యుద్ధకాండము-32
రాగం: సౌరాష్ట్ర - తాళం: అట
పల్లవి:
శృంగారానంత కల్యాణవతీ సంగీతభారతీ వినవే ॥శృంగారా॥
అనుపల్లవి:
ఉ|ప్పొంగుచు సీత రామునికి మ్రొక్కి చెంగట నిలువ మున్పటి నెనరు దక్కి
అంగనామణి రావణుని నే ననిఁ జంపి చెఱ విడిపించితిని
సంగతి గని మనసు వచ్చిన జాడలను బొమ్మనెను రఘువతి ॥శృంగారా॥
చరణములు:
అనిన రాముని మది భావించి లక్ష్మణునిఁ గాంచి కన్నీరు నించి
కనికరమున నన్నుఁ గనుఁగొనవన్నా అనలునిఁ జొచ్చివచ్చిన మీదనన్న
ననుఁ జేకొనునొకో మీయన్న అనిన మానినికి కనుసన్న
జనపతి యొనర్ప జ్వలనుని ప్రజ్వలనమొందించె నగచరతతి ॥శృంగారా॥
తరుణి ప్రదక్షిణమొనర్చి విభునికి దండప్రణామమొనర్చి
గురుపతి దైవమని యుంటినేని పరమపవిత్ర యో పవమానమిత్ర
సరసుఁడగు విభుని ననుఁ గూర్చి యరసి రక్షింపుమనిఁ బేర్చి
యురికె నగ్నిని జానకి సురాసుర మనుజకపివరులు పొగడగ ॥శృంగారా॥
ఇంద్రుఁడు యముఁడు వరుణుఁడు గుబేరుఁడు వృషవాహనుఁడు నీశానుఁడు
చంద్రసూర్య సిద్ధచారణ వసుసంయమీంద్రులతో బ్రహ్మ వచ్చి నృసింహ
సాంద్రకీర్తివి జగత్కర్తవు సాక్షివి జ్ఞానవిగ్రహుఁడ వ-
తీంద్రియుఁడవు జిదానందమూర్తివటంచు రాముని నుతించెను ॥శృంగారా॥
వసువులలో విభావసుఁడవు రుద్రులలో నసమాక్షుఁడవు శంకరుఁడవు
వెసఁ జతుర్ముఖబ్రహ్మవీవె ప్రాణేంద్రియ మసదు గాదశ్వినుల చంద్రసూర్యులు
పొసఁగఁ గన్నులు జగత్క్రీడకు మొదలొకఁడ వచలుఁడ వమేయుఁడ
వసదృశపు మాయ నరాకృతి నరి నడఁచఁదగితి వని రమరులు ॥శృంగారా॥
ఈ వహిని సురలు గొనియాడ బ్రహ్మదేవుఁడు ప్రణమిల్లి వేఁడ
భావింపఁగాఁ గోరి ప్రణతార్తిహారి దేశశేషాద్రివిహారి శౌరి
రావణాతంకరూపధారి రాగరహితమనోనుసారి
భావజారిప్రముఖసూరి ప్రమదకారి యని నుతించెను ॥శృంగారా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi