యుద్ధకాండము-14
రాగం: కన్నడ - తాళం: జంపె
పల్లవి:
శరణాగతసంభరణా
వరకుండలయుగళీకృత తుహినకరచండకిరణా వినవే ॥శరణా॥
అనుపల్లవి:
పరతత్త్వాశ్రయ మహత్వాద్య సుధాత్వసరణిఁ బల్కు కాలనేమి పయిన్ రావణుఁడు
కెరలి తప్తఘృతంబున జలంబు బడిన క్రియ
మెఱసి నిను నీచు ద్రుంతు నామాట మీఱితి వరులచే లంచములు గ్రహించి రామకింకరుఁడవై
గురుని పోల్కి బోధించెద వరరే యనఁ గినుక వలదంచు గదిలె వాఁడు ॥శరణా॥
చరణములు:
హిమవన్నగ పార్శ్వమున వనము రచియించి కాలనేమి మునివలె నుండెను మించి
సమీరసుతుని భ్రమించఁ దలంచి
అమితజవంబునను గపివంశమణివై హా యసాధ్వ నేఁగుచో ఋష్యాశ్రమము గని
తెమలి తోవ తొలఁగెనని కలఁగి యీసం-
యమి నడిగి పోదమనుచుఁ బోయి తత్పాదములకు మ్రొక్కి దేవ రామభద్రుదూతను హ-
నుమంతుఁడనఁదగువాఁడ దృషాతురుఁడ నుదకముఁ జూపు త్రావిపోయెదనని పలికె ॥శరణా॥
అమృతోపమమౌ కమండలంబు తోయంబు ద్రావు ఫలనిచయంబు దిను వినుతంబు
సమంత్రముగ నిత్తు నౌషధంబు
సమరతలంబునఁ బడిన లక్ష్మణుఁడెలమి నమర సర్వకాలవేత్తను గానఁ దెలిసెను
శ్రమము దీర్చుక రేపు బొమ్ము రేప కడనని
తమకమున మౌని పలుకఁ గుంభజలమల్పము కొమరున సరస్సు వటుని బంపి రూపింపు
సుమహిత యను బవమానసుతు వెంట శిష్యునంపి మడువుఁ జూపిరమ్మనెఁ గపటముని ॥శరణా॥
కొల నాద్విజుచే ననిలజుఁడు గాంచి కోర్కెమించి కనులు ముకుళించి ప్రవేశించి
జలంబు ద్రావెను సంభ్రమించి
బలుమకరి మ్రింగెను హరిప్రవరుడు తడబడకతండు హస్తముల నడువన్ వెస మొసలి తల బ-
గిలి మృతియై మదవతియై చూపట్టె
బలియుఁ డభవద్దయను శాండిల్యశాపము బొలిసె నే ధాన్యమాలియన్ సురాంగనను
వలదు మునియనుచు నమ్మనిట మున్ గనిన వాని జంపి విజయముం జేయుమని యది చనె ॥శరణా॥
అతివేగమె యాంజనేయుఁ డటుబోవ హా యిదేమి యింతకురామి యుపదేశమి-
త్తు తత్వదక్షిణ యీ గురుస్వామి
కుతుకమునందిన మేలనన్ గొమ్మనుచుఁ గుటిల యతిని ముష్టిఁబొడువ సురా-
హితుఁడపుడు మతకములు బన్నంగ మరున్నందనుఁ డన్ని
వితగా నొనర్చి కాలనేమిని వధించె వితతమాయికుని భటుండు మాయలన్ బడునె
శ్రీతహితుఁ డాక్షీరాబ్ధిఁ దాటి ద్రోణగిరి యౌషధములను గానక గిరిఁ దెచ్చె ॥శరణా॥
ధరణీధర మత్తఱి మారుతి డించి రామధరణీశు పాదసరోరుహముల జోహారు
శిరంబొరయ సల్పెను వేమాఱు
నరహరి యాదరణ మెఱయఁ బ్లవగకేసరికుమారు గౌగిలించె సుషేణుఁడౌషధ
వరముగొని సౌమిత్రికి శ్రీమీఱఁ జికిత్స
నెఱపె నటనిద్రవోయి లేచినటుల నెంచి నిలునిలు దశానన పొరిగొందు నీవెచట
జొరఁగలవను ననుజన్ము శేషాచలేశుఁడగు రఘుపతి శిరము మూర్కొని యెదనుంచె ॥శరణా॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi