యుద్ధకాండము-11
అతికాయయుద్ధము
రాగం: శ్రీ - తాళం: త్రిపుట
పల్లవి:
ఆర్యసమ్మతమై హితంబగు నార్య యీచరితము వినవే ॥ఆర్య॥
అనుపల్లవి:
శౌర్యఘనగాంభీర్య సమరచాతుర్యాదిసహాయుఁడై యతికాయుఁ డై-
శ్వర్యవిభవము లనుసరింప నవార్యమై గుణరవము మ్రోయన్
సూర్యనిభమగు రథములఁ బఱపి యసురావళి నోడకుఁడని పలికె ॥నార్య॥
చరణములు:
బాణాసారమున వనచర సేనానాయకుల త్రుళ్లడఁగించి దీ-
నానాథులఁ జంపక రామక్ష్మానాథు నెదిరి సు-
జ్ఞానమూహించి రావణసూనుఁ డదలించి
మానమేలేదు ఏ నెళవుగాదు ఏ నీతియురాదు మాతో వాదుఁ
బూని మానిసివైనావు గుణహీనుఁడవు కులగోత్రమెఱుఁగని
వాని కిపుడొదవె నిన్నియును సమానుఁడవె మాతో నని పలికె ॥నార్య॥
మీనై యంబుధిఁ జొచ్చినా గాని చుట్టు మోసినా గాని
క్షోణి క్రోడీకరించినా గాని మానెక్కి పండ్లిగిలించినా
గాని భిక్షుఁడవై నటించిన గాని గూనిబాపఁడవైనా
గాని దొరతనము మాని మౌనివైనా ముసలివైనా
గానీ శాంతిగొని పోరుడిగిన గలికివయినా గాని నిను బో-
నీను నీమీఁదనిడిన తలఁపు మానననె హరితో నసురవరుఁ ॥డార్య॥
జ్వాలాభీలంబౌ దావాగ్నిలీల లక్ష్మణదేవుఁ డెదిరించి
యేల రాపడుచ రజ్జులు చాలా ప్రేలెదవు చక్కఁగా
నిలువు నీ క్రొవ్వడంతు జేజేలలర ననిన
చాలు సౌమిత్రి గోలవీవు పెక్కాలముల తెఱఁగులెఱుఁగవు జరుగు
కాలభుజగాభ శరజాలము పాలు గావలదన దనుజు ను-
ద్వేలఫాలమున నెత్తురొలుక వాలమ్ము గీలించె లక్ష్మణుఁ ॥డార్య॥
దాన బల్‌నొచ్చీ యీఘనుఁడే నన్నోర్వఁగఁ జాలునని యంప-
వానచే ముంచె రావణి రామానుజు నతఁడ-
స్త్రానలముచే దాని మాన్పింపగ వాని మై తూపుల
వేనవేల్ నించఁగా నిష్ఫలమయ్యె హీనునకు జేసిన మేల్కరణి నా-
లోన పవనుఁడు వచ్చి యజుచే
దానవుఁడు వజ్రకవచము గొని
పూనెనని తెలిపి చన రఘుకులుఁ డానిశాటుని కవచమును దునిమె ॥నార్య॥
ధీరుల్ దానవమానవరాజవీరుల్ దివ్యాస్త్రముల్ పరగించి
పేరల్కన్ హరిహరి కరికరి నొరసిన పరుసున
పిరుతివక గెలుపు నుబ్బునఁ బోరి రరుదారన్
ఘోరశరక్షతశరీరులై గైరికారక్తశైలములన నొప్పిరి కలన
నారి నరిఁబోసి బ్రహ్మాస్త్ర ముదారమంత్రాన్వితముగా నిం-
డారఁదీసి మనుకులుఁడేయ సురారిసుతు తలఁ దునిమెఁ దుది నది ॥యార్య॥
ఆలో దేవత లానందమున బూలవానలు గురియించిరి
చాలా భక్తినతుల్ జేసిన తమ్ము నాలింగనమూని మై నిమిరెఁ గరమున ద-
యాలోలుఁడయ్యె నృహరి బాళిగ పులు ని-
ర్వేలహర్షాబ్ధిఁ దేలి రదిజూచి సైఁచక నేచి
కాలయములనఁ గుంభనికుంభు లోలిరణకేళి నగచరులం
దోలి తఱిమిన వారిఁ జంపిరి వాలితమ్ముఁడు నతనికొమరుఁడు ॥నార్య॥
యూపాక్షుండు ప్రజంఘుఁడు మైందుతోఁ బోరాడి రణోర్విఁ గూలిరి
కోపోద్దీపితుఁడై శోణితాక్షుని రూపఱ ద్వివిదుఁడు బొడిచి పాదమున బ్రామెఁ బ్ర-
తాపమనువొంద బాపురే యని ధూమ్రాక్షుని హనుమంతుఁ
డేపునఁ దెగటార్చి యార్చెను బేర్చి
ఆపదలఁ బడి పఱిచి హతశేషాసురులు రావణున కెఱుఁగన్
రూపించి రతికాయుఁ డీల్గుటయును శేషగిరిపుని రాముని జయ ॥మార్య॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi