| కవితలు | నయాగరా | 2. ఈ రోజున - బెల్లంకొండ రామదాసు |
| 2. ఈ రోజున (జనవరి 44) - రామదాస్ |
|
చరిత్రలో తిరిగిన మరణపు తిరగట్లో బియ్యపు గింజల్లా నలిగి నలిగి మండిన గుండెల్లో కండలు ఎర్రని జెండాలై ఎగిరిన వీ రోజున! |
|
బాడుగ బండికి కట్టిన ఎద్దుల మెడ పట్టెడ గంటల గణగణలో నినదించిన కంఠాలే నిప్పుల రణ శంఖాలై పగిలిన వీ రోజున! |
|
పాతాళం బ్రద్దలుగా పగిలిం దీ రోజున! పడగలు విప్పిం దీ రోజున! |
|
జగత్తు ఒక సోల్జర్ అడుగై కదనానికి కదిలిం దీ రోజున! |
|
పాతాళపు చీకటి మంటల్లో ఆకలి ఎండల్లో పడిమ్రగ్గిన దీన హీన మానవ హృదయంలో ఆకాశం పగిలిం దీ రోజున! |
|
గానుగలో సున్నంలాగా రైలు క్రింద పట్టాల్లాగా చెప్పుక్రింద చీమల్లాగా నలిగిన మానవులారా పగిలిన గుండెల్లారా తరిగిన కండల్లారా |
|
మీకోసం నడిచే సోల్జర్ ఎగిరే పైలట్ కదిలే టాంక్ డ్రైవర్! మీకోసం ఫైటర్ మంటలు! మీ కోసం టాంకుల చప్పుడు మీ కోసం విసిరిన బాంబులు మీ కోసం కదిలే స్టీమర్! |
|
పసిఫిక్ రంగంలో బర్మా అడవుల్లో మాస్కో గేట్లల్లో పారిస్ వీధుల్లో లండన్లో వాషింగ్టన్లో ఇటలీలో బెర్లిన్లో చైనా లోయల్లో పృథ్వీ గర్భంలో ప్రతి అణువూ ప్రసవించిన యుద్ధాగ్నులు మీ కోసం! మీ కోసం! |
|
మీ కోసం నిలిచిన మాస్కో! మీ కోసం కూలే బెర్లిన్! వీరులదే మారే లోకం వీరులకే బీర్ బాటిల్! |
|
గట్టర్లల్లో అట్టడుగున శోషిల్లిన దీనులార! |
|
మరచక్రం తిప్పితిప్పి అరిగిన చేతులార! మీ ఘర్మజలం అఖండ గోదావరిగా పొంగిం దీ రోజున! |
|
ఆనకట్ట త్రెంచిం దీ రోజున! పురోగమించిన మీరే తిరోగమించే బెర్లిన్ భవిష్యత్తు మిమ్మల్నే స్వయంవరం చేస్తున్నది! |
|
మీ మెళ్లో పూలమాల వేస్తున్నది! |
|
మీ కళ్యాణానికి రణ ధనుస్సు విరిగిం దీ రోజున! |