యుద్ధకాండము-20
రాగం: శంకరాభరణ - తాళం: ఆది
పల్లవి:
వినవే రమా దత్తకర్పూరవీటి వినుతాంచితగుణపేటి ॥వినవే॥
అనుపల్లవి:
వినవే రావణుఁ డింద్రజి త్తగచరుల మేటి-
వీరులఁ గూల్చి కూలె సౌమిత్రి జయధాటి ॥వినవే॥
చరణములు:
ఇలఁబడి మూర్ఛమునిఁగి లేచి పెంచు వలె నోరు బగులఁ బలవించు దిశలు
తిలకించుఁ దలవంచు హా దైవమా యంచు ధృతి డించుఁ దనువేటికని యెంచు నిస్సంచు ॥వినవే॥
ఈతని గుణములెన్న నూఱో వెయ్యో యిఁక గెల్పు పాతరో నుయ్యోగొయ్యో తల-
పోతలాయెను నిది నవ్వులాయ కుయ్యోమొఱ్ఱో యను నిలింపుల గుంపుల కయ్యో యనెను ॥వినవే॥
బ్రతుకేమిటికని యింతటికి సీతాసతి హేతువని లోకమాత యనక
కతరుఁడై కత్తిదూసి వ్రేయఁగడఁగె వ్రాఁత మిత్తి యనవలె నిది రావణున కేటి సేత ॥వినవే॥
స్వామి బ్రహ్మకులమునందుఁ బుట్టి చంపుదురా స్త్రీలఁబట్టి శ్రీ-
రామావనీంద్రుని గెల్పుమని గిట్టిరమ్మని తిగిచెను సుపార్శ్వుఁడు చేపట్టి ॥వినవే॥
తిరుగవచ్చి కొలువుకూటముఁ జేరి త్వరగా మంత్రులఁ జీరి కరి-
తురగాదుల నెక్కిరమ్మని శేషగిరిహరిఁగాఁ దలచె రామచంద్రుని మాయదారి ॥వినవే॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi