కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-21
రాగం: కన్నడగౌళ - తాళం: ఆది
పల్లవి:
వినవే కోదండధారిణీ విమలయోగిమానససంచారిణీ ॥వినవే॥
అనుపల్లవి:
ధణంధణమని భేరిమ్రోయ రావణుఁడు లోకవిద్రావణుఁడు వెడలె
దనయుఁ డింద్రజి త్తరిచేఁ బడిన ధావంతమున ననికి సేనలతో ॥వినవే॥
చరణములు:
బాణతూణకృపాణధనురాది బహు సాధనములఁ దనరు తేరెక్కి
పెళపెళ ద్రొక్కి పొగరెక్కి తా నిక్కి చూచె రాముని చక్కి
నాణెమగు విల్లెక్కిడి నృపతి యనూనమైన నారాచతితి నొంచె
మేను స్రుక్క నెత్తురుల్‌ గ్రక్క దలమించె నొక్కనినైనఁ జిక్కనీక ॥వినవే॥
మిడత లగ్నిలోనఁ బడి కాలిన
వడువై బలములు నృహరిచేఁ జచ్చినది గని నొచ్చి వెన్నిచ్చి
కడువడిఁ బఱిచి లంకఁ జొచ్చి
ఒడల్ వడవడ వడంక రఘుపతి యడరి వెంబడించెనని దిగులుపడి
పుడమిఱేఁడేడ నేనేడనని పొగడెఁ బదినోళ్ల హరిని రావణుఁడు ॥వినవే॥
నేను రావణుఁడన నిది లంక యని తానెఱిఁగి శుక్రు సన్నిధిఁ జేరి
మ్రొక్కి కోరిక విను వైరి నేరోర్వఁగ సెలవిమ్మనిన నోరీ
దానవాధిప యవిఘ్నముగఁ బాతాళహోమ మొనరింపు సపరికర-
మైన రథమగ్ని యందొగిఁ బుట్టు వదెక్కి శేషగిరీశు గెల్వుమనె ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi