యుద్ధకాండము-10
రాగం: ఆరభి - తాళం: ఆది
పల్లవి:
సారదయాధురీణ సంగీతవిద్యాప్రవీణా వినవే ॥సార॥
అనుపల్లవి:
ధీరులైనవారలు చెలఁగి భీకరారవములను ఱంకెలు వైచి
మీఱినది విని రావణుఁడు మదిని నారసి వందురి రాముఁడు నాకెన్న దేవతానిర్మితుఁడైన వైరి
పోర నతని జంప యూధపులెల్లఁ బొండిటు సేయనివారిఁ జంపుదుననెను ॥సార॥
చరణములు:
రావణానతి సబలులై చని ధూమ్రాక్ష యూపాక్ష శోణితాక్ష మ-
హావీర మహాకాయ ప్రహస్తాకంపన మహోదర మహాపార్శ్వులు
దేవాంతక నరాంతకాతికాయ త్రిశిర ప్రజంఘ కుంభనికుంభు
లా వనచరౌఘముతోఁ దలపడిరౌ-
రా వీరి యద్భుతరౌద్రరసము లేమనం దగు గదా ముసలాశుగక్షు-
రీవిశేషసాధనాళిచే విదళించిరి దానవులు కపిసేనాపతుల ॥సార॥
మర్కటుల్ బలియురై కొండలఁ బెనుమ్రాఁకులఁ బండ్ల గోళ్లఁ బిడికిళ్లఁ
గర్కశపదఘట్టన శిలోరుకరకపోలోదర ముఖాంగముల గల
మార్కొని వైచి మోది కఱచి జీరి మర్దించి తన్నిన వెఱ నసురు లె-
దుర్కొనరైరి లంకకై పాఱిరి
కుర్కురశబ్దము లాబలీముఖులు కొలందిడక బలుతఱిమిన ప్రహస్తుఁ
డర్కకులచంద్రముదితాగచరబలాంబుధిఁ జెల్లెలికట్టి కైవడి నిలిపె ॥సార॥
ఒకనిఁ బదిట నూట వెయ్యింట వనౌకసుల నొక్కొక్క ములికిఁ గూల్చి
నికషాత్మజమంత్రి జయప్రశస్తి నెఱయ నీలుఁ డదలించి పేర్చి కడిమి
నొకతరువుఁ బూని వాని తేరు మీఁదికిఁ బోయి సూతుఁ జంపి హయముల
మకురఁడచి విలుద్రుంచ నిల నిలిచి తికమక నొందక నాగకేతనుం డిభంబుగతి రోఁకట నడువ నీలుఁ
డొకట నొలసి తెలిసి పెన్ గిరివైచి యురువడి రావణు మాతులున్ బొరిగొనియె ॥సార॥
తలలు వీడ రక్కసుల్ బర్వఁ గని తారాసూనుపై నరాంతకుఁడు
చలమున హయముఁ దోలి శక్తినేయఁ జలమున నంగదుఁడు వాజి పడనడచెన్
తలకొందక వాఁడురస్థలి బిడికిటన్ వ్రేయ సోలి వాలికొడు కటఁ దెలివొంది ముష్టిన్ బొడువఁ గుంది
పొలిసె నరారియు దేవాంతకుఁ డప్పు డంగదుని దాఁక హనుమంతుఁ డా-
కలి గొనిన పులోయనన్ ఎడఁజొచ్చి ఘనుఁడగు దేవాంతకుని రూపమడంచె ॥సార॥
అంతకాభీలుఁడగు నీలుఁడు పెల్లార్వ మహోదరుఁ డదల్చి తన
దంతిని థే యని డీకొల్పి పరిఘ తాటించినఁ గపిసేనాపతి నొచ్చి
పంతంబు మీఱ నగంబు గొని సత్వరంబుగ నేయఁ గరితో నొరలి
గంతుగొనె మహోదరుఁ డంతనె జంతరమనం ద్రిశిరుఁ డనిలసుతుని శరావృతుని జేయ నతఁ డరద మిం-
తింతలుగఁ జేసి వారి మూఁడుతల లిలఁగూల్చె వజ్రము గిరిం గూల్పులాగున ॥సార॥
అంజనీతనయుని గదన్ గొని ధూమ్రాక్షుఁడేసిన బిట్టలిగి ప్లవగ-
కుంజరుఁ డురుశైలము దెచ్చివైవఁ గూలె వజ్రధారఁ బడు బలుని కరణి
కెంజాయ కనుల్ముడి బడిన బొమలు పెంజీఁకటి నేలు మైతొడవుల
రంజిల నకంపనుఁడు తేరెక్కి వీకన్
శింజిని మ్రోయించి పావని మై శితాస్త్రముల జించఁగ సకోపుఁడై ప్ర-
భంజనాత్మజుఁడు మ్రానిచే వాని భంజించెన్ దేవతలు జేజేయనఁగ ॥సార॥
గదఁ బట్టుక ద్రిప్పి మహాపార్శ్వుఁడు కాలాగ్నిసన్నిభు ఋషభు నేయఁ
జదికిలపడి మూర్ఛిలి తేరి ఱొమ్ము పృథుల కీశవరుఁడు బొడువ వాఁడీల్గెన్
విదితుఁడై మహాకాయుఁ డరదంబు వెసం బఱపి సజ్యకార్ముకుఁడై
బెదరకుఁడీ కపులారా వినుడీ
కదనము వీరాగ్రేసరుఁడగు రాఘవేశుతోఁ గాని సేయ మా తం-
డ్రి దివిజుల గెలిచెఁ గైలాసమెత్తె నేపను గావున నలఁతిగా నని పల్క ॥సార॥
అంగదుఁడు మహాకాయుని గని యాహా రజ్జులేల మీయయ్యను నె-
ఱుంగుదుఁ దోఁకను జుట్టి పయోధిలో ముంచఁడె మా తండ్రి మున్నెఱుఁగవా
వెంగలీ యనుచుఁ బాదపము వైవ విశిఖంబునఁ ద్రుంచి బాణవృష్టి
నంగదు ముంచి గదన్ గొన సొలయఁగ
చొంగ దొరంగఁ బడెన్ గపులడలన్ సురారి యైదింట బదిట నొకటఁ జె-
లంగి మూఁట నూట నల నీల గవయ గజ గవాక్షానిలసుతాదుల నేసె ॥సార॥
అంత నంగదుఁడు తెలివొంది ఘనగదాయుతభుజుఁడై మహాకాయు ర-
థాంతమునకుఁ జని హరిసూతకేతనచాపముల్ నుఱుమాడె నిర్వురు గదల్
వింతగాఁ గొని పోర నవి పొడియయ్యె వియన్ మల్లయుద్ధమున దుందుభి
నంతమొనర్చిన వాలియన లావునకు నందఱ నద్దనుజున్ బొడిచి వడిన్ రణోర్విఁ దలఁ ద్రెవ్వ శ్రీరఘురాము
చెంతకేఁగి మ్రొక్కిన వాలిసుతు శేషగిరీంద్రుఁడు గౌఁగిలించెను జెలఁగి ॥సార॥
AndhraBharati AMdhra bhArati - మునిపల్లె సుబ్రహ్మణ్యకవి - అధ్యాత్మ రామాయణ కీర్తనలు - Adhytama Ramayana Kirtanalu - Munipalle Subrahmanya Kavi