కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-30
రాగం: బిలహరి - తాళం: జంపె
పల్లవి:
దేవాదిదేవుని రాముని సత్యవాణి పూవుఁబోణీ వినవే ॥దేవాది॥
అనుపల్లవి:
'యావచ్చంద్రశ్చ సూర్యశ్చ యావత్తిష్ఠతి మేదినీ
యావద్రామకథాలోకే తావద్రాజ్యం కరోత్యసౌ
శ్రీవిభీషణ' యని యానాడె బలికితి వే లక్ష్మణా పట్టాభిషేక మొనర్చుమనె ॥దేవాది॥
చరణములు:
రామేంద్రుని యానతి శిరము నందిడుకొని సౌమిత్రి వానరులఁ దొడ్కొని వేగమె చని
హేమప్రాకారసౌధ ముక్తామణీతోరణము శ్రీమత్ప్రతిగృహాంగణము శ్రీదము లంకాపురీంద్రము
వేమరుం బొగడి కల్యాణ నిలయమునను హేమసింహాసనమునన్‌ విభీషణు నునిచె ॥దేవాది॥
సాముద్రజలమ్ములు స్వర్ణకుంభముల నించి శ్రీమించి మైత్రిఁ దెప్పించి ధర్మమెప్పించి
యామినిచరులఁ బాలించి లంక యేలుమని మంచి హేమించి పట్టము బూన్చి సామాది శ్రుతుల్‌ పఠించి
భూమిసురులు తాను విభీషణాభిషేక మొనరించెను రామానుజుఁడు సంభ్రమమున ॥దేవాది॥
కానుకలతో సఖుఁడు లక్ష్మణుఁ డగ్రముననే రా దానవేంద్ర శ్రీమీఱ విభీషణుఁడు
దీనావనుఁడు వీరాధివీరుఁడు ముందుగా రా మానితుఁడౌ శ్రీరామప్రభు సన్నిధిఁ జేర
సానతిన్‌ వచ్చి యభివాదయేహం నృపచంద్ర శేషాచలేంద్రా యని నతులొనర్చె ॥దేవాది॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi