| కవితలు | నయాగరా | 4. మన్యంలో - కుందుర్తి ఆంజనేయులు |
| 4. మన్యంలో (ఏప్రిల్ 43) - ఆంజనేయులు |
|
సమిష్టి సత్యాగ్రహం దేశాన్ని సకలం ముంచెత్తిన రోజులు |
|
మన్యంలో తిరుగుబాటు ప్రభుత్వం విరగబాటు అణిచేసిన గొడ్డలి పెట్టు |
|
రాచరికపు బాటల్లో రాజుకున్న కారుచిచ్చు |
|
మన్నుతిన్న పాముల్లాంటి మన్యం వీరుల గుండెల్లో రేగినై ప్రళయ ప్రళయంగా తుఫాను సహస్రాలు |
|
అమాయక హృదయాల్లో రగిలి విప్లవ జ్యోతులు మన్య సముద్రంలో చెలరేగిన అవమాన బడబాగ్ని జ్వాలకు రాజుకున్నై ప్రభుత్వ భవనాల్ రాజధాని నగరంలో |
|
మా చేసిన మన్యవిప్లవం దేశానికి మార్గదర్శి దిగి వచ్చిన వెలుగుబాట సెంటు జార్జి కోట చెవుల్ చెదిరించిన విప్లవ దుందుభి! |
|
'మిరపకాయ తపాలా'కు మిలిటరీ తుపాకి బారులు సమాధానం చెప్పలేక సగం చచ్చి కూచుంటే తెనుగు రాజు కరకు దనం తెలిసింది ప్రభుత్వానికి |
|
న్యాయం బురఖా తగిలించిన ప్రభుత్వానికి పట్టు గొమ్మలు విప్లవాన్ని విరిచెయ్యను ముఠాదార్ల శపథం! |
|
ముఠాదారీ ముసుగుల్లో జరిగే అక్రమాలకు విరుగుడు మన్య విప్లవం |
|
మన్యంలో ప్రభుత్వానికి మలేరియా చలి జ్వరం పట్టుకొని బాధిస్తే విజృంభించి నిప్పుల కంఠం వినిపించిన విప్లవ గీతం వినేసరికి బెదిరిపోయి ప్రభుత్వానికి తెల్ల గుడ్లు పడినై |
|
మదరాసు నుండి మలబారు నుండి తోలుక వచ్చిన సైన్యంలో కమాండరిన్ చీఫులు శివాలయం గోడమీద చెక్కించిన విగ్రహాలు! |
|
మన్యంలో పేరుకున్న మత్తంతా విదిలించిన మా హృదయాలు కదిలించిన దిగంతాలు మండించిన దీపికలై శౌర్యాగ్నులు ప్రచండమైన మన్య విప్లవం అనామకంగా వీచిన ఒక చిరుగాలి తరంగంగా చేసింది ప్రభుత్వం వ్రాసింది రికార్డుల్లో మూసేద్దా మని లోకం కళ్లు! |
|
రాజద్రోహంగా, నేరంగా దోపిడిగా, దొమ్మీగా చరిత్రలో వ్రాసుకున్న చేదస్తపు వ్రాతలకేం - మన్య విప్లవం మా చరిత్రలో వీచిన జంఝానిల వీచిక! |
|
విదళించిన వీరుని ఖడ్గం పగ పట్టిన పాము బుసా చూపించిన విప్లవ మార్గం |
|
సామ్రాజ్యపు కత్తుల వానకు పట్టించిన స్వర్ణ చ్ఛత్రం అధికారపు అన్యాయమ్ములు అడ్డించిన రక్షా కవచం! |
|
మన్యవిప్లవం మా చరిత్రలో వీచిన జంఝానిల వీచిక! |
|
బంధించిన బానిసత్వ విచ్ఛేదక వీర మూర్తి విప్లవ శరదాకాశం వెలిగించిన విద్యుద్దీపం రామరాజు హృదయంలో రగిలిన స్వాతంత్ర్యేచ్ఛ! |
|
మన్యవిప్లవం మా చరిత్రలో వీచిన జంఝానిల వీచిక! |