యుద్ధకాండము-24
రాగం: నాట - తాళం: ఆది
పల్లవి:
సుఖీభవ యనవే సఖీమణి వినవే ॥సుఖీభవ॥
అనుపల్లవి:
ప్రఖేలనముగ విభాకరాత్మజముఖాగచర వీరులనెంచి నిజ-
సఖాళి నలరించి మెయిఁ బెంచి లిఖించినటులఁ జరించి వైరుల
ముఖాముఖిగ నెదిరించి చలము మించి దట్టించి దశముఖుం
డఖిలాస్త్రములను బరగించి యఖండగతి నలయించెఁ గపిబలము ॥సుఖీభవ॥
చరణములు:
రావణా యిటురమ్మని హుమ్మని యా వాయుజుఁడు పిడికిటఁ బొడువ సోలి వ్రాలి
చావుదప్పె చాలిఁకేల నాలమను బాళి లేవఁబో నెత్తురుల్ పదినోళ్ళ
బావినీళ్ళిడ్చు కపిలెలో యనగా వెడలెఁ దలలో మెదడదరె
దేవుఁడెఱుఁగు నీదెబ్బ కబ్బయని భావించి యాంజనేయ భళిభళి పరా జేయ నీ
లావు మెచ్చవచ్చునన బ్రతికి యున్నావిదేటి బలంబనె ప్లవగమణి ॥సుఖీభవ॥
ఐన నీ పోటుగని మాటుకొని నేనవల నిను వ్రేతు బ్రతికెదవో నా
ఆ నరాశనుం డఱచే నడ్చ సుంతలో నాకౌను విర్విర బోవనంతలో
దానిలం దొరంగె నంతలోననె మేనెరిగి యింతలో హితవొదవె
హినిశాచరాయన్న యదరున దానవుడు మార్కొని పై జని యని-
లేని బలుపెనుపై యున్న మానె బోరు హనుమంతుఁ డల వాలి-
సూనుఁడును నలుఁడు నీలుఁడు నమరిరి ॥సుఖీభవ॥
ఓరి యగ్నివర్ణ యిటురా పటుముష్టి నొంతునని కృతాంతుఁడన డాసి
మారుమాటాడనీ కనిలజుఁడు పేరడఁచె వాని సర్పరోముని
తారకొడుకు నేర్పరో యనఁ ద్రుంచె దీరె నలునిచే ఖడ్గరోముఁడు
సారాహిపవరభీముఁడు తెగటారెను వృశ్చికరోముఁడు ఘో-
రారి కాలుఁడగు నీలుచేఁ గొంత హాయిజెందె జనము రామునిచెంత ॥సుఖీభవ॥
లంకానాథుఁ డంతట నొకట లాతిచేత హితులు తెగుట గని
బింకంబొనర మౌర్విమీటి యుర్వి వీడు గర్వియను కిన్కిన్
శంక లేక రఘునాయకు నెదిరి శరాసారమున ముంచెను హరి
మంకుగొని యలందెను అలంచెను కంకపత్రాఖిలాస్త్రముల సహా
శాంకరి నేనేమందునే జగములందెరుగ ముందు నక-
లంకఘోర రామరావణులిటు లాహవం బొనర్చిరి కనులవిందు ॥సుఖీభవ॥
భూమిపై నిలిచి హరి రథముపై యామినీచరుడుండ వేల్పు-
సామి మాతలీ రథంబు రామమనుజపతి కీ-
యుమీ మీదాసుడన్ గ్రహింపు మిదెందు జయదమని మనవిగా దెల్పు
నా మేల సత్వరగా రథము తగ వామి దెచ్చి కౌసలేయ యిది సు-
త్రాముఁ డంపెఁ దేరెక్కి యీ రావణు గొనుమని మ్రొక్కి ధను-
వీమహాస్త్రముల్ తురగముల్ నేనివెల్ల శేషగిరివరా నీవనెను ॥సుఖీభవ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi