| కవితలు | నయాగరా | 1. నా గీతం - బెల్లంకొండ రామదాసు |
| 1. నా గీతం (జనవరి 44) - రామదాస్ |
|
మానవ మేధస్సుకు సంకెళ్ళను తగిలించిన గత సాంఘిక శిలా శాసనం పడగొట్టను పగిలిన నా నిప్పుల కంఠం పలికిన విప్లవ గీతం |
|
ప్రపంచాన్ని పసిఫిక్ రంగంగా పగిలించిన నా గీతం |
|
జగత్తునొక నయాగరా జలధారలుగా వర్షించిన నా గీతం |
|
లోకంలో స్వేచ్ఛా విద్యుచ్ఛక్తులు ప్రవహించిన నా గీతం |
|
కదలని సమాజ హిమాలయంలో కదిలే నవక్రాంతి బాడబాగ్ని మండించిన నా గీతం |
|
అనార్కలీ సమాధిలో అశ్రు దీపికలు వెలిగించిన నా గీతం |
|
అక్బర్లను కండలుగా ఖండించిన నా గీతం |
|
యుగాల నుంచీ నడిచే నియమపు రైళ్ళకు పట్టాలను పీకేసిన నా గీతం |
|
చీకటిలో పడి మ్రగ్గిన లోకానికి దూరపు తీరాల్లో మండే కాగడాలు చూపించిన నా గీతం |
|
గత సాంఘిక నరబలి నగరంపై బాంబులు దూకించిన నా గీతం |
|
సంకెళ్లను బంధాలను త్రెంచెయ్యను నిప్పుల కత్తెరలను సృష్టించిన నా గీతం |
|
జగత్తులో జలప్రళయం తెచ్చిందట ప్రపంచాన్ని మార్చిందట |
|
స్వేచ్ఛా మహాగ్ని పర్వత శిఖరాంచల రక్త జ్వాలికగా మండిందట |
|
సమ్రాట్టులు చాచిన నెత్తుటి నాలుకలే నరికిందట |
|
హిట్లర్లకు చాణక్యులకు గోరీ కట్టిందట కాలపు దారుల్లో చీకటి ముళ్లను తొలగించిందట |
|
వెన్నెల పూవులు చల్లిందట |
|
శ్రామిక జన ఫాలంలో ఎండని ఘర్మజలం చల్లని చేతులతో తుడిచిందట |
|
వర్గరహిత సంఘ స్వర్గానికి పూల నిచ్చెనలు వేసిందట |
|
నరహంతలకు చెరసాలలకు ఉరి తీర్పులకు నిరంకుశ నియంతలకు తలకొరువులు పెట్టిందట |
|
గతలోకం కాల్చిందట |
|
నవలోకం చూపిందట |
|
నడవండని చెప్పిందట |
|
నరాలు వణికించిందట |
|
కండలు కదిలించిందట |
|
గుండెలు మండించిందట |
|
మేధస్సుకు రెక్కలు కట్టిందట |
|
జీవితాన్ని విహంగం చేసిందట! |