలలోఁ జెట్టులలోన నంబువులఁ బుట్టం బుట్టఁగా నోపఁ గ ర్మలతాబంధము మాపవయ్య! రఘువీరా! జానకీనాయకా! |
83 |
| మ. | ఇల నీ మీఁదను జాలభక్తిగలవాఁ డేచెట్టవాఁడైన నే ఖలుఁడైనం దుది నుత్తమోత్తముఁడగున్ గాదన్నఁ గొంగీడ్చెదన్ దెలుప న్నిల్చిన నాడుకొన్న పరవాదిన్ గెల్చెదన్ వేదశా స్త్ర లసద్వాక్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా! |
84 |
| శా. | దేవా! నాదొక విన్నపంబు గల దేదీ యంటివా వింటివా త్రోవం దండధరుండు దుర్గతులకై త్రోవన్ విచారించునో యేవిఘ్నం బొనరించునో యెఱుఁగరా దే ముక్తికిం బోవుచో రావే వెంబడి నింతనంత రఘువీరా! జానకీనాయకా! |
85 |
| శా. | గోవం దొల్తటి జన్మకాలముల నీకుం బంటఁ గానైతి నం చీవక్రంబులె కాక నాకు నివి లక్షింపంగ జన్మంబులా చావుం బుట్టువు మాన్పుకోవలయు నీ జన్మాన నీవాఁడనై రావా నా మది కింకనైన రఘువీరా! జానకీనాయకా! |
86 |
| శా. | చావు ల్మర్త్యులకెల్లఁ గల్గుటలు నిస్సందేహముల్ దేహముల్ చేవ ల్గల్గిననాఁడె శ్రీగిరి గయా శ్రీవేంకటాహోబిల గ్రావప్రాంతములందుఁ జేరవలెఁ; జేరంబోవ కేలబ్బు నా ర్యావాణీస్తుత మోక్షలక్ష్మి? రఘువీరా! జానకీనాయకా! |
87 |
| శా. | త్రోవన్ మానవుఁ డొంటిఁబోవుతఱి నీస్తోత్రంబు వాక్రుచ్చినన్ నీవుం దమ్ముఁడుఁ దోడువత్తురటె నీ నెయ్యంబు తియ్యంబుగా నీవంటాప్తుఁడు నిన్నుఁ బోలు హితుఁడున్ నీవంటి భక్తప్రియ ప్రావీణ్యుండును లేఁడు చూడ రఘువీరా! జానకీనాయకా! |
88 |
| మ. | నవనీతంబుల కేల పాఱెదవురా నాయన్న! రా! యెన్నరా యివి దూష్యంబులు గాఁగ గోపికలు? నీయింటం బదార్థంబు లె య్యవి లే? వంచు వచించు నమ్మకడ కొయ్యంజేరు కైశోర చో రవినోదంబులు నేఁ దలంతు రఘువీరా! జానకీనాయకా! |
89 |
| మ. | వివిధబ్రహ్మల యంత్యకాలముల నేవే నిల్వ వావేళలన్ ధ్రువుఁడో యొండె విభీషణుండు బలి యుందుర్ వారు నీ దాసులై న విశేషంబునఁ గాక తక్కొరుల కుండంబోలునే యింద్రరు ద్రవిరించిస్తుత శౌర్యసార! రఘువీరా! జానకీనాయకా! |
90 |
| మ. | చెవి నీనామము విందునో యని కడున్ సెంకించి కర్ణంబులన్ రవము ల్మీఱఁగ ఘంట లంటనిడి ఘంటాకర్ణుఁ డేతేరఁగా నవి చూచిన్ వరమిచ్చినాఁడవఁట నీయంఘ్రిద్వయీసేవక ప్రవరుం గాచుట యేమిలెక్క? రఘువీరా! జానకీనాయకా! |
91 |
| మ. | రవిసూనుం బరిమార్చి యింద్రసుతునిన్ రక్షించినావందునో రవిసూనుం గృపనేలి యింద్రసుతుఁ బోరం ద్రుంచినావందునో యివి నీయందును రెండునుం గలవు; నీ కేదిష్ట మౌనో కదా రవివంశాగ్రణి! తెల్పవయ్య రఘువీరా! జానకీనాయకా! |
92 |
