యుద్ధకాండము-31
రాగం: కాంభోజి - తాళం: ఆది
పల్లవి:
వీణావాదనాభినయిత మస్తకా విలసత్కరాంచిత పుస్తకా ॥వీణా॥
అనుపల్లవి:
ప్రాణసముని శ్రీమద్విభీషణుని రామక్షోణీపతి కౌఁగిటిలో మన్నించి భువిలో
నాణెమయ్యెఁ గీర్తి కృతకృత్యుఁడనైతి జయస్ఫూర్తినని పలికి
జాణయై విభీషణానుమతి నాంజనేయ సీతకు నా గెల్పు దెల్పుమనె ॥వీణా॥
చరణములు:
మారుతి రాముని యానతి లంకానగరిఁ జేరి శింశుపాతరువు ప్రాపునఁ జిక్కి
మీఱిన వగబరువుచే నెల్లపుడు శ్రీరామ
శ్రీరామ శ్రీమత్తారకనామ కోరి నను గావవే అని యని వే-
మాఱు బల్కు సీతాసతికి నతి సారెకొనర్ప హితాగ్రణి యనుచు
నా రమణి దెలిసి దీవనలనిచ్చి హారమణిగణములన ప్రియోక్తుల మనిచె ॥వీణా॥
అమ్మా సీతమ్మా రాముఁడు రావణుని ననిలో సబలముగాఁ బొరిగొనె ననినఁ
గొమ్మ వీనులవిందుగా విని యుప్పొంగె
యిమ్మహి నినువంటి ఘనులెవరు ముక్కంటి తమ్మిచూలి సిరిదొర మనుచు నిన్ను రా-
రమ్మా దీవన చేకొమ్మా యని యమ్మ యనిచి సెలవియ్య
నమ్మరుత్సుతుఁడు నృపునిఁ జేరి మాయమ్మ మీ జయము విని మిన్నందెననె ॥వీణా॥
ఎవరినై నేనింతఁ జేసినట్టి యవనిజ నభిషేకించి యలంకరించి
నవరత్నముల మంచిపల్లకినుంచి
సవరణఁ దోడితేఁ జను విభీషణా యన నవనిపతి యానతి శిరమునందిడుకొని
పవనజాది సఖులతోడఁ జని యభంగ సంభ్రమముతో నిపుణలగు
యువిదలను బనుప జడలు విడిపించి యువతికిని మంగళస్నానమొనర్చిరి ॥వీణా॥
పట్టుచీరెఁగట్టి బంగారు రవికఁ దొడఁగి బొట్టుకస్తూరి దీర్చి కాటుక కనులఁ
బెట్టి కురులుఁ గూర్చి సరులు దాల్చి
పట్టెడఁ బన్నసరము బవిరెలు మురువుతాళీల్ పతకములు కంఠసరులు కీల్‌కడెములు
దిట్టమగు వడ్డాణము ఆణిముత్తెపు ముంగర రాణముగలందెలు
మెట్టెలుఁ జిఱుగజ్జెలును కైచేసి మంజులాందోళికమున నిడి రతివను ॥వీణా॥
పల్లకిలో సీతాభామ శ్రీరామవలె నుల్లసిల్లగ రాఁ గని కపిదనుజసేన-
లెల్లఁ గన్గొన మునుకొని వేత్రహస్తులు
మళ్లింపఁ గోలాహలమై పరికించి యిలావల్లభుఁ డనుమతించి చూడఁగాఁ బంచి
యల్ల మాయసీతన్ విడిచి మున్నగ్నినిడిన సీతన్ దేఁదలఁచి
మెల్ల శిబికడిగి రమ్మనిన నడిచి మృగాక్షి శేషగిరీశు సన్నిధిఁ జేరె ॥వీణా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi