యుద్ధకాండము-42
రాగం: ఆనందభైరవి - తాళం: రూపక
పల్లవి:
పట్టాభిషేకము వినవే శాంకరి నీ జన్మ పావనము సేవింపుము కోసరి ॥పట్టాభి॥
అనుపల్లవి:
పట్టుగొమ్మ భక్తులకును బాలవెల్లి దయామృతమున
కిట్టితపము లెవరు చేసిరి యిత్తఱి మదినలరి శ్రీహరి ॥పట్టాభి॥
చరణములు:
శ్రేష్ఠులై వసిష్ఠు మొదలుగా పురోహిత వసిష్ఠు లఖిలనిగమవిదులుగా సుకృత
నైష్ఠికులై నగరుఁజేరి నవరసాలంకారయుతుల
నిష్ఠ రత్నసింహాసనమున నెలకొలిపిరి సీతారాముల ॥పట్టాభి॥
హొన్నువన్నెచిన్న కన్నెలు జేజేల మన్నీలు మంత్రులు ధన్యులు పసిఁడి-
వన్నె యోషధిరసముల నన్నిగూర్చి వసుపులింద్రుని
బన్ని శ్రీమంతుఁ జేయు పగిది నభిషేకించిరి రాముని ॥పట్టాభి॥
వాసుదేవ జాబాలి గౌతములు వాల్మీకాది మౌనిపాళి ఋగ్యజు-
స్సామవేదమంత్రముల కుశాగ్ర తులసీ పుష్పగంధ
సముద్రోదక సంపూర్ణ హైమకలశము నొనర్చిరి ॥పట్టాభి॥
గొడుగు శత్రుఘ్నుఁడు ధరించెను శ్రీసుగ్రీవుఁడు విభీషణుఁ డిరుగడలను చెలువు
దొడరి శ్వేతచామరములు నిడిరి వాయుదేవునిచే
నిడుద బంగారు సరిపెన నిలింపరాజు పంపె హరికి ॥పట్టాభి॥
రామనామాంకములు పాడిరి గంధర్వులు ప్రేమ నచ్చర వెలఁదులాడిరి అపుడు
వేమఱు జయదుందుభులు వేలుపులు మ్రోయించి రామ-
స్వామిపై మందారకుసుమవర్షములు గురిసిరి ॥పట్టాభి॥
కోటిసూర్యేందుమండలాకార మణికిరీటాంగద మకరకుండల ద్యుతుల-
తోటి కౌస్తుభాదికముల మొలనూలు నందియల
కోటిమదనసుందరుని కోదండవిద్యాగురుని రాముని ॥పట్టాభి॥
నవదూర్వాదళశ్యాముని పద్మపత్రనయనుని స్వర్ణాంబరుని రుచిర-
దివిజమాల్యశోభితుని దివ్యచందనాలంకృతుని
నవమణివలయాంగుళీయక విలసద్భుజుని రాముని ॥పట్టాభి॥
మించు పసిఁడిమించు తనువునఁ దొడవులు గీలించి యెలమి కలివి చనువున హే-
మించి రాముని డాతొడ వసించి కెంగేలఁ గౌఁగి-
లించి సీతాసమాఖ్య గాంచి చెలగు సిరికి హరికి ॥పట్టాభి॥
వరదుఁడై సుబ్రహ్మణ్యుని యేలిన నెర సరసుని నానతశరణ్యుని
గురుతెఱిఁగి వర్ణించ నెవరి తరము మనోవాగగో-
చరుఁడగు శ్రీశేషాచలసార్వభౌముని వేంకటరాముని ॥పట్టాభి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi