కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-28
రాగం: గౌళిపంతు - తాళం: ఆది
పల్లవి:
వినవే కలకంఠ లలితకంఠ నుతవైకుంఠ ॥వినవే॥
అనుపల్లవి:
మనుజేంద్రుని గెల్పు రావణు చావు గని యుత్కంఠ
వనచరుల్‌ చెలంగి మేల్‌ మేలని వదంతిఁ జేసిరి సదంతికములను ॥వినవే॥
చరణములు:
క్రందై సురదుందుభులు మొరసె రామునిపై దేవ-
మందారపుష్పవృష్టి గురిసె విన వినుతి చెవుల
విందాయె నచ్చరల్‌ దిగ్దిగ్దాందామని యాడిరి
ముందు జేజేలరాయని తనువందు జ్యోతి వెడలి రాఘవు నెనసె ॥వినవే॥
సురలచ్చెరువునొంది వీఁడు పరదారరతుఁడు
గురుజనద్రోహియయ్యు నేఁడు ముక్తుఁడైనాఁడు
హరికి మనము సత్త్వదేహమట్టైనా హరినిఁ గూడ
టొరుల కెవ్వరికి దెప్పరమన సురమునీంద్రుఁ డనియె దేవతలఁ గని ॥వినవే॥
రావణుఁ డలుక నృహరియందే మది నిల్పుటచే
రాముని వైకుంఠము జెందె మోక్షమునొందె
శ్రీవంద్యుని పగనైనా చెల్మినైనా బొందు
గేవలబ్రహ్మమై నిలుచును నికృష్టుఁడైన ఖలుఁడైన ననెను ముని ॥వినవే॥
అని దశాస్యుఁ దునిమి డాపలి చే విల్ వలపలి చే దూ-
పొనర నిల నాసీనుఁడై నిలిచె నింద్రస్తుతిఁ జె-
న్నొనరి క్రేగనులెఱుపై పోట్లన్‌ మేను రవికోటిప్రభచేఁ
దనరఁగా వీరలక్ష్మీమణి నెనయు శేషగిరిరాముఁ డరయ నను ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi