కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-41
రాగం: భైరవి - తాళం: ఆది
పల్లవి:
మహనీయగుణవివర్ధని ఉమా పర్వతవర్ధని వినవే ॥మహనీయ॥
అనుపల్లవి:
మహిమతో రామప్రభుమణి రా మల్లికల్‌ పరిమళ హిమాంబువుల్
ప్రహర్షమునను జల్లిరా పురంబుప్రజల్‌ తమ భాగ్యమిదే యటన్న మదిని ॥మహనీయ॥
చరణములు:
భూరిభేరీనాదములు దెసలఁ బొసఁగి యెసఁగఁ
జారురత్నకిరీటాది భూషణద్యుతుల వెలుఁగ
వారకామినులు తాహత ఝంతరి తరితకుంద యని
దరువుల్‌ శృంగారాభినయంబులు జెలంగఁగ ఘనంబగు తండ్రి గృహంబు జేరెను హరి ॥మహనీయ॥
రామదేవుఁడు కౌసల్యాచరణయుగళికి
రామతో నతుఁడై పినతల్లు లలరఁగా మ్రొక్కి పలికె
ప్రేమచే సుగ్రీవుని నిజమణిధామమునను విడియింపఁ బంచెను
సామీరి విభీషణాదుల సకలసమృద్ధనివేశనములన్‌ నిల సెలవొసఁగె ॥మహనీయ॥
సీతాపతి యభిషేకార్థము చతుస్సింధుజలముల
ఖ్యాతిగా దేఁ బంపుమని భరతుఁ డానతీయ నసముల
ధాతృసూను సమీరాత్మజాంగద సుషేణుల సుగ్రీవుఁడు పంచెను
జాతప్రీతిన్‌ జని వార లబ్ధిజలంబులు దెచ్చిరి శేషగిరివరు దయ ॥మహనీయ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi