| కవితలు | నయాగరా | 3. చెరసాల - బెల్లంకొండ రామదాసు |
| 3. చెరసాల (జనవరి 44) - రామదాస్ |
|
ఇన్నాళ్ళూ సమాజం ఒక సంకెళ్ల చెరసాల! హత్యలు జరిగిన చెరసాల! నెత్తురు పారిన చెరసాల! దుర్మార్గులు కట్టిన చెరసాల! ఒక పెద్ద చెరసాల! |
|
బానిసత్వ శాస్త్రం శాసించిన పూజారులు నెత్తుటి కత్తులు ఝళిపించిన సామ్రాట్టులు హత్యా మంత్రాంగం పన్నిన అమాత్యులు దుర్మార్గులు మఠాధిపతులు నరహన్తలు మతాధినేతలు ఒకటై జరిపించిన ఘోరహత్య తగిలించిన అనల శృంఖల కట్టిన బానిసత్వ కారాగృహమది గత కాలపు సమాజ పద్ధతి! |
|
పుణ్యం పేరిట యజ్ఞంలో నరికిన పసి మేకల శిరస్సులూ ఉరి బండల ఆహుతైన పతిత ప్రజా శిరస్సులూ పూజారీ కర్మల్లో రాజన్యుల కత్తుల్లో నలిగిన అనాథుల ఆక్రందన ఇదేనా పూర్వపు సమాజ నిర్మాణం? |
|
పర పీడనకై పరిపాలనకై స్వార్థ పరులు తమ అధికారం నిలుపుకోను మతాధి నేతలు వ్రాసిన దుర్మార్గపు శాస్త్రశాసనం తగిలించిన నియమ శృంఖల |
|
రాజులు ఏకచ్ఛత్రంగా ఏలిన శవ సామ్రాజ్యం ఇదే కదా గతకాలపు సమాజ పద్ధతి! |
|
పూజారుల అధికారం రాజన్యుల నియంతృత్వం కట్టిన పెద్ద జైలు కొట్టు చేసిన మహాహత్య ఇదే కదా పూర్వపు సమాజ చరిత్రమంతా! |
|
గుండెలు మంటలుగా కన్నులు కాలువగా మారుతాయి ఈ సమాజ హత్యా చరిత్ర చూస్తే! |
|
రాజన్యుల రథ చక్రపు ఘట్టనలో పడి నలిగే దీనులార! |
|
మతాధి నేతల శాస్త్రాల చెప్పుల క్రింద నలిగి నలిగి రోదించే పసితనంలో పతి పోయిన అమాయక కన్యలార! |
|
స్వేచ్ఛ లేక సమ్రాట్టుల నేత్రాగ్నుల దగ్ధమైన జాతులార! |
|
మరలో మరగా అరిగిపోవు కార్మికులారా! |
|
జమీందార్ల పొట్టలు నింపను ధాన్యం పండించే కర్షకులారా! |
|
ఓహో! ఓహో! అణగారిన ప్రపంచ దీనులారా! మీకై ఈనాడొక అగ్ని పర్వతం పగులుతోంది చూచారా! |
|
మీకై ఈనాడొక అరుణ పతాకం ఎగురుతోంది చూచారా! |
|
మీకై ఈనాడొక నవజగత్తు ప్రభవిస్తున్నది చూచారా! |
|
మీకై ఈనాడొక నందనవన వసంత మందారం కుసుమించెను చూచారా! |
|
మీకై ఈనాడొక రణభేరి పగిలింది విన్నారా! |