| శా. | దోసంబు ల్కులపర్వతంబుల కొలందుల్ గల్గినం గల్గనీ మీ సంకీర్తన శబ్దమాత్రమున భస్మీభూతమైపోవవా త్రాసు ల్కోటిసహస్రముల్ గలిగి యెత్తన్ రాని కార్పాసపున్ రాసు ల్సోఁకిన నిప్పువోలె రఘువీరా! జానకీనాయకా! |
93 |
| మ. | కసుమాలంబగు దేహిపుట్టువుల నీ కష్టంబులం బాపి ది వ్యసుకాయం బొనరింతు వెవ్వఁడు నినున్ వాక్రుచ్చినన్ యోగిమా నస గేహంబులనుండి; లోహము సువర్ణచ్ఛాయగాఁ జేయఁగా రసవాదంబులు నేర్చితౌర రఘువీరా! జానకీనాయకా! |
94 |
| మ. | పసులన్ గాచిన గొల్లవాఁడవనుచున్ భావింతు నిన్నున్ దుదిన్ ముసలిభ్రాత వటంచు నెంతు మదిలో మూర్తిత్రయాకార! నే వసుధాధారుని నిన్ను నిక్క మెఱుఁగన్ వాంఛింతు నో సత్కృపా రసపాథోనిధి! కావవయ్య రఘువీరా! జానకీనాయకా! (గద్వాల ప్రతి) |
95 |
| మ. | పిసినిం జూచి మహాప్రదాతయనుచున్ బీభత్సకుత్సాంగునిన్ బ్రసవాస్త్ర ప్రతిమానరూపుఁడనుచున్ బందం బ్రియంబంద శ త్రుసమూహాంతకుఁ డంచు నెప్పుడు నరస్తోత్రంబు గావించు నీ రసుఁడన్ నిన్ను నుతింపనేర రఘువీరా! జానకీనాయకా! |
96. |
| మ. | బహురూపాలు ధరించుకొంచును గ్రియాభాషాంగము ల్ముట్టఁగా బహుకాలంబులనుండి యాడితి నిఁకం బ్రాల్మాలినట్లయ్యెడిన్ దహలంబెట్టక చాల్పురేయనుము నీత్యాగంబు నేనొల్ల సా గ్రహ దైతేయ మదాపహార! రఘువీరా! జానకీనాయకా! |
97 |
| శా. | మోక్షాపేక్ష జనించె నాకు నిదియేమో కాని యీజన్మమం దక్షీణోదయ!ముక్తి కెవ్వఁ డొడయం డాపుణ్యునిం జెప్పెదో దక్షారిస్తుత! నీవె కర్తవయినన్ దక్కేల నీవే ననున్ రక్షింతో యెఱుగంగఁ జెప్పు రఘువీరా! జానకీనాయకా! |
98 |
| మ. | అక్షీణాప్రతిమానదానవిభవాహంకారపారీణ! యో రక్షోదైత్యమదాపహార విబుధా! త్రైలోక్యసంరక్షకా! దక్షధ్వంసివధూటికావినుత! నీ దాసానుదాసుండ నన్ రక్షింపం గదవయ్య! రామ! రఘువీరా! జానకీనాయకా! |
99 |
| మ. | చదువు ల్దొంగిలి సోమకాసురుఁడు భాషాభర్త కూపెట్టఁగా నుదధుల్ సొచ్చినఁ బాఱిపట్టుటకు నుద్యోగించి మత్స్యంబవై యదరంటన్ రిపుఁ ద్రుంచి వేదములు దేవా దేవ! శాండిల్యనా రదకౌండిన్యనుత ప్రతాప! రఘువీరా! జానకీనాయకా! |
100. |
| మ. | అమరుల్ రాక్షసనాయకుల్ కడఁకతో నత్యంతగర్వంబునన్ దమ సత్త్వంబుల మందరాచలముచేఁ దర్వంగ నంభోధిలో రమణం దద్గిరి మోచి కాచిన జగత్త్రాణుండ! కూర్మావతా ర మనంగా మఱి నీవెకావె రఘువీరా! జానకీనాయకా! |
101 |
| మ. | దనుజాధీశులు నిర్జరాధిపతులున్ దామందఱున్ మందరున్ ఘనసత్త్వంబున నెత్తి వార్థి నహిపుం గవ్వంబుగాఁ ద్రచ్చుచో మునుఁగం బాఱకయుండఁ గచ్ఛపమవై మున్నీటిలోనుండు వ ర్తన మే నాత్మఁ దలంచుచుందు రఘువీరా! జానకీనాయకా! |
* |
| మ. | ధర కల్పాంతమునం గరంగఁబడి పాతాళంబులోనంటినన్ దొరయం దొల్లిటియట్ల కా నిలుప నుద్యోగించి క్రోడంబవై పొరి నబ్భూతలమెత్తినట్టి ఘనదర్పున్ నిన్ను భావింతు ని ర్భరకారుణ్య నిరూఢచిత్త! రఘువీరా! జానకీనాయకా! |
102 |
| మ. | వడుగా! నీవడుగంగనేర విట నల్పంబైన దానంబు న న్నడుగన్ వచ్చితి వన్నఁ గన్గొని బలీంద్రా! నాకు నీవిచ్చు మూఁ డడుగు ల్మూఁడు జగంబులంచుఁ గొనవా యాద్యంతముల్ మాటమా ర్పడ నాడన్ నుడికాఁడవౌర! రఘువీరా! జానకీనాయకా! |
103 |
| శా. | ఏతుల్ గాక మురాంతకుండు గలఁడా యెందైన నిందైన నీ నీతు ల్మాను మటంచుఁ దండ్రి సుతునిన్ నిట్రాతిలోఁ జూపరా చూతున్ నాఁగ నృసింహరూపమున నచ్చో నుండవా చెండవా రాతిం బోలిన దైత్యు మేను రఘువీరా! జానకీనాయకా! |
104 |
| మ. | సమరక్షోణులఁ బాఱఁ బాఱఁగ జరాసంధాదులం ద్రుంచి చం డమదాభీలుని ధేనుకాసురుని చట్ట ల్చీరి ముష్టిప్రహా రములన్ ముష్టికు నా ప్రలంబదనుజున్ మ్రందించి తౌ రేవతీ రమణాకారముఁ దాల్చి యౌర! రఘువీరా! జానకీనాయకా! |
105 |
| మ. | నిను నారాయణమూర్తిగాఁ దలఁచుచున్ నీ దండ నా దండకా వన వాచంయము లెల్లఁ జేరి కొలువన్ వారిం గృపం జూచుటల్ వనధిం గట్టుట రావణుం దునుముటల్ వర్ణింతు రామావతా ర నిరూఢాకృతి నిన్ను నౌర! రఘువీరా! జానకీనాయకా! |
106 |
| మ. | అమరారాతివధూటికామణులచే నశ్వత్థనారాయణ ద్రుమముం గౌఁగిటఁ జేర్పఁ జేసి వ్రతము ల్దూలించి బుద్ధావతా రమునన్ రుద్రసహాయమై త్రిపురముల్ మ్రగ్గించి తౌరౌర! ధీ ర! మునిస్తుత్య యశోవిహార! రఘువీరా! జానకీనాయకా! |
107 |
| మ. | కలికాలాంతమునన్ గిరాతజనముల్ గర్వించినం దత్కిరా తుల నెల్లన్ విదళించుచున్ గృతయుగోద్భూతంబుఁ గావింప నిం పలరం గల్కివి గాఁగ నున్న హరి నిన్నశ్రాంతముం గొల్చువా రలు పుణ్యాత్ము లగణ్యశూర! రఘువీరా! జానకీనాయకా! |
108 |
| శా. | త్రేతా ద్వాపరసంధి నుద్ధతమదాంధీభూత ధాత్రీధవ వ్రాతంబున్ జననీ ప్రతిజ్ఞకొఱ కిర్వైయొక్కమారుల్ బహు ప్రీతిం ద్రుంచితి గాదె నీవు విలసద్వీర్యంబుమై ఘోరని ర్ఘాతక్రూరకుఠారధార రఘువీరా! జానకీనాయకా! |
25 † |
| శా. | కావం దొల్లిటి కాలజన్మముల నీకా బంటుఁ గానైతి నీ సేవాకార్యములేమొ నాకు నవి లక్షింపంగ లేవయ్యె నీ చావుం బుట్టువు మాన్పుకోవలయు నీ జన్మాన నీవాఁడనై రావా నా మదిఁ గోర్కెఁ దీర్ప! రఘువీరా! జానకీనాయకా! |
32 † |
| శా. | ఉండందెక్కడ నీవు లేక వెలియై యుండేది యెచ్చోటు బ్ర హ్మాండంబుల్ లయమందు నీవు కనుమూయన్ లోకపర్వంబుగా నండంబున్ బ్రభవించు నీకును వినోదార్థంబు నీ మాయ మా ర్కండేయాదు లెఱుంగలేరు రఘువీరా! జానకీనాయకా! |
60 † |
| మ. | జననీగర్భములందు నన్నిటు బడన్ జన్మిచ్చి బాల్యంబులన్ జనుబా లెందఱివైనఁ ద్రాపి యటు వేల్ సంబంధముల్గా పురా తనకాలంబుననుండి యెంతగను యత్నంబున్న నిందాకఁ దీ రని కర్మంబులు దీఱు టెట్లు? రఘువీరా! జానకీనాయకా! |
74 † |
| మ. | వెనుకం జేసిన దోషముల్గలుగ నుర్విన్ ముక్తికిం బోదురే చనఁ బొయ్యే వని కాలుబంట్లె నుడువన్, సాక్షాత్తు నా బంటు వీ నిని బట్టన్ గమకించు టొప్ప దనియున్ నీవే నివారించవా ప్రణతాశేష శరణ్యచిత్త! రఘువీరా! జానకీనాయకా! |
77 † |
| శా. | నానాజీవమనోనివాస! త్రిజగన్నాథా! మురారీశ! గౌ రీనాథస్తుత! కైటభాసురవిదారీ! చక్రి! నారాయణా! యో నాళీకదళాయతాక్ష! కలుషవ్యూహాద్రి వజ్రాయుధా! ప్రాణాపానసమానరూప! రఘువీరా! జానకీనాయకా! |
81 † |
| మ. | నను నన్యుల్ గొనియాడ మే లనకయుండన్, నాకు నేనే మహా ఘనుఁడన్ విద్యకు నేనె బ్రహ్మ ననుచున్ గర్వించి దుర్వాక్యముల్ విని మీ చిత్తమునందు రోయకుము నా వేసాలు గ్రాసాలకే యని మన్నింతువుగాని నన్ను రఘువీరా! జానకీనాయకా! |
87 † |
| మ. | వినుమా యాశ్రితు నిల్పువాఁడ ననుమా వేయేల నీ భక్తునిం గనుమా యాశ్రితరక్షణంబు ఘనమా కారుణ్యవారాశి య య్యు నతార్తావనుఁడైన నీకు జగతీవ్యోమస్ఫురత్కీర్తి కొ య్యన లక్ష్మీకమనీయవక్ష! రఘువీరా! జానకీనాయకా! |
90 † |
| మ. | కొమరౌ నాండ్రు పదాఱువేలు గొలువన్ గోపాలకృష్ణావతా రమునన్ జాలక చొచ్చి గోపికల చీరల్ దీసి రాఁదీసి నె య్యమునం బొందిన కొయ్యదేవరవు గావా నీవు కృష్ణావతా రమునన్ లోకమనోభిరామ! రఘువీరా! జానకీనాయకా! |
92 † |
| మ. | కరుణానీరధి! నిన్ను వేడుకొనినన్ గాండీవికిం బోరిలో నరదం బొప్పఁగ గొప్ప సారథివి గావా కావ నోదేవ! నీ సరి యెవ్వారును లేరు శిష్టజనరక్షాదక్ష దీక్షామణీ! ధరణీనాయకమౌళిరత్న! రఘువీరా! జానకీనాయకా! |
93 † |
| మ. | అతులప్రౌఢిమ మీఱ రాయకవి యయ్యల్రాజు సత్పుత్రుఁ డ చ్యుతభక్తిం ద్రిపురాంతకుం డొనరిచెన్ శుద్ధంబుగా నాంధ్ర సం గత పద్యంబుల నూటి నివ్వి వెలయుం గాతన్ రవీందుప్రచా రత యెందాకనొ యంత దాక రఘువీరా! జానకీనాయకా! |
95 † |
| శ్రీరాయకవి యయ్యలరాజు తిప్పరాజ ప్రణీతంబైన యొంటిమిట్ట రఘువీర శతకము సంపూర్ణము. | ||
* శతకరత్నాకరము, రాజమండ్రి ప్రతి అధికపాఠం.
† హర్కారే గుండేరావుగారి పీఠికతో గద్వాల సంస్థానం ప్రచురించిన రఘువీరశతకంలో అదనంగా ఉన్న పద్యాలు.