యుద్ధకాండము-26
రాగం: వసంత - తాళం: ఆది
పల్లవి:
విను చెలి ॥విను॥
అనుపల్లవి:
విను చెలి రాముఁడు కడువడి కెరలి
తనువునఁ దూపులు నీనిచి చేసరళి
దనుజుని టెక్కెము నఱికెం దరలి ॥విను॥
చరణములు:
తెలిదామరనేలు కనుల హరి చెంగలువ విరిచెలువు దాల్చెను
తలలు పది పదితూపుల దినమణికులుఁ డిలఁ గూల్చెను వేవే మొల్చెను
మఱియొకమఱు పదిమార్లు నూఱుమార్లు నెఱయఁగ దలల్ ద్రుంచెను
శిరములు గళములు కరములు ద్రుంచ సుకరములౌట గని హరి కోపించెను ॥విను॥
మణికిరీటములు మకరకుండలములు మంజుముక్తామణిహారముల్
మణిచకచ్చకల ననువగు తాళిల్ కేల్‌కడెములు గల తనువుల్ జేరె బల్ ॥విను॥
తలతొడవులు వీనులసొమ్ములను పతకముల్ చేసరముల్ గల
ఖలరావణ దేహము లెప్పటి వలె వెలుఁగన వచ్చెరువొందె నృపమౌళిబల ॥విను॥
వేసి నేనలసితి నఱికి వేసారితి వీనికిఁ జావులేదాయెను
యీశరములెట్లొ వైరులఁ బొరిగొన నివి వితాయనని హరి చింతిల్లె ॥విను॥
కారణకారణుఁడవైన నరుని వలె గన్పట్టెదవు ధరలోనను
గారడి మాయన్న కడుపులోపలి సుధ ఘటమ గల్పుమని విభీషణుఁడనెను ॥విను॥
పొట్టేలు నెక్కిన దిట్టమ్ము శ్రీరాముఁ డట్టె యేయ సుధాకుంభము
మెట్టుగాల్చి శాంతిఁ బడఁగొట్టె నసురతలల్ తొమ్మిది పదునెనిమిది దోఃస్తంభముల్ ॥విను॥
మోటమ్రానువలె జెన్నరి పగ దశముఖుఁ డౌడుగఱచి చేదోయిఁ
బాటవమునఁ బోరెను శేషాచలపతితో నార్నొక పగలు రేయి ॥విను॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi