యుద్ధకాండము-44
రాగం: సైంధవి - తాళం: ఆది
పల్లవి:
వందనము శ్రీరఘునందనా అని రిందువదనా ॥వందనము॥
అనుపల్లవి:
సా|నందన బ్రహ్మసూర్యేందు వసురుద్రాశ్వినీబృందారకర్షిగోబృందముల్ ఆనందముగ ॥వందనము॥
చరణములు:
రావణాసురుచే స్వరాజ్యము కోల్పడితిమి దేవా మహానుభావా
ఆ దేవతారి మృతిం జెందె నీచే విభవము తిరుగఁ జేకూరెననె శచీంద్రుఁడు ॥వందనము॥
యాగభాగము మాచేఁగొని తా హరించు బాగా రావణుఁడు బోఁగా స-
రాగమున మా భాగములు తిరుగాఁ గైకొంటిమని క్రతుభుజులు పల్కి ॥వందనము॥
మచ్చిక మా పుత్రవర్గమిచ్చిన పిండము లెడఁజొచ్చి తానే గొను హెచ్చి నేఁ
డచ్చపలుఁడు నీచేఁ జచ్చినందున వచ్చె సొమ్మని పితృదేవతలు విన్నవించి ॥వందనము॥
శ్రీహరి మాచేఁ దన వాహనము మోయించె దుర్మోహియయి జగద్రోహి మ-
హాహవోర్వి నీచే హతుఁడయ్యె నుత్సాహము గల్గె నీ సత్కృపనని యక్షులు ॥వందనము॥
గీతము పాడెదము సంగీతకీర్తి నతపారిజాతా సీతాసమేతా సు-
జాతోల్లసత్కౌతూహలులమైతిమని గంధర్వు లలరి మనవి చేసి ॥వందనము॥
కిన్నర విద్యాధర మరున్నాగగరుడులు మున్నగు నప్సరస్త్రీలున్నూ ప్ర-
పన్నాననాబ్జాతమధువువన్నె గని భక్తిపారవశ్యమున కొనియాడి ॥వందనము॥
ఆడిపాడి మెప్పించి సర్వామరుల్ మందారవృష్టితోడ దుందుభులుగూడ జో-
డాడ సీతాలక్ష్మణాంజనేయులతోఁ గ్రీడించి శేషగిరికృష్ణానుమతి నిరవొంది ॥వందనము॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi