| నాటకములు | నదీసుందరి | అబ్బూరి రామకృష్ణరావు |
| నాలుగవ రంగము | |
| (అగస్త్యుని సహాధ్యాయుడగు సావర్ణి ప్రవేశించి కావేరి యగస్త్యునిచేతులలో వ్రాలియుండుటను చూచి వెనుకకు తగ్గును. కావేరి నిష్క్రమించును.) | |
| (సావర్ణి ప్రవేశించును.) | |
| అగస్త్యుడు: | ఈ యాశ్రమమున బాలహరిణములుసైత మంత భయపడవే, నీ వేల చకితుడవైతివి? |
| సావర్ణి: | నిజ మిది యాశ్రమమే. ఈ ముహూర్తమున మాత్రము అంతఃపురమా ఆశ్రమమా యని విచారింప వలసివచ్చినది. |
| అగస్త్యుడు: | ఆశ్రమములో అంతఃపురములుండునా? |
| సావర్ణి: | ఓహో! నీ వుపన్యసింపవలసినవార్త లనేకము లున్నట్లున్నవి. కానీ చెవియొగ్గి వినియెదను. (కొంచెము సమీపించి) కులపతి జీవనసర్వస్వమగు కావేరి యెడల ననార్యుడవై యీ యపచార మేల చేసితివి? |
| అగస్త్యుడు: | ప్రేమచేత. |
| సావర్ణి: | అది యెటువంటిది? |
| అగస్త్యుడు: | నా హృదయకటాహములన్నియు నామె ప్రేమామృతముచే నేడు తెగిపోయినవి. నేటితో నేను విముక్తుడ నైతిని. |
| సావర్ణి: | చిన్ననాటనుండియు నిన్నెఱుగుదును. అప్పటిచేష్ట లన్నియు నీ పర్యవసానమునే సూచించినవి కాబోలు! |
| అగస్త్యుడు: | అవును. చిరకాలమునుండి, చిరజన్మములనుండి యీ యావేదన నా హృదయము నావేశించి, నా యాహార విహారములందు, విద్యావ్యాసంగములందు నా చిత్తశాంతి నపహరించినది. ఇంతవట్టు నిజమే. కావేరియే నాయాశాఫలము. |
| సావర్ణి: | ఈ యాశ్రమవాటికలందు విలాసార్థమై నీవు పెంచిన పూలతోటలందు నీ యుత్సాహమునకు కారణము రమణీశృంగారమేనా? |
| అగస్త్యుడు: | ఇన్నాళ్ళనుండియు నీవు నాకు పరమాప్తుడ వనుకొంటిని. ఇంతదూరస్థునివలె ప్రసంగించెద వేమి? |
| సావర్ణి: | ఈ కావేరి యుదంతము న న్నెంతో దూరమునకు గొనిపోయినది. కామినీకళంకితములైన యీ సంసార బంధములపై నీ కెట్లు మమకారము కుదిరినది? మునివృత్తి కిది మాలిన్య మని నీ వొప్పుకొనవా? |
| అగస్త్యుడు: | తాపసు లంత ప్రబుద్ధులా? వారి కీ లోకమున బంధములే లేవా? |
| సావర్ణి: | శతసహస్రము లున్నవి. లేకున్న నీతపశ్చరణమెందుకు? ఈ కఠోరవ్రతము లెందుకు? |
| అగస్త్యుడు: | కాంతాసంబంధ మా శతసహస్రములలో చేరదు కాబోలు! |
| సావర్ణి: | కామినీ కాంచనములను బ్రహ్మచర్యవ్రత సమయములందే నిర్జించి యంతకన్న బలవద్విరోధులను జయించుటకై ముముక్షువులు తపోవృత్తి నభిలషింతురు. |
| అగస్త్యుడు: | కీర్తి యనునది కాంత. ముక్తి యనునది కాంత. ఈ చతుర్దశభువనములకును అధిష్ఠానదైవము కాంత. ఆమె యీ సమస్తసృష్టిజాలమును తనచీరచెఱగుల చాటున దాచి రక్షించుచున్నది. |
| సావర్ణి: | కీర్తికాంతకును, కులపతిపుత్రికయగు కావేరికాంతకును ఎంత సామ్యమున్నది? |
| అగస్త్యుడు: | నాప్రేమకును, నీవు నా కారోపించిన క్షుద్రకామనమునకును ఎంత సామ్య మున్నదో అంత. |
| సావర్ణి: | నీహృదయమునం దీ యారాటము నింకను స్ఫుటముగ వర్ణింపగలవేమో చూడుము. నీ ధోరణియంతయు నయోమయముగ నున్నది. |
| అగస్త్యుడు: | అది అనుభవైకవేద్యము. |
| సావర్ణి: | పోనిమ్ము. నీసాధనక్రమము విపరీతముగా నున్నది కదా! అట్లే నీ యుపాస్యదైవముకూడ ఏ యసంభావితరూపమునో, యే యశ్రుతపూర్వమగు నామమునో తాల్చి యున్నది కానోపును. నీ వారాధించు దైవ మెట్టిది? |
| అగస్త్యుడు: | రసదేవత. ఆమెకు రసమయి, ఆనందమయి యని రెండే పేరులు. |
| సావర్ణి: | నీ వీలోకమున రసదేవతాసామ్రాజ్యమును నిర్మింపనెంచితి వన్నమాట! |
| అగస్త్యుడు: | ఈ లోకమును, మిగిలిన పదుమూడులోకములును ఆమె రాజ్యములోనివే. |
| సావర్ణి: | ఈ యపోహలన్నియు నెప్పటికిని విడువనేర వన్నమాట! |
| అగస్త్యుడు: | సావర్ణీ! ఇంత నిష్ఠురముగ నెందుకు పరిహాసము చేసెదవు? నీ మిత్రుని హృదయక్లేశమును తగ్గింపగల మాట నొకటైన నాడకపోతివి. |
| సావర్ణి: | కావేరీస్నేహమును నిర్మూలింపుము. ఆశ్రమ విరుద్ధమగు నీ చిత్తవృత్తిని మరల్చుకొనుము. లేకున్న నీకారణముగ కులపతి విశుద్ధజీవితమునకు కళంకము రాకమానదు. |
| అగస్త్యుడు: | కవేరపుత్రికపై యనురాగము తెచ్చిపెట్టుకొనునదికాదు. విశ్వమంతయు పాలించుతల్లియే నాయందా రాగోదయమును మేల్కొలిపినది. ఆమెయే దానిని నిర్మూలింప సమర్థురాలు. |
| సావర్ణి: | చిరకాలసాహచర్యముచే నార్జించిన మైత్రివలన నింకొకసారి చెప్పెదను విను. నా హితవాక్యములు మధురముగ లేవనిమాత్రము నిందింపకుము. కావేరీవృత్తాంతము నీ వవశ్యము మరచిపోవలసినదే. |
| అగస్త్యుడు: | నా యార్తికథను సావధానముగ నాలింపుము. నేడు నా హృదయము అనన్యతుల్యమగు తేజోరాశిచే నిబిడమైయున్నది. ఈ నిండుదినమున నా నిర్వేదభారమంతయు నాప్తుడవగు నీ సన్నిధానమున నివేదించుకోవలయు ననుకొంటిని. విశ్రాంతియెఱుగని నా మమస్తాపమును తగ్గించుకోదలచితిని. కాని యెన్నడును లేని కాఠిన్యమును వహించి నన్ను వేధించుచున్నావు. |
| సావర్ణి: | అంతమాత్రమున నీ తోడిబాంధవ్యము వదలు కొనలేను. నీ శ్రేయోభిలాషయే నా వాక్కుల కింత కాఠిన్యము నారోపించినది. |
| అగస్త్యుడు: | ఎన్నడో నే నీయాశ్రమమునకు మొదట వచ్చినపుడు అస్పష్టమగు లీలామానుషవిగ్రహ మొకటి చంద్రికాయామినులందు కుసుమితోద్యానములందు తనశీతలమగు దృష్టిని నాపై బరపుచుండెను. ఆనాట నుండియు నా సకలేంద్రియములును ఆ విచిత్రానుభవమునకై యెదురు చూచినవి. జీవనమార్గమందు నే నేర్పరచుకొనిన లక్ష్యము లన్నియు నా యదృశ్యమూర్తి యాగమనముచే నదృశ్యములయ్యెను. నా కులము, శీలము, మర్యాద తుదకు నా స్వభావమంతయు ఉదయ భానునివలె క్షణక్షణము నొక క్రొత్తరూపమును దాల్చి సంపూర్ణముగ మాఱిపోయినది. |
| సావర్ణి: | ఈ భేదమును నీ వెన్నడును తెలిసి తర్కించుకొనలేదా? |
| అగస్త్యుడు: | నాయనుభవము నంతయు నొక్కముఖమునకు దెచ్చుకొని నాలో నే నన్వయించుకొంటిని. ఈ యాశ్రమకవాటములను తెరచి యనంతమగు విశ్వవీధీసంచారమునకై నాజీవనలక్ష్మియె న న్నాహ్వానించిన దనుకొంటిని. ఈయాశ్రమము నాస్వేచ్ఛాజీవనమునకు చాలదు. అందుకే యిచ్చటి నియమములను, బంధములను వదలించుకొనుచున్నాను. నా యింద్రియములతో వైరము సాధించి వానిని క్లేశపెట్టజాలను. వానిసాహాయ్యమున నాయుపాస్యదైవము నన్వేషింతును. |
| సావర్ణి: | వయస్యా! నాకెంత ఖేదమును తెచ్చిపెట్టితివి? ఈ విపరీత వృత్తాంత మెట్టి పరిణతి నొందునో కదా! |
| అగస్త్యుడు: | సావర్ణి! నిన్నర్థించి యడుగుచున్నాను. నన్నాశీర్వదింపుము. |
| సావర్ణి: | ఎల్లప్పుడును నీ శ్రేయస్సు నే కాంక్షింతును. |
| అగస్త్యుడు: | నీతో నొకమాట చెప్ప మరచితిని. |
| సావర్ణి: | ఈశుష్కవాక్యములతో నామనసు విఱిగిపోయినది. వెనుకటివలె నేదైన వార్తచెప్పుము. |
| అగస్త్యుడు: | కాదు. నే నీసాయంకాలము కావేరితో సహ్యాద్రికి వెళ్ళివచ్చెదను. |
| సావర్ణి: | (విసువుతో) అచ్చట నేమున్నది? |
| అగస్త్యుడు: | కావేరికి చూడవలెనని యున్నది. |
| సావర్ణి: | (మఱింత విముఖుడై) నే పోయివచ్చెదను. (నిష్క్రమించును) |
| అగస్త్యుడు: | నాయారాటము కొంత శాంతించినది. (నిష్క్రమించును) |