కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-36
రాగం: యదుకులకాంభోజి - తాళం: అట
పల్లవి:
వింటివా దుర్గా స్వర్గాపవర్గవిభు రామేంద్రుని స్తోత్రము ॥వింటివా॥
అనుపల్లవి:
తెఱగంటిరాజగు వేగంటితో నాతమ్మికంటి పల్కె విచిత్రము
ఇరువదికంటిదొర జగడమునఁ జచ్చిన కపుల నమృతపు జడిని నలవడిఁ
గెంటించి బ్రదికింపుమన హరి తొంటి యటుల నొనర్చె వానరుల ॥వింటివా॥
చరణములు:
జంటం బాయక నేనంటి నంజలిచే ముక్కంటిని సీతారామా మన
గంటిని నినుఁ బొడఁగంటిని ప్రజ నోముపంట దశరథుఁడదె శ్రీరామా చూడుమ-
టంటి నంతట రాముఁ డభినవహర్షమున జనకునకు మ్రొక్కెను
అంటి కౌఁగిటనిడి సుతుని ముద్దాడి కొనియాడి చనె దశరథుఁడు ॥వింటివా॥
సీతాలక్ష్మణులతోఁ జెరఁగి సన్మంగళస్నాతకులరై కైచేసి చనిన
చేతోముదమనిన శ్రీరాముఁడు సఖుని చేపట్టి భరతు నెడఁబాసి తొడవుల
నేతెఱంగున దొడుగనగు రవిజాతాది కపుల బహుమత మ-
త్ప్రీతి యగుననినఁ బతి నుడి మణిజాతినలరించె నతఁడందఱిని ॥వింటివా॥
అంబరయాన త్య్రంబకసఖు విమానంబున రాఘవుఁడుండి తమ్మునిఁ
బింబోష్ఠి సీతం బుష్పకంబు నెక్కం బంచి సెలవు గొనుండి సిరులఁ ది-
రంబుగా రాజ్యమేలుఁడు మారాజువై యనిన నతి స్వామీ
యంబకౌసల్య కెరఁగి యయోధ్యాపురిని మిము గనఁగ నిడుమనిరి ॥వింటివా॥
హనుమంతుని సకలవనచరుల సుగ్రీవుని విభీషణుని మంత్రు-
లను గూడి రమ్మని ధనదయానమున నిడికొనె రఘువంశమణి దానిన్‌
ఘనపథంబున జనం బనిగొని జనకజం గనుఁగొని త్రికూటం-
బున లంకసొగసు గను మిది రణభువి రావణాదు లీల్గినచోటనెను ॥వింటివా॥
ఇది సేతువు కడలికీవల రామేశ్వరు నొదవించి నానబలా మాతో-
నదే రావణానుజుఁడితవైన చోటల్లదె కిష్కింధ యబలా వాలిన్
విదళించినాను జేకొనుము వనేచరుల నతులనని కదలి
యిది పంచవటి చిత్రకూటంబిది భరద్వాజాశ్రమంబనెను ॥వింటివా॥
వరవిమాన మందఱితో డిగ్గి సోదరసీతాసహితుఁడయి యేఁగి
పరమ తపోనిధీభరద్వాజుని దివ్యచరణములకు నతుఁడై మ్రొక్కుచు
భరతుఁడును బినతమ్ముఁడును సుఖభరితులే కౌసల్య కుశలియే
గురువర్య యనిన శేషాచలశౌరి అందఱికి నీదయను గుశలమనె ॥వింటివా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi