కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-27
రాగం: కాపి - తాళం: అట
పల్లవి:
రమణీ రమణీయమె యీ చరితము ॥రమణీ॥
అనుపల్లవి:
శ్రమజలబిందు లసన్ముఖుఁడై రామచంద్రుఁడు రావణుతోఁ బోరుటెంతో ॥రమణీ॥
చరణములు:
ప్రదరము లదరంటనేసి వెటవెట పండ్లుగొరికి పగతు డాసి
కొదలేని కినుకచేఁ గోదండోల్లాసి యెదిరె నాదముచే మృగేంద్రము వాసి
కదిసెఁ గాలము నీకటంచు యుగాంతాగ్నివలె రాముఁడడరెను ॥రమణీ॥
అసురేంద్రుఁ డట్టహాసమున మీసమట్టె తీసి యుల్లాసమున
వెసనిన్ను గెల్తు నేనని సాహసమున మసలకు రామా రమ్మాయని రోసమున
నసదుగాని చలమున నిఱురూపైన చాడ్పున బోరిరిద్దఱు ॥రమణీ॥
ఈవిధమున సరిసరిగా రామరావణుల్‌ హరి కేసరిగా
దేవ రాఘవ మనవి దెల్పఁగ దరిగా భావింప వీనిఁ బెంపరలాడు విరిగా
దేవకంటకుని బ్రహ్మాస్త్రముచే వ్రేయుమనెను సురసారథి ॥రమణీ॥
బ్రహ్మాస్త్రం బరిబోసి రఘుపతి సమంత్రముగఁజేసి
సింహమేనుఁగు బట్టి చీల్చినట్టే రాసి బ్రహ్మరాకాసి ప్రాణాల్‌ గొననేసి
బ్రహ్మచే రావణుని తల యిల రాల్చి పొదిఁజేరె బ్రహ్మాస్త్రము ॥రమణీ॥
బ్రహ్మాస్త్రమున మితిదీర రావణబ్రహ్మ కజుఁడు వ్రాసెనౌరా యని
బ్రహ్మర్షి సురనర బ్రహ్మరుద్రాదుల బ్రహ్మస్తంభముగ వాగ్బ్రహ్మమున సార-
బ్రహ్మ సుబ్రహ్మణ్య రామబ్రహ్మమిల శేషగిరిహరి యనిరి ॥రమణీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi