కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-46
రాగం: శంకరాభరణ - తాళం: అట
పల్లవి:
శ్రీరాముని శ్రీమచ్చరితము శ్రీజ్ఞానసూన వినవే ॥శ్రీరాముని॥
అనుపల్లవి:
వారాన్నిధిగర్వవిభంజనోదారశరలాఘవుని యీ రాఘవుని
క్ష్మారమావరు నత శ్రీకరుని దానవిచక్షణుని
సారసదళేక్షణుని సర్వవిలక్షణుని
హారనూపురకిరీటాంగదుని మణిసుగ్రీవుని
వైరహృదయవిభీషణుని మధురభాషణుని ॥శ్రీరాముని॥
చరణములు:
ఆయుష్యము ఆరోగ్యప్రదము ఆమోదము శ్రీయశోవర్ధనము శ్రీసీతాపతిప్రసాదము
శ్రేయోమార్గము ప్రియకుమార విద్యారత్నసంధానము
హా యీ పావనము జ్ఞానోదయము నిత్యాభ్యుదయము నధికపుణ్యా-
మ్నాయము అధ్యాత్మ రామాయణం బెవరు విన్న నుడివినా వారనఘులై నా-
రాయణుని కరుణన్‌ ధన్యులనన్‌ దగుదు రందమున ॥శ్రీరాముని॥
భూమిసురులు పఠియించి సౌజన్యముఁ జెందుదు రిందేమి రాజన్యౌఘము వింటే జెందు విజయసౌఖ్యము
యీ మహితాఖ్యాన మెవరు వినిన వారు స్వామికి సన్మాన్యులు వరధన్యులు
కామితార్థప్రదము జనకోటిజన్మదుష్కృత సంఘాత గుణసంసృతి యనేటి వారాన్నిధి దాఁటి
శ్రీమహావిష్ణు సాయుజ్యపదం బొందుదురు ముదంబు రామతారకము శాంభవీయోగిసుందరము ॥శ్రీరాముని॥
శ్రీ శేషాచలవేంకటాఖ్య లక్ష్మీరమణుని పేర నీశ బ్రహ్మాది లక్ష్మీసర్వేశిత్వశాలి పేరను
కోశాతీతనిరీశ సత్యజ్ఞానగురుఁడౌ విష్ణుని పేరను కృష్ణుని పేరను
ఈ శుభాధ్యాత్మరామాయణము తెనుగుకీర్తనలుగ నేర్పరించెన్‌ సగుణముక్తామణుల పేరను
కౌశలంబునను యుద్ధకాండము యిది షట్కాండ మఖండచిదనుభవి రుచిరవి సుబ్రహ్మణ్యకవి ॥శ్రీరాముని॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi