యుద్ధకాండము-38
రాగం: పూరి - తాళం: ఆది
పల్లవి:
మానినీ పరాకు మాని నీవు వినవే ॥మానినీ॥
అనుపల్లవి:
శ్రీనివాసుఁ డీలీల భరద్వాజుచే నన్నిటఁ బూజితుఁడై హితుఁడై
ధ్యానించి మది భరతుని గురించి హనుమంతుఁ గాంచి యనూనకరుణారసము నించి
నేను వనినని మొననొనర్చిన నెఱపనులు కుశలము మునివిందు
వానరాసురులతో మా రాక దెల్పుమనె ॥మానినీ॥
చరణములు:
మేమిదె|వత్తుమయోధ్యకని తెల్పుమా గురూత్తమున కానతిసల్పుమా స-
చిత్తత్వమూల్యసౌశీల్య కౌసల్యకు బత్తికి మ్రొక్కితిననుమా తల్లుల గనుమా
యిత్తఱి నతిత్వరితగతి జనుమా శృంగిబేరమున నృసత్తముని గుహునిఁ గనుఁగొనుమా
హత్తి నందిగ్రామమునను మదనుజు ననుజసహితు భరతుని గు-
ణోత్తరుని సేమమారసి రమ్మా యనెను హరి ॥మానినీ॥
మా|రుతి నతిచేసి పనివినెను ఖగపతిగతి శృంగిబేరముఁ జేరెను సానుజుఁడై రాముఁడు
సీతాలక్ష్మణ సేనాయుతుఁడై వచ్చుట గుహునికిఁ దెలియఁబలికి
అతులసుందరమనుజ తనువంది నందిగ్రామస్థితు భరతు శ్రీవిరతుఁ జెంది
నతిచేసి కుశలమే సుమిత్రానందన సతీసమేతము రఘు-
పతి భరద్వాజుకడనున్నాఁడు సఖియనెను ॥మానినీ॥
మీ|రెవ్వరికై నారచీరలు నిలఁ బవ్వళించి జడదారులునై
గువ్వమేత కాయగూరల మెసగేరు నొవ్వనిపనియేమి యా దైవరాయఁ
డవ్విరాధ ఖరాసురుల నోర్చి వాలిని తెగటార్చి యతని తమ్ముని సిరులగూర్చి
మొవ్వముగఁ జేకొని కడలి గట్టవ్వలను రావణునిఁ బొరిగొని
చివ్వనను సీత చెఱ యుడిపికొని వచ్చెననె ॥మానినీ॥
ఆ|కైకకొడుకు హర్షపరవశుఁడై దయచే కౌఁగిటినుంచి గురుయశుఁడై యీ
యాకృతినెనసిన యా దేవుఁడవో నీవు కాకుత్‌స్థకులచంద్రుని రామేంద్రుని
రాక మాకెఱిఁగించి సుధ నించి మము మనిచితివని య-
నేక బహుమతులనలరించి రాకొమరుకీర్తి యనిలజుచే సాకల్యముగ వినుమని సుమి-
త్రాకుమారక రాఘవులఁ గనఁగాఁ బోదమనెను ॥మానినీ॥
ఆ|పౌరమంత్రి బుధగురుజనులు జయభేరులు వారసుందరులు రా
శ్రీరామపాదుకాంచితమస్తకులై మహారాజసన్నిధిని పెన్నిధిని
జేరినటువలె భరతశత్రుఘ్నుల్ శరణుశరణు నమస్కారశతమనిరి జితవిఘ్నుల్
సారకరుణామృతాసార లసద్విలోకనము తమ్ములపై పూరించిన శేషగిరినృహరి మన్నించె ॥మానినీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi