యుద్ధకాండము-45
రాగం: పూరి - తాళం: ఆది
పల్లవి:
కౌమారి గౌరి వినవే రఘుపతి చరిత్రము ॥కౌమారి॥
అనుపల్లవి:
రాముఁడు పట్టాభిషిక్తుఁడై మహి ప్రజల కనురక్తుఁ-
డై మనిచే సీతాయుక్తుఁడై మనువంశజుల తక్తు ॥గౌమారి॥
చరణములు:
నెల మూఁడువానలు గురిసి కలమాది సకలసస్యములు
జెలువొందెను వసుంధర తరువులు సుగంధసుమఫలవంత-
ములయ్యె నెరా శ్రీరామనృపతిలకము శతసహస్ర ధేను-
వులను నొక లక్షవృషభములను ముప్పదికోట్ల నిష్క-
ములను వస్త్రాభరణముల నెలమి వేదశాస్త్రవిత్తములగు భూసురసత్త-
ముల కొసఁగెను రఘూత్తముని చరితము విన వినఁ గ్రొత్త ॥కౌమారి॥
సవితృసూనుని మన్నించి స్వర్ణ రత్నహారమునిచ్చి
రవివంశమణి దనుజేంద్రుని అల విభీషణు లసన్నవరత్నహారాన్వితుని గావించి మించి
సవరణతో నంగదునిఁ జేరబిలిచి భుజకీర్తులిచ్చి
ప్రవిమలభక్తి నంజలియుతుఁడై
కొలిచియున్న హనుమంతుఁ దిలకించి యిలకుమారిక
తలచియున్న కోరికె యలర నొసఁగెనను శౌరికి చెలికి తారహారము దొరికె ॥కౌమారి॥
సీత తారావళిఁ జూచు చెలువునితో మోముఁ జూచి వి-
ఖ్యాతవానరులఁ జూచుచు నటులున్న తరి నృహరి
సీత యెవనికి దోఁచు వానికిమ్మనిన
చాతురి నృపకృతి మనమున ననుస్మరించె వైదేహి నీరే-
జాతనయన చాల గారవించి నెనరు మించి
శీతాంశుకోటిరుచిరము జాతిముత్తెముల సరము
వాతాత్మజు కంధరము వంచి యలంకరించెఁ గరము ॥కౌమారి॥
మారుతి గౌరవమున మెఱుపు తారావళితోన
సౌరైనట్లుండె నంత శ్రీరామవిభుఁ డతని
జేరరమ్మని హనుమంతా జ్ఞానోపదేశము
సారము గొనుమని యొసఁగె వింటివే మున్ను అనిలజుఁడు నమ-
స్కారమొనర్చి అనుక్షణంబు నే నిన్ను గొనియాడుచుందు
శ్రీరామా నీకథ యెందాక ధారుణి వెలయు నందాక
నారూఢి జీవింతు మీ కటాక్షమున ననెను ॥కౌమారి॥
కోరినట్టెల్లనిచ్చి సామీరి కల్పాంతమున మదీయ
సార సాయుజ్యము నొందెదవు అని పలికి హరి యపుడు
శ్రీరమణీ సీత నీవు నెందుందురచట
శ్రీ రాజిలు సకలసంపదలు సుఖమున నిత్యానందుఁడై
వారికి నతుఁడయి హిమవత్పర్వతమున మహిమ-
తో రామనామజపమహిమద్యుతి దేజుఁ డొనర్చుచుండె నుమా ॥కౌమారి॥
ముకుళితకరకమలుఁడయి ముందర నిలుచున్న గుహునికి
కకుత్‌స్థవంశ సార్వభౌముఁడు సర్వజ్ఞుఁ డనఘగుణుఁ
డకలంకుఁడయిన శ్రీరాముఁడు చాలారాజ్యము
ప్రకటముగా నొసఁగి ప్రజలనేలుము నీవు తుద సాయుజ్య ము-
క్తికి కుదురై చదురై నదురయ్యెదవని సెలవిచ్చె
సకలేశు ననుజ్ఞ నమస్కారశతము లొనర్చి సమ-
స్త కపుల్ విభీషణుఁడును దమ తమ భూములకుఁ జనిరి భామా ॥కౌమారి॥
ధరణీధరుఁడు శేషాద్రిధరణి సీతామనోహరుఁ డా
హరి పరమాత్ముఁడు నిష్క్రియుండు సత్యప్రకాశఘన-
గురుస్వసుఖానుభవుఁడు రాముఁడు కర్తృత్వా-
విరహితుఁడయ్యు మనుజుఁ డయినందువలన జనోపదేశికుఁడయి
గురుతరాశ్వమేధశతమొనర్చుచు లలనామణితోఁ బదివేలేం-
డ్లిరవొందు రాముని సేవించె హితుఁడై యువరాజై దయయుంచి
సరసమతియై ప్రజలమించి సౌమిత్రి చెలఁగె శ్రీమించి ॥కౌమారి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi