యుద్ధకాండము-37
రాగం: ఫరజు - తాళం: ఆది
పల్లవి:
సేవకజీవమణి వినవే నిజసేవకభావమణీ రమణీ ॥సేవక॥
అనుపల్లవి:
సేవకసౌరమణి దేవుని జితదశగ్రీవుని మహాను-
భావుని భరద్వాజుడు గని భానుతేజుఁ-
డీవు వనికిఁ జని యేమి చేసితి వదెల్ల నీదయవల్లను దెలుసుననె ॥సేవక॥
చరణములు:
ఆదిమధ్యాంతములులే వద్వయ బ్రహ్మమౌ లేవాది విలాసలీల మాయ నీమాయ
పాదునీవె పొందమ్మి పావనికి యానెమ్మి ఆదినారాయణా స్వామీ అంతర్యామి
నాదబ్రహ్మానందరసికవర నందితాత్మ పరమాత్మ యనెను ముని ॥సేవక॥
నీవు విష్ణుఁడవు దేవి సీత లక్ష్మణదేవుఁడు శేషుఁడు తెలియ నీమాయ
నీవు నీయందె నీచే విశ్వము సృజియించినావు నభమువలె నీవు నంటకున్నావు
నీవుసాక్షివి నిఖిలభూతములలో వెలిపూర్ణుఁడవై వెలయుదువనె ॥సేవక॥
వెఱ్ఱివానికి నీవువేఱై తోచినావు కుఱ్ఱలఁ బ్రజలఁ బ్రోవ గోవిందుఁడవు
యెఱ్ఱనై నల్లనై యేమేమి గన్పట్టనేమి గఱ్ఱన వినబడు నవియెల్ల నీవేజగము నీవల్ల
మఱ్ఱాకుల బవళించినయ్య యొక మహిమగలదె నీకన్యమనెను ముని ॥సేవక॥
మాయాజడమైన నీచే మఱి చూడఁబడినందుచే మాయ గుణములతోడను జేయును జగములను
రాయి సూదంటులో హత్తికరిగినట్టు హా జేయువారికి నివి నీయం దుపచారమాయెను
మాయురె దేహరహితుఁడగు నీకిమ్మహి స్థూలసూక్ష్మమనం గలిగెననె ॥సేవక॥
స్థూలము వైరాజము సూక్ష్మము హైరణ్యము లీలను మేనులు వేలకొలందులు
హేల చాలించితేను ఎనయు విరాట్టును మూలమైన నీ యవతారానుసార సార-
శ్రీల నెసఁగి పొసఁగు నీకథాసుధ గ్రోలువారకె ముక్తి యనెను ముని ॥సేవక॥
నలువమాటలు బట్టి కులమణివై పుట్టి జలధిఁ గట్టి యరిఁ గొట్టి యిలబరువు దట్టి
భళిర కౌసల్యపట్టి ప్రబలుఁడను పద్దు పట్టి వెలయు వేంకటరామ శ్రీసీతారామా
తెలిసి నీవు కావలసి సేయుపని యలవియే యొరుల కనిపలికెను ముని ॥సేవక॥
శరణు సుజీవనునిగాఁ బరమపావనునిగాఁ గరుణయుంచి నాయిల్లు సిరి వెలయించి
విరుల పూజ వరించి విందారగించి మించి పురము పాలింపుమీ రేపు నీవె మా ప్రాపు
హరి శేషాచలనృహరి యనిన గురునాజ్ఞ నుండె హరి యలరి రందఱును ॥సేవక॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi