కీర్తనలు అధ్యాత్మ రామాయణ కీర్తనలు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి
యుద్ధకాండము-13
రాగం: తోడి - తాళం: అట
పల్లవి:
కామసంజీవనౌషధి కల్పలతా శ్రీమేనకాసుతా వినవే ॥కామ॥
అనుపల్లవి:
ఆ మీఁద వగచె రామచంద్రుఁడు హా లక్ష్మణా హా యని విలపించెను ॥కామ॥
చరణములు:
తాను విష్ణుఁడైనను మాయచేను జగమునెల్లను మోహింపఁ-
గాను మదినెంచి నెనరుమించి క్షోణిపైఁబడి మూర్ఛ స్రుక్కియున్న
వానిఁ జూచి కన్నీరు నించి
నానోముఫలమా నాపెన్నిధానమా నానీడ నాతో నేనీతోడఁ
బూని రాఁదలఁచి నిను బిలిచిన గాని పల్కవదే కోపమా
నేనన్యుఁడనే కరుణఁ జూడఁగదే నన్ను గన్నులలరగ ననె నృహరి ॥కామ॥
అంత రాముఁడు చింతాకులుఁడై ధీమంతా యో హనుమంతా రా నా
సంతాపముఁ దీర్చుమా సంజీవిని పంతముతోఁ దెచ్చి ప్రాణములిచ్చి యీపట్ల తమ్మునిఁ జేర్చుమా
మంతుకెక్కు నీమహిమనిన కొండంతై పావని మ్రొక్కి చనె నాచక్కి
అంతయును జారులవలన విని యసురపతి కాలనేమి గృహా-
భ్యంతరముఁ జేర వాఁడతని సపర్యలఁ దనిపి కార్య మేమని యడిగె ॥కామ॥
రామానుజు ప్రాణ మీమారుతి దివ్యసామగ్రికిఁ బోయె నామార్గమున విఘ్న-
మౌ మాయలుబన్ని యీరేయి గడుపు నీమేలు మఱువ ననిన దశాస్యుని కాల-
నేమి బోధించెనెన్ని మా మారీచుఁ డేమాయ నట్లనె నే ననుమానమేది రావణా నీజీవన-
మేమి హితసుతపౌత్రబాంధవు లీల్గి రవనిజచే సిరులచే
నేమి తనువేల హరికి సీత నీ రాజ్యము విభీషణుని కిమ్మనెను ॥కామ॥
మునివై యడవికిఁ జని వైదికకర్మఖనివై విజనస్థలినివై తగునునికి-
గొని వైరాగ్యమున విషయాసక్తి జను నింద్రియముల మె-
ల్లనఁ దిగిచి పరమాత్మ నెనయించి చిత్తమున
నిను ప్రకృతికి విలక్షణునిగాఁ దలపోయు
మనఘ చరాచరజగము బుధ్యాదికము కన వినఁబడెడిదేది చతురా-
ననుఁడు మును తృణము తుదయౌ నిది విను ప్రకృతిజన
జనన లయ కారణమదియె మాయ యనఁబడుననె నతఁడు ॥కామ॥
శామారుణశుక్లధామాకృతి బ్రజల
నా మాయ సృజియించి కామక్రోధాది
నామాద్భుతసుతులను హింసేచ్ఛాధి
భామినులఁ గని యది బహు బాళిఁ జెందించఁ బరమాత్మ నీగతులను
యేమి యొల్లని యాత్మేశునందది స్వగుణ స్తోమము నారోపించు దీపించు
స్వామి నిర్మలుఁ డైనను బ్రకృతిసంగియై వెలిగని భ్రమసి తను
దా మఱచి గుణమోహితునిగా దలఁచి తను దెలియు క్రియ వినుమనె నతఁడు ॥కామ॥
ఏ కాలమున వివేకాఢ్యుండయిన శ్రీకారణగురునిచే కాయిక మోహ-
శోకాదికము లేనివానిగాఁ దెలియఁ
జేకుఱు నత్తఱి మరల్చి చూడ్కి గను నాత్మ జీవన్ముక్తుఁడయి ప్రాణి
ప్రాకృతగుణములచేఁ బడక నీవు నిన్ను పరిశీలించు యక్షానీక శి-
క్షాకరుణరక్షుఁడవయి ప్రకృతి కవలివెలుఁగని యాత్మనుఁ దెలియు
నీకొదవు ముక్తి యది బళువేని సగుణాత్మధ్యానమును జేయుమనె ॥కామ॥
ఉదయార్కోజ్వల హృదయాబ్జ కర్ణికాభ్యుదయాసనమున సదయామతి సీత
గదియ నలరువాని కన్గవ యుదుటై
పొదలువాని మెఱుపుబోలు చేలమువాని కదలు నందెలవాని
విదిత వనమాలాన్వితుని గౌస్తుభహారాంగదకటకకిరీటుని వీరాసనుని
ముదమొదవ కేలుదోయి విల్లమ్ములఁ దాల్చి కొల్చు లక్ష్మణుతో
సదరహాసముగఁ బల్కు రామచంద్రు ధ్యానింపు మధిపా యనె నతఁడు ॥కామ॥
ఈ రీతిగ హరి చారిత్రము వినుము చేరి శుభములవ్వారి జన్మాను
సారిగా వచ్చిన దురితౌఘములు తారిచెడు గార్చిచ్చు
దారిలో దూదికంట్లము నిల్చి హెచ్చునా
సారాచారవిచార పౌలస్త్యవీర వైరముమాని భక్తిఁబూని
శ్రీరాముఁ బరిపూర్ణు నొకని సదారూఢ భావభావితుని శ-
రీరసామరహితుని శేషాద్రినివాసుఁ దలఁపుమనె మారీచజుఁడు ॥కామ॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi