యుద్ధకాండము-47
రాగం: హుసేని - తాళం: ఆది
పల్లవి:
మంగళం శుభమంగళం ॥మంగళం॥
అనుపల్లవి:
సంగీతలోలునికి శృంగారశేఖరునికి నంగజాతకోటిరుచిరాంగునికి రామునికి ॥మంగళం॥
చరణములు:
సీతాసమేతునికి శ్రీపతికి భరతజాతాధరునికి జయమంగళం॥
సా|కౌతూహల సుమిత్రాతనయునికి ఖ్యాతి విక్రమాంజనీజాత శ్రీరామునికి ॥మంగళం॥
కౌసల్య కొమారునికి కైకేయీవరదునికి క్ష్మాసురావనునికిని జయమంగళం ॥
శ్రీ|కోసలనగరిస్వామి కోరికల పెన్నిధికి శ్రీసతాభ్యుదయునికి శ్రీనివాసమూర్తికి ॥మంగళం॥
శ్రీధరునికి విజిత విరాధునికి భక్తజనసాధారణునికి జయమంగళం ॥
మూ|లాధారాదిషట్కమలాగ్ర సహస్రార దివ్యబోధానంద ఘనపూర్ణజ్యోతికి ॥మంగళం॥
హరికి భవనీరధితరికి ఖరదూషణారికి శరణానతశబరికి జయమంగళం ॥
క్రూ|రహిరణ్యాక్ష శిరోదగ్రకిరికి హిరణ్యకశిపుసంహార నరకేసరికి ॥మంగళం॥
భానుసూను రాజ్యసంధాననిపుణునికి విజ్ఞాన (మనో)గమ్యునికి జయమంగళం ॥
స|న్మానార్హునికి సింధుమానాపహారికి నసమానగానప్రవీణుఁడైన శ్రీరఘుపతికి ॥మంగళం॥
పక్షివాహనునికి నక్షయునికి సరసిజాక్షుని కధోక్షజునికి జయమంగళం ॥
అస్త్ర|శిక్షిత మారీచ మకరాక్ష కుంభకర్ణాది రక్షోవీరునికి రాజపరమేశ్వరునికి ॥మంగళం॥
రావణాంతకునికి దేవదేవుని జనకజా విమోదకృతికి జయమంగళం ॥
పరమ|పావనునికి విభీషణావనునికి భూమిదేవి సౌఖ్యవర్ధిష్ణునికీ విష్ణునికి ॥మంగళం॥
శ్రీకాళహస్తినగరీ శంభుమిత్రునికి సౌకర్యశాలికి జయమంగళం ॥
సు|శ్రీకకుత్‌స్థాన్వయ సింహాసనస్థునికి వివేకకార్య శేషగిరి వేంకటసుబ్రహ్మణ్యునికి ॥మంగళం॥
క. శ్రీనాయకు కృపచేతను
గానాధిపులకును నెల్లఁ గడుహృద్యంబై
భానుశశితారకంబై
మానుగ నీపుస్తకంబు మహి నెగడొందున్.
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi