యుద్ధకాండము-39
రాగం: ముఖారి - తాళం: జంపె
పల్లవి:
వినుతశీలా దానవిజితసురసాల వినవే హిమశైలబాల ॥వినుత॥
అనుపల్లవి:
ఘనుఁడు రాముఁడు పుష్పకము డిగ్గి తన తమ్ములను కౌఁగిలించి తొడల నిడె వారల-
వ్వనజాక్షు చరణమ్ములకును మ్రొక్కి వందనము జనకనందని కొనర్చిరి యలరి ॥వినుత॥
చరణములు:
తా లక్ష్మణుని భరతుఁ డాలింగనమొనర్చె నాలీల సౌమిత్రి యనుజన్ము నెనసెన్
వాలితమ్ముఁడు కొడుకు చాల కపులు మనుజులయి లాలించిరి కౌఁగిళుల రాఘవుల
చాలా జయమూలమయ్యెను నీసహాయము తమ్ముఁడా యనెన్ భరతుఁ డర్కసుతు ॥వినుత॥
గురుభక్తిఁ గౌసల్య కెరఁగి తల్లులకెల్ల కరమర్థి మ్రొక్కుచును వరవిమానమున
భరతాదుల నిడికొని భానుకులమణి జేరెఁ బురము నందిగ్రామము సత్వరము
సురవిమానవర మా పొగడదరమా 'సుఖం భవతు శివసఖం వహ' యనన్ బనివినె నదియు ॥వినుత॥
రామచంద్రనరేంద్ర రాసిరి యీపాదుకల నే మించి ధనమణులు సామజాశ్వములు
స్వామి సచివాప్తాదిసప్తాంగము లివెల్ల నీ మహిమచే నధికము దశగుణము
స్వామీ యని శ్రీమీఱె పాదుకల రామునియడుగు లాముకొనన్ దొడిగె భరతుఁడు ॥వినుత॥
పదునాలుగేండ్లాయె భవదంఘ్రియుగళి గని సదయాత్మ గురువర్య సత్కార్యధుర్యప
యిదె నమస్కారశత మిదె ప్రదక్షిణములని ఒదవించెను వసిష్ఠుని అనుమతిని
తదుపాంతమునఁ గృపాంబునిధి శేషధరాధరవిభుఁడు చరాచరగురుఁడు రాముఁడుండె ॥వినుత॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi