కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-19
రాగం: శుద్ధసావేరి - తాళం: అట
పల్లవి:
శచిసందర్శితమణిదర్పణా మహారణనిపుణా సముదారిదమనా వినవే ॥శచీ॥
అనుపల్లవి:
శుచి ప్రమితాశుగముల నాజి సుతుఁడాజి చిలుక తేజీదొర
రుచిం దనరి యింద్రజిత్తుమే నురువడించి చెలియించఁగఁ బంచి
సచరాచరమౌ జగంబునకు ప్రచురకంటకుఁడ నన్‌ జను ని-
న్నిచటఁ ద్రుంచి ప్రభూతబలి యిడుదు చూడుమని కడఁకతోఁ బలికె ॥శచీ॥
చరణములు:
ద్రోహి నీమంత్రమును పనిగొనవీ హుతాశనునకిదె నిను బూ-
ర్ణాహుతి జేతునని లేచి యసురవరసుతుఁ డతనిఁ జూచి
బాహుబలమున నిన్నుఁ జంపెద బ్రతికిపోలేవని రథమెక్కి
సాహసంబున చాపమెక్కిడి శరము లురువడిఁ బరపె నరుదుగ
వే హనుమంతున్ మొగంబగలనేసి పినతండ్రినిం గని నీ
దేహమేల గాల్చనే నను వధింపించం గడగితివని పలికె ॥శచీ॥
ఓరి నీవిటు చూడుమని చలపోరి గెలుపెదఁ గోరిముంచెను
నారసపు బడి సౌమిత్రి సురారికొడు కడచె నతిబలులు
కేరి తూరి కటారి నూరి గురేరి పేరిడిన లకోరీల
జీరి చీరి బలారివృత్రుల దారి నెర సడివారి మెఱవడి
యేరికినైనన్‌ జగంబులను ఎఱుంగమా పొదలిక కదలిక
మారుమారు మను నదల్పులను తీరుదొకని నొకనోటఁ బొగడ ॥శచీ॥
భానుని భయమగు చూడ్కి నాఱొక బాణములు లక్ష్మణు ననిలజుని
వీనుల ముఖాబ్జముఁ బదింట విభీషణుని నూటను నేసి
వానరుల గజ గవయ గవాక్ష వాలిసుతముఖ్యులఁ బడల్చిన
దానవాగ్రణి విల్దునిమి రామానుజుఁడు వాఁడెన్ని విండ్లెత్తిన
మానక పొడిఁజేసి సొమ్మసిలఁగా నేసిన బడి మూర్ఛ దేఱి
వూని యన్యధనువున శరములు పుంఖానుపుంఖములుగ నినిచె ॥శచీ॥
మేటిమాయల వీడొకపాటివాఁడనక దెగటార్పు మి-
దేటికినను విభీషణు నుడి పాటించి యారాజమౌళి
సాటిలేక శ్రీరామచంద్రుఁడు సత్యసంధుఁడు విజయశాలి య-
నేటిమాట నిజమేని వీని గీటడంచునని యైంద్రబాణము
నూట సమణికుండలములు సకిరీట రుచిరతిలకంబగు తల
పాటి దప్పి యిలపైఁ బడె సురకోటి వొగడె నృపకిరీటి యనుచు ॥శచీ॥
ఒత్తెశంఖము స్వర్ణశంఖము హత్తిధ్వని జగమునిండఁగ రఘు-
సత్తముఁ డరసి యిది తమ్ముని జయనాదమని పొదలె మదిని
క్రొత్తగాయముల తగు మైతోఁ గువలయేశ్వరు పాదయుగళికి
నొత్తమిల్లినఁ గ్రుచ్చి కౌఁగిట నునిచె లక్ష్మణు నాపై రమ్మనిన
చిత్తము కరుణాయత్తమగుటఁ జేసి గెలుపుగొని వచ్చితి పురు-
షోత్తమాఖ్య నొనరి శేషగిరినుండు హరివనుచుఁ బలికెను నతఁడు ॥శచీ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi