| కవితలు | నయాగరా | 7. ఠాకూర్ చంద్రసింగ్ - ఏల్చూరి సుబ్రహ్మణ్యం |
| 7. ఠాకూర్ చంద్రసింగ్ (జులై 43) - సుబ్రహ్మణ్యం |
|
(18వ గార్వాల్ రైఫిల్ నాయకుడు. దండి సత్యాగ్రహోద్యమంలో తన దళంతో పాల్గొన్నాడు. యావజ్జీవ శిక్ష విధించింది ప్రభుత్వం.) |
|
పారతంత్ర్య భారంతో కుంగుతున్న భరతావని కుసుమించిన రక్తారుణ కుసుమం! అఖండ భరతావని ఆరక వెలిగే మణి దీపం మా ఠాకూర్ చంద్ర సింగ్! |
|
పున్నమి వెన్నెలలై పొంగిన బానిస సంద్రంలో పొర్లిన మబ్బుల కెరటం సామ్రాజ్యపు చెలియలి కట్టను ఛేదించిన రక్త తరంగం! పొగలు చిమ్ము తుపాకి గుండ్లను ప్రతిఘటించు బానిస గుండెల మెరసిన ఆదర్శద్యుతి చంద్రసింగ్ విప్లవ దీక్ష! |
|
300ల ఏండ్ల క్రితం నాటుకున్న విషవృక్షం చీకట్లను చిమ్ముతుంటె విరిసిన చంద్రుడు చంద్రసింగ్! |
|
స్వాతంత్ర్యం సాధించను ప్రజలంతా సాగించిన సమరంలో చంద్రసింగ్ అరుణారుణ జయ పతాక! |
|
ముస్లిములను చంపమన్న రాజాజ్ఞను నిరసించిన చంద్రసింగ్ నేరస్థుడు! |
|
నల్లకోటు వేసుకున్న తెల్లటి న్యాయం చంద్రసింగ్ చేతికి తగిలించెను సంకెళ్లు! |
|
ద్రోహి కాడు చంద్రసింగ్ స్వతంత్ర జన రక్తం పిండిన అధమాధమ పాలక వర్గం పాలిట భూతమ్మై ఘోషించే సాగర శంఖం! |
|
కటకటాల వెనుకన పగిలే రగిలే అగ్నిపర్వతం స్వతంత్ర భారత భువిలో ఘణ ఘణమని మ్రోగు ఘంట! హిందూ ముస్లిం ఐక్యతకై కట్టిన జ్వాలారుణ తోరణమే చంద్రసింగ్ సైనిక దళ వీర దీక్ష! |
|
కలకాలం గిలగిల వలలో తన్నుకునే చేపలు కావివి బానిసలం, పుటుక తోటి సైనికులం |
|
మా చంద్రసింగ్ వీరభూమి భరతావని యుగయుగాల చీకటిలో నిలువలేక నిలువలేక తెరచిన విప్లవ నేత్రం! |
|
స్వతంత్ర భారతమే మీటిన జన విపంచి పాడిన జాబిల్లి పాట చంద్రసింగ్ రక్తారుణ కుసుమం! |