కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-18
రాగం: పంతువరాళి - తాళం: ఆది
పల్లవి:
భాషాపతినుతగుణ హేషాపరితోషా యోషామణిరో వినవే ॥భాషా॥
అనుపల్లవి:
దోషాచరాంతకుని భూషించి నారదుఁడు తు-
రాషాణ్ముఖ్యులఁ గూడి భాషింపుచుఁ జనెను
భీషణాకృతిని గుంభకర్ణుఁడు చేర్చి మృతుఁడౌట విని దశాననుఁడు
రోషశోకములు బెనఁగొనఁ గొలువులో నేలపైఁ బడి మూర్ఛిల్లెను ॥భాషా॥
చరణములు:
భోరున గన్నుల నీరు వరదలై పార నోరు
దెఱచి యడలెను అనుజుఁడా యని పేరు నుడివి బడలెను
వీరుఁడా యింద్రజిత్తు కారుణ్యమున నెత్తి శూరులేడ్తురె నేను పోరున రాఘవుల
బీరమున్‌ బిరుదితండన మాన్చి నీ రుణంబు దీర్చెద నను బంపగ-
దే రాత్రించరశేఖరా యన గారవమున సెలవొసంగెను ॥భాషా॥
సన్నాహసేనలతో విన్నాణియై రావణి కన్నవారెల్లఁ జెలఁగఁగ నికుంభిలలో
నున్న యనలుఁడు వెలుఁగఁ జెన్నారు చెంగల్వలు సిగఁ జుట్టి సూర్యపుటము
వన్నెపటము కటిఁగట్టి మిన్నా కెంజాయపూత
సన్నఁగా నలఁది స్రుక్సృవాది కుశోన్నతాస్తరణుఁడై హవిస్సు ప్ర-
సన్నమతి యజ్ఞాయ స్వాహ యని నిష్ఠ తా వదలక వేల్చె ॥భాషా॥
ధూమ సంతతి భూనభోమండలము నిండ రామా-
వనీంద్రుఁడు గని విభీషణునిచే నామార్గములెల్ల విని
యామాయావి ద్రుంతునే నాగ్నేయాస్త్రమునఁ జూడు-
మా మిత్రా యనిన నాతో సౌమిత్రిని బంపు
యామినీచరునికి పదునాల్గేండ్లాహారనిద్రలు లేనివాని-
చే మృతి మితి యనినన్‌ చెలిమెచ్చి భూమీశుఁడు తమ్మునిఁ జూచె ॥భాషా॥
శాంతాకారాయ ఆనందాత్మనే నమ-
శ్చింతాలతచ్ఛేదినే రామాయ సీతా-
కాంతాయ పరమాత్మనే యనిన లక్ష్మణుని
సంతోషించి మన్నించి యింతింతనరాని ప్రేమ
నెంతో దీవించి యానతిచ్చె దాశరథి హను-
మంతుపై నెక్కిలక్ష్మణుఁడు కపిసంతతు ల్గొలువ విభీషణునితో
మంతుగన్న పరాక్రమాలాపము లంతంతన్‌ బలుకుచుఁ జనెను ॥భాషా॥
మితిమేరలేని బలప్రతతి గొలువ భల్లూక-
పతి జాంబవంతుఁడు బరాబరి సల్ప వాలిసుతుఁడు సురటి విసర
చతురుఁడై నల్వురు సచివులతో విభీషణుఁ డా-
నతుఁడై గొలువ నెరదొరతనమున రామానుజుఁడు రణ-
రతి మదిన్‌ ముప్పిరిని గొని నికుంభిళకు వెసన్‌ జని తదేకనిష్ఠా-
న్వితుని నసురవరసుతుని గనుఁగొనెను విల్‌ శేషాద్రిపతిని దలఁచి ॥భాషా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi