యుద్ధకాండము-12
రావణుని ప్రథమయుద్ధము
రాగం: గౌళ - తాళం: ఆది
పల్లవి:
సూరిజనసౌఖ్యదాయినీ యీ సుచరితము సుధీ సువ్రతము కాత్యాయనీ ॥సూరి॥
అనుపల్లవి:
పోర నతికాయాది ఘనుల్ బడుట కారాటపడి రావణుఁడు కనుల్ స-
మీరసంయుతాగ్ని నెనయగా ఖరారిపైఁ జనఁగా మదినెంచి పగ-
మీఱ నింద్రజిత్తు లంక కాపిడి సమిదూర్జితంబై బలంబు నడువన్
భూరి సాయుధమగు రథమెక్కి పొగరున నిక్కి నడచెను ద్రొక్కి ॥సూరి॥
చరణములు:
వింట గొనయమిడి కపుల నదరంట శరములనేసి చంపె
దంట యనుచు నినసుతాదులవెంట నంటి
మంటలడరు నారాచములచే మదమడంచి బెబ్బులి పేరాఁకట
నొంటిఁబడి వచ్చు పోల్కి దశాననుండు హరి గదిసె నది గని త్రిదశ-
కంటకు నెదిరి విభీషణుఁడు గదాకనద్బాహుఁడై తాఁక నతనిపై
నంటిన పగ మయదత్తశక్తి నన్న సశక్తి నేసె సుయుక్తి ॥సూరి॥
అయ్యస్త్రము గని నాచే వరమియ్యఁబడి నతఁడు వధకు దగఁ
డయ్యా యనిన సౌమిత్రి నృపు నెయ్యమెఱింగి
చయ్యనఁ బిఱిందికి విభీషణు నొయ్యఁ దిగిచి విల్గొని యనికి గ-
రియ్యుండై నిలచె శక్తివచ్చి నరేంద్రసుతుఁ జొచ్చి వెలిఁగెను హెచ్చి
డయ్యఁడయ్యె సకలశక్త్యాశ్రయుం డనంతుఁడు హరికి తనువు నగునతని
కెయ్యెది దుర్భరం బటులైన నిలఁబడె దాన నరభావన ॥సూరి॥
సోలి పడియున్న లక్ష్మణుని జాలి కరముల నెత్తఁబోయి
వ్రాలి రావణుఁడు సిగ్గుపడే జాలి జగతికి
మూలమై తగు విరాట్పురుషుఁడై పొదలు విష్ణుగదల పగ సురారి
కే లీలనగు రావణు గని యొకింత లోనఁ జని పావని యశనిఁ
బోలు పిడికిటను బొడువ మోకాళ్లు భువిన్ మోదఁబడి యతఁడు ముక్కులన్
జాల రుధిరము గ్రక్కె లక్ష్మణున్ సామీరి ఘనుండై కొని చనెను ॥సూరి॥
రామక్ష్మానాథుఁ డనిలజుని సామర్థ్యముఁ బ్రియముఁ గని పొగడె
భీమాటోపమున ధనుర్ధరుఁడై మారుతినెక్కి
కాము గెలుచునాటి రుద్రునివలె గదియఁ దెలిసి దనుజ కిరీటి మ-
హాహర్షమునఁ దేరెక్కి రాగ నరాధిపుఁడు బాగా అదల్చిపోగా
పామరాధమా బ్రతికిపోలే వపరాధము సర్వసముఁడనైన నా-
కేమిటికిఁ జేసితివి నిను భళీ యిలకిడుదు బలి యనెఁ గడుఁ గెరలి ॥సూరి॥
శ్రీరాముని నుడి విని వాహనమై రాజిలు హనుమంతు నేసెఁ
గ్రూరాస్త్రముల రావణుఁడు కపివీరాగ్రణి నొచ్చి
భూరితేజోబలంబున వృద్ధిఁ బొందె ఘృతమ్ముచే నగ్నివలెన్ రఘు-
వీరుఁ డపు డంజనికొమరుని వివిక్తసవ్రణునిఁ గని రావణుని
తేరు గుఱ్ఱములు గొడుగు విల్ సారథి కేతువుల ద్రుంచి యరచందురుల
కోరి యిల బడల్చె కిరీటముల్ గూల్చె రవిసముల్లసత్ప్రభముల్ ॥సూరి॥
బాణావళి నొచ్చినావిపుడు ప్రాణాలతోఁ బో శ్రమము దీఱ
గోణాధిపా నా బలమరయ జాణవై రేపురా
కానీ యని నృహరి వలుక వాక్కాండములను నొచ్చి సిగ్గరి క-
రేణుపతి మృగపతిచేఁ బడి యరింది విడువఁబడి పఱుచు కైవడి
మానమేది రావణుఁడు బాఱి కడువడిన్ లంకఁజొచ్చి మదినెంచె నా
శ్రీనివాసుఁడే రాముఁడు ధరణి శేషగిరిధని యనఁ బరగెనని ॥సూరి॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi